మనం వాడే బాల్ పాయింట్ పెన్ ఆవిష్కరణ వెనుక.. ఓ జర్నలిస్ట్ ఆలోచన!

వార్తా పత్రికల్లో ముద్రణకు వాడే ఇంక్.. తన పెన్నులో సిరా కంటే వేగంగా ఎందుకు ఎండిపోతుందన్న ఓ జర్నలిస్టుకు వచ్చిన చిన్న అనుమానం బాల్ పాయింట్ పెన్ ఆవిష్కరణకు దారి తీసింది. ఆయన పరిశీలనే ఆ తర్వాత మనం ఈరోజుకూ వాడుతున్న బాల్ పాయింట్ ఆవిష్కరణకు కారణమైంది. ఈ ఘటనకు 1931లో బీజం పడింది.

కొన్ని కొన్ని ఆవిష్కరణలకు భారీ పరిశోధనలు అవసరం. మరికొన్నింటికి ఆ అవసరం లేకుండానే ఆ అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. చిన్న చిన్న అసౌక్యరాలే ఆ ఫలితాలకు మూలబిందువులైతాయి. అందుకు మనం హంగేరీకి చెందిన ఓ జర్నలిస్ట్ కథ చెప్పుకోవాలి. ఆయన పరిశీలన ఆ తర్వాత బాల్ పాయింట్ పెన్నులు మార్కెట్ ను ముంచెత్తేందుకు ఎలా కారణమైందో తెలుసుకోవాలి.

లాస్లో బీరో అనే హంగేరీ జర్నలిస్ట్… 1931ల కాలంలో ఇంక్ పెన్నులతో రాస్తూ ఎదుర్కొంటున్న ఒక సర్వసాధారణ సమస్యను నోటీస్ చేశాడు. ఫౌంటెన్ పెన్ సిరా సులభంగా చెదిరిపోవడం ఆయన్ను ఆలోచింపజేసింది. అదే సమయంలో వార్తా పత్రికల్లో ముద్రణ చేసిన సిరా మాత్రం చెదిరిపోవడం లేదు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటా అన్న ఆలోచనలో పడ్డారు లాస్లో బీరో. వార్తా పత్రికల్లో ముద్రణకు ఉపయోగించే సిరాతో… అక్షరాలు చెదిరిపోకుండా రాసే పెన్నును సృష్టించలేమా అన్న యోచన లాస్లో బీరోలో మొదలైంది. ఆ సర్వసాధారణ పరిశీలనే ఆ తర్వాత రచనా ప్రపంచాన్నే శాశ్వతంగా మార్చేసిన ఒక గొప్ప ఆవిష్కరణగా లోకమంతా జేజేలు పలికింది.

సాధారణ అసౌకర్యం నుంచి ఇంజనీరింగ్ సమస్యల వరకూ!

ఇంక్ ఫౌంటెన్ పెన్స్ తో అందంగా రాయలేకపోవడమే కాదు.. ద్రవరూపంలో ఉండే సిరా ఉపయోగించి, రాసినప్పుడు.. అది కాగితాలపైన ఎండటానికి సమయం పట్టేది. దాంతో కొన్నిసార్లు రాసిందంతా కాగితాలపై చెరిగిపోయేది. ఆ అసౌకర్యాన్ని అలాగే భరిస్తూ మిగిలిన సమాజమంతా సిరా ఫౌంటెన్ పెన్నులతో రాయడానికి అలవాటు పడితే.. బీరో మాత్రం పరిష్కారం వైపు అడుగులేశాడు. రూపకల్పనలో లోపాన్ని నోటీస్ చేశాడు. దాన్ని సరి చేయాలని నిర్ణయించుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఆ తర్వాత జరిగిన పలు శాస్త్రీయ అధ్యయనాలు బీరో పరిశీలన ఎంత ముఖ్యమైందో నిర్ధారించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం… కాగితంపై పడ్డ కొద్ది సెకన్లలోని సిరా ద్రావకం గణనీయంగా, వేగంగా ఆవిరైపోయే లక్షణమే బాల్ పాయింట్ పెన్నుకు దారితీసింది.

అదే సమయంలో సిరాతో రాస్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్మూత్ గా రాసేలా సౌకర్యవంతంగా ఉండాలి. సిరా ఎక్కువ లీకేజ్ కాకుండా రాయగల్గాలి. ఇలా ఈ అంశాల పట్ల ఒక సమతుల్యతను సాధించడం నిజంగా ఓ ఇంజనీరింగ్ సవాల్ గా మారింది.

సిరా పెన్నులు విఫలమైన చోట విజయవంతమైన బాల్ పెన్ ప్రయోగం!

