లేటైనా లేటెస్ట్: అందుకే, బొమన్ ఇరానీ జర్నీ ఇంట్రెస్టింగ్!

గోల్ ఏం లేదు. బతకడానికి ఎక్కడవకాశం దొరికితే అక్కడ పని చేశాడు. చివరకు నటుడయ్యాడు. ఎందరో నటీనటులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, తాను మాత్రం నాల్గు కాలాలపాటు గుర్తుండే నటుడనిపించుకున్నాడు. మిగిలిన నటులకు విభిన్నమైన శైలిని కనబర్చాడు. కొన్ని పాత్రలు అనుకున్న స్థాయిలో కుదరాలంటే.. తాను మాత్రమే చేయగలనని నిరూపించాడు. అలా ఒక వెయిటర్ నుంచి.. స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ గా.. అక్కడి నుంచి బాలీవుడ్ వైవిధ్య నటుడిగా అవతరించిన బొమన్ ఇరానీ లైఫ్ స్టోరీ ఇది.

సినిమా నటీనటులుగా ప్రయత్నించేవాళ్లెందరో యుక్తవయస్సు నుంచి చిన్నాచితకా పాత్రలతో ఎన్నో ఏళ్లు గడిస్తేనేగానీ ఒక దశకు చేరుకోలేరు. కానీ, దాదాపు నడి వయస్సులో… అంటే 44 ఏళ్లకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఈడియట్స్ వంటి సినిమాల్లో నటనతో తానెంత భిన్నమైన నటుడో ప్రపంచానికి తెలియజెప్పాడు. వీరూ సహస్ర బుద్ధి పేరుతో… 3 ఈడియట్స్ లో షార్ట్ గా వైరస్ అని పిల్చుకున్న బొమన్ ఇరానీ నటనను చూసి ఆహా అనకుండా ఉండేవారెందరు..?

కమిట్మెంట్ కు కేరాఫ్!

నటనలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ.. ఏనాడూ తన కమిట్ మెంట్ నుంచీ, తన వృత్తిపైనున్న ఫోకస్ నుంచి మాత్రం పక్కకు తప్పుకోలేదు.

తండ్రి చనిపోయిన ఆర్నెల్ల తర్వాత పుట్టాడు. మగ పురుగు కనిపించని ఇంట్లో ఆడవాళ్ల మధ్యే ఒంటరి పురుషుడతను. చిన్ననాటే చదవడం, మాట్లాడ్డం, రాయడం సరిగ్గా రాని డైస్లెక్సియా బారినపడ్డాడు. ముభావమైన పిల్లాడిగానే పెరిగాడు.

ముభావమైన, అర్థంకాని తన ప్రవర్తనతో స్కూల్ నుంచి గెంటేశారు!

జస్ట్ లైక్ 3 ఈడియట్స్ సినిమాలో వైరస్ తరహాలోనే చిన్ననాట మాట్లాడితే అంతా ఆట పట్టించేవారట బొమన్ ని. ఒకింత ఆతృత, అత్యుత్సాహంతో మాట్లాడటంతో తప్పులు దొర్లి.. చాలా అరుదుగా మాట్లాడటం చేసేవాడు బొమన్. తాను 7వ తరగతికొచ్చే 12 ఏళ్ల వయస్సు వరకూ తానెక్కువ మాట్లాడకపోయేవాడు. ఓరోజు తన ప్రవర్తనతో మిషనరీ స్కూల్ ఫాదర్ బొమన్ ని నీకు విద్య నేర్పించడం కష్టమని ఇంటికి పంపించేశాడు. కానీ, ఆ ఫాదర్ కు ఏమనిపించిందో ఏమో… మళ్లీ ఆయనే వారం తర్వాత పిలిపించి తిరిగి అడ్మిషన్ ఇచ్చాడు. కసురుకున్న స్కూల్ ఫాదరే.. బొమన్ లోని ది బెస్ట్ ఏంటో దాన్ని బయటకు తీస్తామని తన తల్లికి హామీ ఇచ్చి పంపించేశాడట.

ఉద్యోగం కోసం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వైపు అడుగులు!

ఎలాగోలా కష్టపడి ఎస్సెస్సీ పూర్తి చేసిన బొమన్.. ఆ తర్వాత కాలేజ్ చదువులకు పూణేలోని వాడియా కళాశాల వైపు అడుగులేశాడు. కానీ, తాను ఇంజనీరో, డాక్టరో కావాలన్న కలలేనాడూ కనలేదు. ఎందుకంటే, తన సత్తా ఏంటో, తానెంత మాత్రం చదువగలడో తనకు తెలుసు. అలా ఆర్ట్స్ వైపు మళ్లింది బొమన్ ఇరానీ మనసు. ఆ తర్వాత తాను హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వంటి కోర్సులు చేస్తే చిన్నోచితకో ఉద్యోగం దొరక్కపోతుందానని.. ఓ కోర్సు పూర్తి చేశాడు. అంటే ఏ యాక్టరో, డాక్టరో కావాలనకునేవాళ్లను చూశామే గానీ… తన అమ్మమ్మతో.. నేను వెయిటర్ కావాలనుకుంటున్నాని చెప్పి ఆమెను ఆశ్చర్యపర్చాడు.

తాజ్ హోటల్ లో సర్వీస్ బాయ్ గా జీవితం ప్రారంభం!

కట్ చేస్తే, ఓరోజు ముంబై తాజ్ హోటల్ కు ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న బాస్.. బొమన్ అర్హతల గురించి అడిగి తెలుసుకున్నాడు. హోటల్ లో ఏం చేయాలనుకుంటున్నావనడిగాడు. దానికి సమాధానంగా కస్టమర్స్ కు ఫుడ్ అండ్ డ్రింక్స్ డెలివరీ అని చెప్పాడు. అసలు హోటల్ ఉందే అందుకు కదా.. అంతకుముందు నువ్వెక్కడ చేసేవాడివనడిగాడు. దానికి తాను అంతకుముందు పనిచేసిన ఓ హోటల్ పేరు చెప్పాడు. దానికి ఓహో.. ఒకేసారి పైకెదగాలనుకుంటున్నావా ఫూల్.. నువ్వు ముందు కింది నుంచి ప్రారంభించంటూ.. హోటల్ రూమ్స్ సర్వీస్ మ్యాన్ గా ఉద్యోగమిచ్చాడు. అలా అక్కడ రెండేళ్లు పనిచేశాడు బొమన్. అక్కడి ఉద్యోగంలో కష్టపడి సంపాదించిన డబ్బును పైసా పైసా కూడబెట్టి బ్యాంకులో వేసుకున్నాడు.

కుటుంబీకులతో కలిసి గుజరాతీ ఫలహారశాల ఏర్పాటు!

ముంబైలోని రెస్టారెంట్స్ లో పనిచేశాక.. చిన్నగా తన కుటుంబీకులతోనే కలిసి గుజరాతీ ఫలహారాలమ్మే బేకరీ కమ్ ఓ స్వగృహ ఫుడ్స్ వంటి సెంటర్ తో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 25 ఏళ్లకు పెళ్లైంది. 26 ఏళ్లకు తండ్రయ్యాడు. పెళ్లై ఏడేళ్లు గడిచిపోతోంది. లైఫ్ దానికదే సాగిపోతోంది. ఎందుకో ఒకింత గిల్టీగా ఫీలైపోయిన బొమన్.. తన దగ్గర ఉన్న సేవింగ్స్ తో ఓ ప్రొఫెషనల్ స్టిల్ ఫోటో కెమెరా కొనుగోలు చేశాడు. మెల్లిగా స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ చేయడం మొదలెట్టాడు. అలా క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడే యువకుల ఫోటోలను తీస్తూ వాళ్ల తల్లిదండ్రులకు ఒక్కో ఫోటోను 25 నుంచీి 30 రూపాయలకొకటి చొప్పున అమ్మేవాడు. అలా కొంత డబ్బు సంపాదించుకోగల్గాడు. మెల్లిగా అప్పటివరకూ తనకున్న కొన్ని అప్పులనూ తీర్చేశాడు.

ఆ సమయంలో ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అస్పీ ఆదాజానియాని కలిసి.. ముంబైలో జరగనున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ కు తాను ఫోటోగ్రాఫర్‌గా పనిచేయవచ్చా అని అడిగాడు. మొదట ఆదాజానియా తిరస్కరించినా… మళ్లీ ఆయనే ఆ ఈవెంట్‌ కవరేజ్ హక్కుల కోసం తన కార్యాలయంలో పనిచేయడానికి ఇరానీని అంగీకరించాడు. తరువాత బొమన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ మ్యాచ్‌లను కవర్ చేస్తూ కొనసాగాడు. చివరికి ఆదాజానియా ఆయనను ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్‌కు అధికారిక ఫోటోగ్రాఫర్‌గా నియమించాడు.

తరువాత నార్వేజియన్ బాక్సింగ్ టీమ్‌కు కూడా ఫోటోగ్రాఫర్ గా పనిచేశాడు. ప్రత్యేకంగా నార్వేజియన్ బాక్సర్ ఒలే క్లీమెట్సెన్ కోసం అవసరమైన ఫోటోలను తీశాడు. అప్పుడు బొమన్ కు ఇష్టమైన కెమెరా Pentax K1000.

బాల్యం నుంచే నాటక రంగంపై ఆసక్తి!

తన స్కూల్‌ రోజుల్లోనే ఇరానీకి నటనపై ఆసక్తి ఏర్పడింది. 1981 నుంచి 1983 వరకు ఆయన నట గురువు హన్స్రాజ్ సిద్ధియా వద్ద శిక్షణ పొందాడు.

ఇరానీకి, నటుడు అలీక్ పదంసీ మార్గదర్శకత్వం లభించింది. రోష్ని అనే నాటకంలో పాల్గొన్నాడు. ఇది వెర్సోవాలోని లోేకల్ థియేటర్‌లో ప్రదర్శించారు. అలాగే ఫ్యామిలీ టైస్, మహాత్మా వర్సెస్ గాంధీ వంటి అనేక టీవీ సీరియల్స్‌లో కూడా నటించాడు. మహాత్మా వర్సెస్ గాంధీలో ఇరానీది గాంధీ పాత్ర. మొదట ఈ పాత్రకు నటుడు దర్శన్ జరీవాలాని అనుకోగా… ఆయన తిరస్కరించడంతో ఇరానీకి ఆ అవకాశం దక్కింది.

తన జీవితాన్ని మలుపు తిప్పిన షియమాక్ దేవర్ పరిచయం!

ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దేవర్ ను ఓ స్టూడియోలో కలిసిన సందర్భంలో వారు లంచ్ కు కలిసే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆలిక్ పదమ్సీని కలిశాక.. ఆయన ఓ పాత్రలో నటించమని బొమన్ కు ఆఫర్ ఇచ్చాడు. ఆ థియేటర్ షో ఫ్లాప్ అయింది. కానీ ఇరానీ మాత్రం దుమ్ము దులిపేశాడు. ఇరానీకిచ్చింది, జస్ట్ రెండున్నర నిమిషాల పాత్రే అయినప్పటికీ.. ఆ పాత్ర మాత్రం హిట్ టాక్ కొట్టేసింది. దాంతో మరో నాటకంలో ఐ యామ్ నాట్ బాజీరావ్ అనే పాత్ర దొరికింది. 75 ఏళ్ల ఆ పాత్రను 150 మంది ఆడిటోరియంలో ప్రదర్శిస్తే.. బొమన్ కు 200 రూపాయలు పారితోషికమిచ్చారు.

విధూ వినోద్ చోప్రా దృష్టిలో పడ్డాక మారిపోయిన బతుకుచిత్రం!

ఆ తర్వాత ఓ సినిమా ఆఫర్ వచ్చినా బొమన్ కు అదీ కుదరకుండా పోయింది. కానీ అప్పటికే థియేటర్ ఆర్టిస్ట్ గా విధూ వినోద్ చోప్రా కళ్లల్లో పడ్డ బొమన్ దశ ఇక అక్కడి నుంచీ మారిపోయింది. ఓరోజు డిన్నర్ కు తన వెంట బొమన్ ను తీసుకెళ్లి.. ఆ తర్వాత రెండు లక్షల రూపాయల చెక్ చేతికిచ్చాడు. ఇంతెందుకు సార్ నాకు అంటే.. నెక్స్ట్ ఓ సినిమాలో మీరు నటించబోతున్నారని బదులిచ్చాడట విధూ వినోద్ చోప్రా. అదే ఆ తర్వాత భాషలకతీతంగా ప్యాన్ ఇండియా సినిమాగా హిట్టై.. ప్రాంతీయ భాషల్లోకీ రీమేక్స్ అయి సంచలనం సృష్టించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఇంతకీ ఆ సినిమాలో తన పాత్రేంటని అడిగితే డీన్ అని చెప్పగానే.. ఏం చేయాల్సి ఉంటుందన్నాడట బొమన్..? ఏం లేదు జస్ట్ నవ్వుకుంటూ ఉండటమే ఆ పాత్ర అని బదులిచ్చాడట విధూ వినోద్ చోప్రా.

సినీ కెరీర్‌!

ఇరానీ 2000 సంవత్సరంలో తెరపైకి అడుగుపెట్టాడు. ఫాంటా, అంబుజా సిమెంట్స్, సియట్ లిమిటెడ్ వంటి ఎన్నో కమర్షియల్స్‌లో నటించాడు.

డర్నా మనా హై సినిమాలో ఆయన చేసిన పాత్ర చిన్నదే అయినా.. విమర్శకుల ప్రశంసలు అందాయి. ఆ చిత్రం హిట్ అవ్వడం కలిసొచ్చింది. అందులో ఆయన సైఫ్ అలీ ఖాన్తో కలిసి నటించాడు బొమన్.

2003లో వచ్చిన కామెడీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ లో ఆయన పోషించిన అస్తానా పాత్ర బొమన్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిల్చింది. ఆ పాత్రకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ హాస్య నటన అవార్డుకు నామినేషన్‌ కూడా దక్కింది. సీక్వెల్ లగే రహో మున్నాభాయ్లో కూడా నటించి.. ఆ చిత్రానికి ఐఐఎఫ్ఏ అవార్డులకు నామినేషన్లలో ఆయన పేరు మార్మోగింది.

ఆమీర్ ఖాన్ తో కలిసి నటించిన కామెడీ-డ్రామా 3 ఇడియట్స్ ఇరానీ నటజీవితంలో పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డుతో పాటు, స్క్రీన్ అవార్డు ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారాలు లభించాయి.

నటుడిగానే కాకుండా… ఇరానీ పలు సందర్భాల్లో ఐఐఎఫ్ఏ అవార్డుల నిర్వహణలో హోస్ట్ గా వ్యవహరించాడు. బాలీవుడ్ కా బాస్ అనే క్విజ్ షోకు ప్రెజెంటర్ తను. సంజయ్ దత్ తో కలిసి.. కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొన్నాడు. వివిధ కమర్షియల్స్‌లో నటించాడు.

2019 జనవరిలో తన స్వంత నిర్మాణ సంస్థ ఇరానీ మూవీటోన్ ను ప్రారంభించాడు.

బొమన్ ఇరానీ ఎగ్జోటికా, కెంట్ ఆర్‌ఓ, అహెడ్ ఎన్జీఓ, సఫోలా వంటివాటికి బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్నాడు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (IIMUN) సలహా మండలిలో కూడా తను సభ్యుడు.

వెర్సటైల్ నటుడిగా గుర్తింపు!

సినిమా సూపర్ హిట్. తనకు సహాయ నటుడి అవార్డ్ దక్కింది. ఆ స్టేజ్ పై ధరించేందుకు ఓ సూట్ కావాలి. అప్పుడు వచ్చాడు అర్షద్ వార్సీ. తన రెగ్యులర్ టైలర్ కు చెప్పి బొమన్ కు ఓ సూట్ కుట్టించాడు. ఆ బ్లాక్ సూట్ వేసుకున్న బొమన్… ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ గోస్ టూ బొమన్ అనేసరికి ఆ స్టేజ్ పైకొచ్చే క్రమంలో తట్టుకుని కింద పడిపోయాడు . చేతికి గాయం కూడా అయింది. తన జీవితంలో మురికిలాగే.. తన సూట్ కూ మురికి అంటుకుంది. అయినా, ప్రేమ్ చోప్రా చేతులమీదుగా ఆ అవార్డ్ అందుకున్న మధుర క్షణాలు.. మర్చిపోలేనివంటాడు బొమన్.

ఇక ఆ తర్వాత బొమన్ వెనక్కి తిరిగి చూడలేదు. ఒక త్రీ ఈడియట్స్ చాలు తన కెరీర్ మొత్తంలో ది బెస్ట్ అని చెప్పడానికి. మై హూ నా, లగే రహో మున్నాభాయ్, దోస్తానా వంటి అనేక సినిమాల్లో బొమన్ కోసమే ప్రత్యేక పాత్రల చిత్రణ తయారైంది. వయస్సొక ఒక సంఖ్య మాత్రమేనని.. తన వైవిధ్యమైన పాత్రలతో నిరూపించాడు. ఇష్టపడేదాన్ని చేయాలనుకుంటే ఎప్పుడైనా ముందడుగు వేయొచ్చని చాటాడు. తనంత కమిట్మెంట్ తో చేస్తే… నిల్చిపోవచ్చనీ తన నటనతో ప్రకటించేశాడు. ఇప్పడు తను సర్వీస్ బాయ్ గా జీవితం ప్రారంభించిన స్టార్ హోటల్ రూమ్స్.. వెర్సటైల్ నటుడిగా ఉన్నతి సాధించిన తన పేరుతో బుక్ అవుతుండటాన్ని ఆస్వాదిస్తున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles