మిస్కిన్.. స్క్రీన్ ప్లేలో ఆయనో మెజీషియన్!

అశోక్ వేములపల్లి… ✍️

………………………………………………………………………………..

“యుద్ధం సెయ్”

తమిళ దర్శకుడు మిస్కిన్ సినిమా ఇది. కొన్ని తను మాత్రమే తీయగలడు అనిపించేవాళ్లలో మిస్కిన్ ఒకడు. ఆఖరికి వీధి లైట్ కిందే సినిమా షాట్ తీసేస్తాడు. చీకట్లోంచే కెమెరాను రన్ చేస్తాడు. మిస్కిన్ కి ఒక కేటగిరీ ఫ్యాన్స్ ఉంటారు. క్రైం, సైకిక్ స్టోరీ లైన్ తో మిస్కిన్ తీసే సినిమాలు చూడటానికి హాలీవుడ్ లో క్రిస్టఫర్ నోలన్ సినిమా చూడటానికి ఉండాల్సినంత ఓపిక , బుర్రా రెండూ ఉండాల్సిందే!

2011లో వచ్చిందీ సినిమా. చేరన్ హీరో. సినిమా చివర్లో ఒక 16 ఏళ్ల కుర్రాడికి సీఐడీ ఆఫీసర్ చేరన్ MANs SEARCH FOR MEANING అనే పుస్తకం ఇచ్చి చదువుకోమంటాడు. విక్టర్ ఫ్రాంకిల్ రాసిన పుస్తకం అది. చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రుల్ని కళ్లముందే హత్యచేయడం చూసిన ఆ కుర్రాడు.. సొంత అక్కను వారం రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేయడంలాంటివి ఎన్నో చూడకూడని దారుణాలు చూసి మానసికంగా కృంగిపోయిన అతణ్ని మళ్లీ జీవితం మీద ఆశ కల్పించడానికి చేరన్ ఆ పుస్తకం ఇస్తాడు.

సినిమా ముగిశాక కూడా పుస్తకాన్ని కుర్రాడికి ఇప్పించడం అనేది మంచి కాన్సెప్ట్. ఒక సీన్లో బులెట్ గాయంతో చనిపోయేముందు.. డాక్టర్ గా యాక్ట్ చేసిన జయప్రకాశ్ ఇలా అంటాడు.. జేకే, LIFE IS NOT A HEAVEN.. ITS A HELL. హాస్పిటల్ కు మిమ్మల్ని తీసుకెళ్తానంటే .. నేను కూడా డాక్టర్ నే నయ్యా .. నా ప్రాణం ఎంత సేపట్లో పోతుందో నాకు తెలీదా అని మందు బాటిల్ ఓపెన్ చేయించి తాగి చనిపోయే సీన్ సినిమాకే హైలెట్. ఈ సీన్ వరకూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు స్టోరీ ఎక్కడా రివీల్ కాదు. కానీ అప్పటికే రెండు గంటల సినిమా ముగుస్తుంది. చివరి అరగంటలోనే సినిమా అంతా అర్దమవుతుంది. అప్పటివరకూ జరిగిన సీన్లన్నీ మన మైండ్లో తిరుగుతుంటాయి.

మిస్కిన్ స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ ఉంటుంది. బహుశా మిగిలిన డైరెక్టర్ల టేకింగ్ కు, మిస్కిన్ కు మధ్య చాలా తేడా ఉంటుంది. అతడి సినిమాలు డెటెక్టివ్, పిశాచి, సైకో, మాస్క్ ఇలా ఏది చూసినా ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని సబ్జెక్టులే ఉంటాయి. ఇప్పటివరకూ మిస్కిన్ పదేళ్లలో పది సినిమాలు తీస్తే అందులో రెండు బ్లాక్ బస్టర్స్. మిగిలిన ఎనిమిది హిట్స్.

యుద్దం సెయ్ సినిమాలో అటు క్రైం, ఇటు సెంటిమెంట్, థ్రిల్లర్, సైకిక్ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ను టచ్ చేస్తాడు. మొదట సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రొజుకో తల, కాళ్లు, చేతులూ ఇలా నరికి బాక్సుల్లో ప్యాక్ చేసి ఒక చోట పెడుతుంటారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సీఐడీ ఆఫీసర్ గా చేరన్ రంగంలోకి దిగుతాడు. ఆ తలలు, కాళ్లు చేతులూ ఎవరివో సినిమా చూస్తున్నవారికి ఇంటర్వెల్ వరకూ ఏమీ అర్దం కావు.

మిస్కిన్ సినిమాల్లో కొన్ని సీన్లు విచిత్రంగా ఉంటాయి. ఒక సీన్లో పోలీస్ స్టేషన్ ఎదుట పుచ్చకాయల బండి ఉంటుంది. వ్యాపారి రాత్రి వెళ్లిపోయేముందు కాయల పై కవర్ కప్పి వెళ్లిపోతాడు. స్టేషన్ లో కానిస్టేబుల్ డ్యూటీ దిగి వెళ్తూ కవర్ ఒపేన్ చేసి ఒక పుచ్చకాయ దొంగతనం చేసి సైకిల్ పై పెట్టుకుని వెళ్లిపోతాడు. తెల్లవారుతుంది. యథావిధిగా పుచ్చకాయల వ్యాపారి ఊదయాన్నే సైకిల్ పై తన షాప్ దగ్గరకు వచ్చి సైకిల్ కి తగిలించి ఉన్న రేడియో ఆన్ చేసి, ఒక పాట పెట్టి వింటూ, పుచ్చకాయల పైన కప్పిన పరదా విప్పుతాడు. పుచ్చకాయల మధ్యలో ఒక వ్యక్తి తలకాయ ఉంటుందియ అతను గట్టిగా అరుస్తూ పోలీస్ స్టేషన్ లోపలికి పరిగెత్తి పోలీసులకు చెబుతాడు. అపుడు పోలీసులు వచ్చి ఆ తలకాయను మార్చురీకి తరలిస్తారు. విచిత్రమేమంటే రాత్రి కానిస్టేబుల్ కాయ దొంగతనం చేసిన స్థానంలోనే ఈ తలకాయ ఉంటుంది. ఈ సీన్ మొత్తం డైరెక్టర్ అలా కెమెరాను పుచ్చకాయల షాప్ వెనుక పెట్టి వైడ్ యాంగిల్ లో వదిలేస్తాడు. ఎక్కడా ఫ్రేం కదలదు. రాత్రి కానిస్టేబుల్ దొంగతనం నుంచి ఉదయం తలకాయ కనిపించేవరకూ ఫిక్సిడ్ షాట్ ఉంటుంది. అలాగే డైరెక్టర్ ఆ తలను మనకు చూపించడు. కేవలం వెనుకవైపు ఉంగరాల జుట్టును మాత్రం చూపిస్తాడు. సినిమా ఫాలో అవుతున్నవారికి మాత్రం ఆ రింగుల జుట్టు ఎవరిదో అర్థమవుతుంది.

మరో షాట్లో ఇద్దరు అమ్మాయిలు టెన్నిస్ ఆడుతుంటారు. అలా ఆడుతున్న అమ్మాయిల కాళ్లను చూస్తూ పైన ఇద్దరు రిటైర్డ్ అయిన ముసలాళ్లను మనకి చూపిస్తాడు. తమకు మనవరాళ్ళ వయసున్న అమ్మాయిలను తాతయ్యలు అంత కామంగా చూస్తున్నారా అనే భావన కల్పిస్తాడు డైరెక్టర్. అయితే ఆ టెన్నిస్ ఆడుతున్న వారిలో ఒకమ్మాయి మెల్లగా నడుచుకుంటూ టెన్నిస్ కోర్ట్ లో మూలన ఉన్న అట్టపెట్టె తెరిస్తే.. అందులో మరెవరిదో తలకాయ ఉంటుంది. ఇక్కడ టెన్నిస్ ఆడుతున్న అమ్మాయిలను అంతసేపు చూపించింది ఆ తలకాయ చూపించడానికే. అయితే పైన ఈ అమ్మాయిలని కామంగా చూసిన ఆ ఇద్దరు ముసలాళ్ల కథను దర్శకుడు చివర్లో రివీల్ చేస్తాడు. వాళ్లను చివర్లో చూసినపుడు ఇంతకుముందు వారిద్దరినీ ఎక్కడో చూశామే అని బుర్ర పెట్టి మనం వెదుక్కోవాల్సి వస్తుంది.

ఒక యువతిని గ్యాంగ్ రేప్ చేస్తుంటే ఎదురుగా ముసలివాళ్ల బ్యాచ్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. బహుశా ఈ తరహా పైశాచికత్వం ఇంకే సినిమాలో ఉండదు. అయితే ఆ ముసలాళ్లు ఆ అమ్మాయిని అలా గ్యాంగ్రేప్ చేయడానికి వేరే కారణం ఉంటుంది. ఇక్కడ ప్రస్తావిస్తే ఇంట్రస్ట్ పోతుంది.

సినిమా మొత్తం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇంతమందిని చంపిన ఆ హంతకులెవరనేది చివర్లో చూసి ఆశ్చర్యపోతాం. సినిమాలో ఒక్క నవ్వు ముఖం కూడా కనిపించదు. అంతా డార్క్ అండ్ సీరియస్ గా సాగిపోతుంది. తన స్క్రీన్ ప్లేతో సినిమా ముగిసేవరకూ మెడ తిప్పుకోనీయకుండా మ్యాజిక్ చేస్తాడు మిస్కిన్. యూట్యూబ్ లో తమిళ్ లో, హిందీలో మాత్రమే ఈ సినిమా ఆందుబాటులో ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles