అదేదో ఊరి నుంచి మహాశిల్పి వచ్చాడు. మరేదో ఊరి చివరన ఉంచిన పెద్ద బండ తెచ్చాడు. ఆరడుగుల కొలతకు ఆ బండను ఖండించాడు. మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేశాడు. ఆరడుగుల బండ విగ్రహమై వెలిసింది. మూడడుగుల బండ చాకిరేవుని చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుడి ఎదుట నిల్చాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి. గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్థంతో తడిశాయి. మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి. అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు.. చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు.. శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతుంది. పవిత్రతకై ప్రతి బట్టా బండను బాదబడింది. గుడి నుంచి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి.. రేవు నుంచి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుడిలోని దేవుడా? రేవులోని బండా? ఎవరు దేవుడు? ఎవరు బండ? ఇది ప్రముఖ నటుడు రంగనాథ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వినిపించింది. ఇంత ఫిలాసఫీ వినిపించిన ఆ మేటి నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఓ విషాదం. ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడో ఇప్పటికీ తేలకపోవడం ఓ మిస్టరీ.

1974లో చందన అనే సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన రంగనాథ్… ఒక నలభై చిత్రాలకు మించే హీరోగా చేశారు. ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ రకాల పాత్రలూ చేశారు. 300కు పైగా సినిమాల్లో నటించిన రంగనాథ్… చివరకు తన యావద్ ఆస్తిని ఇంటి పనిమనిషి పేరిట రాసి… ఆ ఆస్తుల వివరాలను ఇంటి గోడపైనే రాయడం.. ఆయన చివరి కోరిక దేశవ్యాప్తంగా ఒక చర్చగా మారింది.
రంగనాథ్ 2015 డిసెంబర్ 19న హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయస్సు 66 ఏళ్లు. అభిమానులు, సినీ ప్రముఖుల్లో ఆయన మరణం తీవ్ర చర్చగా మారింది.
ఎందుకంటే తన మొత్తం ఆస్తి, సంపద అంతా కూడా తన ఇంట్లో పనిచేసే మీనాక్షికి అప్పగించాలని రంగనాథ్ వీలునామాలాంటి సందేశం వదిలివెళ్లడమే ఆ చర్చకు కారణం. ఆ సందేశాన్ని ఆయన తన ఇంటి గోడపై ఓ బ్లాక్ మార్కర్ తో రాశారని ప్రచారం జరిగింది. తన ఆస్తి మొత్తాన్ని మీనాక్షికే ఇవ్వాలని.. ఆమెను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ఆ సందేశం సారాంశం.
దాంతోపాటే తన ఆస్తుల వివరాలను కూడా అదే గోడపై రాశారట రంగనాథ్. తన చివరి కోరికను ఎవ్వరూ తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండాలనే ఉద్ధేశంతో ఆయన అలా రాసి ఉంటారని కొన్ని వార్తాకథనాలు చెప్పిన మాట.
రంగనాథ్ బలవన్మరణానికి పాల్పడ్డ రోజు ఆయన ఇంట్లో పనిచేసే మీనాక్షే ఆయనకు మధ్యాహ్న భోజనం వండిపెట్టారు. ఆ తర్వాత ఆమె వెళ్లిపోయింది. రంగనాథ్ తీసుకున్న నిర్ణయం ఆమెకు తెలియదు. సాయంత్రానికి కూతురు ఇంటికొచ్చి ఎంతసేపు తలుపులు తట్టినా స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికెళ్లారు. ఆ తర్వాత షాక్ కు గురయ్యారు. పోలీసుల కేసు అవన్నీ యథావిధిగా జరిగిపోయాయి.
రంగనాథ్ మరణానికి ముందు తన స్నేహితుడు దేవదాసుకు మధ్యాహ్నం సుమారు మూడున్నరకు ఒక ఎస్ఎంఎస్ పంపినట్టు కొన్ని వార్తలొచ్చాయి. అయితే అందులో కేవలం గుడ్ బై అని మాత్రమే ఆయన పేర్కొనట్టుగా తెలుస్తోంది. అంటే లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నానని సింబాలిక్ గా ఆ మెస్సేజ్ చేసి ఉంటారా అన్న చర్చ జరిగింది.
మరి రంగనాథ్ వంటి హుందా నటుడికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమేంటి..?
ఒంటరితనం, డిప్రెషన్ తో రంగనాథ్ బాధపడేవారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ఆయన కుమార్తె కూడా తండ్రి సూసైడ్ ఆలోచనల గురించి మాట్లాడారని.. కౌన్సెలింగ్ కు కూడా తీసుకెళ్లినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆయన బలవన్మరణానికి దారితీసిన కారణం ఇదనే ఇతమిద్ధమైన విషమైతే ఏదీ బయటకు రాలేదు. అదో మిస్టరీగానే మిగిలిపోయింది.
గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్!
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకడిగా రంగనాథ్ పేరు సంపాదించారు. తన 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన హుందాగా ఉంటూ.. సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కథానాయకుడిగానూ అలరించారు. సహాయ పాత్రల్లోనూ పలు తరాలకు సుపరిచితమైన నటుడిగా నిల్చారు.
అయితే తన యావత్తు ఆస్తిని ఇంటి పనిమనిషి పేరు మీద రాయాలని ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక కారణమేంటన్నదే… రంగనాథ్ సూసైడ్ విషాదంలో అత్యంత ఎక్కువ చర్చకు వచ్చిన విషయం. చివరిరోజుల్లో తనను ఎంతో శ్రద్ధగా చూసుకున్న వ్యక్తిపైన ఆయన ఉంచిన విశ్వాసానికి అది ఓ నిదర్శనంగా కూడా చాలామంది భావించారు.
ఒక అద్భతమైన మచ్చలేని నటుణ్ని కోల్పోయిన విషాదంతో పాటే… వెండితెర వెనుక ఆయన ఎదుర్కొన్న భావోద్వేగ పోరాటమేంటనే చర్చకు ఆయన ఆత్మహత్య తెరలేపింది. ఇప్పటికీ ఆయన అభిమానుల హృదయాల్లో బాధను మిగిల్చిన ఘట్టమది.
ఒక బండను శిలగా మారిస్తే దైవం.. పక్కకు తోసేస్తే చాకిరేవులో బట్టలుతికే బండగా అభివర్ణిస్తూ… ఎదుటి మనిషి బాధను చూసి కరిగే గుణమున్న ప్రతీ మనిషీ దేవుడేనని ఫిలాసఫికల్ గా మాట్లాడే వ్యక్తి ఆత్మహత్య.. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఓ మిస్టరీనే.



