పర్యావరణాన్ని ప్రేమించేవాళ్లు ఒకింత పిచ్చితో ఉంటారు. అంటే ఆ పిచ్చిలో వారి పట్టుదల కనిపిస్తుంది. అలాంటి ఓ 23 ఏళ్ల యువతి కథే ఇది.
ఉత్తర కాలిఫోర్నియాలో సుమారు వెయ్యేళ్ల పురాతనమైన రెడ్ వుడ్ చెట్టు పేరు లూనా. జూలియా బటర్ ఫ్లై హిల్ అనే 23 ఏళ్ల యువతి 180 అడుగుల ఎత్తులో ఉన్న ఆ చెట్టుపైకెక్కింది. మొట్టమొదట పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆ చెట్టుపై ఉండాలనుకుంది. అయితే, ఆతర్వాత ఆ చెట్టును నరికేయకుండా కాపాడేందుకు ఏకంగా 738 రోజులు చెట్టుపైనే గడిపింది.
చెట్టుకు ఎత్తులో ఏర్పాటు చేసిన రెండు చిన్న చెక్క వేదికలే ఆమె నివాస ప్రాంతాలు. తీవ్రమైన తుఫాన్లు, గడ్డ కట్టే చలి, ఒంటరితనంతో పాటు.. లాగింగ్ కంపెనీ ఒత్తిళ్లను తట్టుకుని రెండేళ్లకు పైగా లూనా అనే రెడ్ వుడ్ చెట్టుపైనే గడిపిన జూలియా బటర్ ఫ్లై హిల్ కథ.. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో ఒక పరాకాష్ఠలా నిల్చింది. ఎందరో ఉద్యమకారులకు జూలియా బటర్ ఫ్లై హిల్ ఓ ఇన్స్పిరేషన్ గా మారింది.

అసలు ఆమె ఉద్యమ నేపథ్యమేంటి..?
1974, ఫిబ్రవరి 18న అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం మౌంట్ వెర్నన్ లో జన్మించింది జూలియా బటర్ ఫ్లై హిల్. ఆమె తండ్రి ఒక సంచార క్రైస్తవ మతబోధకుడు కావడంతో చిన్ననాట్నుంచే అమెరికా అంతా చుట్టేసింది.
జూలియాకు బట్టర్ ఫ్లై అనే పేరు రావడం వెనుక కూడా ఓ కారణముందట. చిన్నప్పుడు ట్రైక్కింగ్ చేసేటప్పుడు ఓ సీతాకోకచిలుక ఆమె వేలుపై వాలింది. ఆ ట్రెక్కింగ్ పూర్తయ్యేవరకూ కూడా ఆమెనే అంటిపెట్టుకుని ఆ బటర్ ఫ్లై ఉండటంతో.. ఆమె పేరులోకి కూడా బటర్ ఫ్లై వచ్చి చేరింది.
1996లో మద్య మత్తులో వాహనం నడిపిన డ్రైవర్ కారణంగా ఓ రోడ్డు ప్రమాదంలో జూలియా తీవ్రంగా గాయపడింది. ఆ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత తన జీవిత లక్ష్యాల్ని గురించి కొత్త ఆలోచనలతో బయల్దేరింది జూలియా బటర్ ఫ్లై హిల్. ఆ సమయంలో ఉత్తర కాలిఫోర్నియాకు వెళ్లి.. అక్కడ రెడ్ వుడ్ అడవులను నరికివేయకుండా కాపాడేందుకు పోరాడుతున్న పర్యావరణ కార్యకర్తలతో జత కలిసింది.
కొన్ని రోజులనుకున్నది రెండేళ్లు పట్టింది!
1997 డిసెంబర్ 10వ తేదీన జూలియా.. లూనా చెట్టుపైకెక్కింది. మొదట ఈ నిరసనలో భాగంగా కేవలం కొన్ని రోజులు మాత్రమే చెట్టుపైనుండాలని భాావించింది. కానీ, ఆ చెట్టుతో పాటు.. రెడ్ వుడ్ చెట్లతో ఉన్న ఆ అటవీ ప్రాంతం ప్రమాదంలో ఉందని భావించిన జూలియా ఆ చెట్టు, ఆ అడవి వైభవాన్ని కాపాడేందుకు నడుం బిగించింది. అలా కొద్దిరోజులకే పరిమితమనుకున్న జూలియా నిరసన.. ఏకంగా రెండేళ్లకు పైగా 738 రోజుల పాటు సాగింది. అలా జూలియా ఓ చారిత్రాత్మక పర్యావరణ ఉద్యమంతో ఆ రంగంలోనే ఓ స్ఫూర్తి ప్రదాతలా ప్రశంసలందుకుంది. ఆమె నిరసన మీడియా దృష్టిని ఆకర్షించింది. అలా లూనా అడవుల పరిరక్షణకు జూలియా అంతర్జాతీయ చిహ్నంగా మారింది. అడవుల పరిరక్షణలో బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందింది.
180 అడుగుల ఎత్తులో జీవితం ఎలా సాగింది..?
రెండేళ్లకు పైగా లూనా చెట్చే జూలియాకు ఇల్లు. 6 అడుగుల ఎత్తు, 8 అడుగుల పరిమాణంలో ఉన్న రెండు చిన్న చెక్క వేదికలపైనే ఆమె నివశించింది. వాన వచ్చినా, గాలి పెట్టినా, మంచు కురిసినా, ఎండ కొట్టినా కేవలం టార్పాలిన్ షీట్స్ మాత్రమే ఆమెకు దిక్కు.
జూలియా తరహాలోనే లూనా అటవీ సంరక్షణ కోసం ఉద్యమిస్తున్న స్వచ్చంద కార్యకర్తలు ఆమెకు తాళ్ల సాయంతో ఆహారం, తాగునీరు, పుస్తకాలు, బ్యాటరీలు, ఇతర అవసరమైన వస్తువులన్నీ పైకి పంపించేవారు. సౌరశక్తితో పనిచేసే పరికరాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు ఇంటర్వ్యూలను కూడా చెట్టుపైనుంచే ఇచ్చేది జూలియా.
అలా ఆమె రెండు పుట్టినరోజులు, క్రిస్మస్ పండుగలతో పాటు.. సాధారణ రోజులన్నింటినీ ఆ చెట్టుపైనే జరుపుకుంది. పక్షులు, ఉడతల వంటి అడవి జీవులతో కలిసి జీవించింది. ఒంటరితనం తీవ్రంగా బాధపెట్టినప్పటికీ.. ఆ చెట్టుతో, దాని చుట్టూ పెనవేసుకున్న ప్రకృతితో ఒక లోతైన అనుబంధం ఏర్పడిందని లూనా చెప్పేది.
తుఫాన్లు, హెలికాప్టర్లు, నిరంతర ఒత్తిడితో సవాళ్లనెదుర్కొన్న జూలియా!
లూనాపై జూలియా జీవితం ఏమాత్రం సులభంగా గడవలేదు. 1997-98లో వచ్చిన శక్తివంతమైన ఎల్ నినో తుఫాన్ల సమయంలో గంటకు 70 మైళ్ల వేగంతో వీచిన గాలులకు చెట్టు తీవ్రంగా ఉగేది. నిరంతరం తేమ వాతావరణ, బలమైన గాలులు ఇవన్నింటినీ తట్టుకునే ఆమె 180 అడుగుల ఎత్తులో రెండేళ్లకుపైగా తన ఉద్యమాన్ని కొనసాగించడం ఊహించుకోవడానికి కూడా భయపడే ఓ హిస్టరీ.
ఓవైపు ప్రకృతి సృష్టించే బీభత్సాలతో పాటు… ఆ అటవీ ప్రాంతంలో అసలు ఉద్యమకారుల నిరసనలకు కారణమైన పసిఫిక్ లుంబర్ కంపెనీ నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది జూలియా. హెలికాప్టర్లను చెట్టు సమీపంల తిప్పడం, నిరంతరం భద్రతా సిబ్బందితో పర్యవేక్షించడం, నిరసన విరమించేందుకు బెదిరింపులకు పాల్పడం వంటి పలు ప్రయత్నాలన్నింటినీ తట్టుకుందేగానీ.. తన నిర్ణయం నుంచి మాత్రం జూలియా బటర్ ఫ్లై హిల్ వెనక్కి మాత్రం తగ్గలేదు.
లూనాను కాపాడింది.. విజయం సాధించింది!
దాదాపు రెండేళ్ల చర్చల అనంతరం 1999, డిసెంబర్ లో పసిఫిక్ లుంబర్ కంపెనీ దిగివచ్చింది. దాంతో జూలియాకు, కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా లూనా చెట్టుతో పాటే.. దాని చుట్టూ మూడు ఎకరాల్లో ఉన్న భూభాగాన్నీ, అటవీ ప్రాంతాన్ని శాశ్వతంగా రక్షించాలన్న డిమాండ్ కు కంపెనీ ఒప్పుకుంది. దాంతో జూలియా తన నిరసనను విరమించింది.
అలా 1999 డిసెంబర్ 18వ తేదీన జూలియా బటర్ ఫ్లై హిల్ నిరసన ముగిసింది.
తన శాంతియుత ఉద్యమంతో పరిరక్షణకు నోచుకున్న లూనా చెట్టు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిల్చింది. ఒక వ్యక్తి పట్టుదలతో నిలబడితే ఎంతటి మార్పును తీసుకురావచ్చో జూలియా నిరూపించింది.
నిరసన తర్వాత కూడా లూనా చెట్టుపై ఆగని దాడులు!
జూలియా చెట్టుపై నుంచి దిగిన తర్వాత కథ అక్కడితో ముగియలేదు. 2 వేల సంవత్సరంలో ఓ గుర్తు తెలియని దుండగుడు లూనా కాండాన్ని కొట్టేసే ప్రయత్నం చేశాడు. పర్యావరణ ప్రేమికులు ఆ చెట్టును మళ్లీ కోలుకునేలా చేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పటికీ లూనా పరిరక్షణను కొన్ని సంస్థలే ప్రత్యేకంగా చూసుకుంటున్నాయి.
ఉద్యమం తర్వాత జూలియా జీవితం..?
ఈ చారిత్రాత్మక ఉద్యమం తర్వాత జూలియా ది లెగసీ ఆఫ్ లూనా అనే ఓ బుక్ కూడా రాశారు, ఆ పుస్తకం విపరీతంగా అమ్ముడుబోయింది. ఆ తర్వాత సర్కిల్ ఆఫ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి.. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రసంగాలు చేస్తూ ప్రముఖ హక్కుల కార్యకర్తగా గుర్తింపు పొందింది.
అందుకే, జూలియా బటర్ ఫ్లై హిల్ కథ నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఓ స్ఫూర్తి పాఠం. ఆమె స్ఫూర్తితో రెండున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ కాలిఫోర్నియా తీర ప్రాంత అడవుల్లో ఆ పురాతన రెడ్ వుడ్ చెట్టు లూనా గర్వంగా తలెత్తుకుని కనపిస్తోంది.
పర్యాటకులకు, వీక్షకులకు అదో అద్భుతమైన చెట్టు మాత్రమే కావచ్చుగానీ.. జూలియా బటర్ ఫ్లై హిల్ కు మాత్రం అదో ఇల్లు.. ఆశకు ప్రతీక.. ఓ వ్యక్తి గట్టి పట్టుదల ప్రపంచాన్ని కూడా మార్చగలదనేందుకు ఓ సజీవ సాక్ష్యం, అంతకుమించిన ఓ సందేశం.



