సునామీ విషాదం నుంచి బయటపడి.. చిగురించే ఆశకు కొత్త రూపయ్యాడు: బేబీ 81.. ఓ ఇన్స్పైరింగ్ స్టోరీ!

విషాదం నుంచి విజయం వైపు!

కొన్ని విషాదకథలు వెంటాడేవి. అలాంటి భయంకరమైన దృశ్యం 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ. ఎక్కడో ఇండోనేషియా సుమత్రా దీవుల్లో వచ్చిన భూప్రకంపనల ప్రభావం ఇటు భారత్ నుంచి మొదలుకుంటే శ్రీలంక, థాయ్ లాండ్ వంటి ఎన్నో దేశాలు ఎదుర్కొన్న విపత్తు తల్చుకుంటేనే ఓ భయానకం..

ఆ సునామీ మిగిల్చిన విషాదంలో ఒక శ్రీలంకలోనే 35 వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే, అందులోనూ కొన్ని కదిలించే కథలు.. ఇప్పుడు పెరిగి పెద్దవై మన ముందు ఆశకు చిరునామాలా నిలుస్తున్నాయి.

ఆ పేరే బేబీ 81. అసలు పేరు జయరాసా అభిలాష్. ఆనాడు సునామీలో రెస్క్యూ ఆపరేషన్ లో లభించిన శ్రీలంకకు చెందిన జయరాసా అభిలాష్ ఇప్పుడు ఉన్నత విద్యనభ్యసిస్తూ… నాటి విషాదం నుంచి బయటపడి విజయంవైపు దూసుకెళ్తున్నాడు. తనను రెస్క్యూ టీం సముద్రపు రాకాసి అలల నుంచి కూతవేటు దూరంలో ఉన్న బురదలో గుర్తించి కాపాడారు. తల్లిదండ్రులెవరో తెలియకుండానే పెరిగాడు. తమ అబ్బాయేనంటూ కొందరు క్లెయిమ్ చేస్తూ కోర్టుకెక్కేవరకూ.. డీఎన్ఏ పరీక్షల వరకూ.. ఆ తర్వాత సునామీ వంటి భయంకర విపత్తులను చూశాడు అభిలాష్.

మానవజాతి ఆధునిక చరిత్రలోనే అత్యంత విషాద ఘట్టం 2004 సునామీ. ఆ సమయంలో రెండు నెలల బాబు తూర్పు శ్రీలంక ప్రాంతంలో పూర్తిగా బురదలో కప్పబడి రెస్క్యూ టీంకు కనిపించాడు. అంత విషాదంలో వేల మంది ప్రాణాలు కోల్పోయిన ఓ దుర్ఘటనలో.. హోప్ అనే పదానికి పర్యాయపదంలా కనిపించిన ఆ రెండు నెల్ల బాబును రెస్క్యూ టీం కాపాడింది. ఓ అనాథలా లభించిన అతణ్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హాస్పిటల్ లో పేషంట్ నంబర్ 81గా నమోదయ్యాడు ఆ బాలుడు. అందుకే తనను అప్పట్నుంచీ బేబీ నంబర్ 81గా అంతా పిల్చుకునేవారు. ఇప్పుడు ఆ బాలుడే జయరాసా అభిలాష్ గా 20 ఏళ్ల ఎత్తుకెదిగాడు. ఉన్నత చదువులు చదువుతున్నాడు.

అయితే, సునామీ సమయంలో చావు అంచుల నుంచి బతికి బట్ట కట్టి ఇప్పుడు విజయం సాధించాలన్న కసితో జయరాసా అభిలాష్ అడుగులేయడం ఒక స్ఫూర్తిగాధైతే… చిన్నాభిన్నమైన తన కుటుంబాన్ని మళ్లీ కలుసుకోవడం తాను అనుభవించిన విషాదంలో ఓ మిరాకిల్.

జయరాసా తండ్రి మురుగుపిళ్లై తన కుటుంబం కోసం నెలల తరబడి వెతికాడు. తన భార్యను, తల్లిని కలుసుకోగల్గాడు. కానీ, రెండు నెలల వయస్సులో సునామీ రేపిన ఉత్పాతానికి అదృశ్యమైనపోయిన కొడుకు మాత్రం లభించలేదు. కానీ విధి ఆడే నాటకం ముందు.. మనవన్నీ వీధి నాటకాలే. అలా విధి ఆ తండ్రీకొడుకుల్ని కలిపిన ఈ మెలోడ్రామా ఓ సంచలనం. అయితే, మురుగుపిళ్లై తన కొడుకును కలుసుకోగల్గడానికీ ఎన్నో నాటకీయ పరిణామాలు ఎదుర్కోక తప్పలేదు.

జయరాసా అభిలాష్ కోసం తమ కొడుకంటే తమ కొడుకంటూ ఏకంగా 9 కుటుంబాలు క్లెయిమ్ చేసుకున్నాయి. ఒక నర్సు దగ్గర జయరాసా అభిలాష్ పెరుగుతున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న తండ్రి మురుగుపిళ్లై కూడా మిగిలిన తొమ్మిది కుటుంబాల్లాగే సదరు పిల్లాణ్ని పెంచుతున్న నర్సు దగ్గరకు చేరుకున్నాడు. ఆ విషయం కాస్తా ఏకంగా చట్టపరమైన ప్రక్రియగా మారిపోయింది. దాంతో మురుగుపిళ్లై కోర్టుకెక్కాడు. తమ కొడుకేనంటూ తనకు న్యాయం చేయలాని కోరాడు. కోర్ట్ తీర్పు వచ్చే వరకూ ఆసుపత్రిలోనే పిల్లవాణ్నుంచాల్సి వచ్చింది.

న్యాయపోరాటం – డీఎన్ఏ పరీక్ష!

కేసు కోర్టుకు వెళ్లింది. న్యాయమూర్తి DNA పరీక్షకు ఆదేశించాడు. అక్కడ మురుగుపిళ్లై తరహాలో మిగిలిన కుటుంబాలు మాత్రం తమ కొడుకేనంటూ కోర్టుకెక్కకపోవడం ఇంకో అడ్వంటేజైంది. కోర్ట్ ఆదేశాలతో జయరాసా, మురుగుపిళ్లైకి సంబంధించిన DNA పరీక్షలు పూర్తయ్యాయి. తుది ఫలితాలు మురుగుపిళ్లయే జయరాసా అభిలాష్ తండ్రి అని తేల్చాయి.

జయరాసా అభిలాష్ కథ.. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. చాలా మీడియా సంస్థలు ఇంటర్వ్యూస్ కోసం యూఎస్ కు కూడా ఆహ్వానించాయి.

సునామీ తర్వాత అభిలాష్ జీవితం!

ప్రస్తుతం అభిలాష్ ఉన్నత చదువులు చదువుతున్నాడు. అయితే, అభిలాష్ స్కూల్ జీవితంలో బేబీ 81 అనే పేరే స్థిరపడి తనను చాలా ఇబ్బంది పెట్టిందంటాడు. కానీ, తన తండ్రి మాత్రం తనను ప్రోత్సహించాడని.. ఇలాంటి పేరు ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదనేవాడనీ చెబుతాడు అభిలాష్.

సునామీ మృతులకు ఓ స్మారక చిహ్నం!

సునామీ నుంచి చిన్నాభిన్నమైన జయరసా ఫ్యామిలీకి రిలీఫ్ ఫండ్ కూడా అందకపోవడంతో మరిన్ని సవాళ్లు ఎదుర్కోక తప్పలేదు. జయరసా అభిలాష్ కుటుంబ కథ అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించడంతో వారి అమెరికా ప్రయాణం ఆ ఆర్థిక సాయానికి అడ్డంకిగా మారింది.

అయినప్పటికీ ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా విడిపోయి మళ్లీ కలిసిన జయరాసా కుటుంబం.. సునామీ మృతుల స్మృత్యార్థం తమ ఇంటి పెరట్లో ఓ స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేసింది. వారందరినీ గుర్తు చేసుకోవడానికే ఆ స్మారక స్థూప ఏర్పాటంటోంది జయరాసా కుటుంబం.

అభిలాష్ జీవిత ప్రయాణం యూనిక్ గా సాగాలని ఆశిస్తున్నాడు తండ్రి మురుగుపిళ్లై. మనుగడే ప్రశ్నార్థకమైన హృదయవిదారక దృశ్యం నుంచి చిగురించిన కొత్త ఆశగా అభిలాష్ జీవితం ఓ ప్రేరణాత్మక అధ్యాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles