ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఆట… బెట్టింగులు పెట్టుకుని మరీ నిరీక్షించిన క్రీడ.. అంతవరకూ స్టార్స్ గా.. స్టార్ జట్లుగా గుర్తింపు పొందినవన్నీ… ఒక్క ఫైనల్ దెబ్బతో వెనుకబడిపోయాయి. లీగ్ మ్యాచుల నుంచి ఫైనల్ వరకూ ఒక్క గోలూ చేయని ఓ క్రీడాకారుడు.. కీలకమైన ఫైనల్ లో ఒకే ఒక్క గోల్ తో ప్రపంచం మనసు దోచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫెర్రాన్ టొరెస్ అనే పేరునే పలువరిస్తోంది.
2026 ఫిఫా ప్రపంచ కప్ అంటే… మొత్తం 104 మ్యాచులు… 48 జట్లు… గ్రూప్ దశలో 72 మ్యాచులు… నాల్గు క్వార్టర్ ఫైనల్స్… రెండు సెమీస్.. చివరకు ఫైనల్స్… ఫైనల్స్ లో ఫైనల్ గోల్ వరకూ కూడా పెద్దగా వినిపించని పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మార్మోగిపోతోంది. ఫైనల్ వరకూ వినిపించిన పేర్లు.. వారి గురించిన కథనాలన్నీ ఇప్పుడు మూగబోయాయి. అర్జెంటీనాపై స్పెయిన్ సాధించిన విజయంతో ఎవ్వరూ ఊహించని ఓ కొత్త హీరో పేరు ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది.
ఫెర్రాన్ టొరెస్ స్పెయిన్ క్రీడాకారుడు. 2026 ఫిఫా ప్రపంచకప్ లో స్పెయిన్ ను విజేతగా నిలబెట్టిన బార్సిలోనా స్టార్ ఆటగాడు. జూలై 19న ఆర్ధరాత్రి వేళ.. అర్జెంటీనా దూకుడు కంటే డిఫెన్స్ వ్యూహమే గొప్పదని నిరూపించిన స్పెయిన్ తరపున ఒకే ఒక్క గోల్ చేసి అర్జెంటీనాను 1-0తో మట్టి కరిపించి.. స్పెయిన్ కు రెండో ప్రపంచ కప్పును అందించిన ఫుట్ బాల్ ధీరుడే ఫెర్రాన్ టొరెస్.

టోర్నమెంట్ మొత్తంలో ఒక్క గోల్ కూడా లేదు!
ఫైనల్ లో అర్జెంటీనాపై స్పెయిన్ గెలుపుకు ముందు ఎందరో ఆటగాళ్లల్లో ఫెర్రాన్ టొరెస్ ఒకడు. టోర్నమెంట్ మొత్తంలో ఒక్క గోల్ కూడా చేయని ఎవ్వరి దృష్టినీ ఆకర్షించని ఆటగాడు. కానీ, కీలకమైన మ్యాచులో.. కీలకమైన వేదికపై అత్యవసర సమయంలో ఈ 26 ఏళ్ల దూకుడు తన ప్రతిభను చాటుకుని ఇప్పుడు చర్చగా మారాడు. వరుసగా రెండోసారీ ప్రపంచకప్ సాధించాలన్న అర్జెంటీనా ఆశలకు గండి కొట్టి… అదే సమయంలో స్పానిష్ ఫుట్ బాల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని సంపాదించుకున్నాడు ఈ కుర్రాడు.
స్పెయిన్ ఫుట్ బాల్ చరిత్రలోనే అరుదైన ఘనత!
ఫెర్రాన్ టొరెస్ కు ముందు ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ లో స్పెయిన్ తరపున గోల్ చేసిన ఏకైక ఆటగాడు ఆండ్రెస్ ఇనియెస్టా మాత్రమే. 2010లో నెదర్లాండ్స్ పై జరిగిన ఫైనల్ లో ఇనియోస్టా చేసిన గోల్ తో స్పెయిన్ తన తొలి ప్రపంచ కప్ గెల్చుకుంది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత ఆ ఘనతను టొరెస్ సాధించాడు. అయితే, రెండుసార్లు కూడా స్పెయిన్ 1-0తోనే గెలవడం విశేషమే కాదు యాదృచ్ఛికం కూడా. వేర్వేరు తరాలకు చెందిన ఈ ఇద్దరు ఆటగాళ్ల గోల్స్ స్పెయిన్ ప్రపంచ కప్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టాలుగా నిల్చిపోయాయి.
ఫెర్రాన్ టొరెస్ ఎవరు..?
2000, ఫిబ్రవరి 29న వాలెన్సియా సమీపంలోని ఫోయోస్ పట్టణంలో పుట్టిన ఫెర్రాన్ టొరెస్ గార్సియా… స్పెయిన్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫుట్ బాల్ అకాడమీల్లో ఒకటైన వాలెన్సియా యూత్ అకాడమీలో శిక్షణ పొందాడు. చిన్న వయస్సులోనే ఫుట్ బాల్ పై మక్కువతో ఎదిగి యువజన క్లబ్ లో అత్యంత ప్రతిభావంతమైన యువ ఆటగాడిగా గుర్తింపు పొందాడు
వాలెన్సియా టూ మాంచెస్టర్ టూ బార్సిలోనా.. ఫెర్రాన్ ప్రయాణం!
వాలెన్సియా తరపున అద్భుతంగా రాణించడంతో టొరెన్ పై యూరప్ లోని అగ్రశ్రేణి ఫుట్ బాల్ క్లబ్బుల దృష్టి పడింది. 2020లో మాంచెస్టర్ సిటీకి చేరాడు. మాంచెస్టర్ లో పెప్ గార్డియోలా అనే కోచ్ శిక్షణలో మరింత రాణించి 43 మ్యాచుల్లో 16 గోల్స్ చేశాడు. అతడి ఆటను మెచ్చిన బార్సిలోనా 2022లో టొరెస్ ను 55 మిలియన్ యూరోలకు కొనుగోలు చేసింది. బార్సిలోనా తరపున 207 మ్యాచులాడి 65 గోల్స్ సాధించాడు. తనెంత విలువైనవాడో చెప్పాడు.
అలాంటి ఫెర్రాన్ టొరెస్ ఇప్పుడు ప్రపంచ కప్ గెలుపులో కీలకంగా మారి ప్రపంచవ్యాప్త చర్చయ్యాడు. కప్ జరిగినంత కాలం చర్చల్లో ఉన్నవారందరి పేర్లనూ.. ఒకే ఒక్క తన గోల్ తో చెరిపేశాడు.



