మళయాళమైతే సరి బాగుంటుందనుకుంటే.. కొన్ని సోసోగానే పర్వాలేదనిపిస్తాయి. అలాంటిదే Narivetta!
ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్.. ఇలా ఏదో ఓ పేరుతో మావోయిస్టుల చిరునామా చెబుతూ సాగుతున్న మారణకాండను లీలగా బ్యాక్ డ్రాప్ లో గుర్తుకు తెచ్చే ఓ కథ! రాజ్యపు ఎత్తుగడలను పట్టిచూపే సినిమా. అన్నల పేరుతో గిరిజనుల అస్తిత్వ నినాదాలు, పోరాటాల అణిచివేతను కళ్లకు కట్టే దృశ్యం. అందుకే, నరివెట్ట అంటే వేట అనే పేరు పెట్టిన సినిమా ఇది.
అయితే, ఈ సినిమాకు స్ఫూర్తి మాత్రం 2003లో వాయనాడ్ లో జరిగిన ఆదీవాసీల ఉద్యమం. ఆదీవాసీలు తమకిచ్చిన హామీ ప్రకారం భూములివ్వాల్సిందేనని పట్టుబట్టిన ఘటన అది. కానీ, యూకలిప్టస్ చెట్ల పెంపకం, రిజర్వుడ్ ఫారెస్ట్ పేరుతో అప్పటి ప్రభుత్వం ససేమిరా అనడంతో ముత్తాంగలో జరిగిన ఘటనను కళ్లకు కట్టేందుకు Nrivettaను తెరకెక్కించారు. అప్పడు జరిగిన ఆదీవాసీల అణిచివేతలో భాగంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు.
ఇంటెన్సిటీతో ముత్తాంగ రియల్ ఇన్సిడెంట్ ను సినిమా కథ రూపంలో చెప్పాలనుకోవడం ఇంట్రెస్టింగ్, అప్రిషియేబులే అయినా.. . తెరకెక్కించిన విధానంపైనే కంప్లైంట్! ఎక్కడా ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద మైనస్!

ఆరంభంలోనే హీరోను పోలీసులు తరిమే ఓ థ్రిల్లింగ్ సీన్ తో క్రియేట్ చేసిన క్యూరియాసిటి.. మళ్లీ ఎక్కడోగానీ కానరాదు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా ఇంకా పెద్ద ఉద్యోగం కావాలనుకుంటూ జులాయిగా తిరిగే.. ప్రేమలో పడ్డ ఓ ముదురు యువకుడి లవ్ స్టొరీలోకి తీసుకెళ్ళి ఆ క్యూరియాసిటీకి అబ్రప్ట్ గా కట్ కొట్టాడు డైరెక్టర్. లవ్ స్టోరీలో లవ్లీ నెరేషన్, ఆ కేరళ అందాలు, హీరో, హీరోయిన్ల మధ్య సీన్స్ చాలాకాలం తర్వాత నేచురల్ గా అనిపించినా.. అంతకు ముందు ప్రారంభంలో పోలీసులు హీరోను తరిమే సీన్ థ్రిల్ కల్గించినా.. వేటికవే బాగుంటాయేగానీ.. థ్రిల్ లోంచి లవ్ లోకి వచ్చి చేర్చిన సాగదీత సినిమాను డల్ చేసింది.
పోలీస్ కానిస్టేబుల్ అయ్యేందుకు ససేమిరా అని.. తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకీ పట్టే హీరోకు.. ఆ తర్వాత ఎదురయ్యే అనుభవాలు, సవాళ్లే సినిమా మొత్తం రన్నింగ్ కు చోదకం.
ఎప్పుడైతే వాయనాడ్ అడవుల్లోకి సినిమా ఎంటరవుతుందో అక్కడ మళ్లీ కాస్త థ్రిల్ మొదలైనట్టే అనిపిస్తుంది. కానీ, మళ్లీ ఎమోషన్స్ కనెక్టివిటీకి వచ్చేసరికి అదే ఓ మైనస్. మిస్సైన హెడ్ కానిస్టేబుల్ బషీర్ వాకీటాకీ తీసుకోవడానికి.. ఓ యాపిల్ ను ఎరగా చూపి పసిపాపను ఒకింత క్రూరంగా నవ్వుతూ దగ్గరకు పిలిచే హీరో.. అనతికాలంలోనే తనకు అండగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ బషీర్ అదృశ్యమైనప్పుడు పడే విపరీతమైనబాధ… మళ్లీ అదే హీరో కానిస్టేబుల్ లో అదే గిరిజనంపై యుద్ధ సన్నివేశాల్లో పుట్టుకొచ్చే జాలి.. అంతకుముందు ఓ కుక్క చెక్ పోస్ట్ దాటి వెళ్లే క్రమంలో ఓ గిరిజన యువకుణ్ని చితకబాదే హీరో క్రూరత్వం.. ఇలా వీటన్నింటి మధ్య భావోద్వేగాల రూపకల్పన అంత ప్రభావవంతంగా చూపలేదనేది ఓ ఫిర్యాదు.
ప్రజా ప్రభుత్వాలు క్రూరంగా వ్యవహరిస్తున్న ఎన్నో ఘటనలు చూస్తున్నప్పుడు.. భూమి, భుక్తి కోసం పోరాడే గిరిజనులకు.. వాటినందించడానికి సముఖంగా లేని ప్రభుత్వ పెద్దలు చేసే కుట్రలను చర్చించాడు డైరెక్టర్. మామూలు సమయాల్లో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోని అడవుల సంరక్షణ అనేది.. అక్కడి భూముల్లో ఇంత జాగా కావాలని ట్రైబల్స్ పోరాటం చేసినప్పుడు మాత్రమే గుర్తొచ్చే ప్రభుత్వాల కఠినాత్మక వైఖరిని పూసగుచ్చాడు. అందులోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జత కలిస్తే.. నక్సలైట్ల ఏరివేత పేరుతో జరిగే మారణహోమానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తారు.. ఆ తర్వాత అది ప్రభుత్వాల తప్పిదం కాకుండా చూసుకునేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూపించాడు డైరెక్టర్. తమ ఉనికి కోసం, అస్తిత్వ నినాదంతో రాజ్యానికి ఎదురుతిరిగిన అమాయక ప్రజల అణిచివేతకు.. మావోయిస్టుల పేరిట ఎలా ఘాతుకాలకు ప్రభుత్వాలు ఒడిగడతాయో కూడా చర్చించాడు. అమాయకులను చంపి వారిని మావోయిస్టుల ఖాతాలో వేసి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాల తీరును ఎండగట్టారు ఈ సినిమాలో. తమ పంతం నెగ్గించుకునే క్రమంలో తమ రక్షణ దళాల్లోనే ఎవ్వర్నైనా అతి క్రూరంగా ఎలా బలి తీసుకుంటారో చూపించారు.
రచయిత అభిన్ జోసెఫ్, దర్శకుడు అనురాజ్ మనోహర్ ఎంచుకున్న ఈ థీమ్ సమకాలీన రాజకీయాలు, పరిస్థితులను కళ్లకు కట్టేది. అదే సమయంలో సినిమాను క్రమపద్ధతిలో తీసుకువెళ్లే విధానంలోనే భిన్నాభిప్రాయాలు కనిపిస్తాయి. చివర్లో న్యాయం ఇంకా బతికుందనే సందేశాన్నిచ్చే ముగింపు సిమాటిక్ గా బాగున్నా.. అలాంటి పరిస్థితులు ప్రాక్టికల్ గా ఆచరణలో కనిపిస్తున్నాయా అనేది మరో ప్రశ్న..?
ఈ సినిమాలో ముఖ్యంగా హీరో టొవినో థామస్, హెడ్ కానిస్టేబుల్ సూరజ్ వెంజరమూడు కన్నా కూడా.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేరన్ బాగా ఆకట్టుకుంటాడు. చివరగా చెప్పదల్చుకున్నదేంటంటే.. ఆదిలోనే టైటిల్స్ లో Narivetta అని స్క్రీన్ పై వచ్చినప్పుడు బుల్లెట్లు దూసుకుపోతున్న సీజీ వర్క్ ఆకట్టుకుంది.
మొత్తంగా మళయాళంలో కనిపించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కాస్త పక్కనబెడితే… SONY LIVలో స్ట్రీమింగవుతున్న Narivetta ఓసారి చూడొచ్చు.



