వినాశకర విజ్ఞానం!
Aranya Krishna…✍🏻
“భవిష్యత్తులో యుద్ధాలు డ్రోన్లతోనే”- ఎలాన్ మస్క్.
అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అవి శాంతికి దోహదం చేయవన్న మాట. అంటే వాటికీ ప్రపంచ శాంతికీ సంబంధం లేకపోవడం కాదు. సంబంధం అయితే వుంది. అది విధ్వంసకర సంబంధం. మానవ శాంతిని హరించే విధ్వంసకర సంబంధం. మనిషిని ప్రశాంతంగా బతకనివ్వని వినాశకర సంబంధం. ఈ భూగోళమ్మీద మనిషి తనని తాను నిర్మూలించుకునే వరకు నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు చేస్తూనే వుంటాడు. మొత్తమ్మీద మనిషి జ్ఞానం, మేధస్సు స్వీయ హననానికే దోహదం చేస్తుంటాయి.

మనిషి ధనానికి బానిస. ధనం సంపాదించటం కోసం ఎప్పుడూ పని చేస్తునే వుండాలి. అలాంటి పనుల్లో యుద్ధాలు, మారణహోమాలు కూడా వుంటాయి. పని కల్పన కోసం కొత్త రంగాలు సృష్టించబడుతూనే వుండాలి. కొత్త రంగాల సృష్టి కోసం నూతన ఆవిష్కరణలు జరుగుతూనే వుండాలి. ఒక్క వైద్య రంగంలో మినహా మిగతా రంగాలలోని ఆవిష్కరణలన్నీ నేరాలకి, విధ్వంసానికి దారి తీసేవే. ఒక్క మనిషి మినహా సృష్టి చరిత్రలోనే ఏ జీవజాతి కూడా ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల తప్ప తనని తాను నిర్మూలించుకునే పద్ధతులకి పాల్పడలేదు. మనిషి నికృష్టత్వమేమిటంటే వాడు తనని తాను నిర్మూలించుకోడమే కాదు ఇతర జాతుల మనుగడకీ ముప్పు తీసుకొస్తున్నాడు. ఈ మాత్రం దానికి మానవ జన్మ మహోత్కృష్టమైనదని స్వంత డబ్బా దేనికో?
మరేం లేదు, మానవ జన్మ మహోత్కృష్టమైనదని ఓ ప్రవచనరావు కూష్మాండం బద్దలయ్యేలా కూత పెడుతున్నప్పుడు నా చెవిలో పడితేనూ!



