కొన్ని పేర్లు పదే పదే ఎందుకు ప్రతిధ్వనిస్తాయో… సక్సెస్ స్టోరీస్ రూపంలో ఎందుకు ప్రతిబింబిస్తాయో చెప్పేందుకు ఓ చక్కటి ఉదాహరణ ఈ అంజూ యాదవ్.
రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఫుల్ ఫామ్ కూడా తెలియని ఓ వితంతువు.. ఇప్పుడో డీఎస్పీగా అవతరించిన కథ చెప్పుకుందాం.
కులం, పుట్టుక, ప్రాంతం, వాతావరణం ఇలా వేటి ప్రభావాలు తమపై ఉన్నా.. సంకల్పం బలంగా ఉంటే ఎలా ఎదుగొచ్చో అంజు స్టోరీ మనకు చెబుతుంది.
1988 హర్యానా ధౌలేడాలో ఓ రైతు కుటుంబంలో ఓ బాలిక జన్మించింది. తండ్రి లాలారామ్ యాదవ్ ఓ చిన్నకారు రైతు. తల్లి సుశీల గృహిణి. వారికున్న స్థోమతకు 12వ తరగతి వరకూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఆ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది అంజు. ఆ సమయంలో తల్లీదండ్రికి ఇంటా, పొలం వద్దా చేదోడువాదోడుగా ఉండేది. ఆ తర్వాత అంజుకు తల్లిదండ్రులు 21 ఏళ్ల వయస్సులో అందరమ్మాయిల్లానే పెళ్లి చేశారు. రాజస్థాన్ లోని గండాలా గ్రామానికి అత్తగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ అబ్బాయికి జన్మనిచ్చిన అంజూ అతడికి ముకుల్ దీప్ అని పేరు పెట్టుకుంది.

ఊహించని మలుపు తీసుకున్న జీవితం అంజుది!
వివాహమనంతరం గృహిణిగానే ఇంటిపట్టునే ఉండటం.. ఎదుగూబొదుగూ లేకపోవడం అంజూకు నచ్చేది కాదు. తనకంటూ ఓ గుర్తింపు ఏదైనా సమాజంలో సంపాదించాలన్న తపనతో ఉండేది అంజు. కానీ, అది అత్తగారింటికి నచ్చలేదు. దాంతో ఆ స్పర్దలే కుటుంబ కలహాలకు దారితీశాయి. అంజు పుట్టింటింకి తిరిగివచ్చింది. కుటుంబ సభ్యుల సాయంతో పిల్లాణ్ని పెంచుతూ జీవితాన్ని కొనసాగించింది.
ఓవైపు తల్లిదండ్రులకు భారమైపోయానన్న బాధ.. తనతో పాటు తన పిల్లాడు కూడా. ఓవైపు మానసికంగా, ఇంకోవైపు ఆర్థికంగా కూడా ఇబ్బందులెదుర్కొంటూనే జీవితాన్ని నెట్టుకొచ్చేది అంజు. కానీ, ఎలాంటి విపత్కర పరిస్థితైనా తనకు వీలైనంతవరకూ లొంగకూడదనే గట్టి సంకల్పం అంజుది.
ఉపాధ్యాయురాలిగా ప్రారంభమైన అంజు ప్రయాణం!
పోలీస్ శాఖలో డీఎస్పీగా చేరకముందు అంజు పలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2016లో మధ్యప్రదేశ్ భింద్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై రెండేళ్లపాటు బోధనలు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్, ఢిల్లీలో కూడా ఉపాధ్యాయురాలిగా ఎంపికై.. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోనూ కొంతకాలం టీచర్ గా సేవలందించింది.
అంజు విషయానికి మలుపుగా మారిన విషాదం!
2021లో అనారోగ్యంతో అంజు భర్త నిత్యానంద్ మరణించాడు. ఆ విషాదంలో కుంగిపోలేదు. అప్పటికే పుట్టింటికి తిరిగి వెళ్లిపోయి భర్తకు దూరంగా ఉంటున్న అంజు తనకెదురైన సమస్యల నుంచి పారిపోకుండా… రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు సిద్ధమవ్వాలని నిర్ణయించుకుంది. వాస్తవానికి పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో RAS అంటే ఏంటో కూడా అంజుకు తెలియదు.
ఓవైపు కుటుంబ బాధ్యతలు చూస్తూనే.. పిల్లాణ్ని చదివిస్తూనే… మరోవైపు అంకితభావంతో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం పగలనకా, రాత్రనకా చదివింది. విజయం సాధించింది. గట్టి పట్టుదల ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించొచ్చని.. ఎంతటి విజయతీరాలనైనా చేరుకోవచ్చని నిరూపించింది.
రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ప్రిపేరయ్యేటప్పుడు.. ఆ పరీక్ష పూర్తి పేరు కూడా తెలియని అంజు ఇప్పుడు రాజస్థాన్ లోనే పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. 21 ఏళ్లకే వివాహం, అత్తింటి వేధింపులు, అప్పటికే ఓ కొడుకు, పుట్టింటికి తిరిగిరావడం, అంతలోనే భర్త మరణం ఇవన్నీ వరుసబెట్టి శాపాల్లాగా అంజును వెంటాడాయి. కానీ, అచంచల విశ్వాసం, కృషి ఉంటే మనుషులు రుషులవుతారని తన సక్సెస్ స్టోరీతో చాటింది ఈ అంజు యాదవ్.
మొదటి యత్నంలోనే విజయం!
రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను తొలి ప్రయత్నంలోనే సాధించింది అంజు. 2023లో ప్రకటించిన ఫలితాల తర్వాత ఆమెకు రాజస్థాన్ పోలీస్ సర్వీస్ లో స్థానం లభించింది. శిక్షణననంతరం.. 2025, సెప్టెంబర్ లో జైపూర్ లోని రాజస్థాన్ పోలీస్ అకాడమీలో నిర్వించిన పాసింగ్ ఔట్ పరేడ్ నుంచి నేరుగా డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు అంజు.
ఒక గ్రామీణ విద్యార్థిని ఓ ప్రభుత్వోపధ్యాయురాలిగా… పోలీస్ అధికారిగా ఎదిగిన తీరు… అంజు ప్రయాణం నేడు ఎందరో మహిళలకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆదర్శప్రాయం.
అంజు ఎందుకు విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులెందరికో స్ఫూర్తి..?
ఏటికేడు లక్షల మంది యువత యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ తదిర పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే ఉన్నారు. కాస్త ఆలస్యమో, వ్యక్తిగత సమస్యల వల్లో విజయం సాధించలేకపోయామని పరిస్థితులను నిందిస్తారు. కానీ, ఈ అంజుయాదన్ సక్సెస్ స్టోరీ ఆ భావనను పూర్తిగా మార్చేసేది.
సంపన్న కుటుంబం కాదు… కుటుంబ బాధ్యతలు, అత్తగారింటి కలహాలు ఇలాంటి ఎన్నో వేదనల తర్వాత మళ్లీ చదువును ఆరంభించింది. వ్యక్తిగత విషాదాలను వెంటాడుతున్నా… విజయాన్ని ముద్దాడింది. కఠినమైన పోటీ పరీక్షల్లో మొట్టమొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఇవాళ డీఎస్పీగా సాటి పోలీసులతో పాటు, తాను పెరిగిన సమాజం నుంచి సెల్యూట్ అందుకుంటోంది.
విజయమనేది ఎక్కడి నుంచి ప్రారంభించాం. ఎప్పుడు ప్రారంభించామన్నది కాదు… ఎన్ని సవాళ్లెదురైనా పోరాడి సాధించుకునే సంకల్పమని ఒక సందేశాన్ని ఈ అంజూ యాదవ్ స్టోరీ మనకు చెబుతోంది. అందుకే అంజూ యాదవ్ పేరు ఇప్పుడామె పుట్టి పెరిగిన హర్యానా ధౌలేడాలోనే కాదు… ఇవాళ సోషల్ మీడియాలోనూ ప్రతిధ్వనిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారిలో అంజు ఓ ప్రతిబింబం కావాలనే సందేశమిస్తోంది.