బాల్ పెన్ సూత్రం చాలా సరళమైంది. సిరా నేరుగా బయటకు రాదు. చిన్న గుండ్రటి బంతి లాంటి మూతి ద్వారా కాగితంపైకి చేరుతుంది. దీంతో సిరా కారిపోవడం ఉండదు. భిన్నమైన సిరాలతో ఈ బాల్ పెన్ ను ఉపయోగించే అవకాశముంటుందన్న విషయాలు ఆవిష్కరణల్లో తేలాయి.

మాడ్రన్ డేస్ బాల్ పాయింట్ పెన్స్ సిరా రసాయన నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలేమంటారంటే.. మంచి సిరా తయారీలో ద్రావకాలు, కందెనలు, బైండర్స్, రెసిన్స్ మధ్య సరైన సమతుల్యత అవసరం. సిరా ఎంత పలుచగా ఉంటే అంత త్వరగా రాత చెదిరిపోతుంది. సిరా ప్రవాహం తగ్గినా రాస్తున్నప్పుడు మధ్యలో అక్షరాలు ఆగిపోతాయి. కానీ, బాల్ పాయింట్ పెన్ ఇలాంటి సమస్యలన్నింటీ చెక్ పెట్టింది. సమర్థవంతమైన పరిష్కారంగా.. ప్రత్యామ్నాయంగా అవతరించింది.

ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చారిత్రక రికార్డుల ప్రకారం.. బాల్ పాయింట్ పెన్… ఫౌంటెన్ పెన్లకంటే చౌక. అంతేకాదు.. మన్నికైన ఆల్టర్నేటివ్. చిన్నగా జేబులో పెట్టుకునేలా ఉండటం వల్ల తీసుకెళ్లడమూ సులభం. వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ మన్నికగా పనిచేస్తుంది. మొత్తంగా పెన్ను అందంగా ఉండటం కన్నా కూడా… ఎంత ఉపయోగకరమన్నదే సాధారణ వినియోగదారుడిని బాల్ పెన్స్ వైపు మళ్లించింది.

ఓ విప్లవంలా వెల్లువెత్తిన బాల్ పాయింట్ పెన్స్!

కవులైనా, రచయితలైనా, సామాన్యులైనా వారేం రాయదల్చుకున్నారో రాసేందుకు ఫౌంటెన్ పెన్నైనా.. బాల్ పాయింట్ పెన్నైనా ఒకటే. కానీ, రాయడంలో కలిగే అసౌకర్యాలను తొలగించడంలో బాల్ పాయింట్ పెన్ ప్రత్యేకంగా నిల్చింది. ఒక వస్తువు మన్నికైనదిగా, సౌకర్యవంతంగా, నమ్మదగినదిగా మారితే.. పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలు ఇలా ఎక్కడ చూసినా ఎంత వేగంగా విస్తరించకలదో ఆ తర్వాత బాల్ పాయింట్ పెన్ నిరూపించింది.

బీరో ఆరంభ ఆవిష్కరణ తర్వాత అనేకమార్లు బాల్ పాయింట్ పెన్నును తీర్చిదిద్దే ఆవిష్కరణలు ఊపందుకున్నాయి. అయినప్పటికీ రూపకల్పనలోని మూలసూత్రం మాత్రం అలాగే కొనసాగుతోంది. అందుకే, ఇప్పటికీ బాల్ పాయింట్ పెన్ తన ప్రాధాన్యతనూ, ప్రత్యేకతనూ చాటుకుంటోంది.

లాస్లో బీర్లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మార్చాలనే సంకల్పంతోనో, ఉద్ధేశంతోనో.. ఇంక్ పెన్నుకు ప్రత్యామ్నాయం తీసుకురావాలనేం యోచించలేదు. తనకు సమస్యగా అనిపించింది.. పత్రికల్లో ముద్రణల్లో తాను పరిశీలించిందానిపై ఆలోచించి పరిష్కారం కోసం వెతకడంతో బాల్ పాయింట్ పెన్ పుట్టుకొచ్చింది. ఇప్పుడదే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే సాధనమైంది.

మన నిత్య జీవితంలో సర్వసాధారణమైపోయిన బాల్ పాయింట్ పెన్ ఆవిష్కరణ గురించి మనం ఆలోచించకపోవచ్చు. కానీ, ఈ కథ మనకు ఓ గొప్ప పాఠం చెబుతుంది. చిన్న సమస్యలెదురైనప్పుడు వాటికి బాధపడుతూ కూర్చోకుండా పరిష్కారం కనుగొంటే… ఆ ప్రయత్నాలే కొన్నిసార్లు ప్రపంచాన్నే అబ్బరపర్చే ఆవిష్కరణలకు దారి తీస్తాయన్నదే ఈ కథలో నీతి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles