సినిమా కూడా ఓ జూదం. చేయి తిరిగి కలిసొస్తే మూడు ముక్కలాటలో కింగూ అవ్వొచ్చూ. దురదృష్టం వెంటాడితే జోకర్ గానూ మిగిలిపోవచ్చు. ఆ బాలీవుడ్ డైరెక్టర్ విషయంలో జోకరే నిజమైంది. క్లిక్ అయితే ఎత్తుకునేవాళ్లు, సినిమా చేసి పెట్టమని అడిగేవాళ్లెందరో. బొక్కాబోర్లా పడితే ముక్కూమొఖం తెలియనట్టు వ్యవహరించేవాళ్లూ అంతకుమించే. బీ గ్రేడ్ సినిమా డైరెక్టర్ గా అప్పటికే కొన్ని చిత్రాలు చేసిన ఆ దర్శకుడు.. మరికొంత ఎదగాలనుకున్నాడు. ఏ గ్రేడ్ సినిమాలవైపు ఆయన దృష్టి పడ్డాక.. ఆయన జీవితం ఎలా మారిపోయింది..? కిక్కునిచ్చే సక్సెస్ ను మించి విషాదాన్ని మిగిల్చిన ఓ ఫెయిల్యూర్ స్టోరీ కమ్రాన్ ఖాన్.

ప్రస్తుత బాలీవుడ్ దర్శకులైన ఫర్హాఖాన్, సాజిద్ ఖాన్ తండ్రే కమ్రాన్ ఖాన్. గతి తప్పిన తండ్రి నడవడిక, కుటుంబం ఆర్థిక దైన్యస్థితిలో ఉన్నప్పుడు ఫర్హాఖాన్ డ్యాన్సర్ అవతారమెత్తితే… సాజిద్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా షోలు చేస్తూ పొట్ట పోసుకున్నారు. ఇవాళ వారిద్దరి ఆర్థిక పరిస్థితీ అత్యున్నతంగా ఉండొచ్చు సరే.. విషాదమయమైన తన తండ్రి జీవిత ప్రయాణంలో వారి అడుగులూ ఎంత విచారకరంగా సాగాయో చెప్పేదే ఈ కథ.
1960ల వరకూ బాలీవుడ్ నటుడిగా, స్టంట్ మ్యాన్ గా అలరించిన కమ్రాన్ ఖాన్.. 1960 – 70 మధ్య కాలంలో బీ గ్రేడ్ చిత్రాల దర్శకుడిగా కెరీర్ ను మరింత కొత్తగా ప్రారంభించాడు. రామానందసాగర్ రామాయణ్ లో హనుమంతుడి పాత్రతో సుపరిచితుడిగా బాగా గుర్తుండిపోయిన ధారాసింగ్… కమ్రాన్ ఖాన్ సినిమాల్లో హీరోగా వేసేవాడు. బెకసూర్, వతన్ సే దూర్, ఇల్జామ్, పంచ్ రతన్ వంటి సినిమాలకు కమ్రాన్ ఖాన్ దర్శకత్వం వహించాడు. కానీ, తనకు రెండో సంతానంగా కుమారుడు పుట్టే సమయానికి.. మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు దర్శకత్వం వహించాలనే ఆలోచన మొదలైంది. అందుకోసం, అప్పటి హీరో సంజీవ్ కుమార్ ను కలిసి ఒప్పించాడు. తన ఆస్తులు, అప్పటివరకూ అంతో ఇంతో తన బీ గ్రేడ్ సినిమాలతో సంపాదించుకున్న డబ్బంతా సంజీవ్ కుమార్ తో చేసే సినిమా కోసం పెట్టడం ప్రారంభించాడు. కానీ, సినిమా మధ్యలో హీరో సంజీవ్ కుమార్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక అక్కడ్నుంచి కమ్రాన్ ఖాన్ జీవితం పూర్తిగా విషాదభరితంగా మారిపోయింది. జూదంలో పోగుట్టుకున్న డబ్బులా.. అంత గుల్లైపోయింది. మరోవైపు తాగుడుకు బానిసయ్యాడు. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటివరకూ పర్లేదన్నట్టుగా బతికిన కమ్రాన్ ఖాన్ కుటుంబం ఆర్థిక బాధలతో సతమతమైంది. అలాంటి వేదనాభరితమైన జీవితంలోకి, దుఖంలోకి జారిపోయిన కమ్రాన్ ఖాన్ తో ఉండలేనని భార్య వెళ్లిపోయింది. విడాకులయ్యాయి. సుమారు పదేళ్లకు పైగా ఎలాంటి పనేమీ చేయకుండానే తాగుతూ ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. చివరకు అనారోగ్యంతో మరణిస్తే.. కమ్రాన్ ఖాన్ అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేకుండా పోయాయి. అప్పుడు కమ్రాన్ ఖాన్ స్నేహితుడు, రచయిత.. ప్రస్తుత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రైన సలీంఖాన్ అంత్యక్రియలకు సాయం చేశాడు.

తండ్రి కమ్రాన్ ఖాన్ పని మానేసి ఇంట్లో కూర్చుంటున్న సమయమది. కూతురు, కొడుకు ఇద్దరూ యుక్తవయస్సుకొచ్చిన పిల్లలు. ఇల్లు గడవాలంటే వెళ్లని దైన్యస్థితి. అదిగో అప్పుడే పెద్దదైన కూతురు ఫర్హాఖాన్ డ్యాన్సర్ గా షోస్ ఇవ్వడం ప్రారంభించింది. ఇక సాజిద్ ఖాన్ ముంబై బీచుల్లో మిమిక్రీ వంటివి చేస్తూ సంపాదించేవాడు. ఇద్దరూ కలిసి సంపాదించినదాంతో కుటుంబాన్ని పోషిస్తూనే.. మరోవైపు, తండ్రి చేసిన అప్పులు తీర్చేవారు. అంతేకాదు, కమ్రాన్ ఖాన్ భార్య కూడా ముంబైలో ఓ ఇంట్లో హౌజ్ కీపింగ్ కు కుదిరి, సంపాదించి.. ఫర్హాఖాన్, సాజిద్ ఖాన్ ను కష్టపడి చదివించింది. అలాంటి విషాదగీతిక నుంచి విజయం దిశగా ఒక ఆరోహణ క్రమంలో ఎదిగారు ఫర్హాఖాన్, సాజిద్ ఖాన్.
ఈ విషయాల్ని ఈ మధ్యే జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫర్హాఖాన్ వెల్లడించింది. తాను, తన తమ్ముడు సాజిద్ ఖాన్ ఎంత గడ్డు బాల్యాన్ననుభవించారో చెప్పుకొచ్చారామె. అత్యంత బాధాకర సమయాల్లో కూడా సినిమానే తమల్ని సంతోషంగా ఉంచిందన్న ఫర్హా.. మన్మోహన్ దేశాయ్, నాసిర్ హుస్సేన్ సినిమాలతో తమ దుఖాన్ని దూరం చేసుకునే యత్నం చేశామంది. ముఖ్యంగా డబ్బు సులువుగా సంపాదించే కథలను చెప్పే సినిమాలను చూసి కాస్సేపు ఆ దైన్యస్థితి నుంచి మేం సంతోషాన్ని పొందేవాళ్లమని చెప్పుకొచ్చారు ఫర్హా.
తన తండ్రి ధారాసింగ్ తో తీసినవన్నీ రాబిన్ హుడ్ తరహా సినిమాలని.. రాబిన్ హుడ్ కమ్స్ టూ బాంబే, టార్జాన్ కమ్స్ టూ బాంబే వంటి సరదా చిత్రాలని గుర్తు చేసుకుంది. కానీ, కాలచక్రం గిర్రున తిరిగి విషాదంలోకి తమ బతుకుచిత్రాన్ని నెట్టేసిందని ఒకింత ఆవేదన వెలిబుచ్చింది.
గతంలో ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ తో ఇంటర్వ్యూలోనూ తన తండ్రి విషాదగాధను వెల్లడించింది ఫర్హాఖాన్.
కేవలం జేబులో 30 రూపాయలతో నా తండ్రి మరణించాడు. నాన్న బాగున్నరోజుల్లో తామేం కావాలంటే అవి దొరికేవి. కానీ, ఆకస్మాత్తుగా తమ జీవితాలు విచారంలోకి, విషాదంలోకి నెట్టివేయబడతాయని ఊహించలేకపోయాం. నాన్న సంపాదించిన డబ్బు, కార్లు, నగలు, గ్రామఫోన్, వాటి రికార్డ్స్ అన్నీ కోల్పోయి… కేవలం డ్రాయింగ్ రూంలో ఉన్న రెండు సోఫాలు, ఒకే ఒక్క ఫ్యాన్ తో ఇల్లు మాత్రమే మిగిలింది. కిట్టీ పార్టీ నిర్వహించేవారికి, పేకాడుకుని వెళ్లిపోయేవారికి ఓ రెండేళ్లపాటు తమ ఇంట్లో గదిని అద్దెకిచ్చి పొట్టపోసుకున్నట్టు వెల్లడించింది ఆ ఇంటర్వ్యూలో ఫర్హాఖాన్.
టైమ్ ఔట్ అనే మరో యూట్యూబ్ ఛానల్ కు అంకిత్ అనే జర్నలిస్టుకిచ్చిన ఇంటర్వ్యూలో సాజిద్ కూడా ఇలాంటి విషయాలనే షేర్ చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్, తన తండ్రి కమ్రాన్ ఇద్దరూ మంచి స్నేహితులని చెప్పాడు. ఫర్హా పుట్టేవరకూ తన తండ్రి వర్క్ ఫోకస్డ్ గానే ఉండేదని.. నేను పుట్టాక ఇంకాస్త విస్తరించాలనే ఉద్ధేశంతో ఆయన ఏ గ్రేడ్ సినిమాలు తీయాలనుకున్నాడు. ఆ తర్వాత తగిలిన దెబ్బలతో మద్యానికి బానిసయ్యాడు. అమ్మానాన్నల మధ్య విడాకులతో తానెక్కువగా తమ అత్తల ఇంట్లో గడిపేవాణ్ననీ చెప్పుకొచ్చాడు సాజిద్.
ఓ రోజు నాన్న నా మతమేంటని అడిగాను. మద్యానికి బానిసై ఉదయం నుంచి రాత్రి వరకూ తాగుతున్న నాన్న.. మద్యం గ్లాస్ కిందపెట్టి లిడో సినిమా థియేటర్ వైపు చూపించాడు. అదిగో అదే నీ మతం. అక్కడికే అంతా వస్తారు. అందులో హిందువులూ, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అంతా ఉంటారు. కలిసి నవ్వుకుంటారు, ఏడుస్తుంటారు. అదే నీ ఏకైక మతం కావాలని నా ఏడేళ్ల వయసులో నాన్న చెప్పాడంటూ తన బాల్య జ్ఞాపకాలను షేర్ చేశాడు సాజిద్.
రాజేష్ ఖన్నా నయా కదమ్ సినిమా కోసం సాజిద్ రిలీజ్ కు ముందే ఓ టిక్కెట్ కొన్నాడు. గురువారం సినిమా అయితే.. మంగళవారం రాత్రే కమ్రాన్ ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ సమయంలో గురువారం రోజు తన దగ్గరున్న టిక్కెట్ తో సినిమా చూడాలా, వద్దా.. అదిగో ఆ సందేహం సాజిద్ ను వెంటాడింది. అప్పుడు సాజిద్ కు 14 ఏళ్ల వయస్సు. తనకు ఏమీ తోచక తన స్నేహితుణ్నడిగితే పిచ్చి పట్టిందా తండ్రి పోయిన దుఖంలో సినిమా చూస్తావా అని లొల్లి పెట్టాడు. కానీ, తన తండ్రే సినిమా చూడాలి. అందులోనే ఎదగాలని తనకు చెప్పినట్టు స్నేహితుడితో సాజిద్ చెప్పినా వినకుండా అతడు ఆ టిక్కెట్లను చించేశాడు. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ గుర్తుకొస్తూనే ఉంటుంది. కానీ, నాన్నే నా మతం సినిమా అని బీజం నాటి వెళ్లిపోయాడని గుర్తు చేసుకుంటాడు సాజిద్.
సాధారణంగా పిల్లల పట్ల ఏ తల్లిదండ్రులైనా బాధ్యతతోనే ఉంటారు. స్థిరాస్తినో, కొంత డబ్బునో బ్యాంకుల్లో పెట్టడమో, తమ ఆస్తులను వీలునామా రాయడమో చేసి పోతారు. కానీ, ఫర్హాఖాన్, సాజిద్ ఖాన్ కు తండ్రి కమ్రాన్ ఖాన్ కేవలం అప్పులు మిగిల్చి వెళ్లిపాయాడు. 1984లో సరిగ్గా ఫర్హాఖాన్ కు 17 ఏళ్లు, సాజిద్ కు 14 ఏళ్ల వయస్సులో.. 3 లక్షల అప్పు మిగిల్చి వెళ్లిపోయాడు. అలా ఫర్హా డ్యాన్స్ షోతోనూ, సాజిద్ పుట్టినరోజు పార్టీల్లో, బీచుల్లోనూ మిమిక్రీ షోలతోనూ డబ్బు సంపాదిస్తూ ఆ అప్పులు తీర్చేవారు. అందులో కొంత డబ్బు దాచుకుని తమకిష్టమైన సినిమాలు చూసేవారు.
కరెంట్ బిల్లులు కట్టలేని కాలాన్ని చూసిన కుటుంబమది. చుట్టుపక్కల ఇళ్లల్లో టీవీలుంటే తమ ఇంట్లో టీవీ లేని పరిస్థితుల నుంచి, విద్యుత్ నిలిపివేస్తే ఫ్యాన్ లేక గాలికోసం హాల్ లో నిదురించిన రోజుల నుంచి ఎదిగిన కుటుంబమది. ఇవాళ ఫర్హాఖాన్ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ కొరియోగ్రాఫర్ గా ప్రయాణం సాగించింది. హిందీ చిత్రసీమలో అతి కొద్దిమంది మహిళా దర్శకురాళ్లలో ఒకరిగా ఎదిగింది. మీ టూ ఉద్యమంలో బద్నామ్ అయ్యేవరకూ కూడా.. సాజిద్ టీవీషోస్, సినిమా డైరెక్షన్ తోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుని నిలబడ్డాడు.


