ఒక ప్లేయర్ ప్రతిభను మరో ప్లేయర్ మాత్రమే పూర్తి స్థాయిలో అంచనా వేయగలడంటారు. అందుకేనేమో ట్రిస్టన్ స్టబ్స్ కు రాహూల్ అంటే వల్లమాలిన అభిమానం. ఆన్ ఫీల్డే కాదు… ఆఫ్ ఫీల్డ్ లోనూ మోస్ట్ స్టైలిష్ గా కనిపించే కే. ఎల్. రాహూల్ పుట్టినరోజు ఈ ఏప్రిల్ 18. కాబట్టి ఆ వెర్సటైల్ ప్లేయర్.. స్టైలిష్ మ్యాన్… టెస్ట్, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లకూ సరిపోయే క్రికెటర్.. ముఖ్యంగా గురువు రాహూల్ ద్రవిడ్ శిష్యుడైన ఆ రాహూల్ గురించి ఈరోజు కాస్త చెప్పుకుందాం. మనం చెప్పుకునేకంటే తనను ఆరాధించే ఆటగాడి మాటల్లో వింటే ఇంకా బావుంటుదేమో! ఆ విషయాల్ని మరో సూపర్ ప్లేయర్ తండ్రి ఓ మీడియాతో పంచుకున్నాడు. ఆ విశేషాల సమాహారంతో అసలు కే.ఎల్. రాహూల్ ఎందుకు ప్రత్యేకమో చెప్పుకుందాం.

ఏప్రిల్ 15, మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ కింద ఉన్న స్టాండ్స్ లో క్రిస్టోఫర్ స్టబ్స్ ఒంటరిగా కూర్చుని ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ సెషన్స్ పరిశీలిస్తున్నాడు. తన కొడుకు ట్రిస్టన్ స్టబ్స్ ఆ స్టేడియం చుట్టూ ఫీల్డర్లంతా పరుగులు పెట్టేలా ఆడుతుంటే చూసి చప్పట్లు కొడుతున్నాడు. అది ఏప్రిల్ 16, బుధవారం రోజు రాజస్థాన్ రాయల్స్ తో జరుగబోయే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచుకు ముందు చూసిన ఓ ట్రైలర్.
కట్ చేస్తే, తెల్లవారే ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 188 కొడితే.. రాజస్థాన్ కూడా ఆ స్కోరును సమం చేసింది. దాంతో సూపర్ ఓవర్ పోటీ తప్పలేదు. సూపర్ ఓవర్ పోటీకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాట్ చేసి కేవలం 11 పరుగులకు 2 వికెట్లు కోల్పోతే… ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నుంచి కే.ఎల్. రాహూల్, ట్రిస్టన్ గిబ్స్ బరిలోకి దిగారు. ఛేదనలో మొదటి బాల్ కు రెండు పరుగులు చేసిన కే. ఎల్. రాహూల్.. ఆ తర్వాత బంతిని బౌండరీకి పంపి ఫోర్ సాధించాడు. నెక్స్ట్ బాల్ వన్ రన్ వచ్చింది. అప్పటికే 6 రన్స్ వచ్చాయి. ఇంకా మూడు బంతులు మిగిలున్నాయి. ఆరు పరుగుల అవసరముంది. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులో ఉన్నాడు. నాల్గో బాల్ స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్ ముగించాడు. సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇది అంతకుముందు రోజు కొడుకు ట్రిస్టన్ స్టబ్స్ మ్యాచును నెట్స్ లో ఎంజాయ్ చేసిన తండ్రి చూసిన ట్రైలర్ కు కొనసాగింపై.. 24 గంటల తర్వాత ఆవిష్కృతమైన రియల్ మ్యాజికల్ షో.
అయితే, అదే రోజు తన ఫేవరేట్ ఆటగాడు కే.ఎల్. రాహూల్ తో కలిసి సూపర్ ఓవర్ లో పంచుకున్న విజయంతో ఓవైపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా… దుఖంలోనూ రాహూల్ తన వెంట నిల్చిన తీరు ట్రిస్టన్ స్టబ్స్ ను వెంటాడింది. అప్పటివరకూ గొప్ప ఆటగాడిగానే చూసిన రాహూల్ లో ఓ అద్భుతమైన వ్యక్తిత్వాన్నీ చూపించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ పెట్టిన 188 ఛేజ్ చేసే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కాస్తో కూస్తో తడబడుతున్నప్పుడు నితీష్ రాణా ఎంటరయ్యాడు. లాంగ్ ఆన్ లో గాల్లోకి లేపాడు. దాన్ని పట్టాల్సిన ట్రిస్టన్ స్టబ్స్ క్యాచ్ వదిలేశాడు. అప్పటికే 16 బాల్స్ ఆడి 20 రన్స్ కొట్టిన రాణా క్యాచ్ మిస్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత రాణా ఏకంగా 12 బంతుల్లో మరో 31 పరుగులు చేసి మొత్తం 51 బాదాడు. అది కాస్తా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్సర్ పటేల్ కు కోపం తెప్పించింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కాస్త కుంగుబాటుకు గురైన స్టబ్స్ ను కూల్ డౌన్ అంటూ కూల్ చేసిందీ రాహూలే మళ్లీ.
అంతేకాదు.. రెండు జట్లు చెరి సమం చేశాక.. సూపర్ ఓవర్ కు వెళ్లే క్రమంలోనూ తన ఫేవరేట్ బ్యాట్స్ మన్ రాహూల్ తో కలిసి వెళ్లడాన్ని ఓవైపు ఎంజాయ్ చేస్తూనే, ప్రైడ్ గా ఫీలవుతూనే.. మరోవైపు, ఒత్తడినెదుర్కొన్నాడు ట్రిస్టన్ స్టబ్స్. ఆ సమయంలో ధైర్యంగా ఆడు అంటూ రాహూల్ చెప్పిన మాటలు తనకు బూస్టప్ ఇచ్చాయంటాడు స్టబ్స్.
అలా ఇద్దరూ కలిసి రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించడంలోనే కాకుండా.. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పైనా 111 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. ఇప్పుడు ఐపీఎల్ పరుగుపందెంలో 6 మ్యాచులాడితే.. ఐదింటిలో గెల్చి ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలో పది పాయింట్లతో నంబర్ వన్ పోజిషన్ లో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే టైటిల్ వేటలో ఉన్నట్టే కనిపిస్తోంది. అందుకు కారణం కే.ఎల్. రాహూల్ బ్యాటింగ్ తో పాటు… అతడి ఇన్స్పిరేషన్ మిగిలినవారినీ నడిపిస్తోంది.
అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్న మాటను మూటగట్టుకున్న ఆటగాడు కూడా కే.ఎల్. రాహూలే. కానీ, రాహూల్ ఆటపైన చాలామంది నమ్మకం పెట్టారు. ఎందుకంటే, ప్రస్తుత భారత టీంలో ఉన్న సీనియర్స్ లో టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లకూ ఆడగల నేర్పరి రాహూల్.
సిడ్నీ టెస్టులో రాహూల్ చేసిన సెంచరీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎంత ఓపికగా వెయిట్ చేస్తాడో చెప్పేది. అతడి ప్రతిభపై తన గురువు రాహూల్ ద్రవిడ్ కు ఎంత నమ్మకమో.. జస్టిన్ లాంగర్, హర్షాభోగ్లే, రవిశాస్త్రి వంటివారికీ అంతే విశ్వాసం.
2018లో ఇంగ్లాండ్ టూర్ లో పంత్ తో కలిసి రాహూల్ చేసిన సెంచరీ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆఫ్ స్టంప్ బాల్స్ ను బాదడంలో రాహూల్ తర్వాతే ఇంకెవరైనా అనిపిస్తాడు. ఓపెనర్ నుంచి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా, సామర్థ్యం రాహూల్ సొంతం. ఫీల్డింగ్ లోనైనా.. అవసరమైనప్పుడు కీపర్ గానైనా రాహూల్ తన శక్తివంచన లేకుండా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తాడు.
మొత్తంగా భారత క్రికెట్ లో అనవసరమైన వివాదాలకు తావు లేకుండా ఒక ప్రతిభావంతమైన.. అంతకుమించి అరుదైన క్రికెటర్ రాహూల్.
రాహూల్ కు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలతో!



