మారుతున్న మత్తురూపం: సమాజానికి సవాల్ విసురుతున్న సింథటిక్ డ్రగ్స్!

దమ్ మారో దమ్!

దమ్ మారో దమ్… షోలే సమయంలో ఓ సినిమా పాట. ఇప్పుడు ఇదో పెద్ద సామాజిక సమస్య, సమాధానం దొరక్క సమాజం తలలు పట్టుకునే ప్రశ్న.

ఉడ్తా పంజాబ్ నుంచి హైవేల మీదుగా.. భారత్ లో మత్తు మాఫియా ఇప్పుడో పెద్ద సోషల్ ఇష్యూ.

యువత చేతికి డ్రగ్స్ ఎలా చేరుతున్నాయి..? భారత్ లో ఏ మత్తు పదార్థాలు ఎక్కువ లభ్యమవుతాయి..? పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి కెనడా, మెక్సికో, దక్షిణ అమెరికా, సిరియా దాకా ఈ ప్రపంచ డ్రగ్ మ్యాప్ ఎలా ముడి పడి ఉంది.

ఇదేదో పోలీసులు పరిష్కరించే ఇష్యూ మాత్రమే కాదు.. దేశాన్ని వణికిస్తున్న అతి పెద్ద రుగ్మత. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులుగా రూపుదిద్దుకునే క్రమంలో అడ్డుపడుతున్న ఓ మత్తు కథ. యువత, కుటుంబాలు, సరిహద్దులు, అంతర్జాతీయ నేర ముఠాలు, డబ్బు, టెక్నాలజీ అన్నింటినీ మిళితం చేస్తున్న ఓ అతి పెద్ద సామాజిక సంక్షోభం.

భారతదేశంలో డ్రగ్స్ వినియోగంపై పరిస్థితేంటి..?

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఎయిమ్స్, ఎన్డీడీడీటీసీ నేషనల్ సర్వే ఆన్ ఎక్స్టెంట్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ సబ్ స్టాన్స్ యూజ్ ఇన్ ఇండియా కలిసి చేసిన సమగ్ర అధ్యయనం భారత్ లో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయికి చేరుకుందో బహిరంగపర్చింది.

2019లోనే విడుదలైన ఈ సర్వే దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించారు. రెండు లక్షలకు పైగా కుటుంబాలు.. 4 లక్షల 73 వేల మంది వ్యక్తులను ఈ హౌజ్ హోల్డ్ సర్వే అధ్యయనం చేసింది. డ్రగ్స్ పై దేశవ్యాప్తంగా రాష్ట్రాల స్థాయిలో ఇంత విస్తృతంగా జరిగిన తొలి సమగ్ర ప్రయత్నంగా ఈ సర్వే గురించి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేర్కొంది.

ఈ సర్వే ప్రకారం టొబాకో పక్కనబెడితే.. ఆల్కహాల్ అత్యధికంగా ఉపయోగించే సైకో యాక్టివ్ సబ్ స్టాన్స్ తర్వాత గంజాయి, ఓపియాయిడ్స్ వినియోగం అధికంగా ఉన్నట్టు తేలింది. కొకైన్, ఆంఫెటమైన్ టైప్ స్టిమ్యులంట్స్, హాలూసినోజన్స్ వినియోగం దేశం మొత్తమ్మీద తక్కువ ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వీటి ప్రభావం అత్యధికంగా ఉన్నట్టు వెల్లడైంది.

భారత్ డ్రగ్స్ కథ అంటే కేవలం గంజాయి, హెరాయిన్, కొకైన్ మాత్రమే కాదు!

గంజాయి నుంచి ఒపియాయిడ్స్ వరకు… ఫార్మాసెట్యుకల్ డ్రగ్స్ నుంచి సింథటిక్ డ్రగ్స్ వరకు.. రాను రాను మత్తు మార్కెట్ రూపం మారుతోంది.

ఉడ్తా పంజాబ్ అనే పేరు ఎందుకొచ్చింది..?

పంజాబ్ లో దారి తప్పి మత్తులో తూలుతున్న యువత ఒపియాయిడ్ డిపెండెంట్ గా మారిపోయింది. 2016లో ఉడ్తా పంజాబ్ పేరిట షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. పంజాబ్ లో సమస్య సినిమా వల్ల పుట్టింది కాదు.. సమస్య వల్లే సినిమాగా రూపుదిద్దుకుంది.

సినిమా విడుదలకు ముందే పంజాబ్ ఒపియాయిడ్ డిపెండెన్స్ సర్వే ఒకటి జరిగింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్… నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ సహకారంతో నిర్వహించిన అధ్యయనం రాష్ట్రంలో ఒపియాయిడ్ డిపెండెన్స్ ఎంత తీవ్రంగా పెరిగిందో చెప్పింది. ఎయిమ్స్ తన పరిశోధనల జాబితాలో ఈ అధ్యయనాన్ని అధికారింగా నమోదు చేసింది.

ఇప్పుడు డ్రగ్స్ అంటే కేవలం పంజాబ్ మాత్రమే కాదు!

ఈ మత్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకింది. భారత్ లో డ్రగ్ సమస్యకు భౌగోళిక సరిహద్దులు మాయమైపోతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై ఈ మత్తు పదార్థాల ప్రభావం తీవ్రంగా పడుతోంది. పంజాబ్, జమ్ము సరిహద్దు ప్రాంతం హెరాయిన్ ట్రాఫికింగ్ కు ఓ ముఖ్యమైన కారిడార్ లా మారిపోయింది. ఇటీవల నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆపరేషన్లలో పంజాబ్ నుంచి జమ్మూకు రహస్యంగా, అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ మార్గాన్ని అధికారులు గుర్తించారు. మరోదారిలో పాక్ నుంచి ఎల్వోసీ ద్వారా కశ్మీర్ వైపు వస్తున్నట్టుగా కూడా ఎన్సీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఇంకోవైపు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి పదార్థాల అక్రమ రవాణాపై భద్రతా సంస్థలు నిరంతరం ఫోకస్ చేస్తున్నాయి.

సరిహద్దులు దాటి, సముద్ర మార్గాల గూండా, అంతరాష్ట్ర రవాణా ద్వారా నగరాల్లోని నైట్ లైఫ్ మార్కెట్స్, డిజిటల్ నెట్వర్క్ అన్నీ కలిసి ఒక సంక్లిష్టమైన వ్యవస్థగా తయారవుతుండటం ఆందోళన రేకెత్తించేది.

తాజా డాటా సంగతేంటి..?

డ్రగ్స్ వినియోగం ఎంత పెరిగిందో చెప్పడానికి నేషనల్ ప్రివలెన్స్ సర్వే మన దగ్గర లేదు. కానీ, ఇల్లీగల్ డ్రగ్ సప్లై ఎంత పెద్దదో మాత్రం నిత్యం దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న మత్తుపదార్థాలు చెబుతున్నాయి.

కేంద్ర హోంశాఖ ఏం చెబుతోంది..?

2026 పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం… దేశంలోని వివిధ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ 2021లో 16 లక్షల 9 వేల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ డాటా 2022కు వచ్చేసరికి 12 లక్షల 53 వేల కిలోలు, 2023లో 13 లక్షల 89 వేల కిలోలు, 2024లో 13 లక్షల 30 వేల కిలోలు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2025 నవంబర్ వరకు మరో 11 లక్షల 85 కిలోలు స్వాధీనం చేసుకున్నట్టు పార్లమెంట్ సాక్షిగా సర్కార్ చెప్పిన లెక్క ఇది.

సీజర్స్ పెరగడమంటే… వినియోగం, నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..

భారీగా దిగుమతులు!

ఇక్కడే అసలు డ్రగ్ మ్యాప్ ఆసక్తికరం. సౌత్ అమెరికా కొకైన్ కు చిరునామా. మెక్సికో సింథటిక్ డ్రగ్స్, ఫెటానిల్ కు పక్కా అడ్రస్. సిరియాతో పాటు, మిడిల్ ఈస్ట్ దేశాలు క్యాప్టాగాన్ కు కేరాఫ్. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో డ్రగ్ ఎకానమి వింగే సెపరేట్ గా పనిచేస్తోంది.

ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్యాలు మరియు నేరాలకు సంబంధించిన కార్యాలయం లెక్కల మేరకు.. 2024లో కొకైన్ ఉత్పత్తి, స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు రెండూ రికార్డ్ స్థాయికి చేరాయి. కొకైన్ ప్రొడక్షన్ లో సౌత్ అమెరికా ప్రపంచానికే కీలక కేంద్రంగా మారింది. ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలే కాదు.. మాదక ద్రవ్యాలు ఖండాంతరాలు దాటుతోంది.

డ్రగ్ ట్రేడ్ అనేదిప్పుడు లోకల్ క్రైమ్ కాదు.. గ్లోబల్ సప్లై చైన్ గా మారిపోయింది.

మెక్సికో – డ్రగ్స్ కు మరో ప్రపంచం!

ఈ ప్రాంతపు కథ ఇంకా సంక్లిష్టం. ఫెంటానిల్, మెథాంఫెటామైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ నార్త్ అమెరికను డ్రగ్ మార్కెట్ లో అత్యంత పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఇక్కడ తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలు, ముడిపదార్థాలమ్మే సంస్థలు, అక్రమరవాణా చేసే నెట్వర్క్స్, బార్డర్ రూట్స్ లో సరకు తరలించేవారు ఇలా అంతా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గ్రూపుగా ఏర్పాటై మెక్సికో వంటి దేశాలను శాసిస్తున్నాయి. మెక్సికోను కేవలం డ్రగ్స్ వాడే దేశమే కాదు… ఉత్పత్తి నుంచి మొదలు ఆర్గనైజ్డ్ క్రైమ్ కార్యకలాపాల ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ సమస్యగా తయారైంది.

ఇక సిరియా కథ మరోలా కనిపిస్తుంది!

ఇక్కడ క్యాప్టగాన్ సామ్రాజ్యమే కనిపిస్తుంది. ఈ డ్రగ్ స్టోరీ మరింత భిన్నమైంది. యాంఫెటమైన్ టైప్ స్టిమ్యులెంట్ వంటి సింథటిక్ డ్రగ్స్ మెదడును, నాడీ వ్యవస్థను ఉత్తేజపర్చి మనిషిని వాస్తవంలోంచి బయటకు లాక్కెళ్లి తనదైన ఊహాలోకంలో విహరింపజేస్తాయి. యూఎన్వోడీసీ ప్రకారం గత దశాబ్దకాలంలో క్యాప్టగాన్ ఎక్కువగా సిరియన్ అరబ్ రిపబ్లిక్ నుంచే లభ్యమైనట్టు, స్వాధీనం చేసుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. 2019 నుంచి 2025 నవంబర్ వరకు మిడిల్ ఈస్ట్ లో స్వాధీనపర్చుకున్న క్యాప్టగాన్ లో 80 శాతం సిరియా నుంచే వచ్చినట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2024 డిసెంబర్ లో సిరియాలో రాజకీయ మార్పుల తర్వాత ఇలాంటి ఉత్పత్తి కేంద్రాలను చాలావరకూ ధ్వంసం చేసింది అక్కడి ప్రభుత్వం.

కానీ, కథ ఇక్కడితో ముగియలేదు. 2024 చివర్లో రాజకీయ మార్పు తర్వాత కూడా… ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో భారీ క్యాప్టగాన్ నిల్వలు పట్టుబడటం అక్రమ రవాణా ఇంకా ఎలా సాగుతుందో కళ్లకు కట్టేది. ఒక దేశంలో ఫ్యాక్టరీ మూసేస్తే ఆగిపోయేది కాదు ఈ డ్రగ్ మార్కెట్. ఇదో పెద్ద రహస్య నెట్వర్క్ గా ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు, సరిహద్దులు దాటి ఖండాంతారాలను దాటిన ఓ ఆందోళనకరమైన విస్తరణ.

సరికొత్త ప్రమాదం సింథటిక్ డ్రగ్స్!

అసలు సింథటిక్ డ్రగ్స్ అంటే ఏమిటి..? గంజాయి కన్నాబిస్ మొక్క నుంచి ఉత్పత్తి అవుతుంది. అఫీమ్ ఓపియన్ పాపీ నుంచి ఉత్పత్తవుతుంది. కొకైన్ కోకా ప్లాంట్ నుంచి వస్తుంది. కానీ, ఈ సింథటిక్ డ్రగ్స్ మాత్రం రసాయనాల మేళవింపుతో తయారయ్యేవి.

మెథాంఫెటామైన్, ఆంఫెటామైన్, ఫెంటానీ వంటి సింథటిక్ డ్రగ్స్ తో ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో మరో మార్పు కనిపిస్తోంది. పాత మత్తు పదార్థాల స్థానే సింథటిక్ డ్రగ్స్ వేగంగా ప్రాధాన్యతను పొందుతున్నాయి.

యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ డాటా ప్రకారం మిడిల్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ ఆసియా అయిన పాక్, ఆప్ఖాన్, ఇరాన్ వంటి చోట్ల ఆంఫెటామైన్ టైప్ స్టిమ్యులంట్స్ తో మార్కెట్ రూపమే పూర్తిగా మారిపోతోంది. మెథాఫెటామైన్ తో పాటు.. క్యాప్టగాన్, ఆంఫెటామైన్ విచ్చలవిడిగా పట్టుబడుతోంది.

సింథటిక్ డ్రగ్స్ – భారత్ కు పొంచి ఉన్న ముప్పు!

సింథటిక్ డ్రగ్స్ కు సాగుభూమి అవసరముండదు. ఓ చిన్న గదిలో కూడా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని కెమికల్స్, టెక్నాలజీ, నెట్వర్క్ తో మత్తు ప్రపంచాన్నే శాసించొచ్చు. అందుకే ఇక కేవలం సరిహద్దుల వద్ద సెర్చ్ ఆపరేషన్స్ చేస్తే, నిఘా పెంచితే సరిపోదు. కెమికల్ సప్లై చైన్స్ ను పసిగట్టాలి. ముడిపదార్థాలమ్మే వారిని టార్గెట్ చేయాలి. డార్క్ నెట్ ను ఛేదించాలి. క్రిప్టోకరెన్సీ పేమెంట్స్ పైనా ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ వంటి సాంకేతిక అంశాలపైనా నిఘా పెంచాల్సిన సమయమిది. లేకపోతే ఈ మత్తు.. ప్రపంచాన్ని చిత్తు చేయడం, మరింత వేగంగా విస్తరించడం ఖాయం.

డ్రగ్ మార్కెట్ రూపం మారుతోంది. మొక్కల నుంచి కెమికల్స్‌కు… స్థానిక ముఠాల నుంచి గ్లోబల్ నెట్‌వర్క్స్‌ కు… వీధి వ్యాపారం నుంచి డిజిటల్ చీకటి ప్రపంచానికి. మత్తు మారుతున్నప్పుడు… దాన్ని అడ్డుకునే వ్యూహం కూడా మారాల్సిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles