మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే పెద్ద కోవర్ట్‌ ఆపరేషన్‌!

కోవర్ట్‌ ఆపరేషన్‌…!

–––––––––––––––––––

వడ్డాది శ్రీనివాస్‌… ✍🏻

సాధారణంగా పీపుల్స్‌ వార్‌ / మావోయిస్టు పార్టీ నేతలను అంతం చేయడానికి పోలీసులు అనుసరించే విధానమనేది బహిరంగ రహస్యం.

అంటే మావోయిస్టులలో ఒకరినో ఇద్దర్నో లోబరచుకుని.. ఆ పార్టీకి చెందిన పెద్ద నేతలను ‘ ఎన్‌కౌంటర్ల‘ పేరుతో అంతం చేయడం. అందుకు పూర్తి భిన్నమైన కోవర్టు ఆపరేషన్‌ చేసింది కేంద్ర హోమ్‌ శాఖ. పీపుల్స్‌ వార్‌ / మావోయిస్టు పార్టీ చరిత్రలో అతి పెద్ద కోవర్ట్‌ ఆపరేషన్‌ ఇదే. సంచలనమైన కోవర్ట్‌ ఆపరేషన్‌ లో అసలు కోవర్ట్‌ ఎవరో తెలుసా…మరెవరో కాదు..

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, పార్టీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ నే…నా…!?

2025 నవంబరు నుంచి సాగుతున్న పరిణామాలు నిశితంగా విశ్లేషిస్తే ఆ వాదనకు బలం చేకూరుతోంది. సగటు జనం ఆశ్చర్య పడవచ్చు… చింత చచ్చినా పులుపు చావని మావోయిస్టు సానుభూతిపరులకు నా మీద కోపం రావచ్చు…

కడుపు నిండిన వేదాంతంలా తమ పిల్లల్ని లైఫ్‌లో సెటిల్‌ చేసి… ఇతరుల పిల్లలు అడవుల పాలు కావాలని ప్రవచించే ఎర్ర మేథావులు నా మీద చిందులు తొక్కొచ్చు.

వస్తె రానీ కోపాల్‌ తాపాల్‌…!

తొక్కితే తొక్కని మందేసి చిందుల్‌…చిందుల్‌…!

నేను చెప్పాల్సింది చెప్పి తీరుతా… బరాబర్‌ చెబుతా.

నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ అన్నా… ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ అన్నా టార్గెట్‌ ఒక్కటే.. మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టేయడం… ఎన్‌డీయే ప్రభుత్వం 2026 , మార్చి 31 అని డెడ్‌ లైన్‌ పెట్టుకుని మరి ఆపరేషన్‌ కగార్‌ను ఉధృతంగా సాగిస్తూ మావోయిస్టు పార్టీని కకావికలం చేసేస్తోంది… ఏకంగా మావోయిస్టు సుప్రీం కమాండర్‌ గా ఉన్న నంబాల కేశవరావే( బసవరాజ్‌) గత ఏడాది మే లో ఎన్‌కౌంటర్‌ లో హతమయ్యారు. దాంతో మావోయిస్టు పార్టీ కి మిగిలి ఉన్న కొద్ది మంది అగ్ర నేతల్లో వణుకుపుట్టీ తమ ముసలి బతుకు మీద తీపి పుట్టింది.. చర్చలు , షరతులు, ఆయుధాలు విడిచి పెడతాం.. క్రాప్‌ హాలిడే తరహ లో తమకూ ఉద్యమ హాలీ డే కావాలి…ఇలా వన్‌ సైడ్‌ లవ్‌ లా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసి కాలం వెళ్ల్లదీయాలని చూశారు. పార్టీ అగ్ర నాయకత్వానికి లేఖల పేరుతో వర్గ పోరు బయటకు లీక్‌ చేశారు.. ఎంత డ్రామా నడిపినా కేంద్ర ప్రభుత్వం స్పందించ లేదు…దండకారణ్యాన్ని చుట్టు ముట్టిన కేంద్ర బలగాలు ఒక్క అడుగూ వెనక్కి వేయ లేదు.. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల రావు మరో 60మందితో కలసి 2025, అక్టోబరులో లొంగుబాటు రూపంలో కౌంట్‌ డౌన్‌ మొదలైంది.

ఇక మావోయిస్టు పార్టీకి చివరి దెబ్బ కొట్టాలి అని భావించిన కేంద్ర బలగాలు కొత్త తరహా కోవర్ట్‌ ఆపరేషన్‌ కు తెర తీశాయి… ఆ పార్టీ ఆగ్రనేతల్లో ఉన్న సందిగ్ధతను వాడుకుని ఏకంగా కుంభ స్థలాన్నే కొట్టాలని భారీ లొంగుబాటు ప్రక్రియకు పావులు కదిపాయి. అదే పార్టీ సుప్రీం కమాండర్‌ దేవ్‌జీ లొంగుబాటు ప్రక్రియ.. కాకపోతే చిన్న తేడా…సాధారణంగా లొంగుబాటు కు సిద్ధ పడే మావోయిస్టు నేతలు ప్రభుత్వానికి షరతులు పెడతారు.. తమను ఎన్‌కౌంటర్‌ చేయకూడదు… ప్రభుత్వం పరిహారం పేరుతో ప్యాకేజీ ఇవ్వాలి…ఇలా ఉంటాయి షరతులు. ప్రస్తుతం పూర్తి ఆధిపత్యం సాధించిన కేంద్ర బలగాలు మావోయిస్టు అగ్ర నేతలకే తిరిగి షరతు పెట్టాయి…మేము చెప్పింది చేస్తే లొంగుబాటు… లేక పోతే అడవుల్లోనే తేల్చుకుందాం అన్నట్టుగా. ఏమిటా షరతు అంటే…..

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్ట్‌ మాద్వి హిడ్మా…! Yes… మీరు చదివింది నిజమే…. హిడ్మా నే… వందలాది మంది పోలీసులు, రాజకీయ నేతలను అంతం చేసిన మావోయిస్టు దాడులకు నేతృత్వం వహించిన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి హిడ్మా లొంగుబాటు ప్రసక్తే లేదు… అలా అని దండకారణ్యాన్ని కాచి వడబోసిన ఆ గిరిజన బిడ్డను అడవి లో మట్టుబెట్టడం పోలీసుల తరం కావడం లేదు.. అందుకే హిడ్మా ను అడవి నుంచి బయటకు తీసుకురండి…మీరు ఎంచక్కా లొంగిపోండని పోలీసులు తేల్చి చెప్పారు. దాంతో మొదలైంది ఆపరేషన్‌ హిడ్మా…!

ఆ ఫలితమే… ఆపరేషన్‌ కగార్‌ ను తట్టుకోలేం… కొంత కాలం శ్రీలంక లో షెల్టర్‌ తీసుకుందాం అని మావోయిస్టు పార్టీ లో కీలక చర్చకు తెర లేచింది. సుప్రీం కమాండర్‌ దేవ్‌జీ, మిగిలి ఉన్న ఒకరిద్దరు అగ్ర నేతలతో పాటు హిడ్మా కాకినాడ, బందరు నుంచి మత్స్యకార బోట్ల లో గత ఏడాది నవంబరులో శ్రీలంక కు వెళ్ళిపోవాలన్నది ప్లాన్‌.. అందుకు ఏర్పాట్లు చేసేందుకు కొందరు మావోయిస్టులు ముందుగానే

కాకినాడ, ఏలూరు, విజయవాడ చేరుకున్నారు. శ్రీలంక కు వెళ్లడం నిజమే అనుకుని కొద్ది మంది సహచరులతో దండకారణ్యం విడిచి వచ్చిన హిడ్మా కేంద్ర బలగాలకు చిక్కారు.. ఫలితం… మారేడుమల్లి లో ఎన్‌కౌంటర్‌. మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా తో పాటు మరో అయిదుమంది హతం..

ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే..?

విజయవాడ, ఏలూరు, కాకినాడలలో ఏకంగా 51 మంది మావోయిస్టులను పోలీసులు 2025, నవంబరు 18న అరెస్ట్‌ చేశారు… అంత మంది మావోయిస్టులు ఎందుకు వచ్చారు అంటే… ఎవరి నుంచి సరైన సమాధానమే లేకుండాపోయింది. అగ్ర నేతల బాడీ గార్డులు గానే వచ్చారన్నది పోలీసువర్గాల అనధికారిక మాటే. ఓకే… బాడీ గార్డులు అరెస్టు అయ్యారు… మరి అగ్ర నేతలు ఏరీ….!? ఎక్కడ….!? అదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. వాళ్ళు మావోయిస్ట్‌ పార్టీ సుప్రీం కమాండర్‌ దేవ్‌జీ బాడీ గార్డులే అని అందరూ అన్నారు..కానీ అసలు అగ్ర నేత ఆచూకీ లేదు..అరెస్టు చేశారా అంటే అదీ లేదు… సుప్రీం కమాండర్‌ ను అరెస్టు చేయడం అసాధ్యం. కనీసం 35 మంది సాయుధులైన బాడీ గార్డుల రక్షణలో ఉండే మావోయిస్ట్‌ పార్టీ కార్యదర్శి వద్దకు పోలీసు బలగాలు చేరుకుని అరెస్ట్‌ చేయలేవు.. ఎదురు కాల్పులు జరిపి అంతం చేయ వచ్చు గానీ అరెస్టు చేయ లేవు..unless ఆ సుప్రీం కమాండర్‌ లొంగిపోతే తప్పా…!

ఇంతకీ దేవ్‌జీ ఎక్కడ అన్న ప్రశ్న కూడా లేవనెత్త కుండా మావోయిస్ట్‌ పార్టీ గత నవంబర్‌ నుంచి దాదాపు మౌనం వహించింది.. కొందరు కలప వ్యాపారులు మోసంతో హిడ్మా ఎన్కౌంటర్‌ అయ్యారు అనే మొక్కుబడి ప్రకటన తప్పా మావోయిస్ట్‌ పార్టీ నుంచి ఎటువంటి స్పందనా లేకుండా పోయింది.. దేవ్‌జీతోపాటు మావోయిస్టు అగ్రనేతలు మూడు నెలలు కాలయాపన చేశారు… ఈ మూడు నెలలు ఎక్కడ ఉన్నారో అంటే అదీ స్పష్టత లేదు.. కేంద్ర బలగాల అతిథులుగానే ఉన్నారని భావించాలి మరి. అందుకే అంతటా అంతటి గంభీర మౌనం…!

ఇక సుప్రీం కమాండర్‌ దేవ్‌జీ లొంగుబాటు ప్రహసనాన్ని ఫిబ్రవరిలో క్లైమాక్స్‌కు తీసుకురావాలని డిసైడ్‌ చేశారు. మల్లోజుల వేణు గోపాల్‌ రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎదుట లొంగిపోయేలా కేంద్ర హోమ్‌ శాఖ గతంలోనే కథ నడిపింది. అగ్రవర్ణ సీఎం కు పేరు వచ్చేలా బీజేపీ ప్రభుత్వం చేసింది… ఏం..! మావోయిస్టు సమస్య ను ఎక్కువగా ఎదుర్కొంటున్న ఛత్తీస్‌ఘడ్‌ సీఎం ఎదుట లొంగుబాటు ప్రక్రియ పూర్తి చేయ వచ్చు కదా… గిరిజన సీఎంకు ఎందుకు ఆ క్రెడిట్‌ ఇవ్వరు అనే విమర్శలు అప్పుడే వచ్చాయి… దాంతో దేవ్‌ జీ తో పాటు మరి కొందరు అగ్ర నేతల లొంగుబాటు ఛత్తీస్‌ఘడ్‌ సీఎం సమక్షం లో చేయాలని కేంద్ర హోమ్‌ శాఖ భావించింది.. అందుకు దేవ్‌జీ సమ్మతించ లేదు..తన స్వరాష్ట్రం తెలంగాణ లోనే లొంగిపోతానన్నారు. కేంద్రం అంగీకరించింది.. తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డికి సమాచారం ఇచ్చింది.. ఏదో తెలంగాణ పోలీసు బలగాలు దేవ్‌జీ తదితరులను చుట్టుముట్టినట్టు రెండు రోజులు మీడియా లో కథ నడిపారు.. ఎప్పుడు తెలంగాణ పోలీసులు వస్తే వెళ్లి షేక్‌ హ్యాండ్‌ ఇద్దామా అని దేవ్‌జీ & గ్యాంగ్‌ వెయిటింగ్‌ అక్కడ.. వాళ్ళు వచ్చారు… కేంద్ర బలగాలు దేవ్‌జీ & గ్యాంగ్‌ ను అప్పగించాయి. ఈ డ్రామా ముగిసే వరకూ సైలెంట్‌ గా ఉండలేక ఛత్తీస్‌ ఘడ్‌ ఉప ముఖ్యమంత్రి, హోమ్‌ మంత్రి విజయ్‌ శర్మ రెండు రోజుల ముందే విషయం బయటపెట్టేశారు. దేవ్‌జీ తెలంగాణ పోలీసులకు లొంగుబాటుపై తమకు సమాచారం ఉందని చెప్పారు.

అబ్బే మా వద్ద లేరు అని తెలంగాణ పోలీసులు ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా విషయం బయట పడిపోయింది.

ఇక అనుకున్న ముహూర్తానికి దేవ్‌ జీ & గ్యాంగ్‌ తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు.. కథ సమాప్తం..

ఈ మొత్తం ఎపిసోడ్‌ అంతా నడిపింది కేంద్ర పోలీసు బలగాలే.. హిడ్మా ఎన్‌కౌంటర్‌ ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఘనత కాదు. ఏపీ గ్రేహౌండ్స్‌ బలగాలు సీన్‌లో లేకుండానే ఆ ఎన్‌కౌంటర్‌ ముగియడం గమనార్హం. ఇక దేవ్‌జీ లొంగుబాటు ఎపిసోడ్‌లో తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డీ లాస్ట్‌ బాల్‌ సిక్స్‌ కొట్టడం కూడా ఏమీ లేదు. కేంద్ర హోమ్‌ శాఖ స్క్రిప్టులో రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలు పాత్రధారులు మాత్రమే. 1986 సాకర్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్లో అర్జెంటీనాను గెలిపించిన వివాదాస్పద గోల్‌ గురించి ఆ జట్టు కెప్టెన్‌ డిగో మరడోనా మాట్లాడుతూ ఆ గోల్‌ను చేతితో తోసి ఉంటే ఆ చేయి దేవుడి చెయ్యే అన్నాడు…. ఇక్కడా హిడ్మా ఎన్‌కౌంటర్, దేవ్‌జీ లొంగుబాటులో బయటకు కనిపించని ఆ దేవుడి చెయ్యి కేంద్ర హోమ్‌ శాఖదే…!

మావోయిస్ట్‌ పార్టీ ఆవిర్భావ కార్యదర్శిగా ముప్పాళ్ల లక్ష్మణరావు ( గణపతి) 2004 నుంచి 2017 వరకూ ఉండి వైదొలిగారు… అప్పుడు కార్యదర్శి పదవిని నంబాల కేశవరావు( బసవరాజ్‌), తిప్పిరి తిరుపతి( దేవ్‌జీ) ఆశించారు… నంబాల కేశవ రావు 2018, నవంబరులో మావోయిస్టు పార్టీ కార్యదర్శి అయ్యారు. 2025 మే లో ఎన్‌కౌంటర్‌లో మరణించే వరకూ కార్యదర్శి గా పార్టీని నడిపారు.. అనంతరం దేవ్‌జీ 2025, జూన్‌ లో పార్టీ కార్యదర్శి అయ్యారు…2025 నవంబర్‌ నాటికే కాడి కింద పడేశారు. అదీ హిడ్మా ఎన్‌కౌంటర్‌ ప్రణాళిక సాక్షి గా… వెంటనే లొంగిపోతే మరీ బయట పడిపోతామనే మూడు నెలలు వేచి ఉండీ మరో నలుగురు అగ్ర నేతలతో సహా సామూహిక ప్యాకేజీ గా లొంగిపోయారు.. అందులోనూ భవిష్యత్‌ అవసరాలు ఏమైనా ఉండవచ్చు అనే ముందస్తు ఆలోచన తో సొంత రాష్ట్రం తెలంగాణానే తన లొంగుబాటు కు వేదిక గా చేసుకున్నారు…

కేంద్ర ప్రభుత్వాన్ని ఒకందుకు అభినందించాలి.. మావోయిస్టు పార్టీ పై చివరి అతిపెద్ద దెబ్బ ఎన్‌కౌంటర్‌ తో కాకుండా లొంగుబాటు తో ముగించినందుకు. లేకపోతే పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచి వేశారు… ఇది నియంతృత్వం అని కడుపులో చల్ల కదలకుండా కూర్చొనే

ఎర్ర మేథావులు గగ్గోలు పెట్టేవాళ్ళు.. అలా కాకుండా ఏకంగా మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్‌ దేవ్‌జీ నే అవసాన దశ లో ఉన్న పార్టీని తీసుకువచ్చి దేశం ( మావోయిస్టు పరిభాష లో రాజ్యం) కాళ్ళ దగ్గర పడేశారు. అందుకే అంతటా మౌనం. సోషల్‌ మీడియాలో

ఎర్ర మేథావుల శోకాలు లేవు… ప్రభుత్వం, పోలీసులపై తిట్లూ శాపనార్థాలు లేవు. అంతటా ష్‌…! గప్‌ చుప్‌…!

చివరగా… దేవ్‌జీ & గ్యాంగ్‌ హాయిగా తమ కుటుంబాలతో శేష జీవితం హాయిగా గడపాలి. మరో నయీం కాకుండా ఉంటే అంతే చాలు. తమ పిల్లలను అమెరికాలోనో మరెక్కడో సెటిల్‌ చేసిన ఎర్ర మేథావులు ఇతరుల బిడ్డలను మాత్రం ఉద్వేగం..ఉద్యమం అంటూ విప్లవ ఉద్యామాల్లో చేరాలని ఎర్ర పలుకులు పలికితే… చూపించేందుకు రెండు అంశాలు మిగిలి ఉన్నాయి…

గుడ్డితో నడ్డిదో నమ్మిన సిద్ధాంతం కోసం, ఉద్యమం కోసం చివరి వరకూ కట్టుబడి ప్రాణాలు కోల్పోయిన నంబాల కేశవ రావు, హిడ్మా ఫోటోలు చూపాలి..

ఉద్యమం అంటూ అడవుల్లోకి పోయి… తాము ఎందరినో చంపి…. తమ వెంట వచ్చిన వాళ్ళ చావులకు కారణమై… అవసాన దశలో ‘జ్ఞాన బల్బు’ ఠక్కున వెలిగి… పోలీసులకు లొంగిపోయి ఎంచక్కా కుటుంబాలతో సెటిల్‌ అయిన దేవ్‌జీ , మల్లోజుల వేణు గోపాల్‌ రావు, మల్లా రాజి రెడ్డి వంటి వాళ్ళ ను చూపించాలి..

ఆచరణ సాధ్యం కాని మూర్ఖపు భావజాలం తో విప్లవ ఉద్యమాల్లోకి వెళితే… ఆ రెండు గమ్య స్థానాలే ఉంటాయి… తప్పా నిలిచేది గెలిచేది సార్వభౌమాధికారం కలిగిన దేశమే అన్నది భావి తరాలకు చూపించాలి. వాళ్లు దారి తప్ప కుండా కాపాడుకోవాలి. వామపక్ష విప్లవ భావజాలం ప్రజాస్వామ్యానికి ఎప్పటికీ ప్రత్యమ్నాయం కాదన్న నిజాన్ని అందరూ గుర్తించేలా చేయాలి. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామిక విధానానికి మించిన వ్యవస్థ ప్రపంచంలో లేదు…ఇక ముందు రాదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles