ఎక్కడైతే న్యాయం కోసం పోరాటం చేసి.. ఆ న్యాయం దక్కక 31 ఏళ్లపాటు జైలు శిక్షనుభవించాడో.. అదిగో అక్కడే మళ్లీ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టాడతను. భారతదేశంలోనే అత్యంత సంచలన ఘటనగా చరిత్రలో గుర్తుండే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడైన ఏ. జీ. పెరారివళన్ రీ సైలెన్స్ జర్నీ ఇది.
స్వేచ్ఛ లభించడమంటే అది కేవలం జైలు శిక్ష నుంచి బయటపడటం కాదని భావించాడు పెరారివళన్. మళ్లీ జీవితాన్ని పున: ప్రారంభించాలి. ఈ మోటోతో ఆరంభమైన పెరారివళన్ పునర్జీవితం.. కోర్ట్ గదుల్లో అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో నిందితుడిగా ఏ కోర్ట్ బోనులోనైతే నిల్చుని, నిందితుడిగా న్యాయవాదుల ప్రశ్నలకు జవాబిచ్చాడో… ఇప్పుడదే కోర్టులో బోన్ ముందు నిందితులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అడ్వకేట్ అయ్యాడు.

పెరారివళన్ 31 ఏళ్ల తన జైలు జీవితం అనుభవించాక.. 2022లో విడుదలయ్యాడు. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికీ జరుగొద్దని భావించాడో, ఏమోగానీ… తనకు దక్కని న్యాయం తనలాంటి వారికి, తన దృష్టికి వచ్చినవారికి దక్కకుండా ఉండొద్దని ఆశించాడోగానీ… మొత్తంగా బెంగళూరులోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం చదివాడు. 2025లో బార్ ఎగ్జామ్ కూడా పాస్ అయి.. ఇప్పుడు హైకోర్ట్ అడ్వకేట్ గా జడ్జ్ ముందుకు అడుగుపెట్టాడు.
పెరారివళన్ వయస్సు ఇప్పుడు 54 ఏళ్లు. తనను ఖైదీగా జైల్లో పెట్టిన న్యాయవ్యవస్థలో.. అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం నల్లకోటు ధరించాడు. ఇప్పుడు తమిళనాడు, పుదుచ్ఛేరీ రెండు చోట్లా తన కేసులు వాదించేందుకు అర్హుడిగా కోర్ట్ మెట్లెక్కాడు.
జైల్లో గడిపిన తన జీవితమే ఆధారంగా చేసుకుని.. తప్పుగా నిర్బంధించబడిన ఖైదీల కేసులు, సత్వర న్యాయం అందక ఆలస్యమవుతున్న కేసులు, అండర్ ట్రయల్స్ హక్కుల కోసం పని చేసేందుకే తాను న్యాయవాద వృత్తిని ఎంచుకుని జైలు జీవితం తర్వాత తన కొత్త జీవితాన్ని ఆరంభించినట్టు చెబుతున్నాడు పెరారివళన్.
సమర్థవంతమైన న్యాయసాయం అందుకోలేకపోతున్న ఖైదీలకు ఆ లోటు తీర్చడమే ఇప్పుడు పెరారివళన్ ముందున్న ప్రధాన లక్ష్యం.
విశేషమేంటంటే, పెరారివళన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారితో పాటు.. తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ చైర్మన్ అమల్ రాజ్, వైస్ చైర్మన్ ప్రభాకరన్ వంటివారంతా హాజరయ్యారు. బార్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ బాలు పెరారివళన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
31 ఏళ్ల తర్వాత విడుదలైన పెరారివళన్ కథేంటి..?
1991లో భారతదేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివళన్ కేవలం తన 19 ఏళ్ల వయస్సులో అరెస్టయ్యాడు. మానవబాంబుతో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) రాజీవ్ గాంధీని చంపిన తీరు భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. ఆ కేసులో కేవలం విచారణ పేరిట తీసుకెళ్తున్నామని పోలీసులు పెరారివళన్ ఇంటికెళ్లారు. విచారణే కదా అని ఎక్కడా పోలీసులను అడ్డగించకుండా.. వాదనలు పెట్టుకోకుండా.. పెరారివళన్ తల్లిదండ్రులు వారే కొడుకును తీసుకెళ్లమని అప్పగించారు. కానీ, పోలీసులతో పాటు విచారణ పేరిట వెళ్లిన పెరారివళన్ తిరిగి మళ్లీ ఇంటికి రాలేదు. సీబీఐ అతణ్ని కస్టడీలోకి తీసుకుంది. కనీసం కుటుంబ సభ్యులను కూడా కలువనివ్వలేదు.
ఏకంగా 59 రోజుల పాటు తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులకు పెరారివళన్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడన్న సమాచారం కూడా లేకుండా పోయింది. ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించడానికి కూడా గజగజా వణికుతూ భయపడిపోయింది.
పెరారివళన్ పై సీపీఐ అభియోగమేంటి..?
రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు వాడిన మానవ బాంబు పేలుడుకు ఉపయోగించిన 9 వోల్ట్ బ్యాటరీని కొనుగోలు చేసి ప్రధాన నిందితులకు అందించింది పెరారివళనే అనేది ప్రధాన అభియోగం. అందుకు, ఓ దుకాణదారుడి సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ కేసు టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (టాడా) చట్టం కింద నమోదైంది.
1998లో టాడా కోర్ట్ పెరారివళన్ ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. 1999లో సుప్రీంకోర్ట్ కూడా ఆ తీర్పును సమర్థించింది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ పై 11 ఏళ్లు ఆలస్యం జరిగి.. 2014లో సుప్రీంకోర్ట్ మరణశిక్షను కాస్తా జీవితఖైదుగా మార్చేసింది.
చివరకు, 2022, మే 18వ తేదీన సుప్రీంకోర్ట్ ఆర్టికల్ 142 ప్రకారం పెరారివళన్ ను విడుదల చేయాలని ఆదేశాలు జారీచేస్తూ తీర్పునిచ్చింది. అప్పటికే పెరారివళన్ 31 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు.
సంచలనమై కేసులో మరణిశిక్ష పడ్డ దోషి కాస్తా.. తిరిగి నల్లకోటుతో న్యాయవాదిగా!
19 ఏళ్ల వయస్సులోనే అరెస్టై పెరారివళన్ జైలులో ఉన్నప్పటికీ తన చదువు మాత్రం ఆపలేదు. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన డిప్లమా కోర్సులో గోల్డ్ మెడలిస్ట్ పెరారివళన్. ప్లస్ టూ పరీక్షలో 1200 మార్కులకు 1096 మార్కులు సాధించి.. జైలులో చదువుకునే విద్యార్థుల్లో నంబర్ వన్ గా నిల్చాడు.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీసీఏ, ఆ తర్వాత ఎంసీఏ పూర్తి చేశాడు. మరిన్ని డిప్లమాలు కూడా చదివిన పెరారివళన్.. అవన్నీ తనకు మరణశిక్ష విధించారని తెలిసిన సమయంలోనే ఏమాత్రం దు:ఖంలో కూరుకుపోకుండా పూర్తి చేయడం మరో విశేషం.
2022లో విడుదలైన తర్వాత బెంగళూరులో లా చదివి, 2025లో బార్ ఎగ్జామ్ కూడా ఉత్తీర్ణుడై ఏ కోర్టులోనైతే తనకు శిక్ష పడిందో అదే కోర్టులో ఇప్పుడు నల్లకోటు ధరించి గౌరవాన్నందుకున్నాడు.
ప్రముఖ క్రిమినల్ లాయర్ అవ్వాలన్నది తన లక్ష్యం కాదంటున్న పెరారివళన్.. న్యాయం కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది ఖైదీల గళం అవుతానంటున్నాడు. కావల్సిన రీతిలో న్యాయసాయం అందని పేద ఖైదీల పాలిట ఆపద్భాంధవుడయ్యేందుకు నల్లకోటు ధరించానంటున్నాడు.
న్యాయం కోసం బోనులో నిలబడ్డ వ్యక్తి.. ఇప్పుడదే కోర్టులో ఇతరులకు న్యాయసాయం చేసే అడ్వకేటుగా నిలబడి ఒక విశేషమైన జీవితాన్ని ఈ సమాజం ముందుంచాడు.



