భూమి కింద బయటపడిన అపారమైన బంగారం.. భూమి పైన జోహన్నెస్ బర్గ్‌ను ఎలా పుట్టించింది?
ఒక బంగారు గని… ఓ నగరాన్ని, ఓ దేశాన్ని, ప్రపంచ రాజకీయ ఆర్థిక చరిత్రను ఎలా మార్చింది..? ఈ విశేషాలు తెలుసుకోవాలంటే మనమోసారి దక్షిణాఫ్రికా దాకా వెళ్లొద్దాం.
ఒకనాడక్కడ నగరం లేదు, భవనాల్లేవు, రద్దీ రోడ్లూ లేవు, ప్రపంచస్థాయి కంపెనీలూ లేవు… ఉన్నది కేవలం విస్తారమైన భూభాగం మాత్రమే. కానీ, ఆ నేల కింద బంగారముందనే విషయం తెలిసింది. అంతే! కొన్నేళ్ళల్లో ప్రపంచం నలుమూలల నుంచీ జనం అక్కడ వాలిపోయారు. గనులు పుట్టుకొచ్చాయి. రైల్వేలు వచ్చాయి. డబ్బు ప్రవాహం మొదలైంది. ఓ కొత్త నగరం రూపుదిద్దుకుంది. ఇదే జోహన్నెస్ బర్గ్ చరిత్ర.

గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్!
జోహన్నెస్ బర్గ్ కున్న గుర్తింపిది. eGoliఅంటారు. అంటే స్థానికంగా జులు భాషలో బంగారముండే ప్రాంతం.
1886… జోహన్నెస్ బర్గ్ చరిత్రను మార్చిన ఏడాది!
విట్ వాటర్స్ రాండ్ ప్రాంతంలో బంగారం నిల్వలున్నట్టు 1884లోనే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. కానీ, ప్రపంచ చరిత్రను మార్చిన గోల్డ్ రీఫ్ 1886లో లాంగ్ లాగ్టే (LANGLAAGTE) అనే ప్రాంతంలో గుర్తించారు. జార్జ్ హారిసన్ అక్కడ బంగారం కలిగిన రీఫ్‌ను గుర్తించడంతో ఈ ప్రాంతంలోని అపారమైన బంగారు సంపద ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
1886 సెప్టెంబర్ 8న విట్ వాటర్స్ రాండ్ లోని తొమ్మిది ఫార్మ్ లను అధికారికంగా బంగారం తవ్వకాల కోసం అనుమతించారు. అప్పటికే జనం వెల్లువలా రావడం మొదలైంది. బంగారం నిల్వల కోసం ప్రపంచమంతా అటే పరుగెడుతోంది. నెలల్లోపే వేల సంఖ్యలో వలస వచ్చినవారితో జోహన్నెస్ బర్గ్ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. పదేళ్లు గడిచేలోపు జోహెన్నెసర్ బర్గ్ జనాభా ఆరోజుల్లోనే లక్ష దాటేసింది. ఆ జనాభాలో గణనీయమైన వాటా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులదే.
ఓ నగరాన్ని సృష్టించిన బంగారం!
సాధారణంగా ఏ పట్టణమైనా, నగరమైనా, ప్రాంతమైనా వాటి నాగరికత నదులు, సముద్రాల వెంట చూస్తుంటాం. కానీ, జోహన్నెస్ బర్గ్ ది ఇందుకు భిన్నమైన కథ. బంగారు గనుల పునాదులపై వెలసిన నగరమిది. గనులు పెరుగుతున్నకొద్దీ కార్మికులు పెరిగారు. యంత్రాలు పెరిగాయి. రైల్వే కనెక్టివిటీ పెరిగి పెద్దదైంది. బ్యాంకులు వెలిసాయి. ఇలా ఒక బంగారు గనులున్న ప్రాంతం… ఏకంగా ఓ పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకుంది.
విట్ వాటర్స్ రాండ్ బంగారు ప్రాంతం.. ఆధునిక దక్షిణాఫ్రికా పారిశ్రామిక ప్రాంతంగా ఏర్పడటానికి కీలకమైన మలుపుగా మారిందని దక్షిణాఫ్రికా ప్రభుత్వ చరిత్ర పత్రాలే పేర్కొంటున్నాయి.
కనిపించేది మాత్రమే బంగారం కాదు.. నేల లోపలే అసలైన సవాళ్లు!
ఇక్కడి బంగారం కథలో ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. బంగారం పైపైనే లభించేది కాదు. గనుల్లో లోతుకు వెళ్లేకొద్దీ దాన్ని వెలికి తీయడం మరింత కష్టంగా మారింది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, ఇంజనీరింగ్ నైపుణ్యం, నూతన సాంకేతికత అవసరమయ్యాయి.
1887లో అభివృద్ధి చెందిన మ్యాక్ ఆర్థర్ – ఫారెస్ట్ సైనైడ్ అనే ప్రక్రియ ద్వారా తక్కువ నాణ్యత కల్గిన ధాతువు నుంచి కూడా బంగారాన్ని సమర్థవంతంగా వెలికి తీయడం సాధ్యమైంది. 1890లో ఈ విధానం ర్యాండ్ ప్రాంతంలో ఉపయోగించడంతో ఈ గనుల్లో ఇక పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తాయి.
అంటే, బంగారు గనులుంటే… వాటిని వెలికి తీసేందుకు మనిషి కనుక్కున్న సాంకేతికత, పెట్టిన పెట్టుబడులు, మానవ శ్రమ వెరసి.. మొత్తంగా జోహన్నెస్ బర్గ్ ను ప్రపంచస్థాయి నగరంగా మార్చింది.
సంపదనే కాదు.. రాజకీయాలనూ శాసించిన బంగారం కథ!
ఇక్కడ వెలికితీసిన బంగారం ట్రాన్స్ వాల్ అనే ప్రాంతాన్ని ఒక్కసారిగా అత్యంత విలువైన ప్రాంతంగా మార్చేసింది. విదేశీ పెట్టుబడిదారులు, కార్మికులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఇలా అంతా ఇక్కడి చేరుకున్నారు. బ్రిటన్- బోయెర్ రిపబ్లిక్ మధ్య ఉద్రిక్తతలకూ ఈ బంగారు గనుల సంపంద ఓ ముఖ్య కారణంగా మారింది. చివరకు ఈ పరిణామాలు ఆంగ్లో – బోయెర్ వార్ కు దిశగా తీసుకెళ్లాయి.
ఆర్థిక వ్యవస్థనే మార్చేసిన నేలమాళిగల్లోని ఖనిజం!
బంగారం ఓ ప్రాంత చరిత్రనే లిఖించింది. ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది. నగరాన్నే సృష్టించింది. వలసలను పెంచింది. రాజకీయ పోరాటాలను తీవ్రం చేసింది. చివరకు దక్షిణాఫ్రికా భవిష్యత్తునే ప్రభావితం చేసింది.
ప్రపంచ బంగారంలో ఎంత వాటా..?
విట్ వాటర్స్ రాండ్ బంగారు క్షేత్రాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత సుసంపన్నమైన బంగారు గనుల్లో ఒకటిగా నిల్చాయి. కొన్ని అంచనాల ప్రకారం 1886 నుంచి ప్రపంచంలో ఇప్పటివరకూ తవ్విన మొత్తం బంగారంలో.. ఈ ప్రాంతం నుంచి వెలికి తీసిన నిల్వలే 40 శాతమట. ఈ సంఖ్యను జోహన్నెస్ బర్గ్ నగరం ఒక్కటే ఉత్పత్తి చేసిందని కాదు.. కానీ, విస్తృతమైన విట్ వాటర్స్ రాండ్ గోల్డ్ ఫీల్డ్ ప్రాంతానికి సంబంధించిన అపారమైన సంపదగా మాత్రం చెప్పుకోవచ్చు.
అందుకే బంగారు నగరంగా గుర్తింపు!
జోహన్నెస్ బర్గ్ ను చూస్తే ఇప్పుడు ఆకాశహర్మ్యాలు, ఆర్థిక సంస్థలు, ప్రపంచస్థాయి వ్యాపార కేంద్రాలు కనిపిస్తాయి. కానీ, ఈ నగరం రూపకల్పనకు పునాది మాత్రం భూఅంతరాల్లోని బంగారు నిల్వలు వేశాయి.
1886లో వెలుగులోకొచ్చిన బంగారు సంపద… ఓ చిన్న మైనింగ్ సెటిల్మెంట్ తో జోహన్నెస్ బర్గ్ రూపురేఖలు, చరిత్రే మారిపోయింది. ఖనిజ సంపద ఓ నగరాన్ని ఎలా పుట్టించిందో.. ఓ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చగలదో… ఓ గని ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయగలదో చెప్పే కథ జోహన్నెస్ బర్గ్ ది. అలా భూమి కింద దాగి ఉన్న బంగారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్క జోహన్నెస్‌బర్గ్ రూపురేఖలే మారలేదు.. దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి, రాజకీయ చరిత్ర కూడా కొత్త మలుపు తిరిగాయి


