అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. తిన్నదరగక అజీర్తితో వైద్యుల దగ్గరకు పరిగెత్తేవాళ్లను చూస్తున్న ఈ లోకంలోనే… పిడికెడన్నం కోసం ఆర్తనాదాలు పెడుతున్నవారూ కనిపిస్తారు. అలాంటివారిని చూసి చలించిపోయాడు ఓ త్రీస్టార్ మిషెలిన్ చెఫ్. తను చేపట్టిన ఓ అన్నదాన యజ్ఞం ఇప్పుడు ప్రపంచం మొత్తానికే ఆదర్శంగా నిలుస్తోంది.
మాస్సిమో బొట్టూరా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మిషెలిన్ చెఫ్. కానీ, తన మూలాలు మరవని వంటగాడు. చిన్నప్పుడు వంటగదిలో అమ్మమ్మ చెప్పిన నీతిబోధలను తనతో పాటే పెరిగి పెద్దవి చేసుకున్నాడు. ఆహారాన్ని దుర్వినియోగం చేయకూడదు. వృథాగా పడేయకూడదు దానికి గౌరవమివ్వాలంటూ.. తన అమ్మమ్మ ఓ బ్రెడ్ తో పాటు వేడిపాలిచ్చినప్పుడు చెప్పిన ముచ్చట మాస్సిమో బొట్టూరా మస్తిష్కంలో నాటుకుపోయింది. అమ్మమ్మ పెట్టింది సర్వసాధారణమైన ఫుడ్డే. కానీ, ఆకలిపైనున్న తనకు అదెంతలా సాంత్వన చేకూర్చిందో మాస్సిమోకు తెలుసు. అందుకే, తన భార్య లారా గిల్మోర్ తో కలిసి ఫుడ్ ఫర్ సోల్ అనే ఓ సంస్థనే స్థాపించాడు. వృథా ఆహారాన్ని తగ్గించేలా అవగాహన కల్పించడం.. అవసరమున్న అన్నార్థుల ఆకలి తీర్చడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం.

మిగులు పదార్థాల ఆత్మగౌరవగా ఆకలి తీర్చడం వరకు!
ఫుడ్ ఫర్ సోల్ ఆలోచన సాదాసీదాగా కనిపించినా అమలు తీరు మాత్రం చాలా ప్రత్యేకమైంది. వృథా అయ్యే ఆహారాన్ని సేకరించి.. తోటి చెఫ్స్, వాలంటరీస్ సాయంతో పోషకాహారంగా మారుస్తారు. ఆ ఆహారాన్ని వచ్చిన అన్నార్థులైన అతిథులకు పెడతారు. అదీ ఎంతో గౌరవంతో సాగే ప్రక్రియ. తిండి కోసం వచ్చినవారి ఆత్మగౌరవం ఏ మాత్రం దెబ్బ తినకుండా ఈ యజ్ఞానికి తెరలేపి తాను నలభీముడే కాదు.. ధర్మాత్ముడు అనిపించుకున్నాడు మాస్సిమో బొట్టూరా.
తన మొదటి ప్రయత్నానికి మిలన్ నగరాన్ని వేదికగా చేసుకుని.. రిఫెట్టోరియో ఆంబ్రోసియానోను అంటే భారీ వంటలు వండే ఓ కమ్యానిటీ వంటగదిని ఏర్పాటు చేశాడు.అందుక, ఓ పాత థియేటర్ ను వంటగదిగా మార్చి ఆకలితో అలమటించే అన్నార్థులకు మంచి ఆంబియెన్స్ తో కూడిన భోజనాన్ని అందించేలా ఏర్పాట్లు పూర్తి చేశాడు.
వంటకాలే కాదు, వాతావరణమూ ముఖ్యమేనంటున్న మాస్సిమో!
తన ఆలోచన ఆ తర్వాత 2016లో బ్రెజిల్ లోని సెకండ్ క్యాపిటల్ గా పిల్చే రియో డి జనీరోకి చేరింది. అక్కడ ఒలింపిక్ విలేజ్ లో మిగిలిన ఆహారాన్ని ఉపయోగించి వేల మందికి భోజనం కల్పించాడు. రోజుకు సుమారు 5 వేల మందికి భోజనాలు పెట్టాడు. ఆహారాన్ని వృథా చేయకపోవడమే కాదు… ఒక పెద్ద ఈవెంట్ లో వృథాగా మిగిలి ఎవ్వరూ తినకుండా పడేసే ఫుడ్ ను అన్నార్థులకు గౌరవపూర్వకంగా ఒక మంచి వాతావరణంలో పెడుతూ ఆ కార్యాచరణను ఓ యజ్ఞంలా చేయడమే ఓ గొప్ప మావనతా దృక్పథం.
పుడ్ ఫర్ సోల్ సంస్థ అభిప్రాయమేంటంటే.. వారు వంటలు వండే, ఆహారాలను ఇంకా టేస్టీగా మార్చి అన్నార్థులకందించే వంటశాలలు కేవలం వారి రిఫెట్టోరియోలు మాత్రమే కాదు.. అన్నార్థులకు ఆహారంతో పాటు, గౌరవం, ఆదరణ అందించే పాకశాలలు.
ఇటలీ నుంచి ప్రపంచవ్యాప్తమైన ఉద్యమం!
మిలన్ లో మాస్సిమో బొట్టూరా ఆరంభించిన ఈ ఉద్యమం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమైంది. ప్రస్తుతం 9 దేశాల్లో 12 రిఫెట్టోరియోలున్నాయి. 4 ఖండాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మాస్సిమో బొట్టూరా తన కొత్త వంటశాలను నైరోబీలో ప్రారంభించబోతున్నాడు.
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా చేసిన సర్వేల్లో భయంకరమైన వివరాలు బట్టబయలైనాయి. 2022 రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో 783 మిలియన్స్ మంది ఆకలితో బాధపడుతుండగా.. మరోవైపు, 1 బిలియన్ టన్నుల ఆహారం వృథా అయిపోతూనే ఉంది. ఈ విరుద్ధమైన పరిస్థితులు చూడలేకే బొట్టూరా తన ఆహార యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు.
ఎందుకు బొట్టూరా ఆలోచన ఇంకా నిలకడగా కొనసాగుతోంది..?
బొట్టూరా ప్రయత్నం కచ్చితంగా ప్రత్యేకమైంది. కేవలం ఆలోచనకే పరిమితం కాకుండా ఆచరణలోనూ బృహత్తరమైన సేవలతో ఆయన ప్రత్యేకంగా నిల్చాడు. పట్టించుకోకుండా పక్కకుబెట్టిన బ్రెడ్, మిగిలిపోయిన కూరగాయల వంటి పదార్థాలను రుచికరమైన ఆహార పదార్థాలుగా మారుస్తున్నాడు. వాటిని అంతే ప్రేమగా, గౌరవంగా వచ్చినవారిని ఆదరిస్తూ అందిస్తున్నాడు.
అన్నార్థులుగా వచ్చినవారికి కేవలం ఆకలి మాత్రమే ఉండదు. ఎవరైనా ఏమనుకుంటారోనన్న ఆత్మాభిమానమూ ఉంటుందని బొట్టూరాకూ తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నిత్యాన్నదానంతో ఈ చెఫ్ వార్తల్లో వ్యక్తయ్యాడు.
బొట్టూరా చెబుతున్న పాఠమేంటి..?
ప్రపంచవ్యాప్తంగా బొట్టూరా వంటగదులన్నీ కేవలం ఏదో సదుద్ధేశ్యంతో ఆరంభమైనవే కాకుండా… వాస్తవిక పరిస్థితులకు తగ్గ పరిష్కారాలను చూపే ఆహార కేంద్రాలుగా పని చేస్తున్నాయి. ఆహారాన్ని తిరిగి వినియోగించే నూతన సృజనాత్మక ఆలోచనలతో పాటు.. దానికి మానవీయ విలువలను కూడా జోడించాడు బొట్టూరా.
పెద్ద ఎత్తున ఆహారం వృథా అవుతున్న ఈ సమాజంలో.. మరోవైపు, లక్షల మంది ఆకలితో ఆర్తనాదాలు పెడుతున్న సొసైటీలో… బొట్టూరాది ఓ భావోద్వేగ ప్రయత్నమే కాదు… ఓ బృహత్తర పరిష్కారం.



