యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తుంటారు. నిజమే. కానీ, డబ్బు లేందే రాజకీయాలు చేయలేని నేటి రోజుల్లో… పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రత్యర్థి వెయ్యిస్తే.. కనీసం రెండు వేలు ఇవ్వాల్సిన గత్యంతరం లేని కాలంలో ఆ పిలుపు ప్రాక్టికల్ గా అందరికీ ఎంతవరకూ సంభవం..?
డబ్బు లేందే రాజీకీయాల్లేని రోజుల చర్చ కాస్సేపు పక్కనబెడితే.. అలాంటి ఓ జెన్ జీ అమ్మాయి కేరళలో ఓ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికై చరిత్ర సృష్టించింది.

కేవలం 21 ఏళ్లకే దియా బిను పులిక్కకండం… కొట్టాయం జిల్లా పాలా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికై రాజకీయాల్లో యువ మహిళా ప్రాతినిథ్యానికి ప్రతీకగా మారారు. అతి పిన్న వయస్సులోనే మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన మహిళా నాయకురాలిగా నిల్చారు.
పాలా మున్సిపల్ కౌన్సిల్ లో మొత్తం 26 మంది సభ్యులుంటే… ఎన్నికల్లో ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ఎల్డీఎఫ్ కు 12 సీట్లు వస్తే.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు 10 సీట్లు వచ్చాయి. మిగిలిన నాల్గు సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు గెల్చారు. దియా బిను కూడా ఇండిపెండెంట్ అభ్యర్థే. కానీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మద్దతుతో 14 మంది ఓట్లు సాధించి… చైర్ పర్సన్ గా ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విజయంలో దియా కుటుంబ పాత్ర కూడా కీలకమే.
అసలు దియా ఎవరు..?
దియా బిను చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసింది. తండ్రి ఒత్తిడి, ప్రోత్సాహంతో పాటు… తనకు కూడా కాస్త ఆసక్తి ఉండటంతో రాజకీయాలవైపు అడుగేసింది. మున్సిపల్ కౌన్సిలర్ గా ఆమె 131 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. చివరకు తానూహించని విధంగా అన్నీ తనవైపుకే కలిసి వచ్చి.. దియా ఏకంగా పాలా మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించింది.
దియా రాజకీయ నేపథ్యమేంటి..?
పాలా మాజీ మున్సిపల్ చైర్మన్ గా బిను పులిక్కకండం పనిచేశారు. తాజా ఎన్నికల్లో కూడా తండ్రి బిను పులిక్కకండం, మామ బిజు పులిక్కకండంతో పాటు.. దియా బిను కూడా కౌన్సిలర్ గా గెల్చింది. ఈ ముగ్గురూ కూడా ఏ పార్టీ నుంచి బరిలోకి దిగకుండా.. స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడం మరో విశేషం.
చిన్న వయస్సులో పెద్ద బాధ్యత!
21 ఏళ్ల యుక్తవయస్సులో దియా బినుకు పాలా మున్సిపల్ చైర్ పర్సన్ గా చాలా గురుతర బాధ్యత పైనపడింది. పాలా మున్సిపాలిటీ అభివృద్ధి, పురోగతికి తనవంతు కృషి చేస్తానంటోంది ఈ జెన్ జీ నాయకురాలు. అందుకు, తన సహచరులైన మరో 25 మంది కౌన్సిలర్ల సంపూర్ణ సహకారం అవసరమని.. దాన్ని ఆశిస్తున్నట్టు చెబుతోంది. మున్సిపాలిటీని నడిపించడంలో వారి అనుభవాలు, సలహాలను గౌరవిస్తానంటోంది దియా బిను.
2023లో దియా బిను తండ్రి బిను పులిక్కకండాన్ని కేరళ కాంగ్రెస్ (ఎం) అధినేత జోసెఫ్. కే. మణి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించారు. అంతేకాదు, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూడా ముందుగా హామీ ఇచ్చిన మేరకు పదవిని కట్టబెట్టకుండా అవమానించందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరిగింది.
ఈ సమయంలో దియా విజయం తండ్రికి ఓ పెద్ద బూస్టప్. తన ప్రత్యర్థులపై ఈ విజయంతో బిను పులిక్కకండం ప్రతీకారం కూడా తీర్చున్నట్టే. దియా మున్సిపల్ చైర్ పర్సన్ గా, తండ్రి, మామలు కౌన్సిలర్లుగా ఉండటంతో.. కచ్చితంగా ఆ కుటుంబ రాజకీయ పునరాగమానికే కాకుండా.. భవిష్యత్తులో దియా రాజకీయ ఎదుగుదలకూ ఈ విజయం ఓ సోపానం కానుంది.
అదే సమయంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమిలో మూడో అతి పెద్ద భాగస్వామిగా ఉన్న జోసెఫ్ మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ (ఎం)కు కూడా దియా విజయం ఓ గట్టి దెబ్బేనన్న చర్చకు తెరలేచింది. మొత్తంగా 21 ఏళ్లకే కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ గా గెల్చి.. అనూహ్యంగా చైర్ పర్సన్ పదవీనే చేపట్టిన దియా బిను అనే జెన్ జీ… భవిష్యత్ కాలపు రాజకీయ ముఖచిత్రానికి ఓ ప్రతీక.


