హేళన చేసిన నోళ్లే వెళ్లబెట్టేలా చేశాడు: వినోదరంగానికి.. వాల్ట్ డిస్నీ ఓ విజయపాఠం!

ఒక నాలుగు పేజీల ఒప్పందం… ప్రపంచానికి వినోదాన్నందించే సామ్రాజ్యంగా ఎలా మారింది..?

ఓ చిన్న గది.. ఒక యువకుడి కల.. చేతిలోనేమో పెద్దగా డబ్బు లేదు.. తాననుకున్న రంగంలోకి దిగినా వరుస వైఫల్యాలూ తప్పలేదు… కానీ, ఆ కలే ఒకనాడు విస్తరించి యానిమేషన్ వినోద రంగంలో ప్రపంచాన్నే శాసించే స్థాయికి చేరిన నిజమైంది. ఆ వాస్తవ రూపమే వాల్ట్ డిస్నీ!

ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పిల్లల నవ్వులు వినిపించినా.. అక్కడ ఏదో ఓ రూపంలో డిస్నీ బొమ్మలు సందడి చేస్తున్నాయన్నమాట. మిక్కీ మౌస్ నుంచి స్నో వైట్, సిండ్రెల్లా, ది లయన్ కింగ్ వరకూ.. సినిమాల నుంచి థీమ్ పార్క్స్ వరకూ… డిస్నీ ఓ వినోద సంస్థను దాటి ఒక కొత్త సాంస్కృతిక ప్రపంచానికే ఊపిరిపోసింది.

మరి ఆ సామ్రాజ్యం ఎప్పుడు మొదలైంది..?

ఈరోజే. 1923, అక్టోబర్ 16న వాల్ట్ డిస్నీ సంస్థ ఊపిరి పోసుకుంది. కానీ, సామ్రాజ్యం మొదలైన రోజు మాత్రం అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో వాల్ట్ డిస్నీ, ఆయన అన్నయ్య రాయ్ డిస్నీ కలిసి డిస్నీ బ్రదర్స్ కార్టూన్ స్టూడియోకు బీజం వేశారు. ఇవాళ కోట్ల డాలర్ల వ్యవస్థగా మారిన వాల్ట్ డిస్నీకి పునాది పడింది మాత్రం పెద్ద మొత్తపు పెట్టుబడులతో కాదు.. జస్ట్ నాల్గు పేజీల ఒప్పందంతో ఎంటర్టైన్ రంగంలోకి వాల్ట్ డిస్నీ అడుగుపెట్టింది.

మరి ఆ నాల్గు పేజీల ఒప్పందమేంటి..?

1923, అక్టోబర్ 16న వాల్ట్ డిస్నీ… న్యూయార్క్‌కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్ మార్గరెట్ జె. వింక్లర్‌తో కుదుర్చుకున్న ఒప్పందమే ఈ నాల్గు పేజీల బాండ్ కథ. ఈ ఒప్పందం ద్వారానే వాల్ట్, తన అన్న రాయ్ డిస్నీతో కలిసి.. ఎలైస్ కామెడీస్ అనే చిత్రాల సీరిస్ ను నిర్మించి… వింక్లర్ ద్వారా పంపిణీ చేయడానికి అవకాశం పొందారు. దాదాపు నాలుగు పేజీలుగా ఉన్న ఈ డాక్యుమెంట్‌ను డిస్నీ సంస్థ తన వ్యవస్థాపక డాక్యుమెంట్ గా పరిగణిస్తుంది.

walt disney success story

మరి ఆ ఒప్పందంలో ప్రధానంగా ఏముంది?

వాల్ట్ డిస్నీ బ్రదర్స్ ఇద్దరూ ఎలైస్ కామెడీ చిత్రాల సిరీస్‌కు నిర్మాతలు. మార్గరెట్ వింక్లర్ ఆ చిత్రాల డిస్ట్రిబ్యూటర్. మొదట 12 చిత్రాలు నిర్మించి వింక్లర్ కు ఇవ్వాలి. మొదటి ఆరు చిత్రాలకు ఒక్కో రీల్‌కు పదిహేను వందల డాలర్లు, ఆ తర్వాతి ఆరు చిత్రాలకు పద్దెనిమిది వందల డాలర్లు చెల్లించే విధంగా.. డిస్నీ బ్రదర్స్, వింక్లర్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ చిత్రాల పంపిణీ హక్కులన్నీ వింక్లర్ కే సొంతం. ఇదీ స్థూలంగా ఒప్పందం. అంటే, వాల్ట్‌ డిస్నీ బ్రదర్స్ తమ యానిమేషన్ చిత్రాలను నిర్మించి.. వాటికి డిస్ట్రిబ్యూటర్ ద్వారా మార్కెట్ కల్పించే ఓ పెద్ద వ్యాపార అవకాశాన్ని సృష్టించుకున్నారు.

వైఫల్యాల తర్వాత హాలీవుడ్ కు!

వాల్ట్ డిస్నీ సక్సెస్ నల్లేరుపై నడకేం కాదు. ఆది నుంచీ విజయాలేం దక్కలేదు. కాన్సాస్ సిటీలో డిస్నీ బ్రదర్స్ ఆరంభించిన లాఫ్ ఓ గ్రామ్ అనే యానిమేషన్ స్టూడియో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. 1923లో మూతబడింది. దాంతో డిస్నీకి వ్యాపార వైఫల్యాలు వస్తే ఎలా కుదుపు కుదిపేస్తాయో అర్థమైపోయింది. అయినా, డిస్నీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా యానిమేషన్ ను మాత్రం వదల్లేదు. తిరిగి లాస్ ఏంజెల్స్ కు వెళ్లి అన్న రాయ్ తో కలిసి మరో ప్రయత్నం మొదలుపెట్టాడు. అక్కడే అతడి జీవితం అనూహ్యరీతిలోకి మారిపోయింది.

వాల్ట్ రూపొందించిన ఎలైస్ వండర్ ల్యాండ్ అనే పైలట్ చిత్రాన్ని చూసిన న్యూయార్క్ డిస్ట్రిబ్యూటర్ మార్గరెట్ వింక్లర్ దాన్ని సీరిస్ గా రూపొందించేందుకు ఒప్పందంకు సిద్ధమయ్యాడు. అలా 1923, అక్టోబర్ 16వ తేదీన ఎలైస్ కామెడీస్ ప్రయాణం మొదలైంది. ఓ చిన్నారి నటిని, కార్టూన్ బొమ్మలతో కలిసి సాగే కథలతో మిళితం చేయడంతో… ఓవైపు కార్టూన్ బొమ్మలు, మరోవైపు ఓ చిన్నారి కలిసి చేసే సందడితో.. ఎలైస్ వండర్ ల్యాండ్ అనూహ్యమైన ఆదరణ చూరగొంది. ఆ చిన్నారి పేరు వర్జీనియా డేవిస్. ఈ యానిమేటెడ్ సీరిస్ విజయంతోనే డిస్నీ సామ్రాజ్యానికి తొలి మెట్టు పడింది.

కుందేలు పోయి ఎలుక వచ్చే డుం డుం డుం!

డిస్నీకి తాకిన అతి పెద్ద కుదుపుల్లో లక్కీ ర్యాబిట్ పై రైట్స్ కోల్పోవడం. దీన్నే ఓస్వాల్డ్ ది లక్కీ ర్యాబిట్ అంటారు. 1927లో యూనివర్సల్ సంస్థ కోసం వాల్ట్, యానిమేటర్ యూబీ ఐవర్క్స్ కలిసి.. ఓస్వాల్డ్ ను రూపొందించారు. కానీ, వ్యాపార వివాదంలో భాగంగా ఆ కుందేలు పాత్రపైన డిస్నీ హక్కులను కోల్పోయింది. ఆ పాత్రతో పాటే.. మరికొన్ని పాత్రలపైనా పట్టు కోలోపోయింది. అదే డిస్నీకి పెద్ద కుదుపు. కానీ, ఆ కుదుపే జీవితంలో మరో కొత్త మలుపు తీసుకొచ్చింది. అలా ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునే పాత్ర పుట్టుకొచ్చింది. అదే మిక్కీ మౌస్.

1928లో స్టీమ్ బోట్ విల్లీ పేరిట యానిమేటెడ్ మిక్కీ ప్రపంచ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కొత్తగా వచ్చిన శబ్ద సాంకేతికతను, యానిమేషన్ తో మిళితం చేసిన తీరుతో మిక్కీ ఓ స్టార్ అయ్యాడు.

వాల్ట్ డిస్నీ విజయాల్లో విశేషమేంటంటే..?

తన చేతిలో ఉన్నదాన్ని కోల్పోయిన ప్రతీసారీ… దానికంటే పెద్దదాన్ని సృష్టించడమే డిస్నీ జీవిత విజయంలో మరో విశేషం.

డిస్నీస్ ఫాలీ అన్నవాళ్లే వావ్ అనేలా ఎదుగుదల!

మిక్కీ మౌస్ విజయంతో డిస్నీవాల్ట్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. యానిమేషన్ ను సీరిసుల్లో పార్టుగా ఉంచకుండా.. ఏకంగా యానిమేషన్ తోనే పూర్తి నిడివి సీరిసులను రూపొందించాలనుకున్న డిస్నీ ప్రయత్నాలను అంతా అవివేకవంతమైన చర్యగా భావించారు. స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ అనే పూర్తిస్థాయి యానిమేటెడ్ సినిమా నిర్మించినప్పుడైతే ఈ విమర్శలు వాల్ట్ డిస్నీకి నేరుగా తాకాయి. హాలీవుడ్ అంతా డిస్నీది ఓ పిచ్చి ఆలోచనగా కొట్టిపడేసింది. భారీ ఖర్చు పెట్టి, ఏళ్ల తరబడి కష్టపడి, సినిమా పూర్తవుతుందా అన్న సందేహాలను వెలిబుచ్చినవారే అంతా.

కార్టూన్స్ తో ఆగిపోలేదు… వాటికి ప్రాణం పోసి యానిమేషన్ తో ఉర్రూతలూగించాడు!

ఇదే వాల్ట్ డిస్నీ ప్రత్యేకత. కథల్ని అనుభవాల్లా చెప్పాలనుకున్నాడు. కార్టూన్స్ కు యానిమేషన్ తో ప్రాణం పోశాడు. ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు. తన మిక్కీ మౌస్ ను ఒక బ్రాండుగా మార్చాడు. 1955లో ఏకంగా డిస్నీ ల్యాండ్ ను నిర్మించి.. సినిమాలో చూపించిన ప్రపంచంలోకి జనం నిజంగా అడుగుపెట్టే ఆస్కారం కల్పించాడు. ఆ తర్వాత డిస్నీ వినోద ప్రపంచం సినిమాలు, టెలివిజన్ షోస్, సీరీసులు, థీమ్ పార్కులు, సరుకులు, పాత్రలు, సంగీతం ఇలా ఒకటీ, రెండూ కాదు చాలా రంగాల్లోకే విస్తరించిన ఓ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది.

మనిషి మరణించినా.. అతడి ఆలోచనలు మాత్రం ఆగిపోలేదు!

ఇదే వాల్ట్ డిస్నీ సంస్థ ప్రత్యేకత. 1966లో వాల్ట్ డిస్నీ మరణించాడు. కానీ, ఆయన ఆలోచనలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తన జీవితకాలంలో రికార్డ్ స్థాయిలో 22 ఆస్కార్స్ గెల్చుకున్నాడు వాల్ట్ డిస్నీ. తన కథలో గొప్పదనం అవార్డుల్లోనో, ఆయన సృష్టించిన మిక్కీ మౌస్ లో మాత్రమే కాదు… వైఫలాల్ని ముగింపుగా చూడకుండా ప్రయత్నాలు ఆపకపోవడమే ఆయన విజయానికి కారణం.

ఓ మనిషి తన ఊహలకు, సృజనాత్మకతకు ప్రపంచం మొత్తం చోటు కల్పించిన కథ వాల్ట్ డిస్నీది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles