కొద్ది మంది పాప్యులరైనవాళ్లు మినహా… చాలామంది అన్ సంగ్ హీరోస్ మనకు తెలియనివాళ్ల కథలెన్నో. అందులో ఓ ధనికుడైన పేద, నిరాడంబర జీవి గురించి మనం ఓసారి తల్చుకోవచ్చు. ఆయన పేరే కళ్యాణ సుందరం. ఎవరీ కళ్యాణ సుందరం..?
తాను కూడబెట్టిన జీతం, పెన్షన్, యావత్ ఆస్తి అంతా కలిసి ఏకంగా 30 కోట్ల రూపాయల వితరణ చేసిన గ్రంథాలయాధికారే ఈ కళ్యాణ సుందరం.
ఎంత సంపాదించామన్నది కాదు.. సంపాదించింది ఎందరికి పంచామన్నదే కళ్యాణ సుందరం కథలో విశేషం.
1940లో తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని ఓ కుగ్రామంలో జన్మించాడు పాలం కళ్యాణ సుందరం. కనీసం మట్టిరోడ్లు కూడా సరిగ్గా లేని.. బస్సు ముఖమే ఎరుగని.. పాఠశాలలంటే పరిచయం లేని.. విద్యుత్ వెలుగులెరుగని.. మేళకరివేలంకుళం ఈయన స్వగ్రామం.
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కళ్యాణ సుందరానికి అమ్మా, నాన్నా అన్నీ అమ్మే అయి పెంచింది. వీలైనంత సాయం చేయాలి.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి ఇదే తల్లి నేర్పించిన మోటో. ఆ మాటే మార్గదర్శకత్వం వహించి కళ్యాణ సుందరాన్ని నడిపించింది.

చదువు కోసం రోజూ తప్పని 20 కిలోమీటర్ల నడక!
వెళ్లడానికి పది.. రావడానికి మరో పది… ఇలా 20 కిలోమీర్లు నడిస్తేనేగానీ చదువు దొరికేది కాదు. ఒంటరిగా నడవడం బోర్ అనిపించడంతో మరికొందరిని కూడా తనతో పాటు బడికి తీసుకెళ్లాలనుకున్నాడు సుందరం. అయితే ఈ మిగిలినవారిది స్కూల్ లో కనీసం ఐదు రూపాయల ఫీజు కూడా చెల్లించలేని దైన్యస్థితి. అప్పట్నుంచే కళ్యాణ సుందరం దానకర్ణుడిగా మారిపోయాడు. వాళ్ల ఫీజులు చెల్లించడం, పుస్తకాలు, బట్టలు కొనివ్వడం ఆరంభించాడు. అలా చిన్ననాటే దాతృత్వం దాతృత్వం తన జీవన విధానంగా మారిపోయింది.
చదువుల్లో గోల్డ్ మెడలిస్ట్!
సాహిత్యం, చరిత్రలో డిగ్రీలు పూర్తి చేసిన కళ్యాణ సుందరం.. లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత తూత్తుకడి జిల్లాలోని శ్రీ వైకుంటం కుమారగురుపర ఆర్ట్స్ కళాశాలలో గ్రంథాలయ అధికారిగా ఉద్యోగం సంపాదించాడు.
35 ఏళ్ల జీతం దానం చేసిన వితరణశీలి!
మొదటి జీతం అందుకున్నరోజే.. కళ్యాణ సుందరం ఓ నిర్ణయం తీసుకున్నాడు. ప్రతీ నెలా తన జీతాన్ని పేద పిల్లలు, అనాథల కోసం దానం చేయాలన్నదే ఆ తీర్మానం. ఎంత జీతం వచ్చినా సరిపోతులేదనుకునే మనుషులున్న కాలంలో… కళ్యాణ సుందరం నిర్ణయం తన తోటివారినందరినీ ఆశ్చర్యపర్చింది. ఎందరు వద్దని వారించినా తను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడ్డ సుందరం.. ఏకంగా 35 ఏళ్లపాటు విరామం లేకుండా వితరణ కొనసాగించాడు.
మరి తన జీవితమెలా గడిచేది..?
లైబ్రేరియన్ గా పనిచేసి సంపాదించే జీతమేమో.. అనాథ పిల్లల కోసమైతే… తనకోసం హోటల్స్, లాండ్రీ షాపుల్లో చిన్న చిన్న పనులు చేసి సంపాదించుకునేవాడటు ఈ సుందరం.
భారత్ – చైనా యుద్ధ సమయంలో బంగారు గొలుసు విరాళమిచ్చిన సుందరం!
1962లో భారత్ – చైనా మధ్య యుద్ధం సందర్భంగా అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశ ప్రజలను విరాళాలివ్వాలని ఓ పిలుపునిచ్చారు. ఆ సమయంలో కళ్యాణ సుందరం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కే. కామరాజ్ ను కలిసి తన మెడలో ఉన్న బంగారు గొలుసును దేశ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. దానికి కామరాజ్ ఆయన్ను బహిరంగంగా సన్మానించారు. ఆ సన్నివేశం ఆయన సేవాభావాన్ని మరింత బలపర్చినట్టైంది.
పెన్షన్ కూడా విరాళంగా ఇచ్చిన దాతృమూర్తి!
1998లో ఉద్యోగ విరమణ చేసినప్పుడు కళ్యాణ సుందరంకు పది లక్షల రూపాయల పెన్షన్ వచ్చింది. అయితే, ఆ మొత్తాన్ని కూడా ఆయన దానం చేసేశారు.
రిటైర్మెంట్ తర్వాత కూడా విశ్రాంతి తీసుకోని కళ్యాణ సుందరం.. ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. వచ్చిన ఆదాయాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించేవాడు. ఆ దానగుణమేంటోగానీ… తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తినీ దానం చేసేశాడాయన.
తనకందిన బహుమతి కూడా దానం చేసిన దానకర్ణుడు సుందరం!
కళ్యాణ సుందరం సేవా కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఆయనకు 30 కోట్ల రూపాయల నగదు బహుమతిని ఆరోజుల్లోనే అందిస్తే.. దాన్నీ దానం చేసేశాడు చేతికి ఎముక లేని సుందరం.
అసలు అంతలా దానం వెనుక సుందరం మోటో ఏంటి..?
ఇక్కడ నాదన్నదేదీ లేదు. అందుకే దేన్నీ సొంతంగా ఉంచుకోవాలన్న కోరికా లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు వెంట ఏదీ తీసుకెళ్లమన్నదే కళ్యాణ సుందరం ఫిలాసఫీ.
ప్రపంచవ్యాప్త గౌరవాలు దక్కిన సుందరం!
కళ్యాణ సుందరం సేవలకు అనేక అంతర్జాతీయ గౌరవాలు దక్కాయి. పలు సంస్థలు ఘనంగా సత్కరించాయి.
ఐక్యరాజ్యసమితి ఆయనన్ను 20 శతాబ్దపు అత్యంత విశిష్ఠ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించింది.
కేంబ్రిడ్జ్ లోని ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా గుర్తించి సత్కరించింది.
ఒక అమెరికన్ సంస్థైతే ఏకంగా మ్యాన్ ఆఫ్ ద మిల్లీనియంగా ఆదరించి పురస్కారాన్నందించింది.
ఢిల్లీలోని జేఎన్టీయూ ప్రపంచంలోనే అత్యుత్తమ పది మంది లైబ్రేరియన్లలో ఒకడిగా గుర్తించింది.
2023లో భారత ప్రభుత్వం కళ్యాణ సుందరాన్ని పద్మశ్రీతోనూ సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సుందరం ఆ గౌరవాన్ని అందుకున్నారు.
తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ సామాజిక సేవకుడిగా గుర్తిస్తే… పంజాబ్ సర్కార్ బెస్ట్ లైబ్రరీ స్కాలర్ గా అభివర్ణించింది. భారత ఉత్తమ లైబ్రేరియన్ గా 2013లో బాపాసి అవార్డ్ అందుకున్న సుందరాన్ని.. 2011లో రోటరీ క్లబ్ లైఫ్ టైమ్ ఆఫ్ సర్వీస్ అవార్డుతో సన్మానించింది. ఈ అవార్డులన్నింటితో వచ్చిన నగదు మొత్తాన్ని కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసమే విరాళంగా ఇవ్వడమే మరో విశేషం.
రజనీ ఆహ్వానాన్ని తిరస్కరించిన కళ్యాణ సుందరం!
2012లో ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్ కళ్యాణ సుందరాన్ని తన తండ్రిలా భావించి.. తమతో కలిసి ఉండాలని ఆహ్వానించాడు. కానీ, అందుకు సుందరం మర్యాదపూర్వకంగా ఆ ఆహ్వానాన్ని నిరాకరించారు. చెన్నైలోని సైదాపేటలో ఓ చిన్న ఇంట్లోనే నిరాడంబరంగా ఆయన జీవితం కొనసాగింది. కుటుంబం కోసం, తన కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును కూడా సమాజం కోసం ఖర్చు పెట్టిన కలియుగ కర్ణుడు కళ్యాణ సుందరం.
సుందరం దాతృత్వం వెనుక కారణాలేంటి..?
చిన్నప్పుడు స్కూల్ కు వెళ్తే బోర్ కొట్టడంతో… ఇంకొందరిని చదివిస్తే తనకూ బోర్ కొట్టదనే ఒక భావనతో ఆయన దాతృత్వ జీవితానికి అడుగులు మొదలయ్యాయి. అవే తన జీవితకాలం అడుగులై మహోన్నత సేవకు దారి వేశాయి.
సుందరం దృష్టిలో సంపద అంటే..?
చాలామంది డబ్బును భవిష్యత్తు భద్రత కోసం, సౌకర్యాల కోసం కూడబెడతారు. కానీ, పాలం కళ్యాణ సుందరం దృష్టిలో మాత్రం అది అవసరంలో ఉన్నవారి వద్దకు చేరాల్సిన ఓ వనరు మాత్రమే. తన కోసం పొదుపు చేయకుండా… పెట్టుబడులు పెట్టకుండా.. ఆస్తులు కూడబెట్టకుండా.. సేవ, దాతృత్వం, మానవత్వం అనే శాశ్వత వారసత్వాన్ని నిర్మించిన మహోదయం సుందరం.
అందుకే సుందరాన్ని భారతదేశంలోనే అత్యంత ధనికుడైన పేద మనిషిగా పిల్చుకుంటారు.



