ఇది తెలుసుకోవాల్సిన ఓ గైనకాలజిస్ట్ వందేళ్ల జీవిత కథ!
మహిళలెదుర్కొంటున్న క్యాన్సర్ చికిత్సల కోసం తను జీవితాంతం కూడబెట్టిన 3 కోట్ల 40 లక్షల రూపాయలను ఎయిమ్స్ కు దానం చేసిన వందేళ్ల వితరణశీలి.

ఎవరు డాక్టర్ కే. లక్ష్మీబాయి…?
లక్ష్మీబాయిది ఒడిశా. బెరహాంపూర్ కు చెందిన ఈ నిండు నూరేళ్ల గైనకాలజిస్ట్… తనలాగే నిండు నూరేళ్లూ మిగతా మహిళా లోకం బతకాలని ఆశిస్తోంది. అందుకే ఆమె వితరణ, దాతృత్వం కారణంగా జాతీయస్థాయిలో ఈ వృద్ధురాలు వార్తల్లో వ్యక్తయ్యారు.
సరిగ్గా తన వందేళ్ల జీవితం తర్వాత ఇంకా తాను చేయాల్సిందేముంటుందని భావించారు ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీబాయి. అందుకే భువనేశ్వర్ లోని ఎయిమ్స్ కు తాను జీవితకాలం సంపాదించిన మొత్తాన్ని దానం చేశారు. తన వితరణ నిధిని గైనకాలజికల్ అంకాలజీ కోసం ఉపయోగించాలని ఆమె ఎయిమ్స్ నిర్వాహకులను కోరారు. ఎందరో పేద, మధ్యతరగతి మహిళలు క్యాన్సర్ బారినపడి హాస్పిటల్స్ కు వస్తుంటారని.. వారికి క్యాన్సర్ నయం చేయించుకునేందుకు, ట్రీట్మెంట్ తీసుకునేందుకు ఆర్థిక సామర్థ్యం ఉండదని.. అలాంటివారికి సేవ చేసేందుకు తన డబ్బునుపయోగించాలని ఆకాంక్షించారు లక్ష్మీ బాయి.
అంతేకాదు, గర్భాశయ క్యాన్సర్ ను నివారించేందుకు కౌమార బాలికలకు హ్యూమన్ ప్యాపిలోమావైరస్ టీకాలు వేయడానికి బెరహాంపూర్ లోని ఆబ్స్టెక్ట్రిస్ అండ్ గైనకాలజీ సొసైటీకీ మరో 3 లక్షల విరాళాన్నందించారు. సుమారు నాల్గు దశాబ్దాలుకుగా గైనకాలజిస్టుగా, ప్రొఫెసర్ గా సేవలందించిన లక్ష్మీబాయి సేవలను కొనియాడుతూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె నిస్వార్థ సేవా తత్పరతను అభినందించారు.
డాక్టర్ లక్ష్మీబాయి ఓ పయనీర్!
మహిళల విద్యాప్రయాణంలో వైద్య విద్యతో ఆమె ఒక పయనీర్ గా నిల్చారు. 1945 నుంచి 1950 మధ్యకాలంలో కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కళాశాలలో తొలిబ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థిని లక్ష్మీబాయి. 1958లో చెన్నైలోని సుప్రసిద్ధ మద్రాస్ మెడికల్ కళాశాల నుంచి ఎండీ చేశారు. గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ లో డిప్లమా (DGO) పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎస్, బాల్టిమెర్ లోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ నుంచి పబ్లిక్ హెల్చ్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆ సమయంలో స్టైపండ్ పొందారు. ఆ తరంలో ఓ భారతీయ మహిళ సాధించిన ఓ అరుదైన ఘనత అది.
డాక్టర్ లక్ష్మీబాయి కుటుంబ నేపథ్యం!
లక్ష్మీబాయికి పిల్లలు కాకమునుపే భర్త చనిపోయాడు. దాంతో తాను చికిత్స చేసిన వేలాది మంది రోగులు, తాను మార్గనిర్దేశం చేసిన వైద్య విద్యార్థులే ఆమెకు వారసత్వంగా భావించారు. తన వృత్తి జీవితంలో 35 ఏళ్లకుపైగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సేవలందించారు. 1950లో సుందర్ గడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి పోస్టింగ్ లక్ష్మీబాయిది. ఆ తర్వాత 1986లో బెరహాంపూర్ లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి (ఎంకేసీజీ) మెడికల్ కళాశాలలో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్ హోదాలో పదవీ విరమణ చేశారు.
ఒక పరిపూర్ణమైన జీవితానికి అర్థమిచ్చేలా తన యావత్ ఆస్తినీ… తన జీవితంలో గమనించిన పేద మహిళల వైద్య ఇబ్బందుల కోసం కేటాయించిన డాక్టర్ లక్ష్మీబాయి నేటి వైద్యులెందరికో ఓ ప్రేరణ.


