తెలంగాణా పల్లె వాతావరణాన్ని కెమెరాలో బంధించిన డాక్యుమెంట్.. ఈసారైనా!

నరేష్కుమార్ సూఫీ… ✍️

ప్రశాంతంగా సినిమా చూసి ఎన్నాళ్లైందీ… అసలు థియేటర్‌కి వెళ్ళైతే నెలలు గడిచింది. తిక్క తిక్కగా ఉన్న మనసుని ఒకదగ్గర కూచోబెట్టే ఓపికే లేకుండా పోయింది. నిన్న విప్లవ్ కాల్ చేసి లింక్ పంపిస్తే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్‌లో చూసానీ సినిమా #ఈసారైనా

పెద్ద మలుపులున్న సినిమా ఏం కాదు, ఫైట్లు లేవు, పేరున్న క్యస్టింగ్‌కూడా పెద్దగా లేదు. అయితే ఇందులో ఏముందీ అంటే… తెలంగాణా గామాల కథ ఉన్నది, డిగ్రీ చదివిన ప్రతీ పోరడూ కనే కలలున్నై, ఒక్క ఉద్యోగం కోసం, నోటిఫికేషన్ కోసం ఎదురు చూసీ, ప్రయత్నించి ఓడిపోయీ, మళ్లీ లేచినిలబడే ఆత్మవిశ్వాసాన్ని చూపించే ఒక మామూలు పిలగాని కథ.

మొదటి అడుగే అయినా బాగానే ఉందే అంటూ మొదలు పెట్టి అయిపోయేదాకా అలా కూచోబెట్టింది. ఊపేసే స్క్రీన్ ప్లే, ఊహించని మలుపులూ… అంటూ “ఫార్ములా”లవెంటపడకుండా అచ్చంగా స్క్రిప్ట్‌ని నమ్ముకున్న ప్రయత్నం సఫలమైందనే అనుకోవాలి.

ఒక అందమైన ఊరూ, అందరి లాగే దెప్పి పొడిచే ఊళ్లో అంకుల్సూ, నేను పేదవాన్నీ అని ధైన్యం చూపించకుండా ప్రయత్నం చేసే పిలగాడు, ఆ పిలగానికోసమే ఎదురు చూసే ఇంకో అందమైన పిల్ల. వాన్ని గెలిపించాలని తపన పడే పిల్ల. అడుగు అడుగులో అతని తోడై అతన్ని గెలిపించుకున్న అమ్మాయి కథ.

ఉద్యోగం లేకుంటే?? రాకుంటే జీవితం అక్కడితో ఆగిపోయేది కాదని ధైర్యం చెప్పే అమ్మాయి. ఇదేనా అంటే ఇంతే సినిమా… ఈ మూడు ముక్కల మధ్య పండించిన కథలో మ్యాజిక్కే మిగతాదంతా.

మొత్తంగా ఇది తెలంగాణా పల్లె వాతావరణాన్ని కెమెరాలో బంధించిన డాక్యుమెంట్. కెమెరా వర్క్ ప్రాణమై ఆ ఊరిని క్యాప్చర్ చేసింది. గోరటి వెంకన్న పాట పొలం మీదినుంచి వచ్చి తాకే గాలిలాగా తగులుతుంది.

బడ్జెట్ ఒక్కటి ఇంకాస్త సపోర్ట్ చేసి ఉంటే గనక తెలంగాణా లోకల్ సినిమా సిరీస్‌లో పక్కగా నిలబడే సినిమా అయుండేది. ప్రమోషన్స్ కోసం కాస్త డబ్బులున్నా దక్షిణ తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన అద్బుతమైన సినిమాగా నిలబడి ఉండేది.

అయితేనేం… #ఈసారైనా హిట్ కొట్టొచ్చు అనే ఆశ ఉన్నోడు కాబట్టే దర్శకుడు విప్లవ్ నిరాశపడకుండా ఇంకో సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్టున్నాడు.

బ్రో! సినిమా తీయటానికీ, చెయ్యటానికీ, రాయటానికీ, నటించటానికి మనదగ్గర దమ్ము మస్తుంది. అని చెప్పుకోదగ్గ కొన్ని సినిమాల్లో ఇదీ తలెత్తుకోగల సినిమా. త్వరలో అమేజాన్‌లో రాబోతోందట. స్పెషల్‌గా ముందే ఒకసారి చూసేసాను. అప్పుడు మల్లోకసారి చూద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles