నరేష్కుమార్ సూఫీ.. ✍🏼
—————————————————
నచ్చిన సినిమా – The Sacrifice (సూఫీ)
ప్రపంచమంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకదేశం మరో దేశం మీద, ఒక మతం మరో మతం మీదా, ఒక జాతి ఇంకో జాతి మీదా… చేసుకునే దాడుల్లా వీటిని చూస్తుంటాం గానీ, మనిషి మనిషి మీద చేసుకునే దాడులే ఈ యుద్ధాలు అని మీకెప్పుడైనా తోచిందా?
మీరు కోరుకునే యుద్ధం మీ పిల్లలని, ఆ తరువాత తరాలనీ నిర్దాక్షిణ్యంగా చంపుతుందేమోనని మీకెపుడైనా భయం వేసిందా?

నేను నిజంగా ఆ భయానికి లోనయ్యాను, అణుయుద్దం వస్తుందేమోననీ, అందులో నా వాళ్లంతా మాడి మసైపోతారేమోనని భయం మొదలైంది.
నా పుట్టినరోజునాడే ఆ వార్త విని కుమిలి పోయాను. ఎవరో ఎవరి మీదో కోపంతో చేసే ఈ యుద్దం మా ప్రాణాలని ఎందుకు తీయాలి? ఈ చిన్నవాడు నా కొడుకు యుద్ధంతో ఏ సంబంధం లేనివాడు కదా వీడెందుకు చావాలి? వీడే కాదు మనం చూసే చిన్నారుల్లో ఎన్ని నవ్వులు, ఎన్ని అమాయకమైన మొహాలు… వాళ్లెవరైనా కావచ్చు బాంబుల మటల్లో, ఆకలి కేకలతో వాళ్లు చస్తుంటే ఆ మరణాలను చూసి నవ్వేవాళ్లు ఎంతటి రాక్షసులు!?
యుద్ధం వస్తోంది… బాంబులు కురుస్తాయి… చచ్చేవాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు ఆకలితో చిత్ర హింసలు అనుభవిస్తారే… అయ్యో!! ఎవడీ వినాశనాన్ని కోరుకుంటున్నాడు? ఎందుకని ఇంతటి నెత్తుటిని కూడులో కలుపుకొని తింటున్నాడు?
వద్దు, వద్దు… ఈ యుద్ధం జరగటానికి వీల్లేదు. దీన్ని ఎలా ఆపాలి. నేను సామాన్య మానవున్ని కదా ఇంతటి నరమేథాన్ని ఆపగలనా?
“స్వామీ, తండ్రీ, నా దైవమా నువ్వే దిక్కు తండ్రీ” అంటూ దేవున్ని వేడుకున్నాను. యుద్ధాలు జరగవద్దనీ, అమాయక మనుషులు చావకుండా చూడమనీ ఆ దేవున్ని కన్నీటితో మొరపెట్టుకున్నాను. భయం… భయం లోపలనుంచీ నా గుండెలని చీల్చుకు వస్తుందేమో అన్నంత భయం. మళ్లీ మళ్లీ మొక్కుకున్నాను.
“ప్రపంచం యుద్దం నుంచి రక్షించబడితే, నా జీవితం మొత్తాన్ని త్యాగం చేస్తాను. ఇక మౌనం వ్రతం తీసుకుంటాను, నా మాటని త్యాగం చేస్తాను, నా ఆలోచననీ త్యాగం చేస్తాను, నాయనా! నా కంటూ ఉన్న అన్నిటినీ త్యాగం చేస్తాను తండ్రీ! నీవే దిక్కు అని వేడుకున్నాను.”
ఎలా? ఎలా?? అని సతమతమవుతుంటే… అదిగో నా ఫ్రెండ్ వచ్చాడు. అవును వీడికి చాలా విషయాలు తెలుసు, వీడిదగ్గర ఎన్నో సమస్యలకి ఇంకెన్నో పరిష్కారాలున్నాయి. ఈతను చెప్పగలడు, నా వేదనని తీర్చే ఉపాయం అతనిదగ్గర ఉంది. అనుకుంటూ అతనికి నాలో ఉన్న భయాలని చెప్పాను, నన్ను తొలుస్తున్న భయాన్ని అతని ముందు ఉంచి నన్ను కాపాడమని అడిగాను.
కానీ..! కానీ వీడేమిటి ఇలాంటి మార్గం చెప్పాడు. మారియాని కలవమన్నాడు, ఎన్నో మంత్రాలు తెలిసిన ఆమెతో నా కలయిక శాంతిని తెస్తుందని చెప్పాడు. కలయిక అంటే… ఆ మంత్రాల మహిళతో శారీరకంగా కలవటం. ఇదెలా పరిష్కారమో నాకు తెలియదు.
అయినా ఆమెదగ్గరికి వెళ్లాను… ఏడుస్తో, దీనంగా ఆమెని వేడుకున్నాను. నాతో గడపమని నాలో భయాన్ని తొలగించే మార్గాన్ని చూపమనీ వేడుకున్నాను. ఆమె ఒప్పుకుంది. నాతో కలిసి ఆ రాత్రి గడపటానికి అంగీకరించింది.
ఆమెని తాకుతుంటే నాలో ప్రకంపణ మొదలైంది. చిన్నగా మరింత చిన్నగా కుచించుకుపోతున్నట్టూ, భయంకరమైన నిశ్శబ్దంలోకి పడిపోతున్నట్టూ అనిపించింది. నా మెదడుని ఎవరో నలుపుతున్నట్టు విపరీతమైన బాధ, ఆ వెంటనే ఓపలేనంత ప్రశాంతత…
శాంతి అనేది ఎంతటి అపురూపమైన వస్తువో నాకు తెలిసింది. యుద్ధం నుంచి తప్పించుకోవాలంటే, శాంతి పొందాలంటే ఎంతో కోల్పోవాలి. ఏ త్యాగమూ లేకుండా ప్రశాంతత పొందటం అసాధ్యం.
“ప్రపంచం శాంతిగా బతకాలంటే అన్నిటినీ వదులుకునే స్థితిని చేరాలి, నువ్వు కోరుకునే ప్రతీ కోరిక వెనుకా యుద్ధానికి కారణాలు ఉంటాయి.
“ఆస్తి, శాంతి, దేశం, మతం, నా ప్రాణం” ఇలా వాటి పేర్లేమైనా కావచ్చు ఇవన్నీ ఎదుటివాన్ని చిత్రవధ చేసైనా కావాలసింది పొందమని చెబుతూంటాయి.
వదలాలి… ప్రతీ కారణాన్నీ నేను వదలాలి. నన్ను నేనే వదిలేస్తే తప్ప శాంతి దొరకదు. నా మాటని త్యాగం చేశాను, నా ఆలోచనలనీ త్యాగం చేశాను, ఆ ఆశలనీ, కోరికలనీ ఆ దేవునికి అర్పించేశాను. ఈ భూమిమీద నాదంటూ ఏమీ ఉండకూడదు, ఈ భూమీ నేనూ వేరు వేరుగా ఉండకూడదు…
దీన్ని మీరంతా ఉన్మాదమనీ, పిచ్చి అనీ అనుకోండి గాక… నేనిప్పుడు అన్నిటినీ త్యాగం చేయదల్చుకున్నాను. నాదీ అనుకునే సమస్తాన్నీ తుడిచి పెట్టాలనుకున్నాను. అందుకే… అందుకే… నా ఇంటిని తగలబెట్టాను.
అదిగో చూడండి! నా ఇల్లు తగలబడుతోంది. అందులో నాకు చెందిన ప్రతీ వస్తువూ కాలి బూడిదైపోతోంది. నింపాదిగా… అశాంతిగా తగలబడుతున్న నా సర్వస్వాన్ని చూస్తున్నాను.
ఇక నాకు ఏ యుద్ధమూ ఏ నష్టమూ చేయలేదు, నన్నెవడూ భయపెట్టలేడు. రండిరా! రండీ…. తీసుకుపోండి, ఈ పిచ్చివాళ్ల బండిలో వేసి నన్ను మీ పిచ్చాసుపత్రిలో పడేయండి.
నేను త్యాగం చేశాను… అవును నేను అన్నిటినీ త్యాగం చేశాను… ఆదియందు వాక్యముండెనట ఆ వాక్యాన్నీ, నా మాటనూ, నా ఉపన్యాసాలనీ, నేను చెప్పే నీతులనీ, ప్రపంచానికి ఙ్ఞానం పంచాలనే వెర్రి కోరికనీ త్యాగం చేశాను
త్యాగానికన్నా గొప్ప శాంతినిచ్చేది మరేదీ లేదు…
*** *** ***
కొన్నేళ్లకిందట రవీంధ్రభారతిలో సండే సినిమా ప్రోగ్రామ్‌లో చూశాను The Sacrifice అనే సినిమా. టార్కోవ్ స్కీ #స్టాకర్ తరవాత నాకు విపరీతంగా నచ్చే సినిమాల్లో ఇదీ ఒకటి.
లెంథీ షాట్స్, పోయెటిక్ నరేషన్‌తో ఉండే టార్కోవ్ స్కీ సినిమాలు వెంటనే అర్థం కావటం కాస్త కష్టమే. ఆ పొడవైన షాట్స్ చూడాలంటే చాలా ఓపిక కావాలి. ప్రతీ షాట్, ప్రతీ డైలాగ్ వెనుకా ఇంకో అర్థమేమైనా ఉందేమో వెతుక్కోవాలి. అంత ఓపికగా చూస్తేనే టార్కోవ్ స్కీ చెప్పాలనుకున్న విషయాన్ని చేరుకోగలుగుతాం.
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అని చెప్పటానికి ఇలాంటి సినిమాలు ఒక సాక్ష్యం అనుకోవాలి. ఆ రోజు సినిమా చూసి వస్తూ ఎందుకో అర్థం కాని దుఃఖంతో పుట్‌పాత్ మీద కూచునే ఏడ్చి, అక్కడే ఈ కవిత రాసుకున్నాను.
ఇన్నాళ్లకి మళ్ళీ ఈ సినిమా చూడాలనిపించింది… రాత్రి చూశాను. ఇప్పుడే ఆ ప్రభావం నుంచి తేరుకుంటున్నాను. మీకూ చూడాలనిపిస్తే యూ ట్యూబ్‌లో ఉంది చూడొచ్చు.
~ The Sacrifice~
1
ప్రభూ…!
నన్ను విడుదల చేయవా
నన్ను నిన్నునుంచీ, ఇంకా నన్ను నానుంచి కూడా,
ఆదియందు వాక్యముండెను, వాక్యము నీ యొద్ద ఉండెను
సత్య నిరాదరణనొందిన ఆ వాక్యము నేడు
నేనై యుంటిని
పరలోకమందున్న ప్రభువా…!
నన్ను నేను…
నాలో ఉన్న నీకు నివేదించుకొనుచుంటిని
తీసుకో తండ్రీ..!
2
ఆమె స్పర్శతో నన్నునేను విశ్లేషించుకుంటిని
ఆమె మాటలో నన్నునేను శ్లేషించుకుంటిని
ఆమె నీవుగా, నేను ఆమెగా ఉండినప్పుడు…
ప్రియ ప్రభువా…!
నేను నిర్వణమొందితిని…
ఓపలేను తండ్రీ…
దారుణ దుఃఖమైయున్నాను, తీరని యుద్ధమైయున్నాను
నాలో లేని నిను మోసీ,మోసీ.. అలిసిపోయాను
oh god..! let me sacrifice myself
3
పెనురక్తచాపమై నన్ను భయపెడుతోన్న నేను
తీవ్ర రోదనా స్వరమై నేను
యుద్ధభూమినై నేను
చంపుతూ నేను, చస్తూ నేను,
నేనై నేను, నువ్వైనేను..
సత్యమేదియూ సత్యమే కాదని తెలిసిన నేను..
ఇక చిగురించలేను..
let me serch myself in you
ప్రభూ…! నన్ను సమాధి చేసుకో
ఆమెలో నిక్షిప్తం చేయి, ఆమెలో లుప్తం చేయి తండ్రీ…
4
పశ్చిమ హింసని ద్వేషించి, యుద్దాన్ని విభేదించి
నన్ను నేను ఎదిరించి
రొమ్ములు గుద్దుకొని రోదించీ, ఓడిపోయితిని తండ్రీ
వాక్యమంటే నిశ్శబ్దమని తెలుసుకొంటిని
మౌనమందు నిన్ను తెలుసుకొంటిని
ఇక నా శరీరమేప్పటికీ చిగురించదు,
దేనినీ నా స్వరం విమర్శించదు…
ఇక ఏనాటికీ… దుఃఖాన్ని దూరం చేసుకోదు
let me sacrifice my word
let me sacrifice my dream
let me sacrifice my legacy
ఇక నా నాలుక చివర వేల్లాడే స్వరాన్ని
కత్తిరించుకొనివ్వు
ఆ ప్రదేశాన రవ్వంత శూన్యాన్ని అతికించుకొనివ్వు
let me sacrifice you who is in me my lord…



