వేదికేదైనా.. వేడుకేదైనా… ఎవరైనా కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు కొంతమంది సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ ను కోట్ చేస్తూ మాట్లాడటం సర్వసాధారణం. తమిళనాడులో కొత్త రాజీకీయం పేరిట.. అక్కడి సూపర్ స్టార్, విజయ్ కొత్త పార్టీ స్థాపన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో… ఆయన అంబేడ్కర్, పెరియార్, కామరాజ్ నాడార్, వీ.కే రామస్వామి వంటివారితో పాటు.. ఓ ఇద్దరు మహిళామణుల పేర్లూ ప్రస్తావించారు. అలాగే వారి భారీ కటౌట్స్ ను ఏర్పాటు చేశారు. ఒకరు వేలు నాచియార్. ఇంకొకరు అంజలై అమ్మాళ్. ఇంతకీ ఎవరు వారిద్దరు… వారిని విజయ్ ఎందుకు కోట్ చేశాడు..?

తన కొత్త పార్టీ తమిళిగ వెట్రి కజగం స్థాపనతో తమిళనాడులో విజయ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. తమిళనాడు రాజకీయాలంటే అయితే నాడు ఎంజీఆర్ స్థాపించి ఆ తర్వాత జయలలిత కేరాఫ్ గా ఒక వెలుగు వెలిలిగినఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం.. లేదంటే అన్నాదురై స్థాపించి.. కరుణానిధి కుటుంబానికి పెట్టని గోడలా నిలబడిన ద్రవడి మున్నేట్ర కజగం అన్నట్టుగా అక్కడి పాలిటిక్స్ సాగుతున్నాయి. జయలలిత మరణం, శశికళ జైలు పాలై క్రియాశీల రాజకీయాలకు దూరమవ్వడంతో ఆ గ్యాప్ అక్కడ ఇంకా అలాగే కొనసాగుతోంది.
నటుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కమల్ హాసన్ వంటి మక్కల్ నీది మయ్యం వంటి పార్టీతో పాటు.. తమిళనాట ఓ వెలుగు వెలిగిన విజయకాంత్ స్థాపించిన దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం వంటి పార్టీలు వచ్చినా పెద్దగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్రనైతే పోషించలేదు. అదే సమయంలో, రజనీకాంత్ రాజీకీయాల్లోకొస్తున్నాడనే ప్రచారమూ ఒక దశలో ముమ్మురంగా జరగడం.. పార్టీ పెడతారన్న వార్తలు.. ఇంకోవైపు బీజేపీ వైపు చూస్తున్నారంటూ జరిగిన ప్రచారమూ.. అవేవీ నిజం కాకపోవడంతో… ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెట్టి ప్రస్తుతమున్న డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఇంకెవరు ముందుకొస్తారన్న చర్చ కూడా తమిళనాట విస్తృతంగా జరిగింది. ఈ క్రమంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ వీటన్నింటినీ బేరీజు వేసుకునే దిగాడనే వాదనా ఉంది.
అయితే, విజయ్ పార్టీ స్థాపన కోసం ఏర్పాటు చేసిన బహిరంగసభ ప్రసంగం ఆకట్టుకోవడంతో పాటే.. ఆయన కోట్ చేసిన తమిళ పాప్యులర్ లీడర్స్ పేర్లూ, ఆయన చెప్పుకొచ్చిన ఆదర్శ సిద్ధాంతాలూ మళ్లీ ఒకసారి చర్చలోకొచ్చాయి. అంబేద్కర్, పెరియార్, కామరాజ్ నాడార్, వీ.కే. రామస్వామితో పాటు… విజయ్ కోట్ చేసిన పేర్లలో వేలు నాచియార్, అంజలై అమ్మాళ్ పేర్లు ఇప్పుడు అందరినీ వారివైపు దృష్టి సారించేలా చేశాయి.

ఇంతకీ ఎవరా వేలు నాచియార్, అంజలై అమ్మాళ్…?
