పతంజలి ఉత్పత్తుల వెనుక.. ఓ స్కాటిష్ జంట!

నేటి ఆధునిక శాస్త్రీయ వైద్యాన్ని ఛాలెంజ్ చేస్తూ బాబా రాందేవ్ చేస్తున్న ప్రచారం.. దానిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దావా వేయడం ఇవన్నీ తెలిసిందే. ముఖ్యంగా మధుమేహం, హైబీపీ, థైరాయిడ్, లివర్ సిర్రోసిస్, ఆర్థరైటిస్, ఆస్తమా ఉన్న ఎందరికో తమ మందుల వల్ల నయమైందని.. అల్లోపతి వల్ల కానివి కూడా తమ మెడిసిన్ క్యూర్ చేస్తుందన్నట్టు పతంజలి పేరిట రాందేవ్ బాబా ఇచ్చిన ప్రకటనలపై.. భారతీయ వైద్య సంఘం అగ్గి మీద గుగ్గిలమవుతూనే ఉంది.

అయితే, ఈ పతంజలి సంస్థ స్థాపన వెనుక ఉన్న కథేంటి..? బాబా రాందేవ్.. తన సహచరుడైన ఆచార్య బాలకృష్ణతో కలిసి ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించారో కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ కలిసి సరిగ్గా 2006లో తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. 50 నుంచి 60 కోట్ల మధ్య వ్యక్తిగత రుణాన్ని తీసుకుని తమ వ్యాపారాన్ని ప్రారంభించారు ఈ ఇద్దరూ. అయితే, ఈ ఇద్దరికీ బ్యాంకింగ్ లావాదేవీల పట్ల అంత చురుకుదనంగానీ… వెనువెంటనే కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేసే పరిస్థితిగానీ అప్పటికింకా ఏమీ లేదనే చెప్పొచ్చు.

మరి రుణం ఎక్కడ లభించింది..? ఇచ్చిందెవరసలు..?

ఏవో పరిచయాలు.. పెద్ద పెద్ద బడా కార్పోరేట్ బ్యాంకర్స్ తో ఉండే సన్నిహిత సంబంధాలు.. బ్యాంకిగ్ రుణాలను పెద్దమొత్తంలో ఇప్పించేంత రాజకీయ పలుకుబడి ఇవన్నీ ఉంటేనే.. 50 కోట్ల పైచిలుకు రుణాలు సాధ్యం. సో.. ఇన్షియల్ గా రాందేవ్ బాబా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించేనాటికి.. అంత పెద్ద బ్యాంక్ రుణమైతే ఆయనకందలేదన్నది కచ్చితం.

అదిగో, ఆ సమయంలో బాబాకు తన భక్తులుపయోగపడ్డారు. యోగా గురువుగా ప్రపంచానికి తనకు తాను పరిచయం చేసుకుని మార్కెట్ చేసుకున్న రాందేవ్ బాబాకు.. భక్తజనం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చారు. ఆయన యోగా క్లాసులకు.. ఏ సమయంలో పెట్టినా వేల మంది హాజరైన సభలను చూశాం. ఈ క్రమంలో సునీత, సర్వన్ శ్యామ్ పొద్దార్ అనే ఎన్ఆర్ఐ దంపతులు.. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ వ్యాపారానికి పెట్టుబడిగా మారారు. వారు పెట్టుబడి పెట్టడంతో పాటు.. పతంజలిలో 3 శాతం వాటా కూడా కల్గి ఉన్నారు.

అలా ఎన్ఆర్ఐస్ సునీత, సర్వన్ పొద్దార్ నుంచి అప్పుగా తీసుకున్న 50 కోట్ల పైచిలుకు రుణాలతో ఏర్పాటు చేసిన వ్యాపారం ఇప్పుడు ఓ సామ్రాజ్యంగా విస్తరించింది. ఏకంగా 55 వేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. ఫేస్ ఆఫ్ పతంజలి బాబా రాందేవే అయినప్పటికీ.. ఆచార్య బాలకృష్ణే ఇందులో కీలకం. అతడి పేరుపైనే ఈ సంస్థలో 94 శాతం వాటా ఉంది. అంతేకాదు, ఏ వ్యూహాత్మక నిర్ణయాలైనా ఆచార్య బాలకృష్ణే తీసుకుంటారు. రాందేవ్ బాబా జస్ట్ బ్రాండ్ అంబాసిడర్ అంతే!

కేవలం 50 కోట్ల అప్పే కాదు… ఓ దీవినీ గిఫ్ట్ గా ఇచ్చారు ఎన్ఆర్ఐ దంపతులు!

స్కాటిష్ దంపతులైన సర్వన్ పొద్దార్, సునీత దంపతులు.. బాబా రాందేవ్ కు 50 కోట్ల రూపాయల పైచిలుకు అప్పుతో పాటు… ఓ ద్వీపాన్నీ బహుమతిగా ఇచ్చారు. 9 వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండే లిటిల్ కుంబ్రే అనే ద్వీపాన్ని ఏకంగా 2 మిలియన్ పౌండ్స్ తో కొనుగోలు చేసి మరీ రాందేవ్ బాబాకు 2009లోనే బహుమతిగా ఇచ్చింది ఈ స్కాటిష్ ఎన్ఆర్ఐ జంట. గతకాలపు కోటలతో అందంగా ఉండే ఈ దీవి.. ఇప్పుడు రాందేవ్ బాబా పతంజలికి సంబంధించిన ఆయుర్వేద మందులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, సబ్బుల వంటివి తయారుచేసే ఓ కార్ఖానాగా మారిపోయింది.

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌లో.. సర్వన్ పొద్దార్ దంపతుల వాటా ఎంత..? ఎన్ని షేర్స్ కల్గి ఉన్నారు..?

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ దాఖలు చేసిన పత్రాల ప్రకారం… సంస్థ మొత్తం షేర్స్ 2 కోట్ల 47 లక్షలుంటే.. అందులో సర్వన్ పొద్దార్, సునీత దంపతుల వాటాగా 12 లక్షల 46 వేల షేర్స్ ఉన్నాయి. మొత్తంగా ఆచార్య బాలకృష్ణ తర్వాత.. వీరిద్దరిదే మేజర్ షేర్.

వాస్తవంగా సర్వన్ పొద్దార్ మిసెసైన సునీతా పొద్దార్ తన శరీర బరువు గురించి తెగ బాధపడేవారట. ఆ క్రమంలో రాందేవ్ బాబా యోగా క్లాసెస్ ఆమెకు ఊరటనిచ్చి.. ఆమె బరువు తగ్గటంతో రాందేవ్ బాబాకు వీరభక్తురాలిగా మారిపోయారు సునీత. దాంతో భర్తతో మరీ వాదించి.. రాందేవ్ కోసం ఏకంగా దీవినే కొనుగోలు చేసి ఇచ్చారట.

యోగా గురువుగా మారిన సునీతా పొద్దార్!

కేవలం తన బరువును తగ్గించేందుకు యోగా క్లాసులకు వెళ్లిన సునీతా.. ఇప్పుడేకంగా యోగా టీచర్ గానే అవతారమెత్తారు. గ్లాస్గోలో ఆమె ఏకంగా క్లాసులు కండక్ట్ చేయడంతో పాటు.. పలువురు యోగా ఇన్స్ట్రక్టర్స్ ను కూడా తయారుచేస్తున్నారు. గ్లాస్గోలో రాందేవ్ ను కలిసిన తర్వాతే ఈ మొత్తం పరిణామాలన్నీ ఒకదాని వెనుక ఒకటి అలా జరిగిపోయాయి. ముంబైలో పుట్టిన సునీతా పొద్దార్.. ఖాట్మండ్ లో పెరిగారు. గ్లాస్గోలో బీహార్ కు చెందిన సర్వన్ పొద్దార్ తో పరిచయమేర్పడగా.. సరిగ్గా ఆమె 18 ఏళ్ల వయస్సులో సర్వన్ శ్యామ్ పొద్దార్ ను వివాహం చేసుకుంది.

మొత్తంగా ఓ స్కాటిష్ ఎన్నారై జంట.. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ వెనుక చోదకశక్తులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles