మనం వాడే షాంపూను పరిచయం చేసిందెవరు..? ఐతే, ఈ మహ్మద్ గురించి తెలుసుకోవాలి!

మనం వాడుతున్న షాంపూలు.. వివిధ కంపెనీ పేర్లతో మార్కెట్ లో చలామణి అవుతున్నవాటి వెనుక 1814లో జరిగిన ఓ కథ ఉంది. అసలా ఆ షాంపూను బ్రిటీషర్స్ కు పరిచయం చేసిందే ఓ ఇండియన్. కానీ, కొన్ని కథలు చరిత్రకెక్కవు. అలాంటివాడే షేక్ దిన్ మహ్మద్.

షాంపూ అనే పదం ఆంగ్ల భాషలోకి రాకమునుపే.. ప్రపంచమంతా బాత్రూమ్ షెల్ఫ్ ల్లో షాంపూ బాటిల్ హెయిర్ ప్రొడక్ట్స్ ను పెట్టుకోకముందే.. ఓ బీహారీ బ్రిటన్ సముద్రతీరంలో బాత్ హౌజ్ నడిపించాడు. బ్రిటీష్ రాజవంశీయులకు భారతీయ ఔషధ నూనెలతో మసాజ్ చేస్తూ.. అక్కడి రాజులతో పోషించబడ్డాడు. రెజెన్సీ కాలంలోనే ఇంగ్లాండ్ లో షేక్ దిన్ మహ్మద్ అనుభవించిన జీవితం.. విదేశీ వ్యాపార చరిత్రలో విశేషమైంది. అదే సమయంలో పెద్దగా గుర్తింపుకు నోచుకోనిది.

మహ్మద్.. 1759లో బీహార్ పాట్నాలో పుట్టాడు. పాట్నా అప్పటి మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తండ్రి పదేళ్ల వయస్సులోనే మరణించాడు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ ఆర్మీలో ఉన్న ఆంగ్లో ఐరిష్ అధికారైన కెప్టెన్ గాడ్ ఫ్రీ ఇవాన్ బేకర్ సంరక్షణలో పెరిగాడు. సుమారు పదిహేనేళ్ల పాటు తూర్పు, మధ్య భారతమంతా ప్రయాణిస్తూ.. సైనిక శస్త్రచికిత్స శిక్షణలో భాగంగా యుద్ధాల్లో పాల్గొంటూ.. భారతదేశంలో మారుతున్న సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను గమనించాడు. 1784లో బేకర్ రిటైర్డై ఐర్లాండ్ కు తిరిగి వెళ్లినప్పుడు.. అతడితో పాటే షేక్ దిన్ మహ్మద్ కూడా వెళ్లిపోయాడు.

కార్క్ పట్టణంలో అతడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఓ స్థానిక పాఠశాలలో చేరాడు. అక్కడే ఐరిష్ ప్రొటెస్టెంట్ అయిన జేన్ డేలీతో ప్రేమలో పడ్డాడు. వారి వివాహం ఆనాటికాలంలో ఓ పెను సంచలనం. ఎందుకంటే, బ్రిటన్ లో నమోదైన తొలి అంతర్జాతీయ వివాహాల్లో ఒకటిగా నిల్చింది. 1794లో మహ్మద్ ఇంగ్లీష్ లో ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. ది ట్రావెల్స్ ఆఫ్ దిన్ మహ్మద్ పేరిట రెండు భాగాలుగా ఆ పుస్తకం ప్రచురితమైంది. భారతదేశంలో తన అనుభవాలను లేఖల రూపంలో వివరిస్తూ.. బ్రిటీష్ పాఠకులకు భారత్ ను ఒక భారతీయుడి కళ్లతో తొలిసారి చూపించిన పుస్తకంగా కూడా అది విశేష ఆదరణ పొందింది. ఏ యురోపియన్ సాయం కూడా తీసుకోకుండానే ఆ పుస్తకాన్ని స్వయానా తానే రాశాడు మహ్మద్.

డాక్టర్ బ్రిటన్ గా గుర్తింపు!

1807 నాటికి మహ్మద్ తన కుటుంబంతో లండన్ కు వెళ్లిపోయాడు. 1810లో పోర్ట్ మాన్ స్క్వేర్ సమీపంలో హిందుస్థాన్ కాఫీ హౌజ్ పేరిట ఇంగ్లాండ్ లో మొట్టమొదటి భారతీయ రెస్టారెంటును ప్రారంభించాడు. అక్కడ కర్రీలు, హుక్కా సేవల వంటివాటితో పాటు.. హోమ్ డెలివరీ కూడా అందుబాటులో ఉండేది. కానీ, మహ్మద్ కు ఆ వ్యాపారం కలిసిరాక రెండేళ్లల్లోనే మూతబడింది. అయినా, మహ్మద్ వెనక్కి తగ్గలేదు.

బ్రిటన్ కు వెళ్లిన మహ్మద్ ఆ కాలంలో సముద్ర నీటి చికిత్స కోసం ప్రసిద్ధి చెందిన ఓ రిసార్ట్ వద్ద ఒక బాత్ హౌజ్ ను ఆరంభించాడు. చాంపి అనే పేరు మీద ఔషధ నూనెలు, ఆవిరితో చేసే మసాజ్ ప్రారంభమైంది. ఆంగ్లేయులు చాంపి అనే పదాన్ని కాస్తా షాంపూగా మార్చేశారు. అప్పట్నుంచీ షాంపూ అనే పదం ప్రాచుర్యం పొందింది. ఆ కాలంలో మహ్మద్ బాత్స్ పేరిట.. షేక్ దిన్ ఓ ఫేమస్ పర్సనాలిటీగా ఎదిగాడు.

రూమాటిజం, పక్షవాతం, కీళ్లనొప్పుల వంటి అనేక వ్యాధులకు చికిత్సనందిస్తానని ప్రచారం చేశాడు. రోగులు కూడా ఆయన దగ్గరకెళ్లి సంతృప్తితో తిరిగి వెళ్లేవారు. ఆసుపత్రులు కూడా రోగులను మహ్మద్ దగ్గరకు పంపించేవి. తను నయం చేసి పంపిన పేషంట్స్ ఫోటోస్ ను తన హాస్పిటల్ వాల్ పై వేలాడదీసేవాడు. దాంతో బ్రిటన్ ప్రజలంతా షేక్ దిన్ మహ్మద్ ను డాక్టర్ బ్రిటన్ గా పిల్చుకున్నారు.

సముద్ర తీరంలో తన రాయల్ పెవిలియన్ ను విలాసవంతంగా నిర్మించుకున్న నాల్గో కింగ్ జార్జ్ కూడా మహ్మద్ మసాజ్ సేవలకు ఆకర్షితుడయ్యాడు. తన కోసం ఒక వేపర్ బాత్ ను ఏర్పాటు చేసుకుని మహ్మద్ ను అధికారికంగా షాంపూయింగ్ సర్జన్ గా నియమించుకున్నాడు. 1830లో జార్జ్ మరణానంతరం నాల్గో విలియమ్ కూడా మహ్మద్ ను కొనసాగించాడు. అదే సమయంలో పోలాండ్ కు చెందిన ఓ రాజకుమారి మహ్మద్ బాత్ మసాజ్ గురించి తెలుసుకుని ఆ సేవలు పొంది.. ఓ వెండి కప్పును కూడా బహుమతిగా ఇచ్చింది.

మహ్మద్ దుస్తులూ ప్రత్యేకంగా కనిపించేవి. మొఘల్ దుస్తుల డిజైనింగ్ తో పాటు.. వెస్టర్న్ ఫ్యాషన్ కలయికతో ఆకట్టుకునేవి. ఇప్పటికీ మహ్మద్ ధరించిన ఆ దుస్తులు బ్రిటన్ మ్యూజియంలో ఉన్నాయి.

ఆ తర్వాతేం జరిగింది..?

మహ్మద్ తన ప్రకృతి సిద్ధమైన మసాజ్ చికిత్సలపై పుస్తకాలను ప్రచురించాడు. లండన్ లో మరో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. తన మనవడు ఫ్రెడరిక్ అక్బర్ మహ్మద్ ప్రముఖ వైద్యుడిగా ఎదిగాడు. రక్తపోటుపై పరిశోధనలు చేశాడు.

1851, ఫిబ్రవరి 24న.. 91 ఏళ్ల వయస్సులో మహ్మద్ బ్రిటన్ లో మరణించాడు. తన భార్య జేన్ తో కలిసి సెయింట్ నికోలస్ చర్చ్ లో ప్రస్తుతం మహ్మద్ సమాధి ఉండగా.. ఆ సమాధి రాయిపైన పాట్నా, హిందుస్థాన్ అని చెక్కబడిన అక్షరాలు కనిపిస్తాయి.

నేటి ఆధునిక కాలపు వెల్ నెస్ ఇండస్ట్రీ ఏర్పాటు కాకమునుపే.. భారత్ కు చెందిన ఓ బీహారీ ఇంగ్లాండ్ సముద్ర తీరంలో దాన్ని నిర్మించి విశేష ఆదరణ చూరగొన్నాడు. ఇద్దరు రాజులకు సేవలందించాడు. ఇంగ్లీష్ లో పుస్తకం రాసిన తొలి భారతీయుడయ్యాడు. ఇవాళ ప్రతీ ఉదయం ఏదో ఒక ఇంట్లో ఉపయోగించే షాంపూ అనే పదాన్ని ఈ లోకానికందించాడు. అయినప్పటికీ షేక్ దిన్ మహ్మద్ కు అంతగా గుర్తింపు దక్కకపోవడమంటే… అతడి విలువ తక్కువని కాదు.. కానీ, ఈ సమాజం ఎవ్వరిని, ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలో ఎంచుకునే విధానాన్ని మనకు పట్టి చూపిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles