ఫేక్ రిపోర్టింగ్.. ఉన్నది లేనట్టు… లేనిది ఉన్నట్టు! అసలు జరుగుతుందో, లేదో తెలియనిదాన్ని ఊహాజనితంగా చిత్రించి ప్రెజెంట్ చేయడం.. జరగని దాన్ని జరిగినట్టు కన్ఫర్మ్ చేస్తూనే పైగా విశ్లేషించడం.. అసలు జరిగిన దాన్ని కనీసం ఉటంకించకపోవడం.. అసలు కంటెంటే లేకుండా మొత్తం వార్తనూ, వార్తా కథనాన్ని, ఫాలోఅప్ కథనాలనూ, విశ్లేషణలను కొనసాగించడం!!
ఇదేదో తెలుగు మీడియాకే పరిమితమైందేం కాదు.. జాతీయ, అంతర్జాతీయస్థాయిలోనూ పొరపాటుగా మారిన ఓ అలవాటు! రేటింగ్స్ ను పెంచుకునే క్రమంలో తప్పుడు ప్రచారాల్నీ చేసేందుకు వెనుకాడకుండా.. చూసే వీక్షకులను విభ్రమలకు గురిచేసేందుకు చేయకూడని ఓ ప్రాక్టీస్. అందుకే ఏ ప్రాంతంవారు చూసినా… అరె, ఇది అచ్చూ మన మీడియాకు సరిగ్గా అతికినట్టు సరిపోతుందే అన్నట్టుగా జనం ఒకింత హాశ్చర్యంతో నవ్వుకుంటూ చూసే సెటైరికల్ మూవీ.. special correspondents!!

ఎప్పుడో 2016లోనే విడుదలైనా.. ఏదో యాదృచ్ఛికమన్నట్టు ఒకటో, అరో కాకుండా… ఇప్పటికీ ఆ సినిమా తాలూకు ఫేక్ రిపోర్టింగ్ కంటెంట్ తోనే బులెటిన్లు, ఎడిషన్లు వెళ్లదీసే మీడియా ఇండస్ట్రీ స్వరూపానికి.. అగ్గికి ఆజ్యం పోస్తున్న నేటి సోషల్ మీడియా విస్తృతత్వానికీ ఓ నిలువెత్తు వ్యంగ్యరూపమే Special Correspondents!
ఈక్వెడార్ లో జరిగే తిరుగుబాట్లు… అక్కడి నొటోరియస్ గ్యాంగులకు సంబంధించి అంతర్జాతీయ సమాజం చర్చించుకుంటున్న వేళ… న్యూయార్క్ రేడియోలో పనిచేసే జర్నలిస్ట్ ఫ్రాంక్ బోర్నేవిల్లేను ఆయన బాస్ మల్లార్డ్ అక్కడికి రిపోర్టింగ్ కు వెళ్లాలంటాడు. అంతకుముందే ఫ్రాంక్ బొన్నెవిల్లే.. ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా.. ఓ పోలీస్ డ్రెస్ వేసుకుని తనకు తానుగా ఓ పోలీస్ ఆఫీసర్ గా చెప్పుకుని దొరికిపోతాడు. అదంతా తమ బాస్ జేఫ్రీ మల్లార్డ్ చెవిన పడుతుంది.. ఫ్రాంక్ ను గట్టిగా మందలించి ఒకింత హెచ్చరిస్తాడు కూడా. అప్పటికే బాస్ కోపానికి గురైన ఫ్రాంక్.. ఈక్వెడార్ కు వెళ్లడం తనకిష్టం లేకున్నా.. ప్రయాణానికి రెడీ అవుతాడు. కానీ, ఫ్రాంక్ వెంట వెళ్లాల్సిన టెక్నీషియన్ ఫించ్ మాత్రం ముందు ససేమిరా అంటాడు. ఎందుకంటే తన భార్యతో ఫ్రాంక్ కు వివాహేతరం బంధముందన్ని విషయం ఫించ్ కు దృష్టికి రావడంతో ముందు ససేమిరా అన్నా.. ఆ తర్వాత తన బాస్ ఆదేశాలతో తప్పక వెళ్లని పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో విముఖతతోనే ఫ్రాంక్ అండ్ ఫించ్ ఈక్వెడార్ జర్నీ ప్రారంభమవుతుంది. ఆ జర్నీలో కనిపించే ట్విస్టులే special correspondentsలో ఛమక్కులు.
అలా ఫ్రాంక్ అండ్ ఫించ్ కలిసి న్యూయార్క్ లో పాస్ పోర్ట్స్, వీసా అన్ని పనులు ముగించుకుని… ఎయిర్ పోర్ట్ బయల్దేరుతారు. కానీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లేకంటే ముందే.. అప్పటికే తన భార్య వ్యవహార శైలితో కాస్తా మూఢీగా, డిస్టర్బ్డ్ గా ఉన్న ఫించ్ ఏదో చెత్తను పడేస్తున్నానుకున్న సోయిలో… అసలు పాస్ పోర్ట్స్, ఫ్లైట్ టిక్కెట్స్ అన్నీ చెత్తను తరలించే ఓ ట్రంక్ లో పడేస్తాడు. అప్పుడు అసలు సినిమాలో ఆసక్తికరమైన సన్నివేశాలు తెరపైకి వస్తాయి. పింఛ్ పై ఫ్రాంక్ ఎంత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినా… చేసేదేంలేక.. రేడియో స్టేషన్ కు ఎదురుగా బ్రిగిడా, డోమింగ్ అనే ఓ స్పానిష్ జంట నడిపించే కేఫ్ లో దాక్కుంటారు. అప్పటికే రెగ్యులర్ గా వెళ్తూ వారితో పరిచయం బలపడటంతో… తమ పరిస్థితి వివరించి కాస్త ఆశ్రయమడుగుతారు. అలా కేఫ్ లో పైనుండే ఓ గదే.. ఫ్రాంక్ అండ్ ఫించ్ కు ఈక్వెడార్ దేశం… తమ న్యూస్ రూమ్.. తమ రిపోర్టింగ్ స్టూడియా అన్నీ అన్నట్టుగా మారిపోతుంది.
అదిగో అలా మొదలవుతుంది ఈక్వెడార్ పేరిట వారి ఫేక్ రిపోర్టింగ్. ఇతర న్యూస్ ఛానల్స్, సైట్స్ నుంచి వీలైనంత సమాచారం సేకరించడం… అప్డేట్స్ ఇవ్వడం.. ఇదీ న్యూయార్క్ లో ఏకంగా తాము పని చేసే రేడియో స్టేషన్ కు ఆపోజిట్ బంగ్లాలోనే ఉండి వారు చేసే ఈక్వెడార్ లైవ్ రిపోర్టింగ్. అయితే రేడియా యాంకర్స్ గుచ్చిగుచ్చి అడిగే ప్రశ్నలతో… అప్పటికప్పుడు కొన్నిసార్లు ఏమీ తోచక చేసే రిపోర్టింగ్ తో పాటు… స్పాంటెనియస్ గా కల్పితాలతో చేసే రిపోర్టింగ్ వెరసి… ఈక్వెడార్ ఇష్యూ అంతర్జాతీయ సమస్యలా మారి ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి సారించాల్సిన గత్యంతరం లేని పరిస్థితిని కల్పిస్తుంది. ఫ్రాంక్, ఫించ్ కలిసి… ఎమిలియో శాంటియాగో అల్వారెజ్ అనే డమ్మీ పేరును కొత్త బందిపోటు రూపంలో తెరపైకి తీసుకొస్తారు. అతనికి ఏదో పెద్ద నేర చరిత్ర ఉన్నట్టు సీన్ క్రియేట్ చేసేవిధంగా రేడియోలో జర్నలిస్ట్ ఫ్రాంక్ రిపోర్టింగ్ సాగుతుంటుంది.
దీన్నే పట్టుకుని అంతర్జాతీయ ఛానల్స్, ఇతర మీడియా కూడా ఫ్రాంక్, ఫించ్ లకు సదరు బందిపోట్ గ్యాంగ్స్ నుంచి ప్రమాదమున్నట్టు.. కొత్త కొత్త వార్తా కథనాలు వండుతుండటంతో.. ఈక్వెడార్ ఇష్యూ.. అందులో ఫ్రాంక్ అండ్ ఫించ్ అనే రేడియో కరస్పాండెంట్స్ కథ బర్నింగ్ టాపిక్ గా మారుతుంది. దాంతో ఫ్రాంక్ అండ్ ఫించ్ ఇద్దరూ మీడియాలోనే కాకుండా.. సమాజంలో కూడా చాలామంది సోకాల్డ్ మన జర్నలిస్టుల్లాగే హీరోలైపోతారు. ఈ క్రమంలో ఫ్రాంక్ అండ్ ఫించ్ బాసైన జేఫ్రీ మల్లార్డ్.. వారిని క్విటోలోని యూఎస్ ఎంబసీకి వెళ్లి రక్షణ తీసుకోవాలని సూచిస్తాడు. కానీ… ఫ్రాంక్, ఫించ్ ఉన్నది.. రేడియో స్టేషన్ కు ఎదురుగానేనాయె! దొరికిపోరూ..? అందుకే అప్పటివరకూ ఫోన్ ద్వారా బాస్ తో.. రేడియోస్టేషన్ క్యూతో సంభాషించిన ఫ్రాంక్ అండ్ ఫించ్ వారి సిమ్ కార్డులను తీసేస్తారు. పైగా తమను ఈక్వెడార్ బందిపోట్లు కిడ్నాప్ చేసినట్టుగా.. సదరు కేఫ్ నిర్వాహకులనే కాళ్లా, వేళ్లా పడి వారికి ముఖాలకు మాస్కులు కట్టి కిడ్నాపర్స్ వేషం వేస్తారు. ఓ వీడియో షూట్ చేసి.. దాన్ని ఓ పెన్ డ్రైవ్ లో కాపీ చేసి.. రేడియో స్టేషన్ ముందున్న పోస్ట్ బాక్సులో వేస్తారు. ఇంకేం… ఆ వీడియోలో ఫ్రాంక్ అండ్ ఫించ్ ను కిడ్నాపర్స్ కట్టేసి బెదిరిస్తున్న విజువల్సుండటంతో.. అది కాస్తా మరింత ప్రచారంలోకొచ్చి అంతర్జాతీయ సమస్య అన్నట్టుగా వైరలవుతుంది.
అదే అదనుగా అప్పటికే వివాహబంధం తెగదెంపుల వరకూ వచ్చిన ఫించ్ పై.. అప్పటివరకూ తేలికగా తీసుకునే అతడి భార్య ఎలియనోర్ సానుభూతితో తాను విడాకులివ్వాలనుకుంటున్న భర్త పేరిట ఓ ఛారిటీ షోకు పథకం వేస్తుంది. అలా, డాలర్ ఫర్ ఏ హీరో పేరిట ఓ పాట పాడి.. ఎలియనోర్ పాప్యులర్ సింగర్ గా మారిపోతుంది. స్వచ్ఛందసంస్థ పేరిట డబ్బు సంపాదిస్తూ కలహాలతో విడిపోవాలనుకున్న భర్త పేరిట సంపాదన మొదలుపెడుతుంది. మరోవైపు, ఫించ్ భార్య అని తెలియని ఎలియనోర్ తో.. ఫ్రాంకూ సంబంధాన్ని నెరపడం.. ఓసారి ఆమెను ఫ్రాంక్ టీవీలో చూశాకగానీ.. ఆమె తన సౌండ్ ఇంజనీర్ ఫించ్ భార్య అని తెలుసుకోలేడు. మొత్తంగా ఆ విషయం పింఛ్ కు తెలిసి ఫ్రాంక్ పై కాసింత ఆగ్రహంతో ఉండగా.. ఫ్రాంక్ కు మాత్రం తనతో తరచూ కలుస్తున్న ఎలియనోర్ పింఛ్ భార్య అని ఎప్పుడోగానీ తెలిసి.. అందుకే తనతో పింఛ్ ఆ విధంగా ఉంటున్నాడానని గ్రహిస్తాడు.
తనున్నప్పుడేమో గయ్యాళీ గంపలా గొడవలు పెట్టుకుని.. ఇతరులతో వివాహేతర సంబంధాలతో విడాకుల వరకూ తెచ్చిన భార్య.. తాను కిడ్నాపర్లకు చిక్కానని తెలుసుకుని తన పేరుతో డబ్బు సంపాదించడం ఫించ్ కు నిద్రపట్టనివ్వదు. దాంతో ఫ్రాంక్ తో కలిసి.. భార్య ఎలియనోర్ దగ్గరకెళ్లి బెదిరిస్తాడు. ముగ్గురికి మూడు వాటాలు పంచాల్సిందేనని పట్టుబడుతాడు. అలా పంచుకున్న డబ్బుతో తాము ఈక్వెడార్ లో లేమని.. ఇక్కడే న్యూయార్క్ లోనే ఉన్నామన్న విషయం బయటకు పొక్కకుండా ఫ్రాంక్ అండ్ ఫించ్ దక్షిణమెరికా పయనమయతారు. అయితే, నాన్నా పులి కథ తరహాలో ఈ ఇద్దరు special correspondents దక్షిణమెరికాకు పయనమయ్యే క్రమంలో.. నిజంగానే అదే ఈక్వెడార్ కిడ్నాపర్ల చేతికి చిక్కుతారు. ఆ తర్వాతేం జరుగుతుంది… వారిద్దరూ యూఎస్ కు హీరోలుగా ఎలా తిరిగివస్తారన్నదే Special Correspondentsలో ఇంట్రెస్టింగ్!
హైదరాబాద్ స్టూడియోలోనే ఉండి ఢిల్లీ రిపోర్టింగ్ చేయడం.. ఉత్తర తెలంగాణాలోని ఏ వరంగల్ లోనో తిరుగుతూ… దక్షిణ తెలంగాణాలోని మహబూబ్ నగర్ లో లైవ్ లో ఉన్నట్టే అన్నీ పూస గుచ్చడం.. ఫోన్ ఇన్ నో… ఇప్పుడు వచ్చిన డిజిటల్ ఫెసిలిటీస్ తో లైవో ఇవ్వాల్సి వస్తే.. అప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం లేకుంటే… ఊహజనితంగా అట, అనుకుంటున్నారు, ఆరోపణలెదుర్కొంటున్నారు వంటి పడికట్టు పదాలతో లాగించేయడం.. ఇలా సమకాలీన మీడియా ధోరణులకు అద్దం పడుతూ.. హ్యుమరస్ సెటైర్ తో సాగుతుంది special correspondents!
ఫించ్ పాత్రలో నటించిన రిక్కీ గేర్వైసే 2016లో స్వయంగా నిర్మించిన ఈ సినిమాను.. నేటి మీడియా వాళ్లూ ఓసారి చూస్తే.. అరె, మనకంటే అస్సలు తగ్గేదేలే అన్నట్టు తీశాడే.. అని ఒకింత హాశ్చర్యంతో కూడిని ఆనందాన్ని అనుభూతినీ చెందడం మాత్రం గ్యారంటీ!
NETFLIX లో ఉన్న ఈ మూవీ మంచి ఎంటర్ టైనర్!



