ఏ దేశమేగినా, ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండుగౌరవము అని రాయప్రోలు సుబ్బారావు చెప్పినా.. ఆ తర్వాత అమెరికా అబ్బాయిలో కాస్త మార్చి సినారె విప్పినా.. అది మాతృభూమి గొప్పదనాన్ని దశదిశలా చాటాలనేందుకే. అయితే, మన మాతృభూమి గురించి మనం చాటడం ఒకెత్తైతే… ప్రపంచదేశాల్లోనివారు మన మాతృభూమి సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆకర్షితులవ్వడం మరో ఎత్తు. అలాంటి కథే డాక్టర్ ఇలియానా సిటారిస్టి.
ఆ ఇటాలియన్ భారతీయ ఒడిస్సీ నాట్యకారిణి ప్రయాణమేంటో ఓసారి తెలుసుకుందాం.
నాట్యం సమయంలో ఆలపించే థిల్లానాలకు ఆమె గుండె కొట్టుకుంటుంది. తనకు తెలియకుండానే తన పాదాలు లయకనుగుణంగా తాళం వేశాయి. ఆ క్రేజ్ ఆమెను భారతీయ నాట్యంవైపు చూసేలా చేసింది. అలా నాల్గు దశాబ్దాలకు పైగా కళకు అంకితమైన పేరే పద్మశ్రీ డాక్టర్ ఇలియానా సిటారిస్టి. అందుకే ఇప్పుడు భారతీయ ఒడిస్సీ నృత్యంలో ఆమె ప్రపంచంలోనే ఓ మేటి నృత్యకారిణిగా అలరిస్తోంది.

ఒడిస్సీ నృత్యశైలితో పాటు.. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాల్లో కనిపించే ఫోక్ డ్యాన్స్ చౌ నృత్యరీతుల్లో కూడా తర్ఫీదు పొందిన ఇలియానా… వాటిని తన సంప్రదాయ ఇటలీ నృత్యరీతులతో సమపాళ్లలో మిళితం చేసి.. సంస్కృతీ, సంప్రదాయాలకు ఏ మాత్రం భంగం కల్గని రీతిలో వాటిని ప్రదర్శించే తీరే ఆమెను ప్రపంచంలో ప్రత్యేక నృత్యకారిణిగా నిలబెట్టింది.
ఈమధ్య హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కు కూడా హాజరైన ఇలియానా.. ఇటలీలో నాటకాల్లో ఓ నటి. తాను పోషించాల్సిన ఓ పాత్ర కోసం ఎలా అభినయించాలన్నది కొంత మథనంలో ఉన్న్పపుడు.. ఆమె కథకళికి సంబంధించిన ఓ ప్రదర్శనకు హాజరైంది. ఆ కథకళి నాట్యంలో వ్యక్తీకరణల్లో కనిపించిన వ్యాకరణం ఆమెను ఇంప్రెస్ చేసింది. అలా తను నాటకరంగంలో మరింత ఎదగాలంటే ఈ కథకళి నేర్చుకోవాలన్న ఆసక్తి కల్గింది. అలా మొదలైన తన ప్రయాణంలో గురుకృష్ణన్ నంబూద్రి అనే గురువును సంప్రదించి ఆయన వద్ద మూడునెలల పాటు కథకళి నేర్చుకోవడానికి కేరళకొచ్చింది. అప్పుడే తన గురువు నంబూద్రి ఒడిస్సీ గురించి కూడా ప్రస్తావించి ఇలియానాకు తెలియపర్చాడు.
అలా 1979లో ఒడిస్సీని నేర్చుకోవడానికి మళ్లీ ఇటలీ నుంచి ఇండియాకొచ్చింది ఇలియానా. అలా కథకళికి ఆరు నెలలు, ఒడిస్సీకి మరో ఆరు నెలలు ఇలా తన ఏడాది కాలాన్ని విభజించుకుంది. కానీ, తను ఒడిస్సీ నృత్యసామ్రాట్ కేలూచరణ్ మహాపాత్ర దగ్గర శిష్యురాలిగా జాయిన్ అయ్యాక ఇక కథకళి కథ కంచికే చేరింది. తన మూలాలైన నాటకరంగాన్నీ వదిలేసింది. మొట్టమొదట నేర్చుకున్న కథకళీకి స్వస్తి పలికింది. ఒడిస్సీలో మునిగితేలింది. అదే విధంగా ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పెద్దఎత్తున కనిపించే మయూర్భంజ్ చౌ ఫోక్ నృత్యరీతులను కొంతకాలం హరినాయక్ అనే గురువు వద్ద నేర్చుకుంది.
శాస్త్రీయ నృత్యం- సవాళ్లు!
ఓ విదేశీయురాలిగా భారతీయ శాస్త్రీయ నృత్యాల్ని నేర్చుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. కేవలం శరీర కదలికలు మాత్రమే కావు నృత్యమంటే. సంగీతం, సాహిత్యం, హావభావాలు, భాషపై పట్టు, తత్వం ఇవన్నీ ఒంటపట్టించుకోవాల్సి ఉంటుంది. పైగా నిరంతర అభ్యాసప్రక్రియలో ఉన్నప్పుడు మాత్రమే అందులో రాణింపూ కుదురుతుంది.

అందరు డ్యాన్సర్లకు భిన్నంగా తనకంటూ ఓ శైలి!
ఆకర్షించే ఓ థీమ్ ను ఎంచుకోవడం.. దాన్ని ముందుగా స్క్రిప్ట్ రూపంలో పేపర్ పైకెక్కించడం.. దానికి ఓ పాట రూపకల్పన.. గద్యరూపంలో ఉన్న సబ్జెక్టైతే, దాన్ని కవిత్యరూపంలోకి, పద్యరూపంలోకి మార్చే విధానం వంటి పలు ప్రక్రియలపై మథనం జరుగుతుందంటోంది ఇలియానా. ఉదాహరణకు శరణార్థులనే ఓ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు.. నృత్యరీతులకు కావల్సిన స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని, సంగీత దర్శకుడు, రచయితతో కూర్చుని.. కొరియోగ్రఫీ చేసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నానంటోంది. ఎక్కడా బ్యాలెన్స్ దెబ్బతినకుండా.. భారతీయ నృత్యరీతులకు ఇటాలియన్ సంప్రదాయాన్ని జోడిస్తూనే తన ప్రత్యేక శైలిని అలవర్చుకున్నానంటోంది ఇలియానా.
భువనేశ్వర్ లో ఆర్ట్ విజన్ అనే నృత్యపాఠశాల స్థాపన!
తన గురువు కేలూచరణ్ మాహాపాత్ర ఇన్స్పిరేషన్ తోనే ఇలియానా ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఏకంగా ఆర్ట్ విజన్ అనే డ్యాన్స్ స్కూల్ నూ ప్రారంభించారు. తన గురువు అనుసరించిన శాస్త్రీయమైన పద్ధతులను తన బోధనలోనూ కచ్చితంగా పాటిస్తానని.. ఒడిస్సీలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ముందు క్రమశిక్షణ నేర్పిస్తామంటోంది. ముఖ్యంగా తన స్కూల్ ఏర్పాటు వెనుక వారసత్వాన్ని కాపాడుకోవడమే ప్రధాన ఉద్ధేశ్యమంటోంది ఇలియానా.
నృత్యం కేవలం తనకు పేరు మాత్రమే తీసుకురాలేదని.. తనలో ఒక క్రమశిక్షణకు శ్రీకారం చుట్టిందంటోంది ఇలియానా. ఆ క్రమశిక్షణతోనే అంకితభావంతో ఏదైనా సాధన చేయగలమనేది ఇలియానా అభిప్రాయం.
ఇటలీ వంటి దేశాల్లో ఒడిస్సీ వంటి నృత్యాలను ప్రదర్శిస్తే ఎలా ఉంటుందోనన్న మీమాంస కాస్త ఉండేదని.. కానీ, దానికి ఇటాలియన్ శైలిని జోడించి బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించిన నృత్యరీతులు విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా.. అంతకుమించిన ప్రోత్సాహం తనకు లభించిందంటోది ఈ డ్యాన్సర్.
ది మేకింగ్ ఆఫ్ ఏ గురు: కేలూచరణ్ మహాపాత్ర, హిజ్ లైఫ్ అండ్ టైమ్స్ పేరుతో తన ఒడిస్సీ నృత్యగురువు జీవిత చరిత్రను తానే రచయితగా పుస్తకరూపంలోకి తెచ్చింది ఇలియానా. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఇన్ ఒడిశా పేరుతో అక్కడి మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేకతను పరిచయం చేసే పుస్తకాన్నీ రచించింది. అలాగే, తన ఆత్మకథను ‘ మై జర్నీ: ఏ టేల్ ఆఫ్ టూ బర్త్స్’ పేరుతోనూ ఓ పుస్తకాన్నీ తీసుకొచ్చిన ఇలియానా.. తాజాగా ఒడిస్సీ అండ్ ది గీత గోవిందా పేరుతో.. శాస్త్రీయ నృత్యరూపానికి, జయదేవుని ఇతిహాస కావ్యానికి మధ్యనున్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ తీసుకురావడం విశేషం.
ఇలియానా భారతీయ ఒడిస్సీ నృత్యంలో సాధించిన ఘనతకు భారతదేశం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించగా.. 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారాన్నందుకుంది డాక్టర్ ఇలియానా.



