సంరక్షణ కేంద్రం కాస్తా మృత్యుకుహరమైంది! ఐరిష్ ఆర్ఫాన్ హోమ్ లో ఏం జరిగింది..?

సుమారు 800 మంది శిశువులు. కొందరు అప్పుడప్పుడే పెరిగి పెద్దగవుతూ ఆడుకుంటున్నవారు. మరికొందరు నవజాత శిశువులు. వారి సంరక్షణ చూసుకునేందుకు కొందరు నర్సులు.. అలాంటి ఆర్ఫాన్ హోం.. సమాజాన్ని షాక్ కు గురిచేస్తూ ఏకంగా సుమారు 800 మంది శిశు మరణాల కేంద్రంగా వెలుగులోకొచ్చింది.

బర్త్ సర్టిఫికెట్సేగానీ… డెత్ సర్ఠిఫికెట్స్ లేని ఓ భయంకరమైన స్కామ్ అది. వారెప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారో వివరాల్లేవు. ఎందుకు చంపి ఉంటారో ఇప్పటివరకూ ఇంకా నిర్ధారణ కాలేదు. అలాంటి కేసును ఇప్పుడు ఐరిష్ ప్రభుత్వం తిరగదోడింది. ఎవ్వరికీ తెలియకుండా అంతమంది పిల్లల్ని చంపేయడం… చంపేసినవారి ఆనవాళ్లు లేకుండా పాతిపెట్టడం వెనుక కారణాలేంటన్నదాన్ని వెలికితీయడం కోసం ఇప్పుడక్కడ తవ్వకాలు మొదలయ్యాయి.

ఐర్లాండ్ లోని టువామ్ చర్చ్ నిర్వహణలో ఉన్న అనాధ బాలలు, ఒంటరి మహిళల గృహంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అక్షరాలా 796 మంది శిశువులు ఎప్పుడు పుట్టారో, ఎలా చనిపోయారో, వారినెప్పుడు ఖననం చేశారో కూడా తెలియదు. అలాంటి ఒక అమానవీయ మరణ శాసనానికి సాక్షీభూతమైంది ఐర్లాండ్ టువామ్ లోని బాన్ సెకోర్స్ మదర్ అండ్ బేబీ హోమ్.

కౌంటీ గాల్వేలోని టువామ్ లో ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు తవ్వకాలు చేపట్టారు. పిల్లల చావులు, మూడో కంటికి తెలియకుండా ఓ హార్రర్ సినిమాను తలపించేలా వారిని పాతిపెట్టడం వెనుకున్న కారణాలేంటో తెలుసుకునేందుకు నడుం బిగించారు. ఈ స్టోరీ ఇప్పుడు కేవలం ఐర్లాండ్ దేశం వరకే పరిమితమైంది కాదు… అంతర్జాతీయ సమాజం దృష్టినే ఐర్లాండ్ వైపు మళ్లించింది.

ఐర్లాండ్ బాన్ సెకోర్స్ మదర్ అండ్ బేబీ హోమ్ గా ఒకప్పుడు పిలువబడ్డ ఆ టువామ్ మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో అసలేం జరిగింది..? ఆ భయంకర నేపథ్యమేంటి.. ? ఇప్పుడు అధికారుల పరిశోధనలో తేలాల్సి ఉంది!

ఎప్పుడైతే ఇక్కడ అనుమానాలు వెల్లువెత్తాయో అప్పట్నుంచీ ఈ ప్రాంతం ఓ హౌజింగ్ ఎస్టేట్ గా రూపాంతరం చెంది… అక్కడేమీ ఎరుగనట్టుగా ఓ పిల్లల ఆట స్థలంగా మారిపోయింది. ఇక్కడ జరిగిన పిల్లల మరణాలపై లెక్కలు తేల్చేందుకు ఐరిష్ ప్రభుత్వం కొలంబియా, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ వంటి అంతర్జాతీయ ఫోరెన్సిక్ నిపుణులను, నేర పరిశోధకులను, మానవ, పురావస్తు శాస్త్రవేత్తలను రంగంలోకి దింపింది. మొత్తంగా ఈ ఆర్ఫాన్స్ హోంలో 1925 నుంచి 1961 వరకూ కొనసాగిన మారణకాండకు కారణాలను వెలికితీసే యత్నాన్ని ప్రారంభించింది.

టువామ్ అనాథల హోమ్ వెనుక ఓ భయంకర చరిత్ర!

సెయింట్ మేరీస్ హోం అని కూడా పిల్చుకునే టువామ్ మదర్ అండ్ బేబీ హోమ్ లో వివాహానికి ముందే గర్భవతులై ఎవరి తోడు లేనివాళ్లను, వారి పిల్లలను, అలాగే అనాథ పిల్లలను చేరదీస్తారు. అప్పట్లోనే ఈ మదర్ అండ్ బేబీ హోమ్.. చుట్టుపక్కల సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలందుకుంది.

క్యాథలిక్ సన్యాసులైన బాన్ సెకోర్స్ నన్స్ ఈ హోం పర్యవేక్షణ బాధ్యతలు చూసేవారు. ఈ హోం పక్కనే గ్రోవ్ అనే మరో హాస్పిటల్ కూడా వీరి పర్యక్షణలోనే ఉండేది.

మొత్తంగా 36 ఏళ్లపాటు అప్రతిహతంగా నడిచిన ఈ ఆర్ఫాన్ హోంలో వేలాది మంది మహిళలు, పిల్లలు పెరిగారు. ఈ క్రమంలో నవజాత శిశువుల నుంచి 3 ఏళ్ల పిల్లల వరకూ ఏకంగా 796 మంది ఇక్కడ మరణించినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. 1925లో పాట్రిక్ డెర్రేన్ అనే పాప మొదట చనిపోగా.. చివరగా 1960లో చనిపోయింది ఐదునెలల పాప మేరీ కార్టీగా గుర్తించారు.

నమోదు చేయబడిన మరణాల సంఖ్యకు భిన్నంగా.. ఇద్దరు పిల్లలను మాత్రమే సమీపంలోని శ్మశానవాటికలో ఖననం చేయడం కలకలం రేపింది.

మిగిలిన పిల్లలను అధికారికంగా ఖననం చేసిన పత్రాలుగానీ, వారికి సంబంధించి సమాధులపైన శిలాఫలకాలుగానీ, స్మారక చిహ్నాలుగానీ ఏవీ లేకపోవడం వల్ల వారందరినీ ఎలా ఖననం చేశారు, ఎక్కడ చేశారు, అంత రహస్యంగా ఎందుకు చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరకాల్సి ఉంది.

కేథరీన్ కార్లెస్ చొరవ!

స్థానిక చారిత్రక పరిశోధకురాలైన కేథరీన్ కార్లెస్ కు ఇక్కడి టువామ్ ఆర్ఫాన్ హోంలో జరుగుతున్న తంతుపైన మొట్టమొదట అనుమానం వచ్చింది. సరిగ్గా 2014లో ఆమె పరిశోధన ప్రారంభించగానే.. కచ్చితంగా ఏదో సందేహాస్పదంగా ఉందని గ్రహించింది. పైగా ఆమె టువామ్ లోనే పుట్టి, పెరిగింది. ఆర్ఫాన్ హోంలో పిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలు, దౌర్జన్యాలు కూడా అప్పటికే ఆమె చెవిన పడ్డాయి. అలా కేథరీన్ కార్లెస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది.

మొదట ఆర్ఫాన్ హోం గురించి స్థానిక గాల్వే రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడి డెత్ రికార్డులను పరిశీలించినప్పుడు.. ఏవో కొన్ని పేర్లు మాత్రమే బయటపడుతాయనే ఒక చిన్న సందేహంతో వెళ్లిన కేథరీన్ కు.. వందలాది మంది చనిపోయినట్టుగా రికార్డ్స్ బయటపడ్డాయి. దాంతో కార్లెస్ అవాక్కైంది. ఒక పక్షం రోజుల తర్వాత కేథరీన్ కు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఓ కాల్ వచ్చింది. చనిపోయినవారి జాబితా మీకు కావాలా అని వారు అడగ్గా.. దాన్ని తీసుకుని చూస్తే 796 మంది పిల్లలు మరణించినట్టు ఆ రికార్డ్స్ వెల్లడించాయి.

అంతమంది పిల్లలు చనిపోయినట్టు రిజిస్ట్రార్ ఆఫీస్ లో నమోదయ్యాయి సరే.. మరి, గాల్వే సమీపంలోని కౌంటీ మాయోలోని శ్మశానవాటికను సందర్శించింది కేథరీన్. కానీ, అక్కడి రికార్డుల్లో మాత్రం ఆ పిల్లలను ఆ శ్మశానంలో ఖననం చేసినట్టు రికార్డుల్లేవు. దాంతో ఏదో జరిగి ఉంటుందని అప్పటికే నమ్ముతున్న కార్లెస్ అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఆ శ్మశానం ఉన్న స్థలం గురించీ కాస్త లోతుల్లోకెళ్లింది కేథరీన్. 1929 మ్యాప్ ప్రకారం ఆ నిర్ధిష్ఠ ప్రాంతమంతా ఒక మురుగునీటి ట్యాంక్ గా ఉన్నట్టుగా ఆమె దృష్టికొచ్చింది. ఆ తర్వాత అది 1970ల్లో శ్మశానవాటికగా మారిందనీ తెలుసుకుంది. అక్కడి శ్మశానవాటిక కేర్ టేకర్ ను మరింత ఆరా తీస్తే.. 1970ల కాలంలో ఇద్దరు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఓ కాంక్రీట్ స్లాబ్ కింద ఎముకలు లభించాయని అతను చెప్పడంతో కేథరీన్ తన పరిశోధనను మరింత లోతుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.

అక్కడ లభించిన ఎముకలు ఐరిష్ కు వలస వచ్చిన కరువు బాధితులకు సంబంధించినవి అయి ఉండొచ్చన్న అనుమానాలనూ కొందరు వ్యక్తం చేశారు. కానీ, అలాంటి కరువు కాలంలో మృతులకు ప్రత్యేక గుర్తులు కేటాయిస్తూ ఓ పొలంలో ఖననం చేశారనే స్పష్టత అప్పటికే కార్లెస్ లో ఉంది.

కేథరీన్ పరిశోధనలతో స్పందించిన ఐరిష్ సర్కార్!

టువామ్ లోని సమాధుల్లో 2017లో ఐరిష్ ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించింది. ఫోరెన్సిక్ పరిశోధకులు ఓ 20 గుంతలను కనుగొన్నారు. అందులో మానవ అవశేషాలు బయటపడ్డాయి. ఆ బయటపడ్డ అవశేషాలను మరింత లోతుగా పరిశీలిస్తే అవన్నీ ఆర్ఫాన్ హోం నడుస్తున్న రోజుల్లోనే జరిగినట్టు గుర్తించడంతో పాటు… నవజాత శిశువుల నుంచి 3 ఏళ్ల బాలలవేననే భయంకరం నిజం వెల్లడైంది.

ఇంకేం, ఐరిష్ ప్రభుత్వ జోక్యంతో న్యాయమూర్తి వైవోన్ మర్ఫీ నేతృత్వంలో మదర్ అండ్ బేబీ హోమ్స్ పై ఓ ఇన్వెస్టిగేషన్ కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. 2021లో న్యాయ విచారణ కమిషన్ తుది నివేదికను విడుదల చేసింది. ఐరిష్ ప్రభుత్వం అధికారికంగా అక్కడి ప్రజానీకాన్ని క్షమాపణలు కోరుతూ ప్రకటన కూడా విడుదల చేసింది.

ఆర్ఫాన్ హోంలో ఉంటున్న యువమహిళలను సెక్సువల్ గా వేధించే క్రమంలో వారు ఒప్పుకోకపోవడంతోనే మూల్యం చెల్లించుకోవాల్సిన వచ్చినట్టు.. అదే ఆ మారణహోమానికి కారణమై ఉంటుందని ఒక ప్రాథమిక అంచనాకొచ్చింది కమిషన్. ఆ తర్వాత ఐర్లాండ్ లోని మిగిలిన మాతా, శిశు గృహాలన్నింటిలోనూ విచారణ చేపట్టిన కమిషన్.. 18 ఆర్ఫాన్ హోమ్స్ లో సుమారు 9 వేల మంది పిల్లలు మరణించినట్టు నివేదికనిచ్చింది.

ఆ తర్వాత ఆ ఆర్ఫాన్ హోంను నడిపిన బాన్ సెకోర్స్ సిస్టర్స్ కూడా క్షమాపణలు చెప్పారు. తాము క్రైస్తవ మతాచారాలకు అనుగుణంగా ఆర్ఫాన్ హోంను నడపలేకపోయామని అంగీకరించారు. పిల్లలను అగౌరవంగా, సమాజ ఆమోదయోగ్యం కాని రీతిలో ఖననం చేశారనీ ఒప్పుకున్నారు. బాధిత కుటుంబాలు కొందరికి పరిహారం కూడా చెల్లించారు.

ఐరిస్ ఆర్ఫాన్ హోంలో ఇప్పుడు భారీస్థాయిలో ప్రారంభమైన తవ్వకాలు!

కార్లెస్ పరిశోధనతో టువామ్ బాలల మరణాల ఘటన ప్రపంచం దృష్టికి వచ్చిన దశాబ్దకాలం తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున మళ్లీ తవ్వకాలను ప్రారంభించింది అక్కడి ఐరిష్ ప్రభుత్వం. ఆప్ఘనిస్తాన్ వంటి చోట్ల యుద్ధాల సమయంలో అవశేషాలను వెలికితీయడంలో నిపుణుడిగా పేరుగాంచిన డేనియల్ మాక్ స్వీనీ నాయకత్వంలో ఇప్పుడు ఈ తవ్వకాలు జరుగుతున్నాయి.

పిల్లల అవశేషాలను బయటకు తీయడం ఇప్పుడు ఎన్నో సవాళ్లతో కూడిన ప్రక్రియ. అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి పెళుసుగా తయారై ఉంటాయంటాడు మాక్ స్వీనీ. అందుకే చాలా జాగ్రత్తగా వాటిని వెలికితీయాల్సిన బాధ్యత ఉందంటాడతను. మగ, ఆడ అవశేషాలను వేరు చేయడంలోనూ ఇబ్బందులున్నాయన్న డేనియల్.. కావల్సినంత ఆర్కైవల్ రికార్డ్స్ లేకపోవడం, డీఎన్ఏ కూడా గుర్తించే అవకాశాలు తక్కువ ఉన్నందున అదో ఛాలెంజింగ్ టాస్క్ అంటాడతను.

ఈ మొత్తం ప్రక్రియలో అసలు నిజాలు ఫోరెన్సిక్ రిపోర్టుల్లో తేలాలంటే కచ్చితంగా నిధులు కూడా పెద్ద మొత్తంలో అవసరమవ్వడంతో.. ఈ ఆపరేషన్ కోసం 60 కోట్ల నుంచి 130 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ఐరిష్ ప్రభుత్వం.

ఆర్ఫాన్ హోమ్ దగ్గర బయటపడ్డ భయంకరమైన నిజాలతో.. ఇప్పుడు ఆ ఆర్ఫాన్ హోమ్ నిర్వాహకుల ఆధ్వర్యంలోనే నడిచిన గ్రోవ్ ఆసుపత్రి వద్ద కూడా దర్యాప్తు చేయాలనే డిమాండ్ కూడా అక్కడి స్థానికుల నుంచి వినిపిస్తోంది.

1950ల నుంచి 70ల మధ్య పిల్లలను ఆ ప్రాంతమంతా గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టి ఉంటారనే అనుమానాలు నెలకొన్నాయి. అలాగే ఆసుపత్రి ప్రాంతంలో ఇంకేదైనా శ్మశానవాటిక ఉండేదా అనేటువంటి సందేహాలను కొట్టిపారేసిన గాల్వే కౌంటీ కౌన్సిల్.. ఆసుపత్రి భూపొరల్లో ఇంకేమైనా మానవ అవశేషాలు బయటపడతాయా అనే కోణంలో మాత్రం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది.

అంత గుప్తంగా పాతిపెట్టబడ్డ పిల్లల అవశేషాలను బయటకు తీయడం.. అసలేం జరిగింది, ఎవరు చేసి ఉంటారనే విషయాలను ప్రపంచానికి తెలియజెప్పడం ఐర్లాండ్ ముందున్న ఓ ఛాలెంజింగ్ టాస్క్.

సంరక్షణ దొరకాల్సిన చోటే మృత్యుకుహరంగా మారిన బాన్ సెకోర్ ఆర్ఫాన్ హోమ్.. ఇప్పుడు ఐర్లాండ్ దేశచరిత్రలోనే ఓ చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles