శుభాంశు శుక్లాను అభినందిస్తూనే.. ఓసారి రాకేష్ శర్మ కథలోకి వెళ్లొద్దాం పదండి!

శుభాంశు శుక్లా… ఇస్రో, నాసా రెండూ కలిసి సంయుక్తంగా నిర్వహించే అంతరిక్ష యాత్రకు వెళ్తున్న వ్యోమగామి. అదీ భారత్ నుంచి రాకేష్ శర్మ తర్వాత వెళ్లుతున్న రెండో వ్యోమగామి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా ఉన్న శుక్లా ఇప్పుడీ యాత్ర పూర్తి చేస్తే.. గత 40 ఏళ్లల్లో భారతీయ రెండో వ్యోమగామిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో 39 ఏళ్ల శుక్లాతో పాటు.. బ్యాకప్ సహ వ్యోమగామిగా 48 ఏళ్ల కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ను కూడా నాసా ఈ యాక్సియమ్ 4 మిషన్ కోసం సిద్ధం చేసింది. శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లతున్న రెండో వ్యోమగామిగా ప్రచారం ఊపందుకున్న వేళ.. ఒకసారి మనం తన అంతరిక్షయానంతో భారతదేశ చరిత్రను తిరగరాసిన మొట్టమొదటి వ్యోమగామి రాకేష్ శర్మ కథలోకి వెళ్లి కాస్త తెలుసుకుని వద్దాం పదండి.

1984, ఏప్రిల్ 3వ తేదీ… సోవియట్ కజికిస్థాన్ లోని బైకోనూర్ కాస్మోడ్రమ్ నుంచి ఓ రాకెట్ గగనతలానికెగిరింది. నిప్పులు చెరుగుతూ నింగికెగిసిన ఆ సోయుజ్ టీ-11 అనే ఆ అంతరిక్ష నౌకలోనే భారత్ నుంచి మొట్టమొదటగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న వ్యక్తి రాకేష్ శర్మ ఎంతో ఉత్సుకతతో ప్రయాణం చేస్తున్నాడు. ఆ అంతరిక్ష పర్యటనే ఆ తర్వాత ఇండో- సోవియట్ యూనియన్ బంధానికి ఓ మైలురాయిగా మారింది.

INDIA AND RAKESH SHARMA

ఇండో-సోవియట్ సంబంధాల్లో మైలురాయి!

1978 నుంచి 1991 మధ్య సోవియట్ యూనియన్ ఇంటర్ కాస్మోస్ కార్యక్రమంలో భాగంగా తన దేశానికి చెందినవారిని కాకుండా ఇతరులను 17 మందిని అంతరిక్షంలోకి పంపించింది. అందులో, మన భారతీయుడైన రాకేష్ శర్మ ఒకరు. వాస్తవానికి ఇంటర్ కాస్మోస్ మిషన్ అనేది.. తూర్పుదేశాలతో సంబంధాలను పెంచుకునే క్రమంలో ఉద్ధేశించబడినట్టు.. పరస్పర ప్రయోజనాలను పంచుకునేవిధంగా డిజైన్ చేసినట్టు కోలిన్ బర్గెస్, బెర్ట్ విస్ అనే రచయితలు 2016లో రాసిన.. ఇంటర్ కాస్మోస్: ది ఈస్టర్న్ బ్లాక్స్ ఎర్లీ స్పేస్ ప్రోగ్రామ్ లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానవసహిత, మానవరహిత అంతరిక్ష ప్రయాణాల్లో ఆయా దేశాలతో సోవియట్ యూనియన్ అంతరిక్ష సంబంధాలకు సంబంధించిన ఓ ప్రాజెక్ట్ ఇది.

భారతదేశం అలీన విధానాన్ని పాటిస్తున్నప్పటికీ… 1960ల కాలంలో సోవియట్ యూనియన్ వైపే మొగ్గు చూపింది. దాంతో రెండు దేశాల మధ్య పరస్పర స్నేహపూర్వక వాతావరణంతో అది గణనీయమైన సహకారానికీ తెరతీసింది. భారతదేశ తొలి ఉపగ్రహాలైన 1975లోని ఆర్యభట్ట, 1979లోని భాస్కర వన్, 1981లోని ప్రయోగించిన భాస్కర టూ.. వీటన్నింటిలోనూ సోవియట్ యూనియన్ సాంకేతిక సహకారాన్నందించింది.

ఇక 1984లో రాకేష్ శర్మ ప్రయాణంతో.. సోవియట్ యూనియన్- భారత్ మధ్య బలమైన బంధానికి అది పరాకాష్ఠగా నిల్చింది. 1980లో లియోనిడ్ బ్రెజ్నేవ్ భారత్ పర్యటన సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఈ భారత్ – సోవియట్ యూనియన్ సంయుక్త యాత్రను సూచించారు. ఆ తర్వాత ఒక ఏడాదికే ఆ మిషన్ ను అధికారికంగా ధృవీకరించారు.

సోవియట్స్ ఇచ్చే కాస్మోనాట్ ట్రైనింగ్ కోసం ఇద్దరు పైలట్స్ ను ఎంపిక చేసే బాధ్యతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అప్పగించగా.. ఐఏఎఫ్ రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా అనే ఇద్దరు నిష్ణాతులైన పైలట్స్ ను ఎంపిక చేసింది. అన్నిరకాల ఎయిర్ క్రాఫ్ట్స్ ను నడపడంతో పాటు.. వాటి పనితీరుపై క్షుణ్నంగా అవగాహన కల్గి ఉండటం.. విశ్లేషించుకునే సామర్థ్యం, నిర్వహించగల్గే ఎబిలిటీ ఉన్నవారిని క్రీం డే లా క్రీంగా అక్కడి పరిభాషలో అభివర్ణిస్తారు. అలాంటివారినే అంతరిక్ష నౌకా పైలట్స్ గా ఎంపిక చేస్తారు. చంద్రుడిపై కాలుమోపిన మొట్టమొదటి వ్యోమోగామైన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ నుంచి నేటి శుభాంశు శుక్లా వరకూ కూడా ఇదే పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతాయి.

అలా 1982లో సెప్టెంబర్ మాసం నుంచి రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా ఇద్దరూ కూడా సోవియెట్ యూనియన్ రాజధానైన మాస్కో నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనున్న స్టార్ సిటీలోని యూరి గగారిన్ సెంటర్ లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు.

యూరి గగారిన్ సెంటర్ లోని సీనియర్ అడ్మినిస్ట్రేటరైన బోరిస్ వోలినోస్ ఏమన్నాడంటే.. లక్ష్యాన్ని ముద్దాడాలనే తపనతో రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా మా దగ్గరకు వచ్చారు. వారికప్పటికీ రష్యన్ భాషే తెలియదు. కానీ, తక్కువ సమయంలోనే వారు దాన్ని నేర్చుకోవడంతో పాటు.. వారి నోట్స్ రాసుకోవడం నుంచి చదవడమూ, పరీక్షలు రాయడం వరకూ కూడా రష్యన్ లాంగ్వేజ్ లోనే చేసేవారని వారిని కొనియాడుతూ ఇచ్చిన ఇంటర్వూ తాలూకు కథనం 1983, ఏప్రిల్ 21న విడుదలైన సోవియట్ వీక్లీలో పబ్లిషైంది.

ఇక 1984లో సాల్యూట్ 7 ఆర్బిటల్ స్టేషన్ కు ప్రయాణించే ముగ్గురిలో అనుభవజ్ఞులైన వ్యోమగాములు యూరి మాలిషెవ్, గెన్నాడి స్ట్రెకలోవ్ తో పాటు రాకేష్ శర్మ మూడోవ్యక్తి. ఆ తర్వాత రవీష్ మల్హోత్రా బ్యాకప్ బందంతో జాయిన్ అయ్యారు.

వారం రోజులపాటు అంతరిక్షంలో రాకేష్ శర్మ!

సోయుజ్ టీ – 11 అంతరిక్ష నౌక 1984, ఏప్రిల్ 3వ తేదీన సాయంత్రం సరిగ్గా 6 గంటల 38 నిమిషాలకు.. 14 అంతస్థుల రాకెట్ బైకోనూర్ నుంచి టేకాఫ్ అయింది. నిప్పులు చెరుగుతూ నింగి పైకెగిసిన ఆ దృశ్యం అప్పుడో సంచలనం. దాని శక్తివంతమైన గర్జనతో భూకంపనలు చుట్టుపక్కల జనాన్ని ఉలిక్కిపడేలా చేసిన ప్రయోగమది. సరిగ్గా ప్రయోగం జరిగిన 9 నిమిషాల వ్యవధిలో ఆ అంతరిక్ష నౌక భూమి చుట్టూ ముందుగా నిర్ణయించిన కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. అలా భారత్ నుంచి మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణీకుడిగా.. మొత్తం ప్రపంచంలోనే స్పేస్ లోకి అడుగుపెట్టిన 138వ వ్యోమగామిగా రికార్డులకెక్కి.. అంతరిక్షంలోకి మనిషిని పంపిన 14వ దేశంగా భారత్ జెండాను రెపరెపలాడించాడు.

రాకెట్ లిఫ్ట్ అయిన 25 గంటలనంతరం 1984, ఏప్రిల్ 4వ తేదీన సోయుుజ్ టీ-11 సాల్యూట్ 7 అంతరిక్ష కేంద్రంతో కనెక్టైంది. ఆ తర్వాత వారంతా అక్కడే స్టాటన్ లో ఉంటూ వారం రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు చేస్తూ గడిపారు. మొత్తంగా భూమి నుంచి 200 కిలోమీటర్లకంటే ఎక్కువ ఎత్తు కక్ష్యలో టీ-11 సాల్యూట్ నౌక అంతరిక్షంలో ప్రయోగాల కోసం ల్యాండైంది.

అంతరిక్షంలోకి వెళ్లాక స్పేస్ షిప్ లో తీరిగ్గా ఏమీ కూర్చునే పరిస్థితుండదని.. చాలా ప్రాధాన్యమైన పనులు చేయాల్సి ఉంటుందని ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో కూడా రాకేష్ శర్మ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా టెర్రా ప్రయోగం అందులో కీలకమైంది. తన సహ సిబ్బందితో కలిసి అంతరిక్షం నుంచి భారత ఉపఖండంలోని సహజ వనరులు, హిందూ మహాసముద్రం పక్కనే ఉన్న ప్రాంతాల వంటివాటిని సాటిలైట్ సాయంతో ఫోటోస్ తీసి విశ్లేషించి అధ్యయనం జరిగేదన్నాడు రాకేష్ శర్మ. ముఖ్యంగా చమురు క్షేత్రాలు, వాయువును ఉత్పత్తి చేసే లోతులేని ప్రదేశాలను సముద్రంలో గుర్తించే ఉద్దేశంతో అండమాన్, నికోబార్ దీవుల చిత్రాలను ఎక్కువగా షూట్ చేసినట్టు.. అలాగే, అటవీ ప్రాంతాలు, తోటలు, గంగానదీ పరీవాహక ప్రాంతం, హిమాలయాలు, సముద్ర ప్రాంతాల్లో జీవ ఉత్పాదకతతో పాటు, పలు భౌతిక శాస్త్ర ప్రయోగాలపై క్షుణ్నమైన పరిశీలన ఆ స్పేస్ షిప్ లో జరిగిందని కోలిన్ బర్గెస్, బెర్ట్ విస్ కోలిన్ బర్గెస్, బెర్ట్ విస్ ఇంటర్ కాస్మోస్: ది ఈస్టర్న్ బ్లాక్స్ ఎర్లీ స్పేస్ ప్రోగ్రామ్ లో పేర్కొన్నారు.

స్పేస్ షిప్ లో ఆరోగ్యాన్ని కాపుడుకునేందుకు వ్యోమగాములు యోగా చేయడంతో పాటు.. వారికి అక్కడి గురుత్వాకర్షణకు తగ్గ జిమ్ పరికరాలను కూడా ఆ స్పేస్ షిప్ లో ఏర్పాటు చేశారు. వాస్తవానికి భారతదేశం అప్పుడప్పుడే అంతరిక్ష ప్రయోగాల గురించి ఆలోచిస్తున్న సమయంలో.. సోవియెట్ యూనియన్ తో జట్టు కట్టడంతో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి అడుగుపెట్టగల్గాడు. ఇంకా అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇస్రో అప్పటికీ చాలా దూరంలో ఉన్న రోజులవి. పైగా ఆ మిషన్ తో రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణంతో ఇండియాకు పరిమిత ప్రయోజనాలే ఉన్నప్పటికీ.. అదో హిస్టారికల్ మూమెంట్ అన్నది అప్పటికి భారత్ ఆలోచన.

భారత్ నుంచి మొట్టమొదట అంతరిక్షంలో అడుగుపెట్టిన వ్యోమగామిగా చెబుతున్నప్పుడు రాకేష్ శర్మ మాత్రం దాన్ని వారించేవాడు. అదో సింబాలింక్ ఈవెంట్ అని.. దాని ప్రాధాన్యత దానికున్నా.. తనను హైలైట్ చేయడంపై మాత్రం ఆయనకిష్టముండేది కాదు.

ఏదేమైనా రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం ఇండో-సోవియెట్ సంబంధాల్లో మాత్రం ఓ మైలురాయనే చెప్పాల్సి ఉంటుంది. ఆ మిషన్ ప్రారంభం రోజున అప్పటి ప్రధాని ఇందిర మాట్లాడుతూ.. రెండు దేశాల పరస్పర సహకారానికి మరో అద్భుతమైన ముందడుగుగా పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయులకు రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం స్ఫూర్తిదాయకమని.. దేశం గర్వించదగ్గ క్షణంగా ఆమె అభివర్ణించారు.

అంతేకాదు, ఆ స్పేస్ షిప్ అంతరిక్షంలోకి వెళ్లతున్న క్రమంలో రాకేష్ శర్మ బృందంతో పాటు రాజ్ ఘాట్ నుంచి సేకరించిన పిడికెడు మట్టి, మహత్మాగాంధీ ఫోటోతో పాటు, నెహ్రూ, అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్, ప్రధాని ఇందిర, అప్పటి రక్షణమంత్రి, ఆ తర్వాత రాష్ట్రపతైన ఆర్. వెంకట్రామన్ వంటివారి ఫోటోలనూ పంపించారు. వాటితో పాటు.. సాల్యూట్ -7 స్పేస్ స్టేషన్ లో వ్యోమగాములు తినడానికి మామిడి పండ్లను కూడా తీసుకెళ్లినట్టు ఇంటర్ కాస్మెస్ లో బర్గస్, విస్ పేర్కొన్నారు.

ఐతే ఆ సమయంలో భారత ప్రజలను టెలివిజన్ సెట్లకు పరిమితం చేసిన ఆసక్తికరమైన విశేషమేంటంటే.. నాటి ప్రధాని ఇందిర, రాకేష్ శర్మతో సంభాషించే విషయాన్ని దూరదర్శన్ లైవ్ టెలిక్యాస్ట్ చేయడం. దాన్ని ఆరోజుల్లో లక్షల్లో వీక్షించారు.

అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తోందని ప్రధానమంత్రి ఇందిర అడిగిన ప్రశ్నకు.. రాకేష్ శర్మ ఇచ్చిన సమాధానమేంటంటే.. సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అంటూ ఇక్బాల్ రాసిన దేశభక్తి గేయంలోని పంక్తులను తన సమాధానంగా పేర్కొన్నాడు. ఆ తర్వాత 1984, ఏప్రిల్ 11న

1984 ఏప్రిల్ 3వ తేదీన అలా మొదలైన రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణం… సరిగ్గా వారం రోజుల పాటు కొనసాగి.. ఆ తర్వాత ఆ బృందం ఏప్రిల్ 11వ తేదీన భూమికి విజయవంతంగా తిరిగి వచ్చింది. అది భారతదేశ అంతరిక్షయాన చరిత్రలో ఎప్పటికీ మరువలేని ఓ మైలురాయిగా నిల్చిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles