జూకెర్ బర్గ్ ను కోర్టుకీడ్చిందెవరు..? టెక్ ప్రపంచంలో అతి పెద్ద లీగల్ ఫైట్ కు కారణమేంటి..??

తెల్లార్లేస్తే పడుకునే వరకు పుస్తకాలు ఎందరు ముడుతారో, లేదో తెలీదుగానీ… మోబైల్ చేతిలో ఉన్నవాళ్లు ముఖపుస్తకాన్ని మాత్రం లేచినప్పట్నుంచీ, మంచంలో పడుకునేవరకూ పట్టుకుంటూనే కనిపించే రోజులివి. సోషల్ మీడియా సైట్స్ లో ఎన్నో ఫ్లాట్ ఫామ్సున్నా… అతి ఎక్కువ మంది అకౌంట్స్ కల్గి ఉన్న వేదికేది అంటే మాత్రం ఫేస్ బుక్కేనన్నది ఓ అంచనా.

అసలు ఫేస్ బుక్ ఇంతలా అలవాటు కాకమునుపు.. ఇంతలా మనం బానిసలైపోకమునుపు… దాని పుట్టుక వెనుక ఓ పెద్ద కథ ఉంది.

మార్క్ జూకెర్ బర్గ్ రెవల్యూషన్ గా కొనియాడబడుతున్న ఈ ఫేస్ బుక్ సృష్టికర్త.. మన ఇండియన్ మూలాలున్న ఓ వ్యక్తని ఇప్పటికే తెలిసిన విషయమే. తన పేరు దివ్య నరేంద్ర. 2004లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అప్లైడ్ మ్యాథమేటిక్స్ లో పట్టభద్రుడతను.

1982, మార్చ్ 18వ తేదీన న్యూయార్క్ లోని బ్రాంక్స్ లో జన్మించిన భారత సంతతికి చెందిన దివ్య నరేంద్ర.. ప్రస్తుతం సమ్ జీరో అనే కంపెనీకి సీఈవో కమ్ వ్యవస్థాపక సభ్యుడు.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నుంచి మొదలుకుని గూగుల్ సుందర్ పిచ్చాయ్ వరకూ అనేక మంది భారతీయులు… భారతీయ సంతతి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు. మరికొందరు సొంతంగా కంపెనీలను స్థాపించి తమ ప్రాబల్యాన్ని చాటారు. అలాంటి వ్యక్తుల్లో మనం దివ్య నరేంద్ర పేరు కూడా చెప్పుకుతీరాలి.

అసలు ఫేస్‌బుక్‌ను సృష్టికర్తనే దివ్య నరేంద్ర. కానీ, మనం వాడుతున్న నేటి ఫేస్ బుక్ క్రెడిట్ ఎన్నడూ నరేంద్రకు దక్కకపోవడం విచారకరం. మరో ఇద్దరు కవలలతో కలిసి నరేంద్ర… ఈ రోజు మనం వాడుతున్న ఫేస్‌బుక్ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. 2002 డిసెంబర్ లో తోటి హార్వర్డ్ విద్యార్థులను కనెక్ట్ చేయడానికి నరేంద్ర చేసిన ప్రయోగమే… ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలుపుతున్న సోషల్ నెట్‌వర్క్ ఫేస్ బుక్. దాని మొదటిపేరు ConnectU.

దివ్య నరేంద్ర తన హార్వర్డ్ యూనివర్శిటీ క్లాస్‌మేట్సైన కవలలు.. కామెరాన్ వింక్లేవోస్, టైలర్ వింక్లేవోస్‌తో కలిసి… మొదట తన ఆలోచన గురించి చర్చించాడు. ముగ్గురూ కలిసి… ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసి.. దానికి ముందుగా హార్వర్డ్ కనెక్షన్ అని పేరు పెట్టారు. డాక్టర్ తల్లిదండ్రులకు జన్మించిన దివ్య నరేంద్ర, చదువులో ప్రతిభావంతుడు. న్యూయార్క్‌లోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో చదివిన తర్వాత.. హార్వర్డ్‌లో ప్రవేశం పొందాడు. అక్కడే ఈ ముగ్గురు దగ్గరయ్యారు. ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సమయంలో, దీనిని అమలు చేయడానికి ప్రతిభావంతమైన ప్రోగ్రామర్ అవసరమైంది. అప్పుడు ఈ ముగ్గురు స్నేహితులూ జూకెర్ బర్గ్ ను కలిశారు.

మొదట ConnectU పేరుతో వెలుగులోకొచ్చింది నేటి ఎఫ్బీ సైట్. ఈ ఆలోచన ఆ కాలానికి చాలా సాదాసీదానే అయినప్పటికీ.. ఓ విప్లవాత్మకం. హార్వర్డ్ విద్యార్థులకే పరిమితమైన ఒక ఆన్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసి, అందులో వారు తమ ప్రొఫైల్స్ సృష్టించుకోవడం, సహవిద్యార్థులను తెలుసుకోవడం, సామాజిక సంబంధాలు ఏర్పరుచుకోవడం మొదట ConnectU కాన్సెప్ట్.

జూకెర్ బర్గ్ తో పరిచయం!

హార్వర్డ్‌లో కోడింగ్ నైపుణ్యాలకు పేరుగాంచిన మార్క్ జుకర్‌బర్గ్‌ను… నవంబర్ 2003లో నరేంద్ర, మరో ఇద్దరు మిత్రులైన కెమరాన్, టైలర్ కలిశారు. హార్వర్డ్ కనెక్షన్ టీమ్‌లో చేరాలంటూ తమ ఆలోచనలను మార్క్ జుకర్‌బర్గ్‌ తో పంచుకున్నారు. అప్పటికే జూకర్ బర్గ్ తన సొంత సోషల్ మీడియా సైట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న సమయమది. ఇరు పక్షాల మధ్య జరిగిన ఈమెయిల్స్, లీగల్ టర్మ్స్ అనంతరం.. ConnectU కోసం దివ్య నరేంద్ర, మరో ఇద్దరు మిత్రులు కలిసి జుకర్ బర్గ్ తో పనిచేయడానికి ఒప్పందం జరిగింది.

నరేంద్రతో పాటు, తన స్నేహితులైన వింకిల్‌వాస్ సోదరులు… జూకర్‌ బర్గ్ తమ ప్రాజెక్ట్‌కు కోడ్ రాస్తాడని నమ్మారు. కానీ, కొద్ది రోజుల్లోనే జుకెర్ బర్గ్ నుంచి స్పందనలు తగ్గిపోయాయన్నది వారి ప్రధాన ఆరోపణ. దాంతో బంధం కట్ అయిపోయి సంప్రదింపులు తగ్గిపోయాయి. కట్ చేస్తే, 2004 ఫిబ్రవరి 4న జుకర్‌బర్గ్ TheFacebook అనే వెబ్‌సైట్‌ తో ఓ సంచలనంగా టెక్ విపణిలోకి అడుగుపెట్టాడు.

అయితే, ఎఫ్బీ పూర్తిగా తమ ఆలోచనల మేరకే తయారైందని.. జూకెర్ బర్గ్ పూర్తిగా కాపీ క్యాట్ అంటూ దివ్య నరేంద్ర, తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన వింకిల్ వాస్ సోదరులు ముందు హార్వర్డ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అది తమ పరిధిలో లేకపోవడంతో చివరకు కోర్టుకెక్కారు.

టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన న్యాయపోరాటం!

ఈ వివాదం 2004 నుంచి 2008 వరకు కొనసాగింది. నరేంద్ర, వింకిల్‌వాస్ సోదరులు… జూకెర్ బర్గ్ మౌఖిక ఒప్పందాన్ని ఉల్లంఘించాడని, తమ ఆలోచనను దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. అదే సమయంలో, ఫేస్‌బుక్ అతి వేగంగా ఎదిగింది. హార్వర్డ్ నుంచి అమెరికా అంతటా ఉన్న విశ్వవిద్యాలయాలకు విస్తరించింది. ఇప్పుడేకంగా ప్రపంచవ్యాప్తంగా జనమెక్కువ వాడే సోషల్ సైట్ గా గుర్తింపు పొందింది

2008లో ఇరు పక్షాలు కోర్టు వెలుపల రాజీకి వచ్చాయి. ఈ రాజీ విలువ సుమారు 65 మిలియన్ డాలర్లుగా… అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 583 కోట్ల 57 లక్షల 65 వేల రూపాయలని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో నగదుతో పాటు, ఫేస్‌బుక్ షేర్లు కూడా ఉన్నాయి. జూకర్‌ బర్గ్ తన తప్పును అంగీకరించకపోయినా.. రాజీ పడటంతో.. ఫిర్యాదు చేసిన వారి వాదనకు బలం ఉందనే భావన బలపడింది.

టెక్ ప్రపంచంలోనే అతి పెద్ద న్యాయపోరాటంగా చరిత్రకెక్కిన ఈ సోషల్ మీడియా లీగల్ ఫైట్.. ఆ తర్వాత ది సోషల్ నెట్ వర్క్ పేరుతో హాలీవుడ్ లో సినిమాగా రూపొంది.. ఆస్కార్ గెల్చుకుంది.

ఫేస్‌బుక్ తర్వాత దివ్య నరేంద్ర జీవితం..?

జూకెర్ బర్గ్ తో వివాదం కొనసాగుతున్నా… అక్కడికే పరిమితం కాకుండా.. దివ్య నరేంద్ర టెక్ ప్రపంచంలో ముందుకు సాగిపోయాడు. ఫైనాన్స్, లా రంగాల్లో ఉన్నత డిగ్రీలు చేశాడు. 2008లో సమ్ జీరో అనే స్టార్టప్ ను ప్రారంభించాడు. పెట్టుబడిదారులు, విశ్లేషకుల పరిశోధనలు, ఆలోచనలు పంచుకునే ఒక ప్రొఫెషనల్ నెట్ వర్క్ SumZero. ఇది ఫేస్ బుక్ లా అందరికోసం కాకుండా… కేవలం ఆర్థిక రంగ నిపుణుల కోసం రూపొందించబడింది. ఇప్పుడు SumZero విలువ మిలియన్ డాలర్స్ పలుకుతుండగా.. ఇన్వెస్ట్ మెంట్, టెక్ రంగంలో నరేంద్ర తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఫేస్ బుక్ కథ ఇప్పటికీ సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమే. మేధోసంపత్తి హక్కులు, విశ్వాసాలు, స్టార్టప్ ప్రపంచంలో జరిగే పరిణామాలు, ఒప్పందాల పారదర్శకతను చర్చకు పెట్టిన లీగల్ ఫైట్.. ఫేస్ బుక్ ఉద్భవించడానికి కారణమైన ఈ స్టోరీ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles