మౌనం.. ఆయన భాష! సంస్కరణ.. ఆయన మార్క్!!

ఎంత నిశ్శబ్దంగా రాజకీయాల్లోకి వచ్చాడో… ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా… తనలాగే, అంతే నిశ్శబ్దంగా అదే రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. విమర్శకులు ఆయన్ను ఉట్టి మరబొమ్మ అన్నారు. సీటుపై తానున్నా.. స్టీరింగ్ తన చేతిలో లేదనీ ఆడిపోసుకునేవారు. లీడర్ షిప్ క్వాలిటీస్ లేవని… ఆయనదో సీఈవో తరహా పాలనా అనీ ఆరోపించారు. అయినా, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉండి కూడా.. స్థితప్రజ్ఞతకు సిగ్నేచర్ లా ఎక్కడా మాట తూలలేదు. భారత రాజకీయాల్లో విలువలు, సంస్కారం ఈ రోజుల్లో ఎక్కడా అని ప్రశ్నించేవారికి… వాటికే ప్యాంట్, షర్ట్ వేసి చూపిస్తూ ఇదిగో ఆ విలువ, ఆ సంస్కారానికి నిలువెత్తు రూపమని ఆయన్ను చూపించొచ్చు. చాలాసార్లు ఆయన మౌనమే… ఎన్నో మాటలను మించిన బిగ్గరతనమై పనిచేసింది. అలాంటి భారత ఆర్థిక సంస్కర్త.. 33 ఏళ్ల తన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వేళ కాస్త చెప్పుకోవాలి.

మీడియా, ప్రతిపక్షాల కంటే కూడా.. తనేంటో తాననుసరించిన బాట చెబుతుందని… అందుకు తన పదవీకాలం ఓ చరిత్రగా మిగిలిపోతుందన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్. బలహీనమైన ప్రధాని అని తనపై వచ్చిన విమర్శలకు గతంలో ఆయన అదే మీడియాకు చెప్పిన మాటలివి. రీసెంట్ గా ఏప్రిల్ 2, 2024న తన 33 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వానికి ఇక వీడ్కోలు పలుకుతూ.. 91 ఏళ్ల వయస్సులో ఇక రిటైర్మెంట్ తీసుకున్నారు… ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగువసభకు ఎన్నిక కాని మన్మోహన్. అయితేనేం..? భారతరత్న, దివంగత ప్రధానైన పాములపర్తి వెంకట నర్సింహారావు వంటివారు కూడా మన్మోహన్ లాంటివారు కావాలని కోరకుండా.. ఏకంగా మన్మోహనే కావాలని ఏరి కోరి తన క్యాబినెట్ లో ఆర్థికమంత్రిత్వశాఖను అప్పజెప్పడం.. ఆర్థికరంగంలో మన్మోహన్ జ్ఞానకుశలతను.. పైగా ఆయన మెచ్యూరిటీ లెవల్స్ ను పట్టిచూపించేవి.

ఒక విద్యావేత్త.. మంచి పాలకుడెలా అవుతాడో చెప్పాలంటే ఓ ఉదాహరణ మన్మోహన్ సింగ్. ఒక బ్యూరో క్రాట్ ఎలా ఉండాలో చెప్పాలంటే నిదర్శనం మన్మోహన్ సింగ్. ఆర్థిక సరళీకరణలకు ఆద్యుడైన పీవీసాబుకు.. అన్నివిధాలా సలహాదారుడిగా మార్గాన్ని సుగమం చేసిన ఆర్థికవేత్త. ఎన్ని విమర్శలెదురైనా… 1991 ఆర్థిక సంస్కరణలతో పాటు… మన్మోహన్ సింగ్ ప్రధానిగా పనిచేసిన హయాంలో తీసుకొచ్చిన కొన్ని పథకాలు కోట్ల మంది ప్రజలకి పట్టెడన్నం పెడుతున్నాయి.

1991 ఆర్థిక సంస్కరణలపై మన్మోహన్ ముద్ర!

అప్పటికే ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ.. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. ఈ శతాబ్ద కాలంలో భారతదేశం గర్వించదగ్గ సంస్కర్తల్లో గొప్పవారిగా ముగ్గురి పేర్లను.. రామచంద్ర గుహ వంటి విశ్లేషకలు, రచయిత వెల్లడించగా.. అందులో మొదటి పేరు మన్మోహన్ సింగ్ దేనంటే నమ్మగలమా..? 18 పరిశ్రమలు మినహా.. మిగిలిన పారిశ్రామిక పాలసీలో లైసెన్స్ రాజ్‌కు స్వస్తి పలికిన వ్యక్తి డాక్టర్ సింగ్. పరిశ్రమల్లో 51% వరకు విదేశీ ఈక్విటీ వాటాను అనుమతిస్తూ.. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాడు. ఈ లిబరలైజేషన్.. మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే పూర్తిగా మార్చేసింది. ఖాళీ బిందెలా తయారైన భారత ప్రభుత్వ ఖజానాను.. ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించి భావిభారత ఆర్థిక వృద్ధి రేటుకు మార్గాన్ని సుగమం చేసింది.

2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా… డాక్టర్ సింగ్!

2004లో… బీజేపీ కంటే కేవలం 7 సీట్ల మెజార్టీని మాత్రమే కనబర్చిన కాంగ్రెస్ పార్టీ… తన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ పేరుతో.. సమాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో, వామపక్ష పార్టీలు అలయెన్స్ లో చేరకుండా బయట నుంచి తెలిపిన సంఘీభావంతో.. 543 సీట్లకుగాను.. 335 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే… ఎవ్వరూ ఊహించని విధంగా.. ఎందరో కురవృద్ధ పేరుగల నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా.. దేశం మొత్తాన్నీ ఆశ్చర్యపర్చే పేరు ప్రధానమంత్రిగా తెరపైకొచ్చింది. అలా సోనియా అభీష్ఠం మేరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పీఠాన్నధిరోహించాడు. 2009 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుంది. 206 సీట్లను గెల్చుకుంది. బీజేపీ కేవలం 116 సీట్లతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో మెజార్టీ లోక్ సభ సీట్లను గెల్చుకుని… ఐదేళ్ల టర్మ్ తర్వాత జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక మెజార్టీతో మళ్లీ ప్రధానైన వ్యక్తిగా మన్మోహన్… సింగ్ ఈజ్ కింగ్ అనిపించుకున్నాడు. ఆ టర్మ్ లో మన్మోహన్ తీసుకొచ్చిన కొన్ని అద్భుత పథకాల్లో ఇవాళ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఆ పథకం కింద కోట్ల మంది ఇవాళ దేశంలో పని చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు. అంతేకాదు, వివిధ రంగాల్లో నష్టాలు వచ్చినప్పుడు.. రైతులు, రైతుకూలీలు, ఇతర వర్గాలవారికీ ఉపాధిహామీ బాసటగా నిలుస్తున్న దృశ్యాలు కొల్లలు. మొత్తంగా మన్మోహన్ పీరియడ్ లో తీసుకువచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొట్టే పథకం ఇంతవరకూ భారతదేశ చరిత్రలోనే ఎవరూ తీసుకురాలేదంటే కూడా అతిశయోక్తి కాదేమో..?! అలాగే, సింగ్ సాబ్ ప్రవేశపెట్టిన అతి గొప్ప పథకాల్లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిందే! విద్యా, వైద్యం మౌలిక అవసరాలుగా మారిన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలు, పిల్లలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ప్రవేశపెట్టిందే NHRM. 2013లో, ఈ పథకం జాతీయ ఆరోగ్య మిషన్‌గా పేరు మార్చుకుని.. పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. బలహీన వర్గాల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చే గొప్ప పథకంగా మన్మోహన్ దూరదృష్టిని ఆ స్కీమ్ తో అంచనా వేయొచ్చు. అలాగే, రైట్ టూ ఎడ్యుకేషన్ కూడా కీలక పథకంగా చెప్పుకోవాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పథకాన్ని తీసుకొచ్చి.. విద్యావసరాన్ని చాటిచెప్పిన విద్యావేత్త మన్మోహన్ సింగ్. మరో పథకం… పౌరుల చేతిల్లో పాశుపతాస్త్రంగా మారిన రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వంటివెన్నో సింగ్ విజయాల్లో కీలకమైనవి.

యూపీఏ వన్, యూపీఏ 2 హయాంలో.. 2004 నుంచి 2013 వరకు భారతదేశ జీడీపీ ప్రతి యేడూ సగటు రేటు 7.74%గా కొనసాగింది.

2008లో ఒప్పందం కుదుర్చుకున్న ఇండో-యుఎస్ న్యూక్లియర్ డీల్ కూడా ప్రత్యేకమైంది!

2008లో, US-భారతదేశం పౌర అణు ఒప్పందంపై సంతకం ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. పౌర అవసరాలకు, మిలిటరీ అవసరాలను వేరు చేస్తూ ఈ ఒప్పందం జరిగింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) రక్షణ కింద అన్ని పౌర సౌకర్యాలను అందించేందుకు భారత్ అంగీకరించింది. దాంతో భారతదేశంలో పౌర సౌకర్యాల్లో పూర్తి సహకారానికి USఅంగీకరించింది. దాంతో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG) నుంచి భారత్ మినహాయింపును కూడా పొందింది. ఈ వెసులుబాటుతో ఇండియా ఆ తర్వాత ఇతర దేశాల నుంచి అణు సాంకేతికతతో పాటు ఇంధనాన్ని కొనుగోలు చేసే అవకాశాల్ని చేజిక్కించుకుంది.

అయితే, పైవన్నీ మన్మోహన్ సర్కార్ లో నాణానికి ఒకవైపు కనిపించే విజయాలైతే… మరకలూ అదే స్థాయిలో ఆ ప్రభుత్వాన్ని వెంటాడాయి.

నవంబర్ 26, 2008న ముంబైలో జరిగిన తీవ్రవాద దాడి.. అదే మన్మోహన్ సర్కార్ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. పది మంది ఉగ్రవాదులు భారతదేశ ఆర్థిక రాజధానిలోకి ప్రవేశించి.. ముంబై మహా నగరంలో 12 చోట్ల కాల్పులు, బాంబు దాడులకు తెగబడితే.. 166 మంది మరణించారు. సుమారు 300 మంది గాయపడ్డ ఆ ఘోర ఘటన ఓ మహా విషాదాన్ని మిగిల్చింది. ఇక యూపీఏ ప్రభుత్వం సెకండ్ టర్మ్ లో.. బయటపడ్డ 2010 కామన్ వెల్త్ గేమ్స్ స్కామ్, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించిన స్కామ్స్ వంటివెన్నో.. నాటి మన్మోహన్ ప్రభుత్వంపై అవినీతి మరకలకు కారణమయ్యాయి.

అన్నాహజారే నిరసనతో మన్మోహన్ సర్కార్ పై పెరిగిన ఒత్తిడి!

అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడిగా… నేడు జైల్లో ఊచలు లెక్కిస్తున్న కేజ్రీవాల్ వంటివారితో కలిసి అన్నా హజారే 2011 ఏప్రిల్ లో జన్‌లోక్‌పాల్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని.. చట్టం తీసుకురావాలని.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ప్రారంభించిన నిరసనే యూపీఏకు భారత్ లో నూకలు చెల్లేలా చేయడంలో కీలకపాత్రైంది. ఆ ఉద్యమానికి నాడు అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. దానికి తోడు యూపీఏ ప్రభుత్వ రెండో టర్మ్ లో.. అధిక ద్రవ్యోల్బణ రేట్లతో జనసామాన్యంపై ఆ ప్రభావం అమితంగా పడింది. ద్రవ్యోల్బణం రెండంకెలకు పెరిగింది. ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలలోనూ.. ఎల్‌పీజీ ధరల పెరుగుదలతోనూ.. నాడు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీక.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగల్గడంలో సక్సెస్ అయ్యింది. వీటికి తోడు.. 2012లో న్యూఢిల్లీలో ఓ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార ఘటన.. దేశం మొత్తాన్నీ కుదిపేసింది. 23 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన.. మహిళ భద్రతపై చర్చకు తెరలేపింది. అదే ఆ తర్వాత నిర్భయ కేసుగా మనం చెప్పుకుంటున్నాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles