సమాజమంతా ఒక ఒరవడిలో కొట్టుకుపోతున్న వేళ… అందుకు భిన్నంగా నడిచి కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది ఆ మున్సిపల్ కార్పోరేషన్. కులాల కుంపట్లో చలి కాచుకునే సమాజాలు, ప్రభుత్వాలకు చెంపపెట్టులాంటి అడుగేసి.. ఇదీ, జీవనవిధానమని ఒకింత రుబాబ్ తో తలెత్తుకుని చెప్పే ఘటన అది.
ఉన్నతవర్గాలంటూ దళిత మేధావుల అక్కసు.. దళితులంటూ ఉన్నతవర్గాల వారి చిన్నచూపు… ఈ భేషజాలను ఆసరా చేసుకుని రిజర్వేషన్ల పేరిట జరిగే రాజకీయాలు… ఆ తంతు ముందుకు సాగేదుండదు. కానీ, దానిపేరిట పార్టీల కౌంటర్ ఎటాక్స్.. ఒకరిపై ఇంకొకరి నిందలు.. ఇదిగో అలా సాగిపోతుందే తప్ప.. వీటన్నింటినీ మించి సమతాభావనకే ఆస్కారం కనిపించని వివక్షాపూరిత రోజులను చూస్తుండటం విచారకరం. బాగా చదువుకుంటున్నవారి నుంచీ మొదలు..అంతకుమించి ఆలోచించలేని సమాజాలుండటం విషాదం. ఇలాంటి సమయంలో తమిళనాడులో పడ్డ ఓ అడుగు ఓ కనువిప్పు కావాలనిపిస్తుంది ఈ కథ వింటే.

ఇంతకీ తమిళనాడులో ఏం జరిగింది..?
తిరుచ్చి మున్సిపల్ కార్పోరేషన్ కులాల పేర్లను సూచిస్తూ కనిపించే వీధుల్లో అలాంటి బోర్డులను తొలగించేస్తోంది. తిరుచ్చి నగరం మొత్తం ఓ డ్రైవ్ చేపట్టింది. సదరు కులాల పేర్లతో వెలసిన వీధులకు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని ఆ వీధుల్లో ఉన్న స్థానికులకే అవకాశం కల్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 15వ తేదీ, సోమవారం రోజున ఆ కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా కులాల పేర్లతో వెలసిన వీధులను గుర్తించి.. అలాంటి వీధుల్లో ఏరియా సమావేశాలను నిర్వహించింది. అందులో స్థానికులు, సాహిత్యసంఘాలు, ఇతర ప్రజాసంఘాలవారిని ఆహ్వానించి వారి నుంచి ఏ పేరు పెట్టాలో తెలపాలని పిటిషన్స్ కోరింది.
కులాల పేర్లతో వెలసిన వీధుల్లో ఉన్న నివాసితులు అనేకమంది ఏ దరఖాస్తు చేసుకున్నా.. ఫారమ్స్ నింపినా.. లేదా, ఇంటర్వ్యూలలో తమ చిరునామాలు పేర్కొనడం అసౌకర్యంగా ఉందని చెప్పడంతో.. తిరుచ్చి మున్సిపల్ కార్పోరేషన్ ఈ కొత్త డ్రైవ్ కు తెరలేపింది.
అలా మొట్టమొదటి పిటిషన్ వొరైయూర్ లోని కురా వీధి నుంచి అందింది. ఆ వీధి పేరు అభ్యంతరకరంగా ఉందనే ఫిర్యాదు అందడంతో పాటు.. ఆక్కడ ఓ బస్ స్టాప్ పేరుపై కూడా కంప్లైంట్ ఫైల్ అయింది. దాంతో అక్కడ ఓ మీటింగ్ ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు.. అనుభవజ్ఞుడైన సీపీఐ నాయకుడు ఆర్. నల్లకన్ను పేరు పెట్టాలన్న డిమాండ్ దృష్టికొచ్చింది.
కుల, మత ఆధారిత పేర్లను తొలగించి.. అవసరమైతే ఆ తర్వాత ఉండే పేరుతో ఆయా వీధుల పేర్లను ఉంచొచ్చనీ తీర్మానించారు. అలా ఆచరణీయం కాని పక్షంలో మొత్తం పేరునే మార్చేయాలన్న యోచనా తెరపైకొచ్చింది. అలా అక్కడి స్థానికుల అభిప్రాయం మేరకు మార్పుకు బీజం పడింది. మొత్తం ఐదు జోన్లుగా విభజించి అసిస్టెంట్ కమిషనర్స్ సాయంతో కుల, మతపరమైన పేర్లతో ఉన్న వీధులన్నింటినీ గుర్తించి, ఓ జాబితా రూపొందించి.. వాటిని ముందుగా మున్సిపల్ పరిపాలనాశాఖ కార్యదర్శికి ఆమోదం కోసం పంపేందుకు సిద్ధమయ్యారు.
అలాగే వీధి అనే బదులు కాలనీ అనే ప్రత్యయంతో నివాస ప్రాంతాలను పిలవాలనీ.. బోర్డ్స్ కూడా అలాగే ఏర్పాటు చేయాలనీ తీర్మానించారు. తిరుచ్చి నగరంలోని 65వ వార్డులో కుల జ్ఞాపకాలతో పాటు.. కల్లుడిపో ఏరియా అని పిల్చే మద్యం తాలూకు, మురికి కాలువ రోడ్డు అని పిల్చే డ్రైనేజీ పేర్లు.. అలాగే,శ్మశానవాటికలను సూచించే పేర్లతో 20 వీధులు, రోడ్లు వెలిశాయి. శ్రీరంగంలోని సుడుకాడు రోడ్డుతో పాటు, వొరైయూర్ లోని కీలా సారయట్టరై వంటి వీధుల పేర్లు కించపర్చేలా ఉన్నాయన్న నిరసనలు మిన్నంటడంతో తిరుచ్చి మున్సిపల్ శాఖ ఈ డ్రైవ్ భుజానికెత్తుకుంది. బాబు చెట్టి వీధి, పట్టాభిరామన్ పిళ్లై వీధి, సోడానాయకన్ వీధి ఇలాంటి పేర్లన్నీ మార్చేయాలని తీర్మానించారు.
తిరుచ్చి బహుజనానికి సంబంధించిందనే ఒక సంకేతం ఇచ్చేలా ఈ డ్రైవ్ కు తెరతీశారు. అతి తర్వలో పేర్లను మార్చే ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామంటున్నారు అక్కడి అధికారులు. ఈ ఏడాది ప్రారంభంలోనే శ్రీరంగంలోని తంగయ్యన్ వీధికి ప్రఖ్యాత నాదస్వరం కళాకారుడు షేక్ చిన్న మౌలానా పేరు పెట్టారు. అలాగే, కారు మండపంలోని తిరునగర్ వీధికి దివంగత తమిళకవి నందలాలా పేరుగా మార్చేశారు.
దేశం మొత్తం కులాలు, మతాల కుంపట్లో కాలాలకతీతంగా చలి కాచుకుంటున్న వేళ.. తమిళనాడులోని తిరుచ్చి మున్సిపల్ కార్పోరేషన్ వేసిన ఈ విప్లవాత్మక అడుగు.. ఆ కుంపట్లలో చలి కాగడం పేరిట వారికి వారే దగ్ధమవుతున్నవారెందరికో ఓ చెప్పుదెబ్బలాంటిది.



