ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ లో… కొత్త కొత్త తరాలు ఎన్ని పుట్టుకొస్తూనే ఉన్నా.. ఆద్యుడిగా అందులో మన సునీల్ గవాస్కర్ పేరు ఉండి తీరాల్సిందే. ఐపీఎల్ తో ఇప్పుడు నూతనతరం క్రికెటర్లు ఎందరు వస్తున్నా.. ఎంత కొత్త నీరు వచ్చినా.. పాతతరం మధుర జ్ఞాపకాలు… అసలు దేశం తరపున మంచి ప్రారంభాన్నందించిన వారిని ఓసారి తల్చుకోవాల్సి వస్తే జూలై 10వ తేదీన పుట్టినరోజు జరుపుతున్న బర్త్ డే బాయ్ గవాస్కర్ పేరు మననం చేసుకోవాల్సిందే! అలాంటి ఓ మధుర జ్ఞాపకమైన… పాకిస్థాన్ తో తన చివరి టెస్ట్ సీరిస్ గురించి ఓసారి మాట్లాడుకుందాం.

అది 1987.. పాకిస్థాన్ తో, ఇండియా ఆడిన టెస్ట్ మ్యాచులు నాటకీయ పరిణామాలకు కేరాఫ్ అన్నట్టుగా రక్తికట్టించాయి. చివరి ఐదో టెస్ట్ మ్యాచుకు బెంగళూర్ కేంద్రమైంది. అప్పటికే మిగిలిన నాల్గు మ్యాచులు డ్రాగా ముగియడంతో.. చివరి మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. అలా 1987, మార్చ్ 13వ తేదీన మొదటి ఇన్నింగ్స్ ఫస్ట్ డే ఆట ప్రారంభమైంది. కెప్టెన్ కపిల్ దేవే అయినప్పటికీ… సునీల్ గవాస్కర్ చివరి టెస్ట్ మ్యాచ్ కావడంతో… సీనియరైన గవాస్కర్ పైన గౌరవంతో… ఆ రోజు టెస్ట్ మ్యాచ్ టాస్ కు కూడా ఇమ్రాన్ ఖాన్ తో గవాస్కర్ నే పంపి.. ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు కపిల్ దేవ్. పాకిస్థాన్ టాస్ గెల్చింది. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. కపిల్ బౌలింగ్ ఊపుకు తట్టుకోలేక.. ఓపెనింగ్ బ్యాట్స్ మన్ రిజ్వాన్ ఉజ్ జమన్ పెవిలియన్ బాటపట్టాడు. ఇక రమీజ్ రాజా, సలీం మాలిక్ కొంత కుదురుకుని.. 36 రన్స్ పాట్నర్షిప్ తో కొనసాగుతున్నారు. కానీ, నాటి లెగ్ స్పిన్నర్ మణీందర్ సింగ్ ధాటికి… పాకిస్థాన్ కేవలం 14 రన్స్ కే 6 వికెట్లను కోల్పోయింది. అప్పడు పాకిస్థాన్ స్కోర్ 74/8. మొత్తానికి ఇంకా చివరి రెండు వికెట్లులో కొంత కుదురుకున్న పాక్.. మరో 42 పరుగులు జోడించి.. 49.2 ఓవర్లలో 116 పరుగులకు ఆల్ ఔట్ అయింది. మొత్తానికి మొదటి ఇన్నింగ్స్ ను తన స్పిన్ మాయాజాలంతో.. 7 వికెట్లు తీసి మణీందర్ సింగ్ కకావికలం చేస్తే.. కపిల్ కు మరో 2, రవిశాస్త్రికి ఓ వికెట్ దొరికింది. అదే రోజు మళ్లీ భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. గవాస్కర్, శ్రీకాంత్ ఓపెనింగ్ జోడీ కలిసి 39 రన్స్ పాట్నర్షిప్ తర్వాత రెండు వికెట్సూ కోల్పోగా.. మొహిందర్ అమర్నాథ్, దిలీప్ వెంగ్ సర్కార్ జోడీ మొత్తంగా 68 రన్స్ తో క్రీజులో ఉండగా మొదటిరోజు ఆట ముగిసింది.
రెండోరోజు ఆట మొదలయ్యాక 126.. అంటే పాకిస్థాన్ కంటే మొదటి ఇన్నింగ్స్ లో మరో 10 రన్స్ ఎక్కువబాదిన ఇండియా నాల్గు వికెట్లు మాత్రమే కోల్పోయి ఉచ్ఛస్థితిలో ఆడుతోంది. కానీ, అనూహ్యంగా పాక్ బౌలర్స్ ఇక్బాల్ ఖాసీమ్, తౌసీఫ్ అహ్మద్ దెబ్బకు.. ఇండియా కేవలం 145 పరుగులకే.. అంటే కేవలం 29 పరుగుల ఆధిక్యానికే ఆలౌటైపోయింది. కేవలం దిలీప్ వెంగ్ సర్కార్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు తప్ప.. మిగిలిన బ్యాటింగ్ ఆర్డరంతా కుప్పకూలిపోయింది.
ఇంకేం పాకిస్థాన్ ఓపెనర్స్ ను మార్చేసింది. రెండో ఇన్నింగ్స్ లో సలీం మాలిక్ తో కలిసి… జావేద్ మియాందాద్ ఓపెనింగ్ జోడీగా రావడం.. 45 రన్స్ పాట్నర్షిప్ తో కొంత దృఢమైన ఫౌండేషన్ వేయడంతో.. పాక్ 155 కు 5 వికెట్లను కోల్పోయి.. అప్పటికే 126 రన్స్ లీడ్ లో ఉంది. మూడోరోజు ఆట ప్రారంభమయ్యాక ఉదయం సెషన్ లో పాక్ 3 వికెట్స్ కోల్పోగా.. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 198 పరగుల వద్ద తన 8వ వికెట్ కోల్పోయాడు. కానీ, 41 పరుగులు చేసిన సలీమ్ యూసుఫ్ తో జత కలిసిన తౌసీఫ్ అహ్మద్ 51 రన్స్ చేయడంతో.. పాక్ స్కోర్ 249 రన్స్ కు చేరుకుంది. ఇండియాపైన 221 పరుగుల లీడ్ తో ఉంది. భారత్ గెలవాలంటే 221 రన్స్ అవసరం. కానీ, పిచ్ మాత్రం బ్యాట్స్ మన్ కు అనుకూలించడం లేదు. బౌలర్లు పండుగ చేసుకుంటున్నారు. రవిశాస్త్రికి నాల్గు, మణీందర్ సింగ్ కు 3 వికెట్లు, శివలాల్ యాదవ్ కు రెండు వికెట్స్ పడ్డాయి.
మళ్లీ ఇండియా బ్యాటింగ్ కు దిగింది. కానీ, ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్స్ శ్రీకాంత్, మోహిందర్ అమర్నాథ్ ను వసీం అక్రమ్ పెవిలియన్ బాట పట్టించాడు. కేవలం 15 పరుగులకే ఇండియా రెండు వికెట్స్ కోల్పోయిన దయనీయ స్థితిలో ఉంది. అప్పటికే బ్యాటింగ్ కు వచ్చిన గవాస్కర్ కు.. వెంగ్ సర్కార్ జత కలిశాడు. ఇద్దరూ కలిసి 49 రన్స్ పాట్నర్షిప్ తో కొనసాగుతుండగా.. 64 పరుగుల స్కోర్ వద్ద తౌసీఫ్ అహ్మద్ బౌలింగ్ లో వెంగ్ సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ కిరణ్ మోరే కేవలం మూడే పరుగులు చేసి చేతులేత్తేయగా.. బ్యాటింగ్ కు వచ్చిన అజహార్ 7 పరుగులతో.. ఇప్పటికే 51 పరుగులు చేసిన గవాస్కర్ తో క్రీజులో ఉన్నాడు. అలా 99 స్కోర్ వద్ద థర్డ్ డే ముగియగా.. ఇండియా గెలవాలంటే ఇంకా 122 పరుగులు చేయాల్సిన పరిస్థితి.
మార్చ్ 16వ తేదీ నెక్స్ట్ డే రెస్ట్ డే. అయితే, ఆ రెస్ట్ డే రోజు అనుకోకుండా రిసెప్షన్ లో కలిసిన బిషన్ సింగ్ బేడీతో.. తౌసీఫ్ అహ్మద్, ఇక్బాల్ ఖాసీమ్ మాట్లాడుతూ అనవసర ఆశలేం పెట్టుకోకుండి. బాల్ బౌలింగ్ కు సహకరిస్తోంది. ఇండియా పని అయిపోయినట్టేనంటూ ఒకింత వెటకారంగా సలహా ఇచ్చారట.
ఇంకేం ఫోర్త్ డే ప్రారంభమైంది. వంద పరుగుల టార్గెట్ తో గవాస్కర్, అజహార్ జత క్రీజులో ఉండగా.. అజారుద్దీన్ ఇక్బాల్ ఖాసీం బౌలింగ్ లో 26 పరుగులకు కాట్ అండ్ బౌల్డ్ కాగా.. ఆ తర్వాత వచ్చిన రవిశాస్త్రి 30 పరుగులు చేసింతర్వాత అదే ఇక్బాల్ ఖాసీం మళ్లీ శాస్త్రినీ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇండియా స్కోర్ 155. ఇంకా కపిల్ కూడా రెండు పరుగులకే వెనుదిరిగాడు. మొత్తంగా భారత్ 161/7 వద్ద మరో 60 పరుగుల లక్ష్యంతో ఎదురీదుతోంది. ఆసమయంలో 96 పరుగుల వద్ద వివాదాస్పద రీతిలో గవాస్కర్ ను క్యాచ్ ఔట్ గా ప్రకటించారు. ఇండియాకు ఇంకా 41 పరుగులవసరం. ఆ తర్వాత వచ్చిన శివలాల్ యాదవ్, రోజర్ బిన్నీ అటాక్ చేయబోయినా ఫలితం లేకుండా పోయింది. 204 పరుగుల వద్ద ఇండియా కుప్పకూలింది. దాంతో ఐదు టెస్టుల సీరీస్ లో ఫలితం వచ్చిన ఒకే ఒక్క మ్యాచ్ గా ఈ బెంగళూర్ టెస్ట్ మిగలగా.. పాకిస్థాన్ 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ మ్యాచులో గవాస్కర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా… ఐదు టెస్టుల సీరిస్ లో 324 రన్స్, 8 వికెట్లతో ఇమ్రాన్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది సీరిస్ గా నిల్చారు.
ఇవాళంటే ధనాధన్ టీ-20 పొట్టి క్రికెట్ వచ్చి.. వన్డేలే ఏం చూస్తాంలే అనేంత భారంగా మారగా.. నాడు పాక్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన హైవోల్టేజ్ టెస్ట్ సీరిస్ గా… ఇప్పటికీ 1987 సీరిస్ కు ఓ ప్రాధాన్యత ఉండగా.. గవాస్కర్ తన ఆఖరి టెస్టులో ఇండియా తరపున 96 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిల్చి తనకున్న ప్రాధాన్యతేంటో తెలియజెప్పాడు. గెలుపోటములు పక్కనబెడితే.. ప్రధాన వికెట్లన్నీ పడిపోతున్నా లిటిల్ మాస్టర్ మాత్రం పట్టుదలతో చివరాఖర వరకూ ఆడిన తీరే.. తనని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిపింది. అలాంటి నాటి మ్యాచులెన్నింటో సాక్షీభూతమైన సన్నీకి.. బర్త్ డే విషెస్ తో!



