మై వాపస్ ఆవూంగా హిట్ తో ఇంతియాజ్ అలీ పేరు మళ్లా బాగ ఇన్పిస్తోంది. ఎండితెరపై ధగధగా మెరిచిపోతున్న ఈ పేరెనుకాల… కథేంది మరి..? బడికొమ్మంటే పోనోడు… 9లో గుండుసున్నాతో గుడ్డు పెట్టినోడు.. అంత పెద్ద డైరెట్రెట్లయిండు..?
జంషెడ్ పూర్ కాడ పుట్టిన బిడ్డడు ఇంతియాజ్ అలీ. 9 తప్పిందర్వాత తనపై తనకే నమ్మకం కోల్పోయిండు. కానీ, ఆ కసే ఆయన సదివే తరీఖు మార్చేసింది. దాంతో ఢిల్లీ యూనివర్సిటీలనే టాపరైండు. కథలు సెప్పుడే సిసలైన బతుకు లక్ష్యమైనాది. గా కోరికతోనే తరతరాల ప్రేక్షకుల హృదయాలను తాకే సైనిమాల్దీసుడు షురూ చేసిండు.

బతుకెంత గందరగోళమైనా మనల్ని సరైన తొవ్వలోకే తీసుకొస్తదని జబ్ వీ మెట్ లోన చెప్పిన గీత్ నా… మాటలల్ల సెప్పని ఒంటరితనాన్ని మోసుకొచ్చిన రాక్ స్టార్ జోర్డాన్ నా.. తనది కాదనుకున్న బతుకు బంధాల్నుంచి బయటపడాలనుకునే తమాషాలోని వేద్ నా.. లేక, అన్నీ పోగొట్టుకుని ఆ తర్వాత స్వేచ్ఛను వెతికి పట్టుకున్న వీరానా…?
కానీ, ఇదే ఇంతియాజ్ అలీ సైన్మా మాయ. కల్పించి సెప్పని పాత్రలు… మన బతుకుల్నే నిజంగా ఎండితెరపై సూస్తున్నమా అన్నట్టు పరుస్తడు కాబట్టే ఈ డైరెట్రు హిట్టైండు. తన సైన్మాలకింత క్రేజీ. మర్సిపోలేని కథల్ని సెక్కుతున్న ఈ జక్కన.. దర్శకుడు కాకమునుపు పేద్ద పోరాటమే సేసిండు తెలుసా..?
ఓటమితోనే గెలుపు నేర్చుకున్నడు!
తొమ్మిదిల ఫెయిలైనంక గా రిజల్ట్ తో డిప్రెషన్ లోకి పోయిండు కాక. స్కూల్ కు పంగనామం పెట్టిండు. బడి గేటు దగ్గరకోవుడు.. ఆడు ఈడు ఎటకారం సేస్తరేమోనని భయపడి మళ్లా ఇంటికొచ్చుడు.. ఇదే పని. ఇట్లాంటి ఓటములు ఇంతియాజ్ అలీ అసొంటోళ్లనెందరిపైనో బతుకంతా ముద్రేస్తై.
కానీ, ఇంతియాజ్ మాత్రం ఆ ప్రశ్నకే జవాబు ఎతుకుడు మొదలెట్టిండు. బట్టీ పెట్టుడు బన్జేసిండు. అర్థం చేసుకునుడు మొదలెట్టిండు. ఎంతర్థమైతే అంతే మనసున పట్టిచుకోవాలనే ఫిలాసఫీకొచ్చిండు. సదివే ఇధానాన్నే పూర్తిగా మార్చేసిండు. గా మార్పే ఇంతియాజ్ బతుకుచిత్రాన్నీ మార్చేసినాది.
తొమ్మిదిలో పీకినోడే యూనివర్సిటీల అడుగుపెట్టి టాపరైండు.
సిత్తం సెప్పుల మీద – భక్తి దేవుడి మీద!
ఇద్యలో ఇరగదీసుడు షురూ అయినా మనసు మాత్రం ఇంకేడనో ఉండేది కాకకు. నాటకాల పిచ్చీ, సోకూ తగిలింది. వీధి నాటకాలు రాసుడు షురూ చేసిండు. నటించిండు. రోజూ సూసే బతుకులే తన డ్రామా క్యాన్వాసులు. అట్లా కథలు సెప్పుడు ఇష్టం నుంచి బతుకంతా అదే ఐపోయినాది. ఆ రంగస్థల అనుభవాలతో ముంబై ట్రైనెక్కిండు. ఆడే టెలివిజన్ తో మళ్లీ కొత్త బతుకు మొదలైంది. మన హైదరాబాద్ కృష్ణానగర్ సైన్మా బతుకుల్లాగే కష్టాలూ, ఎథలకేం తక్కువ లేదు. కానీ, గట్టి పట్టు వట్టిండు. దర్శకుడైండు.
కథలు సెప్పే ఇధానంతో గుండెల్లో నిల్సిపోయిండు!
ఓ జబ్ వి మెట్, ఓ రాక్ స్టార్, ఓ హైవే, మరో తమాషా, ఇప్పుడు మై వాపస్ ఆవూంగా ఇయన్నీ అతిశయోక్తిలేం కాదు. బతుకు పరమార్థం కోసం.. ప్రేమ, స్వేచ్ఛ, గుర్తింపు కోసం ఎతికిన సామాన్యుల కథలు. అందుకే ఈ సైన్మాలన్నీ సూస్తూనే ఉన్నరు. మాట్లాడుకుంటున్నరు.
ఒక్కటైతే పక్కా… కొన్నిసార్లు తొవ్వ తప్పినోడే.. అసలైన తొవ్వ దొరకబడుతడని ఇంతియాజ్ అలీ నిరూపించిండు. అందుకే ఆయన సైన్మాలన్నీ మనకు అవే సెబుతూంటై.
ఫైయిలైనని బడి గేటుకాడనే ఆగిపోతే ఆ పోరగాడు.. ఇవాళ తన కథలతో కోట్లాది మంది తమ బతుకుల్నే ఎండితెరపై సూస్కునేంత గొప్ప సైన్మాలను తీయకపోతుండేనేమో!
అందుకేనేమో ఇంతియాజ్ అలీ తన ప్రతీ సైన్మాలో మనకదే సెప్పేందుకు సూస్తుంటడు. అన్నీ కూలిపోయినట్టు అనిపించినప్పుడు మొదలెట్టుడే గొప్ప ప్రయాణం. ఇదే మనకు ఇంతియాజ్ అలీ సెప్పే ఓ పాఠం.



