రుణం తీసుకుని ఆరంభించిన స్టార్టప్ నుంచి… బిలియన్ డాలర్ల సామ్రాజ్య నిర్మాణం. ఇదీ తురాఖియా బ్రదర్స్ సాధించిన ఘనత. ఈ ముంబై సోదరులిప్పుడు యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ కు రోల్ మాడల్స్.
భవిన్ తురాఖియా, దివ్యాంక్ తురాఖియా.. ఈ ఇద్దరూ అన్నదమ్ములు. ముంబై వీరి స్వస్థలం.
ఇద్దరూ సొంత కాళ్లపై నిలబడి ఎదగాలనుకున్నారు. ఇంకెక్కడో ఎందుకని.. తండ్రినే అప్పడిగారు. 25 వేల మొత్తం కొడుకుకు ఇవ్వడం ఏ తండ్రి కూడా అప్పుగా భావించకపోయినా… పైసా విలువ తెలవాలనే ఉద్ధేశంతో తండ్రి కూడా అప్పుగానే ఇచ్చి ఇంటి నుంచి పంపాడు ఈ ఇద్దరు అన్నదమ్ముల్ని. అలా 25 వేల రూపాయలతో వీరి స్టార్టప్ ప్రారంభమైంది. సరిగ్గా ఈ సోదరులు చిత్తశుద్ధితో చేసిన పని.. 15 ఏళ్లు తిరిగేసరికి, గ్లోబల్ టెక్ సామ్రాజ్యాన్నే తయారుచేసింది.

11 కంపెనీలు పెట్టిన అన్నదమ్ములిద్దరూ వాటిలో కొన్నింటిని భారీ మొత్తాలకు అమ్మేశారు. ఇంజనీరింగ్ డిగ్రీల్లేకపోయినా ఈ అన్నదమ్ములిద్దరూ ఇండియన్ ఇంటర్నెట్ ఫీల్డ్ లో ముందంజలో నిల్చిన వ్యాపారవేత్తలుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. వీరి నేతృత్వంలోని డైరెక్టి, బిగ్ రాక్, మీడియా. నెట్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లక్షలాది కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
తురాఖియా సోదరుల బిలియన్ డాలర్ల సంపాదన వెనుక కారణాలేంటి..?
ఈ అన్నదమ్ములిద్దరిదీ ఓ మధ్య తరగతి కుటుంబం. ముంబైలో పెరిగిన దివ్యాంక్, భవిన్ ఇద్దరూ కూడా కోడింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. దాన్ని ఔపోశన పడుతూ ఎప్పటికప్పుడూ తమను తాము అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగారు. స్టార్టప్ ల ఏర్పాటులో ధైర్యంగా అడుగులు వేశారు. భారీ డీల్స్ కోసం యత్నించారు. అందులో సక్సెస్ అయ్యారు.
నవతరానికి ప్రతీకలు ఈ అన్నదమ్ములు!
నూతన పారిశ్రామిక రంగం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి రంగాలతో పాటు.. ఇతర రంగాల్లోని ఎందరికో ఇప్పుడూ సోదరుల వ్యాపార ప్రయాణం ఓ ఇన్స్పిరేషన్. తమ కాళ్లపై తాము నిలబడటం, విశ్వమానవులుగా గుర్తింపు సాధించడం, టెక్నాలజీ ఆధారిత వ్యాపార నమూనాలు ఇవన్నీ నేటి తరం ఇలాంటివారిని చూసి అందిపుచ్చుకోవాల్సిన విశేషాలు. ఇప్పటికే ఎందరో భారతీయ మూలాలున్న ప్రపంచస్థాయి వ్యాపారవేత్తల మాదిరిగానే.. ఈ తురాఖియా సోదరులు కూడా అంతర్జాతీయ అవకాశాలను పూర్తిగా సద్వినియోగపర్చుకున్న సమర్థులు. పరిమిత వనరులతో ఆరంభించి ప్రపంచస్థాయికెదిగిన భారతీయుల విజయానికి ఈ సోదరుల వ్యాపార ప్రయాణం ఓ నమూనా.

గ్లోబల్ డీల్స్ ఎలా కుదుర్చుకోగల్గారు..?
1998లో తండ్ర ఇచ్చిన 25 వేల రూపాయలతో డైరెక్టి అనే సంస్థను ఆరంభించారు. మొదట డొమైన్, ఇంటర్నెట్ సేవలతో ప్రారంభమైన వీరి వ్యాపారం.. ఆ తర్వాత వడివడిగా విస్తరించింది. 11 స్టార్టప్ లుగా ఎదిగింది. వాటిలో నాల్గు కంపెనీలను ఎండ్యూరెన్స్ ఇంటర్నేషనల్ గ్రూపుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు అమ్మేశారు. ఆ తర్వాత మీడియా. నెట్ ను మరో చైనీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు 90 మిలియన్ డాలర్లకు విక్రయించారు. వీరు స్థాపించిన సంస్థలన్నీ ఏటా 120 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్నాయి. అధిక రిస్క్ తీసుకున్నప్పుడు.. అంతే లాభాలాను కూడా ఆర్జించవచ్చనే ఒక సందేశాన్నిస్తున్న మాడల్ వీరి వ్యాపార వ్యూహం.
సాంకేతికతపైన ఆసక్తే విజయాలను తెచ్చిపెట్టింది!
భవిన్, దివ్యాంక్ విజయాలకు కారణం చిన్నప్పట్నుంచీ సాంకేతికపై ఉన్న మక్కువే. దాంతో ఈ ఇద్దరూ చిన్న వయస్సులోనే కోడింగ్ నేర్చుకోవడం వైపు మళ్లారు. పద్దెనిమిది, పందొమ్మిదేళ్ల యువకులంతా సంప్రదాయ పద్ధతుల్లో చదువుకుంటుంటే.. వీరి మనసు మాత్రం వ్యాపారం ఎలా చేయాలా అనే ఆలోచల సుడిగుండాల్లో ఉండేది. ఇంజనీరింగ్ డిగ్రీ లేకుండానే మీడియా. నెట్ వంటి సంస్థల నుంచి సాఫ్ట్వేర్ సర్వీసులనందించి… గూగుల్ యాడ్ సెన్స్ వంటి గ్లోబల్ లెవల్ ఆర్గనైజేషన్స్ కు పోటీగా నిల్చారు. దీర్ఘకాలిక చూపు, అందుకు తగ్గ నిర్వహణా సామర్థ్యం, దానికి కావల్సిన వ్యూహం, చాతుర్యముంటే.. విలువైన వ్యక్తులుగా ఎదుగొచ్చని, విశ్వవ్యాప్త గుర్తింపు సంపాదించుకోవచ్చని ఈ ఇద్దరు అన్నదమ్ముల కథ మనకు చెబుతోంది.