అక్టోబర్ 27న సాయంత్రం చెన్నై విక్రవాండిలో జరిగిన తమిళ వెట్రి కజగం (టీవీకే) సభ ఒక సంచలనం రేపింది. యావత్ తమిళనాడు రాష్ట్రమేగాక.. దేశంలో సంప్రదాయపార్టీలు వేళ్లూనుకుపోయి.. అక్కడో ఇక్కడో తమ అస్తిత్వం కోసమే పోరాటాలు చేస్తూ మనుగడలో ఉన్న కొన్ని ప్రాంతీయపార్టీలు సైతం విజయ్ పార్టీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తిని సర్వత్రా కనబర్చారు. ఈ క్రమంలో తన సైద్ధాంతిక మార్గదర్శకులుగా విజయ్ పేర్కొన్న ఇద్దరు మహిళలెవ్వరన్న చర్చతో పాటు.. గూగుల్ సెర్చ్ ఇంజన్ లోనూ వారికోసం వెతికే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
వేలు నాచియార్!
వేలు నాచియార్ బ్రిటీషర్స్ తో పోరాటం సల్పిన రాణి. తమిళనాడు రామ్ నాడ్ రాజ్యానికి చెందిన రాజు చెల్లముత్తు సేతుపతి, సకంధిముతల్ కు 1730లో జన్మించిన వేలు నాచియార్ పేరుకు ఆడపిల్లే అయినా.. ఒక యువరాజులానే పెరిగింది. గుర్రపుస్వారీ, విలువిద్య, కలరియపట్ట, సిలంబం వంటి దక్షిణభారత యుద్ధ కళల్లో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషావేత్త. సైనిక వ్యూహంలో ఆమె శైలి నాడు అందిరనీ సమ్మోహనపర్చేది.
1746లో శివగంగై ఎస్టేట్ కు యువరాజుగా ఉన్న ముత్తు వడుగనాథ పెరియవుదయ తేవర్ కు స్నేహితురాలిగా, తత్వవేత్తగా, మార్గదర్శిగా వ్యవహరించిన వేలు నాచియార్.. ఆ తర్వాత ఆయన్నే వివాహం చేసుకుంది. 1772లో ఆర్కాట్ నవాబ్ కుమారుడితో కలిసి పనిచేసిన బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ శివగంగైపై దండెత్తింది. ఆ సమయంలో ముత్తు వడుగనాథర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వేలు నాచియార్, ఆమె కుమార్తె వెల్లచి.. దిండిగల్‌లోని సురక్షిత ప్రాంతానికి పారిపోయారు. ఎనిమిదేళ్లపాటు అక్కడ మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ రక్షణలోనే రహస్య జీవితాన్ని గడిపారు. అయితే, తమ రాజ్యం నుంచి వలస వెళ్లిపోవాల్సి రావడంతో.. వేలు నాచియార్ లో పగ, ప్రతీకారం కూడా అంతకంతకూ కాలంతో పాటు పెరుగుతూ వచ్చాయి. మరుదు సోదరులుగా పిలువబడే హైదర్ అలీ, గోపాల్ నాయకర్ అప్పటికే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రెబల్స్ గా పని చేస్తున్న క్రమంలో.. వారి మద్దతును కూడగట్టింది. కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వారిద్దరూ దొరికిపోయి ఉరి తీయబడ్డారు.
అయితే, బ్రిటిష్ వారిపై వేలు నాచియార్ పోరాటంలో ఆమెకు మిలటరీ కమాండర్ నాయకర్ తో పాటు… ఆమెకు యుద్ధవిన్యాసాల్లో శిక్షణనివ్వడంలో హైదర్ అలీ తోడ్పాటు ఆమెను మరింత రాటుదేల్చింది. అదేవిధంగా తన సైన్యాన్ని ఆమెకు సాయంగా పంపించారు.
1780లో వేలు నాచియార్ బ్రిటీష్ వారితో జరిగిన పోరాటంలో విజయం సాధించి.. తిరిగి తమ శివగంగై రాజధానిని స్వాధీనం చేసుకుంది. దశాబ్దాంపాటు ఆమె పాలననంతరం.. 1790లో ఆమె తన కుమార్తె వెల్లచికి పాలనాపగ్గాలందించి 1796లో కన్నుమూసింది. ఆమెను తమిళనాట వీరమంగైగా పిల్చుకుంటారు. వీరమంగై అంటే ధైర్యవంతురాలైన మహిళ అని అర్థమట. అంతేకాదు, భారతదేశంలో బ్రిటీష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన రాణుల్లో ఒకరిగా వేలు నాచియార్ గుర్తింపు పొందింది. కాబట్టి, రాబోయే రోజుల్లో తమిళనాడులో బలమైన తన రాజకీయ శత్రువులతో తలపడబోతున్న విజయ్ కి… వేలు నాచియార్ సైద్ధాంతిక మార్గదర్శకురాలన్న చర్చ ఇప్పుడు వినిపిస్తోంది.
మరి అంజలై అమ్మాళ్ ఎవరు…?
అంజలై అమ్మాళ్… ఈమెను తమిళనాట సౌత్ ఇండియాస్ రాణి ఆఫ్ ఝాన్సీగా అభివర్ణిస్తారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆమె నిస్వార్థ సేవలతో పాటు.. స్వాతంత్ర్యానికి పూర్వం మహిళల స్థితిగతులపై ఆమె పోరాటం తనను కదిలించిదంటూ చెప్పుకొచ్చాడు విజయ్ తన ప్రసంగంలో.

1890లో కడలూరులో ఓ నేత కార్మికుడి కుటుంబంలో జన్మించిన అంజలై అమ్మాళ్.. చిన్నవయస్సులోనే చాలా చురుకుగా ఉండేది. 1908లో మురుగప్పన్ తో వివాహం తర్వాత.. ఆ ఇద్దరి జంటా స్వాతంత్ర పోరాటంలో పాల్గొంది.
1921లో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రభావితమైన అంజలై అమ్మాళ్.. గాంధేయ సూత్రాలను అనుసరించింది. 1857 తిరుగుబాటును అణిచివేసేందుకు దురాగతాలకు పాల్పడిన కల్నల్ జేమ్స్ నీల్ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. 1930లో ఉప్పు సత్యాగ్రహం.. అలాగే క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అంజల్ అమ్మాళ్ ది చురుకైన పాత్ర. 1931లో నాటి మద్రాసులో జరిగిన అఖిల భారత మహిళా కాంగ్రెస్‌కు ఆమె అధ్యక్షత వహించింది అంజల్ అమ్మాళ్.
బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటంలో ఎన్నోసార్ల ఆమె జైలు ఊచలు లెక్కపెట్టారు. ఉప్పుపై పన్ను వేస్తూ తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకించే సమయంలో ఆమె ఆరునెలల జైలుశిక్షననుభవించింది. అదే సమయంలో తన చిన్న కొడుక్కి జన్మనిచ్చింది. ఆమె ప్రసవం కోసం బెయిల్ పై బయటకొచ్చినా… కొడుకు పుట్టిన రెండు వారాలకే నాటి బ్రిటీష్ దౌర్జన్యకారులు ఆమెను మళ్లీ జైలుకు పంపారు. 1943లో మహాత్మాగాంధే తన కడలూరు పర్యటనలో ఆమెను కలవడానికి వెళ్లితే… ఆయన, ఆమెను కలవకుండా బ్రిటీష్ ప్రభుత్వం అడ్డుకుంది. కానీ, వారి అధికారిక కుట్రలు ఫలించలేదు. ఆమె బురఖా ధరించి ఓ గుర్రపుబండిలో వెళ్లి.. గాంధీని కలిసింది. అప్పుడే ఆమెను మహాత్ముడు… సౌత్ ఇండియాస్ రాణీ ఆఫ్ ఝూన్సీగా కొనియాడటంతో.. ఆ పేరు ఆమెకు తమిళనాట మరో పర్యాయపదంగా మారిపోయింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహించి.. తమిళనాడులో శాసనసభకు ఎన్నికైన మొట్టమొదటి మహిళగా కూడా అంజల్ అమ్మాళ్ గుర్తింపు పొందింది. తను మరణం వరకూ రాజకీయాల్లో చురుకుగా కొనసాగిని నిబద్ధత కల్గిన కార్యకర్తగా అంజల్ అమ్మాళ్ పేరు అక్కడి పుటల్లో చిరస్థానాన్ని దక్కించుకుంది.
అందుకే, విజయ్ తన సైద్ధాంతిక మార్గదర్శకుల్లో అంబేద్కర్, పెరియార్, కామరాజ్ నాడార్, వీ.కే. రామస్వామి వంటివారితో పాటు.. ఈ ఇద్దరు అపరదుర్గలైన వేలు నాచియార్, అంజల్ అమ్మాళ్ ల పేర్లనూ స్ఫురణకు తెచ్చి.. తమిళనాట తన ఆలోచనలు, మార్గదర్శకులను చర్చకు పెట్టే ప్రయత్నం చేశారు.



