దేశ రాజధాని నుంచి ఆర్థిక రాజధాని వరకు… బాద్షా ప్రయాణం!
చాలామంది లాంటి సాధారణ కుర్రాడే. కానీ, దేశ రాజధాని ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ సిటీలో పెరిగిన వాతావరణం కాబట్టి కాస్తా పోష్. తాను ఫౌజీలో సైనికుడిగా వెలుగులోకొచ్చే వరకూ.. నటనపైనున్న మక్కువతో సర్కస్ ఫీట్లే చేయాల్సి వచ్చింది.. ఆ తర్వాత దివానాగా బుల్లితెరపై నుంచి వెండితెరపైకొచ్చాడు. నెగటివ్ రోల్ లో ప్రతీకార పాత్రలో బాజీగర్ అంటూ వేటగాడి రూపమెత్తాడు. దాన్నే కంటిన్యూ చేస్తూ డర్ అంటూ భయపెట్టిన విలనిజాన్నద్ది నెగటివ్ క్యారెక్టర్ రోల్స్ కు రోల్ మాడల్ అయ్యాడు. ఆ తర్వాత అమ్మాయిని లేపుకుపోయేందుకు దిల్ వాలే దుల్హనియా లేజాయింగే అంటూ బయల్దేరిన ఆ ఎన్ఆర్ఐ… దిల్ తో పాగల్ హై అంటూ ప్రేమ పిచ్చిదనాన్ని పాటలతో వినిపించాడు. ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. అలా బాలీవుడ్ బాద్షాను చేసేశారు. అయితే, ఓ శిలలాంటి తనను ఆ స్థాయిలో నిల్పేందుకు వచ్చిన అవకాశాలు.. ఇచ్చిన దర్శక నిర్మాతల సహకారం మరువలేనిదైనా.. తన శిలను శిల్పంలా తీర్చిదిద్దుకున్న ఉలి కూడా తానే కావడమే విశేషం.

షారూక్ ఖాన్ పుట్టినరోజు.. నవంబర్ 2, 1965!
ఢిల్లీ రాజేంద్రనగర్ వాసైన షారూక్ ఖాన్.. సెయింట్ కొలంబస్ స్కూల్ లో చదివాడు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను పోగుట్టుకున్నాడు. తండ్రిది పెషావర్ అయినా… ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ప్రధాన అనుచరుడిగా షారూక్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ ఖాన్.. స్వాతంత్ర్యపోరాట కాలంలో పనిచేశాడు. ఢిల్లీ హన్స్ రాజ్ కళాశాలలో ఎకనామిక్స్ పూర్తి చేసిన షారూక్ ఖాన్… ఓ క్రీడాకారుడు కావల్సినవాడు యాక్టరై.. బాలీవుడ్ ను శాసించే హీరో స్థాయికెదిగిపోయాడు. హాకీ, ఫుట్బాల్ వంటి ఆటల్లో సెయింట్ కొలంబస్ స్కూల్ నుంచి గౌరవమైన స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డ్ అందుకున్నాడు. కానీ, భుజానికైన గాయంతో ఆ తర్వాత క్రీడల జోలికి వెళ్లలేకపోయాడు. అదే సమయంలో తనకిష్టమైన నటులు దిలీప్ కుమార్, అమితాబ్ వంటివారిని ఇమిటేట్ చేసేవాడు. అలా నటనపై పెరిగిన ఆసక్తితో ఢిల్లీ థియేటర్ యాక్షన్ గ్రూప్ లో నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. జామియా మిల్లియా యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ మాస్టర్స్ పూర్తి చేసి.. ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలోనూ తర్ఫీదు పొందాడు షారూక్.
పెద్ద కలలు కన్నాడు.. అనుకున్నట్టే సాధించాడు!
దిల్ దారియా సీరియల్ తో మొట్టమొదట బుల్లితెరపైకొచ్చినా.. ఆ సీరియల్ ఆలస్యమవ్వడంతో ఫౌజీ సీరియల్ తో నటనలో మెప్పించాడు. సర్కస్ తో అందరి దృష్టిలో పడ్డ షారూక్.. బాలీవుడ్ లోనూ అడుగుపెట్టాలని కలలు కన్నాడు. కానీ, ఢిల్లీ అంటే తాను చిన్నప్పట్నుంచీ పెరిగిన నగరం.. నాల్గు పరిచయాలు, మంచీచెడు చెప్పేవారుంటారు. బాలీవుడ్ లో అడుగుపెట్టాలంటే ముంబైకి షిఫ్ట్ కావాలి. పైగా అరేబియా మహాసముద్రమంత ఆ ఇండస్ట్రీలో అసలు అవకాశం దొరుకుతుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో 1991లో జబ్బకు బ్యాగు వేసుకుని బయల్దేరిన ఎస్ఆర్కే… బాలీవుడ్ అనే కింగ్డమ్ ను శాసించే రాజైపోయాడు.
దీవానాతో ఎంట్రీ ఇచ్చి.. బాజీగర్, డర్ నెగటివ్ రోల్స్ తో విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. అంతేకాదు, అప్పటివరకూ అరంగ్రేటం చేసిన హీరోలెందరితోనో పోలిస్తే తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. 1995లో ఆదిత్యాచోప్రా దర్శకత్వం వహించి విడుదలైన దిల్ వాలే దుల్హనియా లేజాయింగే షారూక్ ఫేట్ ను పూర్తిగా మార్చేసింది. షోలే తర్వాత ముంబైలోని మరాఠా మందిర్ లో అతి ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా డీడీఎల్జే ఓ ట్రెండ్ సృష్టించింది. అంతెందుకూ.. నాటి హైదరాబాద్ మహేశ్వరీ, పరమేశ్వరీలో ఓ ఊపులూపింది.
డీడీఎల్జేతో రొమాంటిక్ హీరోగా తయారై.. వరుసబెట్టి దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతాహై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నాహో వంటి సినిమాలతో కింగ్ ఆఫ్ రొమాన్స్ అన్న పేరును సొంతం చేసుకున్నాడు. పైగా తన సినిమాల్లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిల్చి తన కెరీర్ ఎదుగదలలో మరింత తోడ్పడ్డాయి. ముఖ్యంగా కాజల్ తో.. ఆ తర్వాత రాణీముఖర్జీతో షారుక్ జతకడితే ఇక ఆ సినిమా కచ్చితంగా హిట్టేనన్న టాక్ ను సంపాదించుకున్నాడు.
బయోపిక్ కు ఏమాత్రం తక్కువగాని.. బాద్షా నిజజీవిత ప్రేమకథ!
పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందిన గౌరీని వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు షారుక్. యుక్తవయస్సు నుంచే ఓ తుంటరోడిలా గౌరీని అనుసరించేవాడు. గౌరీ మకాం ముంబైకి మార్చేశాక… షారుక్ కూ కలిసివచ్చింది. ఓవైపు బాలీవుడ్ లో నటుడిగా అవకాశాలు వెతుక్కుని ఎదగడానికి.. ఇంకోవైపు గౌరీని ముంబైలోనూ పాలో చేయడానికి.. ఇలా రెండింటినీ దృష్టిలో పెట్టుకునే ముంబై చేరుకున్నాడు ఎస్ఆర్కే. కానీ, నటుడిగా అప్పుడప్పుడే సీరియల్స్ తో బుల్లి తెరపైకొచ్చిన షారుక్ విషయంలో.. గౌరీ కుటుంబీకులు ముందు ఒప్పుకోలేదు. పైగా మతం కూడా ఒక్కటి కాకపోవడం కూడా అడ్డుపడింది. కానీ, పట్టువదలని విక్రమార్కుడై.. బాలీవుడ్ బాద్షా అయినట్టే.. గౌరీని ఒప్పించి… ఆర్యసమాజ్ లో 1991. అక్టోబర్ 25న వివాహం చేసుకున్నాడు. ఆర్యన్, సుహానా అనే ఇద్దరు పిల్లలున్నా కూడా.. సరోగసీ ద్వారా మరో అబ్ రామ్ అనే కుర్రాడికి తల్లిదండ్రులయ్యారు షారుక్, గౌరీఖాన్ లు. తన బిజీ షెడ్యూల్ లోనూ పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయిస్తుంటాడు షారూక్. షారుక్ ఎదుగుదలలో గౌరీ పాత్రను ఎప్పటికప్పుడు వేదికేదైనా గుర్తు చేసుకుంటూ తాను ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్య పట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమను ప్రకటిస్తుంటాడు. ముంబై మన్నత్ లోని షారుక్ ఇల్లు… అదో పర్యాటక ప్రదేశమా అన్నట్టు వీక్షకులను సమ్మోహనపరుస్తుంది.
గ్లోబల్ స్టార్ గా షారుక్!
షారుక్ సినిమా భారతదేశాన్ని మించి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసులను కొల్లగొట్టింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ బాద్షా ఓ గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందాడు. ఫ్రాన్స్ లో ప్రత్యేక సన్మానాలు పొందడం నుంచి.. మేడం టుస్సాడ్ మ్యూజియంలో ఏకంగా మైనపు విగ్రహాన్నే కల్గి ఉన్న ప్రముఖుల్లో ఒకడిగా షారుక్ కు గుర్తింపు దక్కింది. 14 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సాధించి.. విదేశీ యూనవర్సిటీల డాక్టరేట్స్, ఇతర అవార్డ్స్ అందుకున్న షారూక్ ను భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీతో సత్కరించింది. అలా ఢిల్లీ వంటి ఓ మెట్రోపాలిటన్ సిటీలో.. ఎందరిలానో ఓ సర్వసాధారణ యువకుడిగానే తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇవాళ ఎత్తైన శిఖరాలధిరోహించిన షారూక్ ఖాన్… ఏదైనా రంగంలో సాధించాలనుకునే వారెవ్వరికైనా కచ్చితంగా ఓ రోల్ మాడల్. అయితే, ఇప్పటివరకూ కూడా ఒక్క నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకోకపోవడం మాత్రం షారుక్ కెరీర్ లో ఓ వెలితి.



