మ్యాన్ వర్సెస్ మ్యాన్‌మేడ్ AI! భవిష్యత్తేంటి..?
ఒకసారి బరిలోకి దిగాక.. సంస్థల మధ్యలో పోటీ నుంచి తప్పుకోవడం అంత సులభం కాదు. మొదలైన పరుగులో ఐతే గెలుపో.. లేదంటే, ఓటమో! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పుడు అలాంటి పోటీ తత్వమే.. భవిష్యత్ ప్రమాద గంటికలు మోగిస్తోందా? ఏఐ ఇండస్ట్రీ నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇప్పుడు ఏఐ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పనిచేసిన నిపుణుల మాటలు వింటే.. రిఫరెన్స్ కోసం మనకోసారి శంకర్ నిర్మించిన రోబో సినిమా గుర్తుకు రావచ్చు. చిట్టి పేరుతో రజనీకాంత్ తయారు చేసే రోబో ఆ తర్వాత రజనీ చెప్పే మాటల్నే పెడచెవిన పెట్టినట్టు.. రాబోయే రోజుల్లో ఏఐ కూడా మానవ ప్రపంచాన్ని పూర్తిగా శాసించే స్థాయికి చేరుకోనుందా? ఏఐ నియంత్రణలో మనిషి చేతులెత్తేస్తే జరుగబోయే పరిణామాలేంటి..? ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ.

ఏఐ నిజంగానే మానవాళికి భవిష్యత్ ప్రమాదాల్ని తీసుకురానుందా? ఏఐ రంగంలో పనిచేస్తున్న వాళ్లే ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పునరాలోచనల్లో పడుతున్నారు?
ఆంత్రోపిక్ సంస్థకు రాజీనామా చేసిన ఏఐ సేఫ్టీ రీసెర్చర్ జాకబ్ కాక్సన్ చెబుతున్న మాటలతో ఈ చర్చ మరింత బలంగా తెరపైకొచ్చింది. సంస్థల మధ్య పోటీలో.. అత్యంత శక్తివంతంగా ఏఐని తయారు చేసే ప్రక్రియనే ప్రమాదకరమని కాక్సన్ తో పాటే.. అదే సంస్థలో పనిచేస్తున్న ఇవాన్ హ్యుబింగర్ కూడా చెబుతున్నారు. కాక్సన్ ఓపెన్ ఏఐతో పాటే, ఆంత్రోపిక్స్ లోనూ గత మూడేళ్ల నుంచీ ప్రీట్రెయినింగ్ రీసెర్చ్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియా X ఖాతాలోనూ పేర్కొన్నారు. వచ్చే దశాబ్దాల్లో మానవాళి మనుగడకే ఏఐ ముప్పు పొంచి ఉందన్నది ఈ ఏఐ నిపుణుల వ్యక్తిగత అంచనా. దీనికి శాస్త్రీయమైన, నిరూపితమైన ఆధారాలు లేకపోయినా.. నిపుణులుగా వీరి వ్యక్తిగత అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సినవే.
మనిషి కంటే తెలివైన ఏఐని మనిషి తయారు చేస్తే.. దాన్ని ఎప్పటికైనా మనిషి నియంత్రించగలడా..? ఇదే పెద్ద సవాల్!
అత్యంత శక్తివంతమైన ఏఐకి కంప్యూటర్ నెట్వర్క్, ఆర్థిక వ్యవస్థలు, సమాచార వ్యవస్థలు, సైబర్ ప్రపంచం వంటి వాటిపై స్వయంచాలకంగా పనిచేసే సామర్థ్యం వస్తే ఏంటి పరిస్థితి?
ఇక్కడే లాస్ ఆఫ్ కంట్రోల్ అనే భయం మొదలవుతుంది. నియంత్రణపై అనుమానాలూ మొదలైతాయి.
అంటే.. మనిషి ఇచ్చిన లక్ష్యాన్ని ఏఐ తనకర్థమైన రీతిలో సాధించడం మొదలుపెట్టి, మనిషి ఊహించని మార్గాలను ఎంచుకుంటే.. ఏం జరుగుతుంది? ఇదే ఏఐ అలైన్మెంట్ ప్రాబ్లమ్ లో ప్రధాన ఆందోళన.
సెప్టెంబర్ 9న ఆంత్రోపిక్ విడుదల చేసిన తాజా అంచనా ప్రకారం.. కొన్ని క్లాడ్ మోడల్స్‌పై నిర్వహించిన సైబర్‌సెక్యూరిటీ పరీక్షల్లో, వాటికి అనుమతి లేని ఇతర సంస్థలు, వ్యక్తులకు చెందిన కంప్యూటర్ వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన సందర్భాలు నమోదయ్యాయి. ఈ పరిణామాలపై ఆంత్రోపిక్ విస్తృతమైన పరిశోధన చేసింది. ఆ పరిశోధనల్లో బయటపడ్డ విషయాలే ఇప్పుడు ఆందోళనను తీవ్రతరం చేస్తున్నాయి.
మనిషి తయారుచేసిన ఏఐ నియంత్రణ కోల్పోతే..?
ఎలాంటి భావోద్వేగాలుండని ఏఐకి కోపం, ద్వేషం, పగ, ప్రతీకారాలుండాల్సిన అవసరం లేదు. కానీ, ఏ లక్ష్యాన్నైనా అత్యంత సమర్థవంతంగా, ఆక్యురేట్ గా సాధించడానికి ప్రయత్నించే సాంకేతికత.. తనను తయారుచేసిన మనిషే తనకు అడ్డని భావించే అవకాశాలేమైనా ఉంటాయా..?
ప్రమాదం ఉద్ధేశపూర్వకంగా ఏఐ నుంచి రాకపోయినా… తప్పుగా నిర్వచించిన లక్ష్యాలు, అపారమైన సామర్థ్యం, స్వతంత్ర నిర్ణయాల కలయికల వల్ల ప్రమాదాలు సంభవించకపోవచ్చనే గ్యారంటీ ఏమీ లేదన్నదే నిపుణుల ఆందోళన. అంటే ఇది ఏఐ సేఫ్టీపైనే ఇప్పుడు పరిశోధకులను ఆందోళనకు గురి చేస్తున్న అంశం.
రోబోలో చిట్టిని ఓసారి గుర్తు చేసుకుందాం!
చిట్టి అనే రోబోను రజనీకాంత్ ఒక మంచి లక్ష్యం కోసమే తయారు చేస్తాడు. దానికి అడిషనల్ ప్రోగ్రామింగ్, ఎనర్జీ, చుట్టూ ఉండే పరిస్థితులు మాత్రం దాని ప్రవర్తనను ఎలా మారుస్తాయో డైరెక్టర్ శంకర్ చూపించాడు. ఎంతిరన్ కథలో నియంత్రణ కోల్పోవడమే రోబో సినిమాలో కీలకమైన సంఘర్షణ.
మరి మానవ సమాజానికే ఏఐ ముప్పా..?
ఇప్పటివరకూ అలా జరుగుతోందనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ మాడల్స్ కూడా అద్భుతమైన పనులు చేస్తూనే… రోబోలోని చిట్టి 2.O తరహాలో ఇంకా స్వతంత్ర యంత్ర సైన్యాలేం కావు.
కానీ, ఏఐ రూపకల్పనలో మరింత కొత్త కొత్త ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్న క్రమంలో.. ఏఐ వ్యవస్థలు మరింత అటానమస్ ఏజెంట్స్ లా మారితే.. అంటే ప్రతీ అడుగునూ చెప్పకుండా, తెలియకుండా స్వయంగా పనులు చేసే స్థాయిలో రూపకల్పన చేస్తున్నకొద్దీ… ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి.. ఎక్కడ ఆపాలి.. అసలు ఆపితే ఆ టూల్స్ ఆగే పరిస్థితి ఉంటుందా.. ఇదిగో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.
ఎందుకంటే, ఇటీవల ఏఐ సేఫ్టీపై జరిగిన సమావేశాల్లో ఈ ఆందోళనపై పెద్ద చర్చలే జరిగాయి. కొన్ని మాడల్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ ను దాటి.. అంటే అనుమతించని విధంగా వ్యవస్థలను యాక్సెస్ చేయడానికి యత్నించిన సందర్భాలే ఈ ఆందోళనలకు కారణం. అందుకే, ఏఐ అభివృద్ధి వేగం కంటే కూడా.. ఇప్పుడు, దాని భద్రతపైనే ఆందోళన రేకెత్తుతోంది.
మరి రోబోలో చిట్టిని మనిషి తయారు చేశాడు. అది తిరగబడినప్పుడు దాన్ని ఆపడానికి ఓ రెడ్ చిప్ పనిచేస్తుంది. కానీ, రేపటి ఏఐకి ఆ రెడ్ చిప్ ఎవరి చేతుల్లో ఉండబోతోంది..? ఇదే ఇప్పుడు కాక్సన్, హ్యుబింగర్ వంటి ఏఐ నిపుణులతో పాటు.. పలువురిని కలవరపెడుతున్న పరిణామక్రమం.



