#salutetoourheroes
తనకు మాలిన ధర్మం లేదంటారు. కానీ, ఇది కొందరు ఈ సామెతకు ఆవల జీవిస్తారు. ఒకరి ప్రాణాల్ని కాపాడేందుకు తమ ప్రాణాలు పోయినా పర్లేదనుకుని మరణించినా చిరంజీవులుగా నిల్చిపోతారు. అందుకే ఇతడి గురించి మనం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి.
రాజేష్.. కేరళ వరదల్లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరొకరిని కాపాడి తాను వరదలో కొట్టుకుపోయిన ఓ వాలంటీర్ కథ ఇది.

కేరళలో కురుస్తున్న భారీవర్షాలకు వరదలతో ఒకవైపు జనం అతలాకుతలమైపోతుంటే.. మానవత్వం ప్రదర్శిస్తూ బాధితుల పక్షాన నిల్చేవారూ కొందరు అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛంద సేవలు చేస్తున్నారు. ఈ మధ్యే అసోం వరదల్లో అలాంటి హుస్సేన్ మన్సూరీ గురించి చెప్పుకున్నాం. ఈ రాజేష్ కథ అంతకంటే గొప్పది. త్యాగానికి మనిషి రూపమిస్తే అది రాజేష్.
కేరళలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న రాజేష్ అనే వాలంటీర్ ఓ స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్. కన్నూర్ జిల్లాలోని మింతుల్లి దీవి సమీపంలో కరియంగోడ్ నది బీభత్సం సృష్టించింది. అక్కడ వచ్చిన వరదల్లో బాధితులకు సాయమందించేందుకు వెళ్లిన రాజేష్.. ఒక 61 ఏళ్ల వృద్ధుడిని రక్షించి తాను వరదల్లో గల్లంతయ్యాడు. తన లైఫ్ జాకెట్ ను ఆ వృద్ధుడికిచ్చి తీరానికి తీసుకొస్తుండగా… అమాంతం వచ్చిన రాకాసి ప్రవాహం మానవత్వానికి ప్రతీకైన రాజేష్ ను ఎత్తుకెళ్లింది. మంగళవారం రోజున రాజేశ్ మృతదేహం బయటపడింది. ఇది కరుణ లేని ప్రకృతి రాసిన మరణ శాసనం.
ఈ రాజేష్ ఎవరు..?
తిరువనంతపురం సమీపంలోని కల్లియూర్ గ్రామవాసి. స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ గా, ర్యాపెల్లింగ్ ట్రైనర్ గా పని చేస్తుంటాడు. కేరళలో ఇటీవలి సంవత్సరాల్లో సంభవించిన ప్రతి పెద్ద ప్రకృతి విపత్తులోనూ స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొన్న వారియర్ ఈ రాజేష్.
2018లో వచ్చిన వరదలు కేరళను అతలాకుతలం చేస్తే ఏకంగా ఓ సినిమాగా కూడా అది తెరకెక్కింది. ఆ సమయంలోనూ రాజేష్ వాలంటీర్ గా సేవలందించాడు. 2024 వాయనాడ్ లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటన.. అప్పటివరకూ పర్యాటక కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతాన్ని డార్క్ టూరిజం స్పాట్ గా మార్చేసింది. అదిగో ఆ సమయంలోనూ రక్షణ బృందంలో తానూ ఒకడిగా రాజేష్ సేవలందించాడు. 2026లో మళ్లీ కేరళను వరదలు ముంచెత్తినప్పుడు కూడా సహాయక చర్యల కోసం ముందుకొచ్చాడు. మొత్తంగా సేవే జీవితంగా సాగిన త్యాగజీవి ఈ రాజేష్.
ఇప్పుడు భార్య లక్ష్మి, ఇద్దరు చిన్న కుమారులైన అర్షాన్, అభిషేక్ తో పాటు.. తల్లిదండ్రులు గీత, రాజశేఖరన్ ను శోకసంద్రంలో ముంచివెళ్లిపోయాడు ఈ త్యాగశీలి.
కరియంగోడ్ నదిలో ఏం జరిగింది..?
పులింగోడ్ ప్రాంతానికి చెందిన 61 ఏళ్ల వృద్ధుడు బెన్నీ వరద నీటిలో కొట్టుకుపోతుండగా రాజేష్ అతడిని కాపాడాడు. బెన్నీని సురక్షితంగా ఓ ఒడ్డుకు చేర్చిన రాజేష్.. తీరం దాటించేందుకు తన వద్దనున్న లైఫ్ జాకెట్ ను బెన్నీకిచ్చాడు. బెన్నీని ఒడ్డుకు చేర్చే క్రమంలో రాజేష్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతైన రాజేష్ మృతదేహం మొన్న మంగళవారం లభ్యమైంది.
రాజేష్ కు నివాళుర్పించిన కేరళ సీఎం!
మానవత్వం చూపి రాజేష్ చేసిన సేవ ఇప్పుడు కేరళ తీరాన్ని దాటి రుతుపవనాల కంటే వేగంగా జనాన్ని కంట తడిపెట్టిస్తోంది. నిస్వార్థంగా రాజేశ్ చేసిన త్యాగం చిరస్థాయిగా నిల్చిపోయేది. ఈ విషయాన్నే కేరళ సీఎం తన X ఖాతాలోనూ పోస్ట్ చేశారు. గతంలో కేరళ వరదల్లోనూ, వాయినాడ్ విపత్తులోనూ రాజేష్ చూపిన చొరవను సీఎం సతీషన్ గుర్తు చేసుకున్నారు.
రియల్ హీరోగా నిల్చిన రాజేష్!
రియల్ హీరో రాజేష్ తన ప్రయత్నంలో ఒక విషాదకరమైన ముగింపుతో వెళ్లిపోవడం హృదయ విదారకం. అందుకే ఇప్పుడు పార్టీలు, ప్రాంతాలకతీతంగా రాజేష్ పేరు మార్మోగిపోతోంది.
మొత్తంగా రాజేష్ చూపించిన తెగువ, చేసిన నిస్వార్థ సేవ, త్యాగంతో కేరళ చరిత్రలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకుని వెళ్లిపోయాడు. రియల్ హీరో రాజేశ్ కు సెల్యూట్ తో ఈ అక్షర నివాళి!


