Anwar The Artist… ✍🏻
ఇక నా పని అయిపోయిందా, నేనిక చచ్చి పొతానట్రా నాయనా? దిగాలుగా అడిగింది ముసలమ్మ మనవడితో. పిల్లవాడికి ఒక క్షణం పాటు ఏం చెప్పాలో తోచలేదు. “లేదు లే అమ్మమ్మా, నువ్వు పూజలు చేసే దేవుడి దయ నీకు దండిగా ఉంటుంది . అదీ కాక నువ్వు చాల సంవత్సరాల కిందటి నుండి మాంసం తినడం మానేశావుగా, నీ పంటి కిందకు నలగని ఆ జీవాలు అన్ని కూడా నీకోసం జాలితో ప్రార్థిస్తాయిలే, దీవెనలు ఇస్తాయిలే” అన్నాడు మనవడు.

నా చిన్నతనం నుండి మా మేనత్తలు, పిన్నమ్మల చుట్టుముట్టూ పెరిగాను నేను. వాళ్ళ అందరి ఇళ్ళు మా చుట్టు పక్కలే. మేము ముసల్మానులం కదా. గొప్ప రుచి మా ఇంటి వంటలది. అందునా మా ఇళ్ళ మాంసపు కూరల గురించి చెప్పనక్కరలేదు. భగవంతుడి ఇష్ట వంటశాల మా ఇల్లు. మా జేజీని, పేరు పేరునా మా పిన్ని, మేనత్తలని గుర్తు చేసుకున్నపుడల్లా ఒక్కో వంటకం నా నోట్లో నీళ్ళు తెప్పిస్తుంది. ఈ వంట వండాలంటే మా నూరాపా అత్తనే, ఆ కూర చేయాలంటే మా చాంద్ బి అమ్మనే, చేప ముక్క తన జన్మలో నోట పెట్టి ఎరగదు మా జేజి, చేపల పులుసు పొయ్యి మీద ఘుమ ఘుమలాడాలంటే మా జేజెమ్మనే వండాలి. పెనం మీద దోశ సుర సుర సుయ్ మనాలంటే మా మాబున్ని అమ్మ చెయ్యి పడాల్సిందే. ఇక ముంతాజ్ ఆంటీ చేసే కీమా సంగతి, చిట్లం పొడి వ్యవహారం తలుచుకోకుంటే మహా పాపం. ఒకటా రెండా, ఏభైనా వందా! తిన్న తిండ్లు. నాలిక పై నుండి నర నరానికి నషాళానికి ఎక్కిన రుచులు. మాంసపు వంటలు అంటే అమితంగా నాకిష్టం. ఉన్నట్టుండి ఒక రోజున మాంసాన్ని మానేశా నేను. తమాషాకి అంటున్నాడులే అనుకున్నారు నా భార్యా పిల్లాడు. లేదు ఇక ఈ జన్మకు మాంసం ముట్టేది లేనే లేదు. ముట్టడం లేదు కూడా, అలా అని దేవుడికి మాట ఇచ్చుకున్నాను నేను . ఎందుకో అదంతా చెప్పనవసరం లేని అనవసర కథ.
అవసరమైన ఈ కథలో మాత్రం నేను ముందర చెప్పిన మనవడి తాలూకు అమ్మమ్మ తీవ్ర జబ్బున పడి ఉంది, రోజులో, వారమో మిగిలిన ఆయుష్షు అంతే. ఆవిడని చూడ్డం కోసం వచ్చారు కొడుకు, కోడలు, వాళ్ళ పిల్ల . కోడలు , మనవరాలు కారు దిగి ఇంట్లోకి వెళ్ళారు. కొడుకు మాత్రం అమ్మని చూడ్డానికి ఇంట్లోకి రాలేదు. గంటు పోయినట్లు మొహం పెట్టుకుని కారులోనే కూర్చుని ఉన్నాడు. అమ్మమ్మ గారి మనవడు మేనమామ దగ్గరికి వచ్చాడు. మరే మామా, నీకు తెలుసో లేదో ఈ సంగతి. నాకు అమ్మమ్మ నే చెప్పింది. ఆవిడకు మాంసపు వంటలు అంటే మహా ప్రీతిట. నువ్వు చిన్నతనంలో బలహీనంగా ఉండేవాడివట, తరచూ జబ్బులే నీకు . అమ్మమ్మ దేవుడికి దణ్ణం పెట్టుకుందిట. స్వామి! నా పిల్లవాడిని స్వస్థపరుచు, అందుకోసమని నేను ఎంతగానో ఇష్టపడే మాంసం కూరని తినడం ఈ క్షణం నుండి తినడం మానేస్తా. ఆ తర్వాత పిల్లాడు పెరిగి పెద్దయ్యి గొప్పవాడు కూడా అయ్యాడు. అమ్మ మాత్రం రుచిని చంపేసుకుంది. ఈరోజు పిల్లాడు అమ్మని చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు.
ఈ సినిమా పేరు How to make million before grandma dies. బహుశా త్వరలో Netflix లో విడుదలవుతుంది. థాయ్ సినిమా. ఈ సినిమా చూస్తూ మునుపెన్నడూ నేను చేయని పని ఒకటుంది. ఈ సినిమాలో మనవడి పాత్ర ధరించిన Putthipong Assaratanakul అనే అబ్బాయి దాదాపు నా పిల్లవాడి వయసంతటి వాడు. దేవుడా నా పిల్లవాడు జీవితంలో ఎంత వర్ధిల్లాలో, ఈ నటుడు అంతే వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నా కోరిక మన్నించు స్వామి. నాకు తెలిసి నేను ఎప్పుడూ ఏ సినిమా వాళ్ళ గురించి ఎప్పుడూ ఇట్లా ప్రార్థించలేదు. మొదటి సారి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి, ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి గురించి, ఈ సినిమా తీసిన దర్శకుడి గురించి, వారి బాగు గురించి భగవంతుడి దీవెనలు వేడుకున్నాను. ఇట్లాంటి వాళ్ళ వల్లే సినిమా అనేది ఒక కళ గా, ఒక మానవీయ సమాలోచనగా, ఒక సృజనగా మనకు ఉండిపోతుంది. సమయం దొరికితే , సమయం ఉంటే సినిమా చూడగలరు.



