ఐదు దశాబ్దాలు మార్కెట్ ను ఏలిన వీఐపీ అది! మరి, ఇప్పుడు వాటాలెందుకు అమ్ముకుంటోంది..?

మధ్య తరగతి బతుకులతో ముడిపడ్డ కొన్ని విలాసవంతమైన, వినోదమైన వస్తువుల సేకరణ… ఒక మురిపాన్నిచ్చేది. అలాంటి మురిపాన్ని పొందిన ఒకనాటి సూట్ కేసు మీకు గుర్తుందా..? ఆ రోజుల్లో కాస్ట్లీ. కానీ అది ఉందంటే ఆ దర్జానే వేరు. అదే వీఐపీ సూట్ కేస్. సుమారు భారతీయ మార్కెట్ ను 53 ఏళ్ల పాటు ఏలింది ఆ సూట్ కేస్. కానీ, ఆ సూట్ కేస్ సృష్టికర్త ఇప్పుడు తన వాటాలను అమ్ముకోవాల్సిన దైన్యస్థితి ఎదుర్కొంటున్నాడు. మరి ఆ సూట్ కేసు వెనుకనున్న కథేంటి..? ఇప్పుడెందుకు ఆయన వాటాలను అమ్ముకోవాల్సి వస్తోంది…? అసలాయనెవరు.. ? రండి కాస్త తెలుసుకుందాం!

వీఐపీ సూట్ కేసులు, బ్యాగులతో భారత మార్కెట్ లో పేరెన్నికగన్న లగేజ్ ట్రాన్స్ పోర్టేషన్ కు తెరతీశాడు దిలీప్ పిరమిల్. సుమారు ఐదు దశాబ్దాలుగా వీఐపీ కంపెనీకి చైర్మన్ గా ఉన్న దిలీప్ పిరమిల్.. భారతదేశాన్ని ఒక ఊపు ఊపిన తన వీఐపీ కంపెనీకి సంబంధించి 51.73 శాతం షేర్లలో.. 32 శాతం వాటాలను విక్రయించడానికి సిద్ధపడ్డారు. ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల కన్సార్షియంకు విక్రయించడానికి అంగీకరించడానికి ఇప్పటికే సర్వం సిద్ధం చేశాడు. దీంతో ప్రస్తుతం 19.73 శాతానికి వీఐపీలో ఈక్విటీ పడిపోయింది. స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ లో కూడా ఈ విషయం అధికారికంగా ప్రకటించడంతో.. ఒక ఐకానికి బ్రాండ్ శకం ముగింపు దశకు చేరుకుంది.

ఎన్డీటీవీ ప్రాఫిట్ తో మాట్లాడిన పిరమిల్.. తమ వాటాలమ్ముకుని తప్పుకోవాలనుకునే నిష్క్రమణ వెనుక బలమైన కారణముందని వెల్లడించాడు. తన కుటుంబంలోగానీ, తర్వాతి తరంలోని వారసత్వంగానీ ఎవ్వరూ కూడా ఇక ముందు ఈ వ్యాపారాన్ని నడపడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదన్నారు పిరమిల్. నాయకత్వ శూన్యత ఏర్పడటంతోనే తమ వాటాలను అమ్ముకుంటున్నాట్టు వెల్లడించారాయన.

భారతదేశ లగేజ్ బ్యాగింగ్ లో తిరుగులేని రారాజుగా, మార్కెట్ లీడర్ గా వీఐపీది ఓ చరిత్ర. కానీ, ఇప్పుడా ఇండస్ట్రీ సంపద క్షీణదశకు చేరుకుంటోంది. గత ఐదు దశాబ్దాలు తిరుగులేని రారాజుగా ఉన్న వీఐపీ.. గత ఐదేళ్లుగా మాత్రం మార్కెట్ లేక పడిపోయింది. గత ఏడాది నాల్గు త్రైమాసికాల్లోనూ తీవ్ర నష్టాలను చూసింది వీఐపీ సంస్థ.

6800 కోట్ల వ్యాపార సామ్రాజ్యం వీఐపీది. కానీ, ఇప్పుడు నష్టాలను చవిచూస్తోంది. దీంతో మిథున్, సంవిభాగ్ సెక్యూరిటీస్, సిద్ధార్థ సంచేటీకి చెందిన మల్టిపుల్ ప్రైవేట్ ఈక్విటీస్.. 1763 కోట్ల ఒప్పందంతో వీఐపీలో వాటాలు దక్కించుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ లో జూలై 11న ఉన్న ముగింపు ధర కంటే కూడా 15 శాతం తక్కువకు.. కేవలం 388 రూపాయలకొక్క షేర్ చొప్పున ఈ కంపెనీ వాటాలను విక్రయించేశారు.

రెండేళ్ల క్రితమే వీఐపీని కొనుగోలు చేసేందుకు తమకు ఇంకో సువర్ణావకాశం వచ్చిందని సీఎన్బీసీ టీవీ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ దిలీప్ పిరమిల్ వెల్లడించారు. అప్పుడు ఒక్కో షేర్ ధర 700 పలికిందని.. మార్కెట్ క్యాపిటల్ ధర 10 వేల కోట్లు పలికిందని.. కానీ ఆఫర్ ను తాము ఉపయోగించుకోలేకపోయామని ఆయన ఒకింత బాధపడ్డారు. ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంలోపు మరో 50 శాతం తమ షేర్ ధర పెరుగుతుందని భావించామని.. కానీ, దురదృష్టవశాత్తూ అలా జరక్కపోగా.. పడిపోయిందన్నారు పిరమిల్.

వాటాదారుల ఇంట్రెస్టే తమ ప్రథమ ప్రధాన్యత అని చెప్పారు దిలీప్ పిరమిల్. ఈ పరిస్థితుల్లో కొత్త మేనేజ్ మెంట్ ను తీసుకురావడమొక్కటే సరైన ఆచరణీయ మార్గమంటారాయన. అందుకే ప్రైవేట్ ఈక్విటీ షేర్ హాల్డర్స్ ను ఎంచుకున్నామని.. వారైతేనే 2 నుంచి 3 ఏళ్ల లక్ష్యంతో పెట్టుబడిని రెండు లేదా మూడింతలు చేయగలరన్న నమ్మకముందంటారు పిరమిల్.

అయితే, వీఐపీ వాటాలమ్ముకునే పరిస్థితి రావడం దురదృష్టకరమే అయినప్పటికీ.. భవిష్యత్తులో మేనేజ్మెంట్ బోర్డులో మాత్రం తమ కుటుంబం స్థానమైతే నిలుపుకోగలదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పిరమిల్. అందుకే, తాను 32 శాతం కంటే ఎక్కువ వాటాను విక్రయించాలనుకోవడం లేదని.. ముఖ్యంగా తనకు డబ్బు కన్నా.. తన షేర్ విలువ పెరగడమే ముఖ్యమంటారు. ప్రస్తుతం వీఐపీ కంపెనీ మేనేజ్మెంట్ సమస్యలతో సతమతమవుతోంది. అయితే, వీఐపీ ఫండమెంటల్స్ ఎప్పుడూ బలంగానే ఉంటాయని.. త్వరలో తిరిగి మళ్లీ పునరుత్తేజితమవుతుందంటున్నాడు పిరమిల్. అందుకే వచ్చే పెట్టుబడిదారులను కూడా కాస్త ఓపికతో ఉండాలని.. మేనేజ్మెంట్ మార్పు కూడా అంత సులభం కాదని చెబుతున్నాడు.

భారతదేశ లగేజ్ పరిశ్రమలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వీఐపీకి అవకాశాల్లేకపోలేదు. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా వీఐపీ తన సత్తా చాటుతుందని ఆశనైతే తనకుందంటాడు పిరమిల్. అంతేకాదు బహుళజాతి కంపెనీగా కూడా ఎదిగే అవకాశాలూ వీఐపీ వంటి సంస్థకుందనే నమ్మకాన్నీ మరోవైపు దిలీప్ పిరమిల్ కనబరుస్తున్నాడు. మొత్తంగా ఒక ఐదు దశాబ్దాల పాటు ఇండియాలో ఒక ఉత్థానాన్ని చూసిన వీఐపీ ఇప్పుడు అదే స్థాయిలో పతనాన్నీ చూస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles