శత్రువు బలహీనతే… ప్రత్యర్థి బలం. అదే అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికాను గడగడలాడించిన ఓ మాఫియా డాన్ మృత్యుగీతికకు కారణమైంది. లవ్, రొమాన్స్, డెత్ వంటి హైడ్రామాతో.. మెక్సికో మాఫియా డాన్ ఎల్ మెంచో కథ ఓ హానీట్రాప్ ని తలపించింది.
మెక్సికోలోనే అత్యంత దుర్భేద్యమైన డ్రగ్ లార్డ్ గా పేరుబడ్డ ఎల్ మెంచో… తన ప్రేమబంధం కారణంగా పట్టుబడి మరణించిన తీరు సినిమాను తలపించింది.
మెక్సికో రక్షణ మంత్రి జనరల్ రికార్డో ట్రెవిల్లా ట్రెహో తెలిపినదాని ప్రకారం.. ఎల్ మెంచో ప్రేయసుల్లో ఒకరి సన్నిహత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మెక్సికో భద్రతాదళాలు జాలిస్కో రాష్ట్రంలోని టాపల్పాలో ఎల్ మెంచో స్థావరాన్ని గుర్తించి, పక్కాగా అతడిపై దాడికి తెగబడ్డాయి.

అసలెవరు ఎల్ మెంచో..?
నెమెసియో రూబెన్ ఒసెగేరా సెర్వాంటెస్ ఇదీ ఎల్ మెంచో అసలు పేరు. జాలిస్తో న్యూ జనరేషన్ కార్టెల్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని.. అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసే స్థాయిలో ఫెంటానిల్, మెతాంఫెటమైన్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలను అక్రమరవాణా చేసేవాడు ఎల్ మెంచో. డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠమెక్కాక డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది అమెరికా ప్రభుత్వం. ఆ క్రమంలో ఎల్ మెంచో నేతృత్వంలోని జాలిస్తో న్యూ జనరేషన్ కార్టెల్ అనే సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థపైనా, ఎల్ మెంచోపైనా నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.
ఎల్ మెంచోను పట్టించినవారికి 2018లో పది మిలియన్ డాలర్స్ ప్రకటించగా.. 2024 వరకు దాని విలువ 15 మిలియన్ డాలర్లకు పెంచింది అమెరికా ప్రభుత్వం.
ఎల్ మెంచో తన ప్రేయసి వద్దనున్న సమయంలో పక్కాగా ప్లాన్ చేసి మెక్సికన్ భద్రతా దళాలు దాడులకు తెగబడ్డాయి. ఆ సమయంలో కార్టెల్ గన్ మెన్ భద్రతాదళాలపై ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత అడవుల్లోకి పారిపోయి ఓ క్యాబిన్ లాంటి సముదాయం వద్ద ఇరుపక్షాల మధ్య పోరాటం సాగింది. అక్కడి నుంచి ఎల్ మెంచో తన ఇద్దరు బాడీగార్డులతో పారిపోతున్న సమయంలో సైనికుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. హెలికాప్టర్ లో మెక్సికోకు తరలిస్తుండగానే ఎల్ మెంచో మార్గమధ్యంలో మృతి చెందాడు.
అత్యాధునిక ఆయుధాలతో మెక్సికన్ భద్రతాదళాలతో పాటు.. అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికానూ గడగడలాడించాడు ఎల్ మెంచో. అయితే, ఉన్నపళంగా ఒక్కసారిగా ఊహించలేని దాడి భద్రతాదళాల నుంచి ఎదురైనప్పుడు ఎల్ మెంచో వద్దనున్న రాకెట్ లాంచర్స్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. దాంతో ఎనిమిది మంది కార్టెల్ సభ్యులు హతమయ్యారు. ఎల్ మెంచో టీం నుంచి గ్రేనెడ్స్, బుల్లెట్స్, ఆర్మ్డ్ వాహనాలు స్వాధీనం చేసుకున్నాయి మెక్సికన్ భద్రతాదళాలు.
ఉద్రిక్తతంగా మారిన మెక్సికో!
ఎల్ మెంచో అంటే మెక్సికోలో గత రెండు దశాబ్దాలుగా ఓ సమాంతర ప్రభుత్వం. ఎల్ మెంచో మరణంతో మెక్సికో హింసాత్మకంగా మారింది. కార్టెల్ సభ్యులు రోడ్లు దిగ్భంధం చేశారు. వాహనాలు, పెట్రోల్ బంకులు, దుకాణాలకు నిప్పంటించారు. ప్రతీకార దాడులకు పాల్పడ్డారు. ఎల్ మెంచోను పట్టుకునే ప్రయత్నంలో ఏకంగా ఆయన మరణం తర్వాత మరో 73 మంది మృతి చెందినట్టు అధికారిక అంచనా. అందులో భద్రతా సిబ్బంది, కార్టెల్ బృంద సభ్యులతో పాటు.. సామాన్య పౌరులూ ఉన్నారు. మృతి చెందినవారిలో చాలామంది వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కావల్సి ఉంది.
ఊపిరి పీల్చుకున్న మెక్సికో ప్రభుత్వం!
రెండు దశాబ్దాలుగా మెక్సికోకు, అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన ఎల్ మెంచో మరణంతో మెక్సికో ప్రభుత్వంతో పాటు.. అమెరికా కూడా ఊపిరి పీల్చుకుంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్ బామ్ సాయుధ దళాలను ప్రశంసించారు. తాము కోరుకున్న శాంతి, ప్రశాంతత ఇన్నాళ్లకు చేకూరాయన్న ఆమె ప్రకటన ఎంత రిలీఫ్ ను ఇచ్చేదో చెప్పేది. ఎల్ మెంచోపై నిఘా కోసం 20 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 250 చోట్ల రోడ్డు బ్లాకులన్నీ తొలగించిన ఆనందం అధ్యక్షురాలి మాటల్లో వ్యక్తమైంది.
అయితే, ఎల్ మెంచోను మట్టుబెట్టే ఆపరేషన్ లో అమెరికాదీ కీలకపాత్ర. వైట్ హౌజ్ పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ కు సహకరించింది. గూఢచారి సమాచారం సేకరించడంలో తోడ్పడింది. ఇటు తమకు.. అటు మెక్సికోకూ కంట్లో నలుసులా మారిన ఎల్ మెంచోను మట్టుబెట్టినందుకు అమెరికా మెక్సికోను అభినందించింది.
ఎల్ మెంచో గురించి!
మాదక ద్రవ్యాల అక్రమరవాణాలో ఎల్ మెంచో నేతృత్వంలోని సంస్థ చాలా శక్తివంతంగా, చురుకుగా పనిచేసేది. ఎల్ మెంతో ఎలా ఉంటాడో కూడా ఎవ్వరూ సరిగ్గా చూడకపోవడం.. ఆయన ఫోటోలు కూడా పెద్దగా బయటకు రాకపోవడంతో.. ఎల్ మెంచో నేరసామ్రాజ్యం ఓ క్రైమ్ థ్లిల్లర్ సినిమాను తలపించేలా సాగింది. 1980, 90లలో అతను కాలిఫోర్నియాలో అరెస్ట్ అయినప్పుడు తీసిన ఫోటోలు మినహా.. లేటెస్ట్ ఎల్ మెంచో ఎలా ఉంటాడో కూడా ఎవ్వరికీ తెలియదు.
ఎల్ మెంచో నేపథ్యం, ప్రారంభ జీవితం!
59 ఏళ్ల కరడుగట్టిన మాఫియా డాన్ ఎల్ మెంచో.. మిచోఆకాన్ రాష్ట్రంలోని ఎల్ నరాంజో అనే వ్యవసాయాధారిత గ్రామంలో జన్మించాడు. అతడి అసలు పేరు రూబెన్ ఒసెగేరా సెర్వాంటెస్. తర్వాత నెమెసియా అనే పేరు మార్చుకున్నాడు. అలాగే ఆయన్ను షార్ట్ గా ఎల్ మెంచో అని పిల్చుకోవడం ప్రారంభమైంది. యువకుడిగా ఉన్నప్పుడే కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. అక్కడ అప్పటికే డ్రగ్స్ వ్యాపారంతో అమెరికాకు నిద్రలేకుండా చేస్తున్న కుయినిస్ గ్యాంగుతో అతడికి సంబంధాలేర్పడ్డాయి.
మెక్సికోకు తిరుగు ప్రయాణం- నేరసామ్రాజ్య విస్తరణ!
హెరాయిన్ అక్రమ రవాణా కేసులో 3 ఏళ్ల పాటు ఎల్ మెంచోకు శిక్ష పడింది. ఆ తర్వాత మెక్సికో నుంచి ఎల్ మెంచోను అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. తిరిగి మిచోఆకాన్ కు చేరుకున్న తర్వాత కుయినిస్ గ్రూపుతో మళ్లీ కలిశాడు. 1990ల ప్రాంతంలో కొలంబియా డ్రగ్స్ సరఫరాదారులతో కలిసి కోకైన్ అక్రమరవాణా నెట్వర్క్ లో కీలకంగా మారాడు. ఆరంభంలో లోస్ కుయినిస్ డ్రగ్ మాఫియా అధినేతైన వాలెన్సియా కార్నేలియోకు గమ్ మ్యాన్ గా కూడా పనిచేశాడు.
కొంతకాలం వారితో కలిసి పనిచేసినా 2009లో జరిగిన ఘటనలు.. విభజన వల్ల… ఎరిక్ వాలెన్సియా సలాజార్ తో కలిసి జాలిస్తో న్యూ జనరేషన్ కార్టెల్ ను ఆరంభించాడు. రెండు దశాబ్దాలలోపే తన నేర సామ్రాజ్యాన్ని వేలాది మంది సభ్యులతో విస్తరించాడు. యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంచనాల ప్రకారం మెక్సికోలోని మొత్తం 32 రాష్ట్రాలకుగాను.. 21 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల్లో తన డ్రగ్ మాఫియా నెట్వర్క్ ను విస్తరించాడు ఎల్ మెంచో.
చదివించి కేవలం మాధ్యమిక విద్యనే అయినప్పటికీ.. ఒసెగేరా సెర్వాంటెస్ అలియా ఎల్ మెంచో.. మాదక ద్రవ్యాల అక్రమరవాణాతో పాటు… రియల్ ఎస్సేట్, ఇంధన దోపిడీ వంటి అనేక రంగాల్లో తన వ్యాపారాలను విస్తరించాడు. తన వ్యూహాలు, ఆత్మవిశ్వాసంతో అగ్రరాజ్యానికే కంటి నిండా కునుకు లేకుండా చేశాడు.



