అమ్మలెందరికో అమ్మ.. ఈ డాక్టరమ్మ!

లడాఖ్ తొలి మహిళా గైనకాలజిస్ట సెరింగ్ లాండోల్!

ప్రసవాలు చేయడమే కాదు, మహిళల ఆరోగ్యంపై మూఢనమ్మకాల ప్రభావాన్ని పారద్రోలిన వైద్యురాలు!

వైద్యో నారాయణో హరి అని ఎందుకంటారు… ఇదిగో ఈ డాక్టరమ్మ కథ వింటే అది ఇంకా బాగా తెలుసుకోవచ్చు. మైనస్ డిగ్రీల చలిలో కాలు బయటపెట్టగలమా…? అలాంటి వాతావరణంలో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్లగలరా… ? అలాంటివారి కోసం స్వయానా ఈ డాక్టరే వారింటికొచ్చి వైద్యం చేసింది… ఎన్నో ప్రసవాలతో తల్లీబిడ్డల్ని కాపాడింది. అందుకే లడాఖ్ లో.. ఈ సెరింగ్ లాండోల్ భువిపై వెలిసిన ఓ దేవతా రూపంగా పూజలందుకుంటోంది.

డోట్ టూ డోర్ తానే వెళ్లి అవసరార్థులకు ప్రసవాలు చేయడమే కాదు… ఒక సమాజ ఆలోచనా తీరునే మార్చిన డాక్టరమ్మ ఈమె.

లడాఖ్ అంటే గుర్తొచ్చేది మంచు కొండలు, ఎముకలు కొరికే చలి, ఎత్తైన పర్వతాలు.. కానీ, ఇక్కడి మహిళలకు ఆ వాతావరణమే మరో సమస్య. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఆ గడ్డ కట్టే మంచులో ఆసుపత్రికెళ్లడం ఓ ప్రహసనం. ముఖ్యంగా చెకింగ్ కోసం వెళ్లే గర్భీణులు, ప్రసవం కోసం వెళ్లాల్సిన మహిళలకు, బయట చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు…. ఇంటింటికి తానే వచ్చి ఓ దైవంలా నిల్చారు ఈ డాక్టర్ సెరింగ్ లాండోల్. లడాఖ్ లో మహిళల ఆరోగ్య సంరక్షణ కోసమే తన జీవితాన్ని అంకింతం చేసిన వైద్యురాలిగా ఈమె పేరు మంచుకొండల్లో ఎప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటుంది.

లడాఖ్ లో తొలి మహిళా గైనకాలజిస్టుగా గుర్తింపు!

1979లో జిల్లా ఆసుపత్రిలో సెరింగ్ లాండోల్ వృత్తిలో జాయినైనప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు ఇవాళ ఊహించడానికి కూడా కష్టమైనవి. లాండోల్ జీవితంలో జరిగిన ఒక్క ఘటన, ఆమె చూసిన చిన్ననాటి దృశ్యం ఈమెను పూర్తిగా మార్చేసింది.

తల్లి అనుభవించిన బాధలను చూసి ఏర్పర్చుకున్న జీవిత లక్ష్యం!

ప్రసవం సమయంలో డాక్టర్ సెరింగ్ లాండోల్ అనుభవించిన బాధ.. నాటి దృశ్యం ఆమెను అత్యంత ప్రభావం చేసింది. ప్రసవ సమయంలో తల్లిని మిగిలిన అందరికీ దూరంగా ఉంచడం, ప్రత్యేక పాత్రల్లో భోజనం పెట్టడం వంటి మూఢ నమ్మకాలు, అక్కడి ఆచార, సంప్రదాయాలు చిన్ననాటే లాండోల్ ను ఆలోచనలకు గురిచేశాయి. ఆ దృశ్యాలన్నీ లాండోల్ లో ప్రశ్నలుగా మారాయి. చిన్ననాట బలంగా పడ్డ బీజమే.. పెద్దయ్యాక మహిళల ఆరోగ్యం కోసం పనిచేయాలన్న లాండోల్ కలను నిజం చేసింది.

సెరింగ్ లాండోల్ 1945లో లేహ్ లో ఓ రైతు కుటంబంలో జన్మించారు. ఆ సమయంలో పాఠశాలకు వెళ్లే అవకాశం పొందిన కొద్ది మంది బాలికల్లో లాండోల్ ఒకరు. తన వైద్య విద్యను శ్రీనగర్ లో పూర్తి చేశారు.

1979లో లడాఖ్ కు తిరిగివచ్చిన డాక్టర్!

వైద్య విద్య పూర్తి కాగానే లడాఖ్ లోని జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్టుగా వైద్య సేవలు ఆరంభించారు. నాడు ఆసుపత్రుల్లో మనం కనీసం ఊహించే సౌకర్యాలు కూడా లేవు. రాత్రింబవళ్లు విద్యుత్ అందుబాటులో ఉండేది కాదు. అప్పుడే పుట్టిన పిల్లలకు, నవజాత శిశువులకు కావల్సిన హీటింగ్ వ్యవస్థ లేదు. ఆపరేషన్ థియేటర్స్ ను వేడి చేయడానికి బొగ్గును మండించి వేడిని పెంచేవారు. అత్యంత తీవ్రమైన, గడ్డ కట్టుకుపోయే చలిలో ప్రసవాలు నిర్వహించడం వైద్యపరంగానే కాదు… మౌలిక సదుపాయాల పరంగా కూడా పెద్ద సవాళ్లనే ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన వివరాల ప్రకారం వాక్యూమ్ పరికరాన్ని, గ్లౌజులను, అవసరమైన మందులు వంటి సామాగ్రిని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేవారు. అక్కడ నీటి సరఫరా లేకపోవడంతో డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసుకునేవారు. కానీ, ఆ నీళ్లన్నీ ఆ మైనస్ డిగ్రీల సెంటిగ్రేడ్ చలికి గడ్డ కట్టేవి. నీటిని వినియోగించుకోవాలంటే ముందు ఆ మంచు గడ్డలను పగులగొట్టి.. ఆ నీటిని కిరోసిన్ హీటర్స్ తో వేడి చేసి ఉపయోగించేవారు.

ఇక ఆ మంచుకొండల్లో ట్రైబల్స్ బతుకులూ పేదరికానికి కేరాఫ్ లా ఉండేవి. నవజాత శిశువులకు వేయడానికి బట్టలు కూడా కొనలేని కూడా కుటుంబాల పరిస్థితి దయనీయంగా కనిపించేది. చలిలో శిశువులను పడిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి, హైపోథెర్మియా నుంచి కాపాడేందుకు వైద్య సిబ్బందే బట్టలు సమకూర్చాల్సిన దైన్యస్థితి.

వాతావరణం మాత్రమే అక్కడి అసలు సమస్య కాదు! మరి..?

లాండోల్ ఎదుర్కొన్న పెద్ద సమస్య వాతావరణం మాత్రమే కాదు. మహిళల్లో నెలకొన్న భయాలు, సంకోచాలు, మూఢనమ్మకాలు కూడా. చాలా మంది మహిళలు ప్రసవానికి ఆసుపత్రులకు రావడానికి ఇష్టపడేవారు కాదు. కనీసం తమ ఆరోగ్య సమస్యలు చెప్పడానికి కూడా సంకోచించేవారు. కాబట్టి లాండోల్ కు కేవలం వైద్యం చేస్తేనే తన పనైపోలేదు.

నమ్మకమే ఆయుధం!

ముందు అక్కడివారిలో ప్రసవాలు, ఆరోగ్య సమస్యలు, మూఢ నమ్మకాలు ఇలాంటివాటిపై ఒక అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించే విధానంలో వారికి నమ్మకం కల్పించడం ఇంకా పెద్ద సవాల్. అలాంటి సమయంలో డాక్టర్ లాండోల్ లడాఖ్ లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి.. వైద్య శిబిరాలు నిర్వహించారు. మహిళలతో మాట్లాడారు. గర్భధారణ సమయంలో పోషకాహారం, పరిశుభ్రత, ప్రసవం, కుటుంబ నియంత్రణ వీటి గురించి ఆ శిబిరాల్లో వివరించడం మొదలుపెట్టారు. అలా ఆమె ప్రయత్నం ఆసుపత్రి గోడల వద్దే ఆగకుండా… ఫీల్డ్ లో తిరిగేలా చేసింది. ప్రజల దగ్గరకు వెళ్లేలా చేసింది. స్థానికంగా అక్కడ మాట్లాడే భాష తనకు తెలియడం, వారి ఆహారపు అలవాట్లు, సామాజిక పరిస్థితులపై అవగాహన ఉండటంతో లాండోల్ తొందరలోనే అక్కడి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు.

కుటుంబ నియంత్రణపై డాక్టర్ లాండోల్ పోరాటం చెప్పుకోవాల్సింది!

డాక్టర్ సెరింగ్ లాండోల్ సేవలు కేవలం ప్రసవాలకే పరిమితం కాలేదు. ఒకప్పుడు తక్కువ వ్యవధిలోనే వరుసగా పిల్లల్ని కనడం సర్వసాధారణం. పైగా కుటుంబ నియంత్రణపైన అపోహలుండేవి. కానీ, ఊరూరా తిరిగి కనీసం రెండు ప్రసవాల మధ్య రెండేళ్ల విరామం ఉంటేనే తల్లీ, బిడ్డలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటారనే అవగాహనను అక్కడి ప్రజల్లో కల్పించారు లాండోల్. తక్కువ మంది పిల్లలుండటంతో వారి ఆరోగ్యం, విద్య, పోషణపైన ఆయా కుటుంబాలు మెరుగ్గా దృష్టి పెట్టగలవనీ చెప్పేవారు. గర్భిణులు తరచూ తక్కువ పరిణామాల్లో భోజనం చేయాలని.. ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం వంటి పోషకాలెంత అవసరమో చెబుతూ పోషకాహారంపై కూడా ఆమె ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఒక డాక్టర్ గానైతే ప్రసవంతో సరిపెట్టుకోవచ్చు. కానీ.. ఆమె సామాజిక వైద్యురాలు. అందుకే ప్రసవానికి ముందెలా ఉండాలనే అవగాహన కల్పించే ఓ మెంటార్ గా… ప్రసవం సమయంలో ఓ వైద్యురాలిగా… ప్రసవం తర్వాత తల్లీ, బిడ్డ ఆరోగ్య సంరక్షణను చూసే ఓ సంరక్షకురాలిగా ఇలా విభిన్న పాత్రలతో మహిళల ఆరోగ్యాన్ని ఓ వ్యవస్థలా చూశారు.

రూపాయి ఫీజు కూడా అదనంగా తీసుకోని డాక్టర్!

లాండోల్ సేవలో ఇది మరో ఆసక్తికరమైన సన్నివేశం. తన దగ్గరకొచ్చే రోగుల నుంచి ఫీజు లేకుండా వైద్యమందించారు. తనకు వచ్చే జీతం సరిపోతోందని చెప్పేవారు. ఒకరి సమస్య ఇంకొకరి సంపాదనకు దారితీయొద్దనే ఫిలాసఫీ డాక్టర్ సెరింగ్ లాండోల్ ది. ఇవన్నీ వెరసి డాక్టర్ లాండోల్ సేవలను మరించ ప్రత్యేకతలుగా నిలిపాయి.

ఐదేళ్ల తర్వాత అనూహ్య మార్పు!

ఏ పనైనా మొట్టమొదటి అడుగుతోనే ఆరంభమవుతుంది. అయితే, అలా అడుగు వేయగానే గమ్యం చేరలేం. అలాగే, తాననుకున్న ఫలితాలను లడాఖ్ ప్రాంతంలో తీసుకురావడానికి ఐదేళ్ల సమయం పట్టింది డాక్టర్ లాండో ల్ కు. ఆసుపత్రులకు రావడానికి భయపడే, సిగ్గుపడే మహిళల్ని, కుటుంబాల్ని అక్కడి తీసుకువచ్చేందుకే ఆమె ఎంతో కష్టపడి ఐదేళ్లు వారిలో అవగాహన కల్పించింది.

ఇది ఒక వైద్యురాలి కథగా చూడలేం. ఒక సమాజంలో ఆరోగ్యంపై ఉన్న ఆలోచనలను మార్చిన దీర్ఘకాలిక ప్రయాణంగా చెప్పాల్సి ఉంటుంది.

కాలక్రమంలో ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయి. మహిళలు తమ ఆరోగ్య సమస్యలపై మాట్లాడటం ఆరంభించారు. కుటుంబ నియంత్రణ, ప్రసూతి తర్వాత ఆరోగ్య సంరక్షణ, పోషకాహారంపై అవగాహనను పెంచిన సామాజిక వైద్యురాలిగా లడాఖ్ లో ఆమె పేరు చిరస్మరణీయురాలిగా మారింది.

డాక్టర్ లాండోల్ ను వరించిన భారతదేశ అత్యున్నత పురస్కారాలు!

భారత ప్రభుత్వ లాండోల్ సేవలను గుర్తిస్తూ 2006లో పద్మశ్రీతో సన్మానిస్తే… 2020లో పద్మభూషణ్ కూడా సెరింగ్ కు దక్కింది. వైద్యరంగంలో నాల్గు దశాబ్దాలుగా ఆమె చేసిన సేవలకు రెండు భారతీయ అత్యున్నత పురస్కారాలందుకున్న మహిళా వైద్యురాలిగా సెరింగ్ పేరు చరిత్రలో నిల్చిపోయింది.

చలిని జయించడం కంటే పెద్ద పని!

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వైద్య పరికరాలు మోసుకుంటా ఇంటింటికీ వెళ్లడం సెరింగ్ వైద్య ప్రయాణంలో ఓ భాగం మాత్రమే. లడాఖ్ వంటి మనసు విప్పని ప్రాంతాల్లో… వివిధ రకాల నమ్మకాలు, అపోహలున్న సమాజంలో… మహిళ తన ఆరోగ్యం గురించి మనసు విప్పి డాక్టర్ దగ్గరకు, ఆసుపత్రికి వచ్చి చెప్పడమే ఆమె సాధించిన అసలు విజయం. ఆసుపత్రికొచ్చి ప్రసవం చేయించుకోవడం ఎంత అవసరమో నమ్మించడంలోనూ, గర్భిణీ ఆరోగ్యమనేది కుటుంబ బాధ్యత అని చెప్పడంలోనూ డాక్టర్ సెరింగ్ లాండోల్ సాధించిన విజయాలే… ఆమెకు, భారతీయ వైద్యరంగంలో ఒక ప్రత్యేక పేజీని సంపాదించి పెట్టాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles