భారతదేశంలో పద్మ పురస్కారాలందించడమంటేనే వారిని గొప్పగా గుర్తించడం.. ఇక భారతరత్న దక్కితే ఆ గుర్తింపే వేరు. ఎవరైనా వారెంచుకున్న రంగంలో దేశం గర్వించదగ్గ రీతిలో పేరు, ప్రఖ్యాతులు సంపాదించినప్పుడు వేళ్ల మీద లెక్కించేలా ఏ కొందరికో మాత్రమే దక్కే ఓ అత్యున్నతమైన గుర్తింపది. సరే, ఆ పురస్కారాల ఎంపిక, ఎంపిక చేసే జ్యూరీల ఎన్నిక వంటివాటిపై కూడా భిన్నాభిప్రాయాలుండొచ్చు. అలాగే, ఫలానావారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్.. ఫలానావారికిచ్చి, దక్కాల్సినవారికి దక్కలేదన్న అసంతృప్తీ సమాజంలో కనిపిస్తూనే ఉండొచ్చు. అలాగే, అవార్డుల జారీపైనా భిన్నాభిప్రాయలూ ఉండొచ్చు. ఉండాలి కూడా. ఏదేమైనా, భారతరత్న దక్కడమంటే మాతృభూమిలో ఓ అఛీవ్ మెంట్ సాధించినట్టే లెక్క. మరి ఆ అవార్డ్ సరే… ఆ అవార్డందుకుంటే అందే ప్రయోజనాలేముంటాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా…?

భారతరత్నలో పారితోషికమేమీ ఉండదుగానీ.. భారతరత్న అందుకున్నవారికి ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలు మాత్రం చాలా చాలా ఉంటాయి.
దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లినా రాష్ట్రపతికి దక్కే అతిథి హోదా భారతరత్న పురస్కారం అందుకున్నవారికి దక్కుతుంది.
ఈ హోదా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటివారికి మాత్రమే దక్కుతుంది. వారితో సరిసమానంగా భారతరత్న పురస్కారమందుకున్నవాళ్లు ఆ హోదాకు అర్హులవుతారు.
ఏ విమానాశ్రయానికి వెళ్లినా, రైల్వేస్టేషన్ కు వెళ్లినా అధికారిక స్వాగతం పలుకుతారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైతే వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రవాణా, బోర్డింగ్, లాడ్జింగ్ వంటి ఏర్పాట్లన్నీ చూస్తుంది. అంతేకాదు, ఎక్కడికెళ్లినా ప్రోటోకాల్ ప్రకారం భద్రతా ఏర్పాట్లుంటాయి. అది కేవలం పురస్కారం అందుకున్నవారికి మాత్రమే పరిమితం కాకుండా.. భద్రతాపరంగా వారి సోషల్ స్టేటస్ ను బట్టి వారి కుటుంబంలో భార్య, పిల్లలు, ఇతర వ్యక్తిగత సిబ్బంది వరకూ ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ రవాణా ఖర్చులను భరిస్తాయి.
ఇక విదేశీ ప్రయాణాల కోసం వీరికి ప్రత్యేక పాస్ పోర్ట్ సౌకర్యముంటుంది. ఉన్నతస్థాయి అధికారులు, దౌత్యవేత్తలకు అందించే మెరూన్ కవర్డ్ పాస్ పోర్ట్ ను భారతరత్న పురస్కార గ్రహీతలకు జారీచేస్తారు.
దీనివల్ల విమానాశ్రయాల్లో శరవేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇలాంటివారి కోసం ప్రత్యేకమైన ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్ ఏర్పాటు ఉంటుంది. విమానాశ్రయాల్లో వెయిటింగ్ టైంలో వీరికి స్పెషల్ వీఐపీ లాంజెస్ ను ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయ పర్యటనల నేపథ్యంలో లాజిస్టిక్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు.. వీరి ప్రోటోకాల్ సేవలు చూసేందుకు విదేశాల్లో ఉండే భారతీయ అధికారికవర్గాల నుంచీ కావల్సిన మద్దతు లభిస్తుంది.
భారతరత్న అందుకున్న వ్యక్తులెవరైనా భారతదేశంలోనే కాదు… ఆ అత్యున్నత పురస్కారం అందుకున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపును అందుకుంటారు. భారతరత్నలకు పన్ను మినహాయింపు మరో ప్లస్ పాయింట్. వారందుకున్న ఏ పురస్కారాలకైనా నగదు బహుమతి పెద్దమొత్తంలో ఉన్నప్పుడు వాటికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 2014లో సచిన్ టెండుల్కర్ కు అలాంటి పన్ను మినహాయింపు లభించింది. కాబట్టి నేరుగా భారతరత్న వంటి పురస్కారంతో ఆర్థిక సాయమందకపోవచ్చునేమోగానీ… పరోక్షంగా మాత్రం ఆదాయపు పన్ను మినహాయింపు నుంచి ట్యాక్స్ కు గురయ్యే ఏ విషయంలోనైనా పన్ను మినహాయింపుంటుంది.
ఇక భారతరత్న పురస్కారమందుకున్నవారికి జీవితకాల ప్రయాణమంతా ఉచితమే. ఎయర్ ఇండియా దేశీయ విమానాల్లో ఫ్రీగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించవచ్చు. రైల్వేల్లో ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని కల్పిస్తారు. ఇక విదేశాలకు పయనమైతే ఛార్జీల్లో రాయితీలుంటాయి. అలాగే, వారికి లభించే గుర్తింపు ఆ అవార్డ్ గ్రహీతల ప్రాధాన్యతను తెలియజెప్పేలా ఉంటుంది.

ప్రోటోకాల్ లోనూ భారతరత్న గ్రహీతలకు అధిక ప్రాధాన్యత దక్కుతుంది. ప్రాధాన్యతా పట్టికలో వీరిని 7 ఏ స్థానంగా గుర్తించారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహించే ప్రోటోకాల్ జాబితా ప్రకారం వీరికి క్యాబినెట్ మంత్రుల కంటే కొంచెం తక్కువ స్థాయిలో.. అదే విధంగా, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు, ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రం దాటినప్పుడు వర్తించే స్థాయిలో వీరికీ ప్రోటోకాల్ హోదా లభిస్తుంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యేకమైన గుర్తింపు, జాతీయస్థాయి ప్రముఖులుగా లభించే గౌరవం ఇవన్నీ భారతరత్న పురస్కారం దక్కినవారికి మాత్రమే లభించే అత్యున్నత సౌకర్యాలు.
గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం, రాష్ట్రపతి భవన్ లో జరిగే ముఖ్యమైన ఈవెంట్స్ కు పిలుపు, ఇతర జాతీయ కార్యక్రమాల్లో కూడా వీరికి పెద్దపీట వేస్తారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారితో సరిసమానంగా వీరికి గౌరవాన్నందిస్తూ ఆహ్వానించడంతో ప్రజా ప్రాధాన్యత విషయాల్లోనూ వారి సేవలను ఉపయోగించుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో వారికుండే భద్రతాభయం దృష్ట్యా Z కేటగిరీ భద్రతను కూడా అందిస్తుంది భారత ప్రభుత్వం. వారు ఒకవేళ కోరితేగనుక కచ్చితంగా ప్రభుత్వం వారి సోషల్ స్టేటస్ ను పరిశీలించి ఆ ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు ప్రముఖ నాయకుడైన ఎల్. కే. అద్వానీ వంటివారు ఇలాంటి ఏర్పాట్లను పొందారు.
ఇక భారతరత్నతో ప్రోటోకాల్ ప్రకారం దక్కే గుర్తింపులు కాస్సేపు పక్కనబెడితే.. సామాజికంగా పరువు- ప్రతిష్ఠ అమాంతం పెరిగిపోతాయి. వారు రోల్ మాడల్స్ గా మారిపోతారు. దాన్ని ప్రభుత్వమే గుర్తించి పురస్కారమందడంతో వారి సామాజిక స్థాయి కచ్చితంగా అప్పటివరకూ వారు అనుభవించిన జీవితాన్ని మించి ఉంటుంది.
ఒక ఎమ్.ఎస్. స్వామినాథన్, ఒక సచిన్ టెండుల్కర్, మరో లతా మంగేష్కర్ ఇలా భారతరత్న పురస్కార గ్రహీతలంతా వారి వారి రంగాల్లో ఒక ఉచ్ఛస్థాయిని అందుకున్నవారే. దానికి భారతరత్న వారికో జీవిత సాఫల్యంగా మారుతుంది.
మన భారతదేశం ఇచ్చే అత్యున్నత పురస్కారమైన భారతరత్న విషయంలో పౌరసత్వ నిబంధనలేమీ లేకపోవడమూ చెప్పుకోవాల్సిందే. 1987లో సరిహద్దు గాంధీగా ఖ్యాతిగాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అయినా, 1990లో భారతరత్న అందుకున్న నెల్సన్ మండేలా అయినా, 1980లోనే భారతరత్నగా గుర్తించబడ్డ మదర్ థెరీస్సా అయినా భారతీయేతరులే కావడం గమనార్హం. ఈ అవార్డ్ ఎంపికలో కేవలం జాతీయ భావనలే కాదు… సార్వత్రిక దృక్కోణం ఉంటుందనేది వారి ఎంపిక చెప్పే విషయం.
మరణానంతరం కూడా ఈ అవార్డును అందిస్తూనే ఉన్నారు. అలాంటివారిలో లాల్ బహదూర్ శాస్త్రిని చెప్పుకోవచ్చు. ఇక వైవిధ్యమైన రంగాల వారినీ గుర్తిస్తూ ఈ పురస్కారానికి వన్నె తెస్తున్నారు. సి. రాజగోపాలాచారి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్, సచిన్, లత, ఎం.ఎస్ స్వామినాథన్, ఎల్. కే. అద్వానీ ఇలా సైన్స్ నుంచి క్రీడల వరకూ.. తత్వం నుంచి శాస్త్రీయ విజ్ఞానం వరకూ వివిధ రంగాలవారి ఎంపికతో భారతరత్న అనే పురస్కారం.. అవార్డుల్లో ఎందుకు అత్యున్నతమో ఇప్పటివరకూ నిరూపణైంది.



