దూరపు కొండలు నునుపు… ఎంత సత్యమైన మాట!
పల్లెలు వదిలి మనిషి పట్టణం బాట పడుతున్నాడు. బతుకు వేటలో బాటసారిలా మారి సుదూర తీరాలకు వెళ్లుతున్నాడు. పర్యవసానంగా పల్లెలు, ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. రచ్చబండల మీద పెద్ద మనుషులు మినహా… ఊళ్లల్లో యువత కనిపించడం లేదు. మరోవైపు పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోతోంది. గాలి కలుషితమవుతోంది. చెత్త పేరుకుపోతోంది. నీరు దొరకడం లేదు. వెరసి మనిషి తన మనుగడను తానే ప్రమాదపుంటంచుల్లోకి నెట్టేసుకుంటున్నాడు.

ఈ మాటలన్నింటికీ ఇప్పుడు బెంగుళూర్ అనే మహానగరం ఓ పెద్ద ఉదాహరణ!
ఐటీ ఇండస్ట్రీకి కేరాఫ్ గా మారిన బెంగళూర్ సిలికాన్ వ్యాలీ అంటే మక్కువ పడేవారి సంఖ్య ఎక్కువే. దానికి కారణం అక్కడ కనిపించే చల్లని వాతావరణంపై కథకథలుగా వెళ్లినవారు చెప్పే మాటలే. దాంతో ఐటీ ఉద్యోగాల కోసం వివిధ రాష్ట్రాల నుంచీ బెంగళూర్ బాట పట్టేవారి సంఖ్య పెరగ్గా… అందులో సింహభాగం తెలుగు రాష్ట్రాల వారే ఉండటం గమనించాల్సిన విషయం.
ఇప్పుడు జనాభా విపరీతంగా పెరిగి.. వలసలు పెరిగిపోవడంతో పాటు… భూగర్భజలాలు కూడా పూర్తిగా పడిపోయి బెంగళూర్.. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ ను తలపిస్తోంది. ఇప్పుడు బెంగళూరుకు నిత్యం 500 మిలియన్ లీటర్ల నీరవసరం. అంత నీటి కొరతను ఎదుర్కొంటున్నట్టు ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే చెబుతున్నారు. 14 వేల బోర్ వెల్స్ లో ఇప్పటికే… 7 వేల బోర్ వెల్స్ ఎండిపోయాయి. బెంగళూర్ కు 2 వేల 600 ఎంఎల్డీల నీటి అవసరముండగా.. 1470 ఎంఎల్డీలు కావేరీ నది నుంచి… 650 ఎంఎల్డీల నీరు బోర్ వెల్స్ నుంచి అందుతోంది. అయినా, ఇంకా 500 ఎంఎల్డీల నీటి కొరతతో బెంగళూర్ జనం అల్లాడిపోతున్నారు. మార్చి మధ్యకాలానికే ఇలా ఉంటే… ఇంకా నాల్గు నెలలు కాందే కనీసం తొలకరి కూడా పలకరించదే..?
కావేరీపై నిర్మించిన ఐదు ప్రాజెక్టలుపైనే ఇప్పుడు అక్కడి సర్కార్ గంపెడాశలు పెట్టుకుంది. 2006-07 మధ్య మెట్రోపాలిటన్ బెంగళూర్ లో విలీనమైన 110 గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుండగా.. వాటన్నింటికీ నీరందించాలంటే ఆ ప్రాజెక్టులే శరణ్యమని ప్రభుత్వమే చెబుతోంది. మరోవైపు, ఆ ప్రాజెక్టుల్లోని కావేరీ, కబినీ రిజర్వాయర్ ల్లో తగినంత నీటి నిల్వలున్నాయని… జూన్ వరకూ అవి తాగునీటి అవసరాలకు సరిపోతాయన్నది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెబుతున్న మాట. అంతేకాకుండా మరో 313 ప్రాంతాల్లో బోర్ వెల్స్ వేయించడం.. నిరుపయోగంగా పడి ఉన్న మరో 12 వందల బోర్స్ ను కూడా పునరుద్ధరించడం.. సరస్సులను నింపడానికి యత్నిస్తామంటోంది అక్కడి సర్కార్. ఈ క్రమంలో నీటి అవసరం ఎంత ఉందో అక్కడి సర్కార్ గుర్తించింది. కానీ, ఆ సంక్షోభం నుంచి బయటపడే మార్గం మాత్రం అంతు చిక్కడం లేదు. అందుకే కార్ సర్వీసింగులకు, గార్డెనింగ్ కు, నిర్మాణాలకు విచ్చలవిడిగా నీటిని వాడటంపై కూడా ఏకంగా నిషేధాన్నే విధించిందంటే… బెంగళూర్ ది ఎంత పెద్ద వాటర్ క్రైసిస్..?
ఇప్పుడు బెంగళూర్ నగరానికి వాటర్ ట్యాంకర్సే దిక్కు. అందుకోసం, అక్కడి ప్రభుత్వం 200 వాటర్ ట్యాంకర్స్ ను ఏర్పాటు చేయగా… బెంగళూర్ లో నివసిస్తున్న 60 శాతం మంది జనం ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ పైన్నే ఆధారపడుతున్న దయనీయ స్థితి.
ఇక బెంగళూర్ నగరం ఎంతటి నీటి సంక్షోభంలో కూరుకుపోయిందో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధ్యయనాలు మరింత విస్పష్టం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ నాళాలు, చెరువులు, కాల్వలు, కుంటలు ఇలా కబ్జాలకు గురి కావడంతో… 50 ఏళ్లల్లో మొత్తం 79 శాతం నీటి వనరులు ధ్వంసం చేయబడ్డాయి. 88 శాతం వృక్షసంపద నాశనమైపోయింది. ఇప్పుడు 95 శాతం కాంక్రీట్ జంగల్ గా మారిన పట్టణమేదైనా ఉందంటే అందుకు బెంగళూర్ ఓ నిలువెత్తు రూపం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వలసలతో.. అధికమవుతున్న జనాభా… ట్రాఫిక్ సమస్యలు, పర్యావరణ కాలుష్యం, ఇండస్ట్రియలైజేషన్, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రీన్ కవర్ కోల్పోతున్న ప్రమాదకర పరిస్థితులు… కోటి జనాభాకు కనీసం పదిహేను లక్షల వృక్షాలు కనిపించని భయానక వాతావరణం వెరసి… ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూర్ ఇప్పుడు నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
ఇప్పుడు బెంగళూర్ అర్బనైజేషన్ పరిణామాలు చర్చనీయాంశం కావల్సిన సమయం. మిగిలిన నగరాలు గుణపాఠాలు నేర్చుకోవాల్సిన కాలం. మిగిలిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుందో గ్రహించాల్సిన విషయం. పట్టణాలు వికేంద్రీకరణ జరగకుండా సెంట్రలైజ్జ్ అర్బనైజేషన్ తో వచ్చే ప్రమాదాలెలా ఉంటాయో చూపే ఓ నిలువెత్తు నగర రూపం బెంగళూర్.



