ప్రధానికి ఓ ఐఏఎస్ లేఖ: వైరల్ గా మారిన సెటైరికల్ పోస్ట్!

దయచేసి నా రాజీనామాను కూడా ఆమోదించండంటూ మోడీకి ఓ ఐఏఎస్ రాసిన లేఖ ఇప్పుడు మరో చర్చ.

ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదింపజేసిన మీరు… దయచేసి నా రాజీనామాను కూడా ఆమోదించగలరంటూ కాస్త వ్యంగ్యంగా విజ్ఞప్తి చేశారు.

ఆ ఐఏఎస్ పేరు కన్నన్ గోపీనాథన్. 41 ఏళ్ల కన్నన్ గోపీనాథన్ కేరళకు చెందిన వ్యక్తి. 2012 బ్యాచ్ అధికారి. అరుణాచల్ ప్రదేశ్, గోా, మిజోరాం వంటి కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల కేడర్ ప్రత్యేక అధికారి. గత ఏడాది ఈయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిపోయారు.

అయితే గోపీనాథన్ 2019లోనే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. కానీ, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా కోల్డ్ స్టోరేజీలో పెట్టేసింది. నాన్చడం, ఇగ్నోర్ చేయడం ఈ కాలంలో అన్నింటికంటే పెద్ద శిక్షలనేది అందరికీ తెలిసిందే. అదే గోపీనాథన్ కూడా ఎదుర్కొంటున్నాడు.

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం పుణ్యమా అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇప్పుడు మరిన్ని కొత్త కొత్త అంశాలు సామాజికంగా.. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుతున్నాయి. కన్నన్ గోపీనాథన్ తాజాగా ప్రధాని మోడీకి ఇతరుల రాజీనామాలు ఆమోదించడం ఆరంభమైంది కాబట్టి.. దయచేసి తనది కూడా ఆమోదించాలంటూ కోరుతూ ఒకింత వ్యంగ్యంగా తాజాగా రాసిన లేఖతో… ఇప్పుడీ వ్యవహారమూ సామాజిక మాధ్యమాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే తాను రాజీనామా చేసి ఏడేళ్ల కాలం గడిచిపోయింది కాబట్టి.. ఇప్పటికైనా తన రాజీనామాను ఆమోదించి కరుణించండంటూ తన లేఖను, దాని సారాంశాన్ని గోపీనాథన్ Xలో పోస్ట్ చేశారు.

జీతమూ లేదు.. నిర్ణయమూ లేదు!

కన్నన్ గోపీనాథన్ పోస్టుకు నెటిజన్స్ పెద్దఎత్తున స్పందిస్తున్నారు. మరి రాజీనామా పెండింగ్ లో ఉంటే ప్రభుత్వం నుంచి మీకు జీతభత్యాలందుతున్నాయా అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. జీతం లేదు, సస్పెన్షన్ లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు.. కానీ, మిగిలిన సమస్యలన్నెలాగైతే కోల్డ్ స్టోరేజీల్లో పెట్టి నాన్చుతారో నా రాజీనామా కూడా అలాంటి కోల్డ్ స్టోరేజిలోకి వెళ్లిపోయిందంటూ గోపీనాథన్ స్పందించారు.

అయితే, ఈ పోస్ట్ గురించి.. గోపీనాథన్ రాజీనామా గురించి సమాజానికి ఎంత అవసరముందన్న కోణం పక్కనబెడితే… గోపీనాథన్ వ్యంగ్యంగా స్పందిచిన తీరే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చవుతోంది.

మరో వ్యక్తి స్పందిస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేయనుంటిరి.. అక్కడ పీఎం స్పందించవచ్చని అడిగితే… ముందు కెమెరా యాంగిల్ సెట్ చేసుకుని, కొత్త టెలిప్రాంప్టర్ తెచ్చుకుని, ఆ తర్వాత మీరన్నట్టు ప్రయత్నిస్తానంటూ ఆయన వేసిన సెటైర్ మరింత భిన్నవాదనలు, వ్యంగ్యోక్తులకు దారితీసింది.

ముందు మేకప్ ఆర్టిస్టును కూడా సిద్ధం చేసుకోండి.. క్యాస్టూమ్స్ కూడా అదిరిపోవాలంటూ మరింతమంది స్పందిస్తే.. దానికి గోపీనాథన్ వాళ్లంతా రాజీనామా చేసేశారు.. ఇక మిగిలింది నేనేనంటూ ఇంకా సర్క్యాస్టిక్ గా, చమత్కారంగా సమాధానమిచ్చారు.

మరి అసలు గోపీనాథన్ ఎందుకు రాజీనామా చేశారు..?

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని 2019లో కేంద్రం రద్దు చేసిన తర్వాత… అక్కడ అమలు చేసిన ఆంక్షలను గోపీనాథ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్టు గతంలో పలుమార్లు తెలిపారు.

కాంగ్రెస్ లో చేరిక తర్వాత ఆయనేమన్నారు..?

ఆర్టికల్ 370 రద్దు చేయడం ప్రభుత్వ నిర్ణయం కావచ్చునేమోగానీ… అది మొత్తం రాష్ట్రాన్ని మూసేయడమేనన్నారు గోపీనాథ్. జర్నలిస్టులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలను నిర్భంధించడమేనని.. రవాణా, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలను నిలిపేయడం ప్రజాస్వామ్యంలో సమంజసమా అంటూ ఒక ఐఏఎస్ అధికారిగా కేంద్రాన్ని ప్రశ్నించడం అప్పట్లో పెను సంచలనం. ఇప్పటికీ గోపీనాథన్ ది అదే నిశ్చితాభిప్రాయం.

2018లో కేరళ వరదల సమయంలో స్వచ్ఛంద సేవలందించిన గోపీనాథన్.. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా కూడా గళం విప్పారు.

మరి రాజీనామా ఎందుకు పెండింగ్ లో పడింది..?

గోపీనాథన్ రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర హోంశాఖ నుంచి పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కు ఆ లేఖే ఇంకా పంపించలేదు. అందువల్ల గోపీనాథన్ రాజీనామా కోల్డ్ స్టోరేజీలో పడిపోయింది.

2025లో గోపీనాథన్ ఏమన్నారంటే..?

తాను రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత విధుల్లో నిర్లక్ష్యం.. ప్రభుత్వాన్ని విమర్శించానని క్రమశిక్షణ చర్యలు ఆరంభించారని పేర్కొన్నారు. తాను సాంకేతికంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడేై విమర్శించానని యూపీఎస్సీకి తెలిపి నా పే స్కేల్ తగ్గించాలనీ చూశారు.. అసలు జీతమే రానప్పుడు ఏ పే స్కేల్ తగ్గిస్తారని నాడు కేంద్రాన్ని నిలదీశారు గోపీనాథన్.

గమ్మత్తేంటంటే… తనతోపాటే 2019లో రాజీనామా చేసిన మరో మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ రాజీనామా మాత్రం 2022లో ఆమోదించారుగానీ.. గోపీనాథన్ ది మాత్రం ఇంకా పెండింగ్ లోనే పెట్టారు. ప్రస్తుతం శశికాంత్ సెంథిల్ తమిళనాడు తిరువళ్లూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ.

షా ఫైజల్ కేసు ఎందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు గోపీనాథన్..?

జమ్ముకశ్మీర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ కేసు కూడా ఇలాంటి వివాదానికే దారితీసింది. 2019లో ఆయన కూడా రాజీనామా చేశారు. కశ్మీర్ లో జరుగుతున్న హింస, ముస్లిం మైనార్టీలపై వివక్షకు నిరసనగా తాను నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. సేమ్ టూ సేమ్ గోపీనాథన్ లాగే ఆయన రాజీనామా కూడా చాలాకాలం కోల్డ్ స్టోరేజీకే పరిమితమైంది.

ఆ తర్వాత షా ఫైజల్ నేషనల్ కాన్ఫరెన్స్ లో చేరారు. అనంతరం స్వంత పార్టీ స్థాపించారు. ప్రజాభద్రతా చట్టం కింద (పీఎస్ఏ) జైలుకూ వెళ్లారు. ఆ తర్వాత తన వైఖరిని మార్చుకుని మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. దాంతో షా ఫైజల్ ను 2022లో తిరిగి ప్రభుత్వ విధుల్లోకి తీసుకున్నారు. అప్పట్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ షా ఫైజల్ వ్యవహారాన్ని హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ గా అభివర్ణించారు.

ఇక అన్నామలై కేసేంటి..?

తమిళనాడుకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కే. అన్నామలై కూడా 2019లోనే తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. ఎందుకంటే అనంతరం ఆయన 2022లో బీజేపీలో చేరారు. ఇటీవలే ఆయన బీజేపీని వీడి కొత్త రాజకీయ పార్టీని స్థాపించడమూ తెలిసిందే. రాజకీయాల్లో మతాన్ని తీసుకురావడాన్నే అన్నామలై వ్యతిరేకిస్తున్నట్టు ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. కానీ, అన్నామలై కొత్త పార్టీ స్థాపన వెనుక రకరకాల లెక్కలున్నాయనే చర్చా అంతకంటే బలంగా ఉంది.

ఇప్పుడు గోపీనాథన్ అనే ఐఏఎస్ అధికారి ప్రధాని మోడీకి రాసిన లేఖతో.. ఇప్పుడీ అంశాలన్నీ మళ్లీ ప్రస్తావనకొస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles