Maruthi Powrohitham… ✍️
కన్నడలో ‘మిథ్య’ అంటే భ్రమ లేదా అబద్ధం. పదకొండేళ్ల మిథున్(తనను మిథ్య అని పిలవడం వాడికి ఇష్టం) హృదయ పరివర్తన యాత్ర ఈ సినిమా. “మిథ్య” అనే ఈ కన్నడ చిత్రానికి సుమంత్ భట్ దర్శకత్వం వహించారు. తల్లిదండ్రుల మరణానంతరం 11 ఏళ్ల బాలుడి మానసిక సంఘర్షణను హృదయానికి హత్తుకోనేట్లు చిత్రీకరించబడినందున ఈ చిత్రం కన్నడలో మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా అతీష్ శెట్టి సంక్లిష్ట భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తీకరించడం వలన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

సినిమా ప్రారంభంలో రైలులో తలుపు దగ్గర నిలుచొని బయటకు చూస్తూ ప్రయాణిస్తున్న మిథున్ అలియాస్ మిథ్య (అతిష్ శెట్టి) భావోద్వేగాలను చిత్రీకరించాడంలోనే డైరెక్టర్ ప్రతిభ మనకు కనిపిస్తుంది. మిథున్ తండ్రికి ఆడపిల్లలు అంటే ఇష్టం. అందుకోసం ఉడిపిలో ఉన్న తన భార్య అక్క కూతురైన వందనను ముంబైకు తెచ్చుకొంటాడు. వందన రాకతో భార్యా భర్తలమధ్య విభేదాలు మొదలౌతాయి. తల్లిదండ్రుల గొడవలకు మిథ్య కలవర పడుతూ ఉంటాడు. వందన రాకవలననే తన తల్లిదండ్రుల మధ్య గొడవలు మొదలైనాయని భావించి వందనపై ద్వేషం పెంచుకొంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో మిథ్య తండ్రి అకస్మాత్తుగా మరణిస్తాడు. తండ్రి వైపు బందువులు మిథ్య తల్లి విషం పెట్టి భర్తను చంపిందని ప్రచారం చేస్తారు. ఆ అపవాదును భరించలేక తల్లి ఆత్మహత్య చేసికొంటుంది. ఉడిపిలో వుండే పెదనాన్న( ప్రకాష్ తుమినాడ్), పెద్దమ్మలు(రూప వర్కడీ) తమ కూతురు తో పాటు మిథ్య ను ఉడిపికి తీసుకవస్తారు. మిథ్యకు చిన్నపిల్ల అయిన వందనపై విపరీతమైన ద్వేషం వుంటుంది. అయితే ద్వేషం చర్యల రూపంలో ప్రదర్శించడానికి చేతకాదు. అయినప్పటకి అప్పుడప్పుడు చిన్న చిన్న చర్యల ద్వారా ఆ అమ్మాయిని హింసిస్తూ ఉంటాడు.
మిథున్ తనగతం నుండి బయటపడటానికి చాలా కష్టపడతాడు. అతను తన జీవితంలో కొత్తదనాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తాడు. మిథ్యా పాత్రలో అతిష్ శెట్టి అద్భుతంగా నటించాడు. అతిష్ శెట్టి నుండి పరిపక్వతతో కూడిన ఆ నటనను రాబట్టడానికి డైరెక్టర్ పడిన కష్టం మనకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. పాత్ర పట్ల మనకు సానుభూతి కలిగించేలా చేస్తాడు. ప్రకాష్ తుమినాడ్ మగ బిడ్డ కోసం ఆరాటపడే వ్యక్తిగా శక్తివంతమైన నటనను ప్రదర్శించాడు. మిథ్యాతో స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి అతను తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. మిథ్య తన ప్రేమను అంగీకరించే వరకు వేచి ఉండటానికి సిద్ధంగా ఉంటాడు. సీలింగ్ ఫ్యాన్ శబ్దం, నిశ్చలమైన నీరు, గాలికి ఊగుతున్న చెట్లు, సైకిల్ రైడింగ్ లాంటి ప్రతీకల ద్వారా మిథ్య అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. మిథ్య గదిలో ముఖం మీద దిండు పెట్టుకుని నిద్రిస్తున్న షాట్ ఉంది. అదే ఫ్రేమ్‌లో వందన నవ్వుతూ, తన కుటుంబంతో ఉల్లాసంగా ఆడుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ షాట్ డైరెక్టర్ అద్భుత ప్రతిభకు నిదర్శనం. మానసిక సంఘర్షణలకు గురి అయిన మిథ్య ఆ సంఘర్షణల నుండి ఏవిధంగా బయట పడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకొంటే బావుంటుంది.
తెలుగు సాహిత్యంలో కూడా ఇలాంటి అద్భుతమైన కథలు ఉన్నాయి అయితే సినిమాగా మారే అవకాశాలు లేవు. సినిమా రంగంతో అనుబంధం ఉన్న తెలుగు సాహిత్యకారులు సినిమాకు సాహిత్యానికి వారధి కాగలరని ఆశిద్దాం.
అమెజాన్ ప్రైం లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. డైలాగులు తక్కువగా వుండి చిత్రీకరణకు అధిక ప్రాధాన్యం ఉండడం వలన సులభంగా అర్థం అవుతుంది. వీలుంటే చూడండి.



