ఒక న్యాయమూర్తి వ్యాఖ్యలు… అదే సమయంలో నీట్ పేపర్ లీక్.. యాదృచ్ఛికంగా జరిగిన ఈ రెండు ఘటనలతో దేశంలో నేపాల్ తరహా ఒక యువత పోరాటాన్ని కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో చూశాం. వాళ్ల డిమాండ్ కు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో… ప్రధాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు, ఇతర ప్రాంతీయ పార్టీలకు, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి చేతగానిది యువత చేసి చూపిందనే ప్రచారం పుంజుకుంది. అదే సమయంలో సీజేపీ విజయం తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పూర్తిగా దేశంలోని సమస్యలపై పోరాటం చేసే ఒక వేదికవుతుందా.. లేక, యువతరం నేతృత్వంలో ఓ కొత్త రాజకీయ పార్టీగా అవతరిస్తుందా అనే సందేహాలూ ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడో ట్వీట్ జనం పల్స్ కు అందని రీతిలో కనిపించడంతో.. అంశాలవారీగా సీజేపీ తన రూపు మార్చుకుంటోందా.. లేక సీజేపీ తరహాలోనే మరికొందరు యువత అలాంటి మాడల్స్ తో ముందుకొస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
నీట్, సీబీఎస్ఈ పేపర్ల లీకేజ్ తో చెలరేగిన వివాదాలకు తోడు… సీజే వ్యాఖ్యలతో విద్యావ్యవస్థపై అస్త్రంగా వచ్చిందే సీజేపీ. కానీ, ఇప్పుడా విద్యావ్యవస్థలో సంస్కరణలపై కేంద్రం దిగిరావడంతో.. వాట్ నెక్ట్స్ అనే క్వొశ్చన్ ముందుకొచ్చింది. ఒక ప్రశ్నకు పరిష్కారం సాధించాలనుకుని రంగంలోకి దిగాక… పరిష్కారం లభించినా మళ్లీ వెను తిరిగి తమ పని తాము చేసుకోలేని ఒక బృహత్తర బాధ్యత ఇప్పుడు సీజేపీపై పడింది. ఈ క్రమంలో సీజేపీ కేవలం విద్యావ్యవస్థలో సంస్కరణలపై మాత్రమే ఫైట్ చేస్తుందా… లేక, దేశంలో అనేక అంశాలపై పోరాటాలు చేయబోతుందా… కేవలం జాతీయ స్థాయిలోనే ఈ పోరాటాలుంటాయా… రాష్ట్రాలకూ సీజేపీ ఉద్యమాలు పాకుతాయా.. ఇలా పలురకాల ప్రశ్నలు ఇప్పుడు దేశంలో చర్చల్లో ఉన్నాయి.

ఈ సమయంలో విద్యావ్యవస్థ తర్వాత ఇప్పుడు దేశంలో ప్రధానంగా చర్చకొస్తున్న మరో అంశం పెట్రోల్ లో ఇథనాల్ కలపడమే. దీనిపై విస్తృతమైన చర్చ జరగడంతో పాటే.. ఇంతకాలం కేవలం హైవేల నిర్మాణంతో మాత్రమే కాస్తో కూస్తో కనిపించి, వినిపించి.. పెద్దగా వార్తల్లో ప్రధానంగా కనిపించని గడ్కరీ.. ఇప్పుడు ఫోకస్ అయ్యారు.
వందశాతం స్వచ్ఛమైన పెట్రోల్ పేరిట ఇప్పుడు ఈ 20 జనతా పార్టీ గడ్కరీ రాజీనామాను డిమాండ్ చేస్తోందా..?
ఇప్పటికే ఈ 20 జనతా పార్టీ పేరిట ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ అమ్మకాలపై ఆన్లైన్ ప్రచారం ఆరంభమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరహాలోనే ఈ వేదిక ఇప్పుడు నితిన్ గడ్కరీ రాజీనామాను కోరుతోంది.
ఈ 20 ఇంధనంతో పాటు… వందశాతం స్వచ్ఛమైన పెట్రోల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్న ప్రధానమైన డిమాండ్ తో ఈ ప్రచారం ఇప్పుడు ఊపందుకుంటోంది.
మరి ఈ 20 జనతా పార్టీ అంటే ఏమిటి..?
ఈ 20 జనతా పార్టీ అంటే తాము రాజకీయ పార్టీ కాదని.. ప్రజా సమస్యలపై పనిచేసే పౌరుల స్వతంత్ర ఉద్యమని ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా Xలో చేసిన ఓ పోస్ట్ లో ఈ విషయాల్ని పేర్కొంది.
ఈ 20 జనతా పార్టీ రాజకీయ పార్టీ కాదు.
మేం పూర్తిగా స్వతంత్ర పౌరులమంతా కలిసి చేస్తున్న ఉద్యమమిది. సామాన్య ప్రజలను ప్రభావితం చేసే అంశాలను తెరపైకి తీసుకొచ్చి వాటి గురించి పోరాటమే మా లక్ష్యం. పారదర్శకతను నిర్ధారించడం, వినియోగదారుల హక్కులను కాపాడటం, 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానంపై బహిరంగ చర్చను ప్రోత్సహించడమే తమ ఏకైక అజెండా అంటూ పోస్ట్ చేసింది.
ఈ ఉద్యమానికి కూడా సోషల్ మీడియాలో వేగంగా ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ పెట్టగానే 25 వేల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చి పడటం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ పై దేశంలో నెలకొన్న చర్చను కళ్లకు కట్టేది.
మరి కేంద్రమేమంటోంది..?
ఈ 20 లక్ష్యాల్లో భాగంగా కేంద్రం చెబుతున్న విషయాలు…
ముడి చమురు దిగుమతులు తగ్గించడం
కాలుష్య ఉద్గారాలను తగ్గించడం
దేశ ఇంధన భద్రతను పెంచడం
ఇథనాల్ ఉత్పత్తితో రైతుల ఆదాయాన్ని పెంచడం
అలాగే, ఇథనాల్ మిశ్రమాన్ని పెట్రోల్ 20 శాతం కంటే ఎక్కువగా కలిపే ప్రణాళిక ఏమీ లేదని.. 20 శాతం వల్ల పెద్దఎత్తున వాహనాలకు నష్టం వాటిల్లే నిర్ధారిత ఆధారాలూ లేవనీ గడ్కరీతో పాటు.. కేంద్రం చెబుతున్న మాట.
మరి ఈ 20 జనతా పార్టీ ప్రధాన డిమాండ్లేంటి..?
పెట్రోల్ బంకుల్లో ఇంధన రకాలను స్పష్టంగా లేబుల్ చేయాలి
ఇథనాల్ మిశ్రమం వల్ల కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రభావాలపై అధికారిక గణాంకాలను విడుదల చేయాలి
ప్రధానంగా వాహనాల మైలేజ్, ఇంజన్ మన్నిక, కాలుష్య ఉద్గారాలపై ఈ 20 ప్రభావాన్ని అంచనా వేసే స్వతంత్ర అధ్యయనాలు చేయించాలనే డిమండ్స్ ను ఈ 20 జనతా పార్టీ తన పోస్ట్ లో పేర్కొంది.
సబ్సిడీలు, ఉచిత ఇంధనం.. లేదా, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని తాము కోరడం లేదని.. వినియోగదారులు తాము కోరుకున్న ఇంధనాన్నే కొనుగోలు చేసే వెసులుబాటు ఉండాలని మాత్రమే తాము కోరుతున్నట్టు ఈ 20 జనతా పార్టీ చెబుతోంది. మొత్తంగా దేశంలో విద్యావిధానంపై సీజేపీ ఉద్యమం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ఈ 20 జనతా పార్టీ పేరిట ఆరంభమైన ఈ ప్రచారం ఏ టర్న్ తీసుకుంటుంది… అన్ని ఉద్యమాలూ ఒకే రీతిలో సక్సెస్ అయితాయా… లేక, ఆ తీవ్రత కొన్నింటిలోనే సాధ్యపడుతుందా… మొత్తంగా సీజేపీ ఉద్యమం ఇప్పుడు దేశంలో నెలకొన్న సమస్యలపై యువతను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, అవసరమైతే స్ట్రీట్ ఫైట్ కు దిగేవైపు పురిగొల్పుతున్నాయా ఇలాంటి చర్చోపచర్చలు ఏ నల్గురు కలిసినా కనిపిస్తున్నాయి.



