మొదట సోషల్ మీడియా వేదికగా ఆరంభమై… ఆ తర్వాత ఢిల్లీ ఉద్యమంతో కేంద్రం మెడలు వంచిన కాక్రోచ్ జనతా పార్టీ… రాజకీయ పార్టీగా అవతరిస్తుందా…? లేక వారు చెబుతున్నట్టుగానే ప్రజా ఒత్తడిని ప్రభుత్వాలపై పెంచే ఓ వ్యవస్థగా మారుతుందా..? ఈ విషయంలో మనం ఓసారి తెలంగాణా జనసమితిని గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది. కోదండరాం నేతృత్వంలో తెలంగాణా జనసమితి పేరిటి తయారైన ఓ ఉద్యమ సంస్థ… ఆ తర్వాత పార్టీగా మారాక ఏం జరిగిందో చూశాం. అదే కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణా ఉద్యమం ఎంత కీలకంగా నడిచిందో కూడా చూశాం. పూర్తిగా రెండిటినీ ఒకే గాటన కట్టకపోయినా… ఇప్పుడు సీజేపీ పోకడ మాత్రం కాస్త ఆ అడుగుజాడలను పోలి ఉండటమే ఈ విశ్లేషణకు కారణం.
ఎందుకంటే తాజాగా సీజేపీ దేశవ్యాప్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రకటించింది. గ్రాస్ రూట్ లో ప్రజలతో మమేకం కావడానికి క్యా బోల్తీ పబ్లిక్ అనే నినాదంతో జనంలోకి వెళ్లే ఓ వేదికను సిద్ధం చేస్తోంది. విద్యార్థులు, యువత, సాధారణ పౌరులంతా తమ ఉద్యమంలో చేరి తమ గొంతులను మరింత పెంచాలని కోరుతూ పార్టీ తన వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదుకు ఆహ్వానం పలుకుతోంది.

నిరుద్యోగం, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు, ప్రభుత్వ పాఠశాలల మెరుగుదల, ప్రజల్లో సర్కారీ వ్యవస్థలపై తగ్గుతున్న విశ్వాసం వంటి అంశాలపై ఈ ఉద్యమ సంస్థ ఫోకస్ చేయనున్నట్టు చెబుతోంది.
క్యా బోల్తీ పబ్లిక్!
సెప్టెంబర్ లో క్యా బోల్తీ పబ్లిక్ పేరిట దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి వివిధ రాష్ట్రాల్లో పర్యటించేందుకు నడుం బిగించింది. ప్రజలను నేరుగా కలుసుకుని గ్రామీణ, స్థానిక స్థాయిలో దేశ రాజకీయ చర్చల దిశను మార్చడమే ఈ క్యా బోల్తీ పబ్లిక్ లక్ష్యం.
దేశంలో అత్యంత పెద్ద సమస్య నిరుద్యోగం. ప్రధానంగా దాన్ని జాతీయాంశంగా మార్చడమే ఈ క్యా బోల్తీ పబ్లిక్ మోటో.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మంచి ఊపులో ఉన్న సీజేపీ.. విద్యార్థిలోకానికి లభించిన అతి పెద్ద విజయంగా ఢిల్లీ ఉద్యమాన్ని భావిస్తోంది. జంతర్ మంతర్ నిరసన కేవలం విద్యార్థులనే కాదు.. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్న యువతనంతా ఏకం చేసిందన్న భావన సీజేపీది.
నాయకత్వం లేని ఉద్యమం!
విద్యార్థులు, యువ ఉద్యోగులు, పౌరులంతా సభ్యత్వం తీసుకుని తమ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సీజేపీ ప్రకటించింది. సీజేపీ వెబ్సైట్ ద్వారా ఆ సభ్యత్వ నమోదు తీసుకోవాలని సూచిస్తోంది. అదే సమయంలో సంస్థ ఎలాంటి క్రౌడ్ ఫండిగ్ నిర్వహించడం లేదనీ స్పష్టం చేసింది.
సీజేపీ భవిష్యత్తు రాజకీయ పార్టీగా మారుతుందా..?
ఈ ప్రశ్నే కోదండరామ్ తెలంగాణా జనసమితితో పోలికను ముందుకు తెచ్చింది. ప్రస్తుతానికి ప్రజా ఒత్తిడి సమూహంగా మాత్రమే సీజేపీ కొనసాగాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ కీలక నేతలు చెబుతున్న మాట. అంటే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారుతారా అన్న ప్రశ్నకు.. లేదన్న సమాధానమైతే రాలేదు. కాబట్టి.. కోదండరామ్ తెలంగాణా జనసమితి తరహాలో సీజేపీ కూడా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలనూ కొట్టిపారేయలేం.
ప్రస్తుతానికైతే రాజకీయ పార్టీగా మారే బదులు ప్రజా జవాబుదారీతనాన్ని పెంచడం, సంస్కరణల కోసం పోరాటాలు చేయడం, గ్రాస్ రూట్స్ కు వెళ్లి పనిచేయడం ఇవే సీజేపీ ముందున్న లక్ష్యాలు.
జాతీయ నాయకత్వ బృందాన్ని ప్రకటించిన సీజేపీ!
సీజేపీ అధికార ప్రతినిధిగా ఆశుతోష్ రాంకా ఈ జాతీయ నాయకత్వాన్ని ప్రకటించాడు.
వ్యవస్థాపక కన్వీనర్ గా 30 ఏళ్ల అభిజీల్ దీప్కే. సహ కన్వీనర్లుగా ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ తో పాటు.. సోనమ్ వాంగ్ చుక్ కూడా ఈ బృందంలో ఉన్నారు.
పర్యావరణవేత్త, ఉద్యమకారులు సోనమ్ వాంగ్ చుక్ తమ ఉద్యమానికి మెంటార్ గా కొనసాగుతారని అభిజీత్ దీప్కే చెప్పుకొచ్చాడు. ఆయన సలహాలు, సూచనలతో ముందుకెళ్తామన్నారు.
జార్ఖండ్ లో విద్యార్థులకు సీజేపీ మద్దుతు!
జార్ఖండ్ లో జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు తమ పూర్తి మద్దతును కూడా సీజేపీ ప్రకటించింది. త్వరలోనే తమ ప్రతినిధి బృందం రాంచీకి వెళ్లి విద్యార్థులను కలిసి, వారి డిమాండ్లను అంగీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామనీ తెలిపింది.
సంస్థలపై విశ్వాసం తగ్గిందంటున్న సీజేపీ!
రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారంటోంది సీజేపీ. ఈ సంస్థల్లో జవాబుదారీతనం, తటస్థత పునరుద్ధరించాలంటే ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వాలపై ఒత్తిడి అవసరమని భావిస్తోంది. ప్రస్తుత దేశ రాజకీయ వ్యవస్థ చాలా దారుణ స్థితిలో ఉందన్నది సీజేపీ అభిప్రాయం.
జంతర్ మంతర్ ఉద్యమంతో విస్తరణవైపు అడుగులు!
ఢిల్లీ జంతర్ మంతర్ ఇచ్చిన ఊపుతో ఉద్యమాన్ని విస్తరించాలనే ఆలోచనలతో, వ్యూహాలకు పదును పెడుతూ సీజేపీ రెండు రోజులు భేటీ అయ్యింది. అయితే, ఇప్పటికిప్పుడు రాజకీయ పార్టీగా మారే ఉద్ధేశం లేదని.. దేశానికి ఇప్పుడు అవసరమైంది కేవలం ప్రజా ఒత్తిడేనంటోంది. సో.. ప్రస్తుతానికి సీజేపీ ఒక ప్రెజర్ గ్రూపుగా మాత్రమే పనిచేస్తుంది.
సీజేపీ అజెండాలో మరిన్ని ఆలోచనలు!
విద్యార్థులకు న్యాయ, వైద్యసాయమందించడం కూడా సీజేపీ ఆలోచనల్లో కీలకమైనవి. ఇటీవల జరిగిన నిరసనల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేలా చర్యలకు ఉపక్రమించింది. గాయపడిన నిరసనకారులకు న్యాయపరమైన, వైద్యపరమైన సాయం అందించాలని నిర్ణయించింది.
జూలై 25న ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థుల ఆధ్వర్యంలోని ఉద్యమానికి లభించిన గొప్ప విజయమని సీజేపీ అభివర్ణించింది. నిరంతర ప్రజా ఒత్తిడి ద్వారా రాజకీయ వ్యవస్థను జవాబుదారీగా ఎలా మార్చవచ్చో ఢిల్లీ దృశ్యాలే అందుకు నిదర్శనమంటోంది సీజేపీ. విద్యార్థీలోక శక్తికి విజయ చిహ్నంగా జంతర్ మంతర్ ఉద్యమాన్ని చూస్తున్న సీజేపీ.. మరింత గ్రాస్ రూట్స్ లో పనిచేయానుకోవడం దేశంలో ఆల్టర్నేట్ ఆబ్సల్యూట్ కోసం చూస్తున్న తరుణంలో ఓ ముందడుగు. అయితే, తెలంగాణా జనసమితి ఉద్యమ సంస్థగా పనిచేసినంత కాలం పొందిన ఆదరణ.. ఆ తర్వాత, పార్టీగా అవతరించాక ఆ బలాన్ని కూడగట్టుకోలేకపోయింది. మరి సీజేపీ భవిష్యత్తేంటన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతోంది.


