కులరహిత సమాజ నిర్మాణానికి ఓ దిక్సూచి.. సౌందాళ!

ఓవైపు సాంకేతికంగా బౌండరీస్ బ్రేక్ చేస్తూ మనిషి దూసుకుపోతుంటే.. ఇంకోవైపు, అదే సమాజం కుల, మత, వర్ణ వివక్షలు, వాటిపై పెద్ద పెద్ద చర్చల దగ్గరే ఆగిపోయి వర్గాలుగా విడిపోతోంది. సామాన్యుల నుంచి మొదలు, ప్రపంచ రచయితలు, పుస్తకాల వరకూ మాట్లాడే పెద్దలు సైతం.. ఏదో ఒక భావాజాలం దగ్గరే ఆగిపోయి తాము ప్రత్యర్థులనుకున్నవారిపై విద్వేషాన్నో, వ్యంగ్యాన్నో వెదజల్లుతూ గొప్పలు పోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఓ ఊరు మాత్రం ఈ నవ నాగరిక సభ్య సమాజాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మిగిలిన సమాజం తమకంటే ఎంత వెనుకబడి ఉందో వెక్కిరిస్తోంది. అలాంటి ఓ కులరహిత గ్రామానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, రండి.

మహారాష్ట్ర అహల్యానగర్ జిల్లాలో సౌందాళ… సామాజిక సంస్కరణలకు ఓ విశిష్ఠ ఉదాహరణ. కుల వివక్షను నిర్మూలించేందుకు, సాటి మానవుడి పట్ల సమానత్వాన్ని పాటించేందుకు తీర్మానం వరకే ఆగిపోకుండా, ఆచరిస్తున్న కులరహిత గ్రామం సౌందాళ.

కులరహిత సమాజం ఆలోచన వెనుక జరిగిన కసరత్తు!

అందుకు, 2026, ఫిబ్రవరి 5వ తేదీన ఓ మంచి ముహూర్తం ఖరారైంది. అప్పటికే కులరహిత గ్రామంగా ప్రకటించేందుకు గ్రామసభలు, పెద్దల చర్చలు ఇలా పెద్ద కసరత్తే జరిగింది. అలాంటి కసరత్తులోంచి భాగంగానే “అమ్చీ బాత్ మానవ” అంటే మా కులం మానవత్వం అనే నినాదాన్ని ఎత్తుకుంది సౌందాళ గ్రామం. వివిధ సామాజికవర్గాలకు చెందిన గ్రామస్థులంతా కలిసి, తీర్మానం చేసి ఆచరణలోకి తెచ్చిన గొప్ప విషయం ఈ కులరహిత గ్రామ ప్రకటన.

ఇప్పటికీ తెలంగాణాలోని నిజామాబాద్, జగిత్యాల వంటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరిట జరుగుతున్న ఆగడాలు, అరాచకాలు, గ్రామ, కుల, సామాజిక బహిష్కరణలు సభ్య సమాజాన్ని తల దించుకునేట్టు చేస్తున్నాయి. కానీ, అందుకు పూర్తి భిన్నంగా మహారాష్ట్రలోని ఈ సౌందాళ గ్రామం మాత్రం కుల ఆధారిత వివక్షకు తావు లేకుండా తీర్మానం చేయడం నవనాగరికమనుకుంటున్నతక్కిన సభ్య సమాజం సిగ్గుతో నేర్చుకోవాల్సిన పాఠం.

ఇప్పుడు సౌందాళాలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, దేవాలయాలు, నీటివనరులు, కమ్యూనిటీ హాల్స్, శ్మశానాలు ఇలా ప్రతీ ప్రజా సౌకర్యం కుల, మత, జాతి, వర్గ విభేదాల్లేకుండా అందరికీ వర్తిస్తాయి. అలాగే కులాధారిత వివాదాలు, అవమానకరమైన సోషల్ మీడియా పోస్టులపైనా గ్రామ పాలనా కమిటీ చర్యలు తీసుకోవడానికి పర్యవేక్షకులను ఏర్పాటు చేసింది.

సౌందాళ గ్రామంలో వివిధ సామాజికవర్గాలకు చెందిన ప్రజలు నివశిస్తున్నారు. ఇప్పటివరకూ పెద్దగా కుల వివాదాలేమీ లేనప్పటికీ.. నేడు సమాజం కులాలవారీగా విడిపోయి కళ్లకు కడుతున్న పరిస్థితుల్లో దాన్ని తమ గ్రామంలో అడ్డుకట్ట వేసేందుకు, తక్కిన సమాజానికి ఆదర్శంగా నిల్చేందుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే సౌందాళ చేసిన తీర్మానం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.

సౌందాళ తీర్మానం భారత రాజ్యాంగం పేర్కొనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం వంటి విలువల నుంచి పొందిన ప్రేరణకు ఓ ఊరుమ్మడి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎక్కడో సాహిత్యంలోనో, కవిత్వంలోనో మాత్రమే కనిపించే.. సమసమాజ భావనను ప్రత్యక్షంగా చూడగల్గే ఒక వేదిక సౌందాళ.

2024లోనే సౌందాళ మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. వితంతువుల పునర్వివాహానికి మద్దతునిచ్చే తీర్మానం చేసింది. వారిని అవమానకరంగా వేధించడం, తిట్టడం వంటివాటిని నిషేధించింది. చాలాచోట్ల స్థానిక సామాజిక సాంప్రదాయాలను సవాల్ చేసేలా సౌందాళ తీర్మానాలు యావత్ భారతాన్నే ఆకర్షిస్తున్నాయి. అందుకే సౌందాళ చేపట్టిన ఈ చర్యతో… పౌర సమాజ సంస్థలు ఫిబ్రవరి 5వ తేదీని ఇప్పుడు అంతర్జాతీయ కులరహిత దినోత్సవంగా ప్రకటించాలనీ ప్రతిపాదిస్తున్నాయి.

సౌందాళ తీర్మానం చెబుతున్న పాఠమేంటి..?

సౌందాళ తీసుకొచ్చిన ఈ గొప్ప సామాజిక మార్పు… నవ నాగరికమనుకుంటూనే ఆటవికంగా, అనాగరికంగా ప్రవర్తిస్తున్నవారికి చెంపపెట్టులాంటింది. భారత సమజాంలో ఇప్పటికీ కుల వ్యవస్థ బలంగా వేళ్లూనుకుని ఉన్న సమయంలో… జన్మ ఆధారిత గుర్తింపు కన్నా మానవత్వమే తమ కులమని, మతమని ప్రకటించి సౌందాళ ఒక కొత్త నిర్వచనాన్ని మిగిలిన ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ చిన్న గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం.. వేసిన ఈ ముందడుగు… వర్గరహిత సమాజంపై జరిగే చర్చలో ఓ విప్లవాత్మక చర్య.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles